1 - పరిచయము
ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుఁడగు నారద మహర్షి - శ్రీ శైలము మొదలగు
పుణ్యక్షేత్రములయందు శివు నారాధించి - శ్రీ నైమిషారణ్యముఁజేరినవాడై - శివ మహిమను శౌనకాదిమునులకు ప్రబోధించుచుండగా పౌరాణికోత్తముడగు సూత మహాముని-నైమిషారణ్య వాసులగు తాపసులకు మ్రొక్కులిడుటకు - నేతెంచెను. శౌనకాదులు నారదునకు సూతునకును స్వాగతముఁబలికి - యథోచితముగా ఆసనాదుల నేర్పరచియు దిగువవిధము వినయముతోఆసక్తి తోడను ప్రశ్నించిరి.
శో॥ భవభక్తో భవాంశ్చైవ - వయంవై నారదస్తథా ।
అస్యాగ్రతో మునేః పుణ్యం -- పురాణం వక్తు మర్హసి ॥
సూతమహామునీ! నీవు మేము నారదమహర్షియు శివుని యందు భక్తి గలిగియున్నాముగదా! ఈ నారదముని ముందు - పుణ్యఫల ప్రదమగు మహాపురాణమునువక్కాణింపుము! అంత సూతుడు చెప్పఁదొడఁగెను.
అకారము ఉకారము మకారంబును కూడిన ప్రణవాత్మకము - స్థూలము - సూక్ష్మంబు - పరాత్పరమునగు శివలింగము.
ఋగ్వేదము ముఖము గాను సామవేదము నాలుక గాను, యజుర్వేదము కంఠము గాను, అధర్వవేదము హృచయముగా నుండునది. రజోగుణముతో బ్రహ్మదేవుడై, సత్త్వగుణమున విష్ణువై, తమోగుణమున రుద్రుండునై సృష్టి స్థితి లయములఁ జేయుచు -- శుద్ధ సత్త్వగుణ భూయిష్ఠుండగు శివుఁడుగా - తిరోధాన అనుగ్రహములఁగావించు శివలింగమునునమస్కరించి లింగోద్భవము గూర్చి యథాశక్తిప్రవచింతును.
“ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమోనమః“
“రజు స్సత్త్వ తమోగుణముల నతిక్రమించిన, గొప్ప తేజస్సుచే ప్రకాశించు శివుడనబఱుఁగు శివలింగమునకు నమస్కారము” అను పుష్పదంతుని వాక్యము పై యంశమును సమర్థించుచున్నయది.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” ఆను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున - ప్రథమాధ్యాయము.