2 – సోమకాంత వర్ణనం

సూతమహర్షి ఇలా కొనసాగించాడు:

సూతమహర్షి:

“ఇలా సోమకాంతమహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకంవల్ల అతిదారుణమైన కుష్టువ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి, సోమకాంత మహారాజు, ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు!

కాని, నానాటికీ అతని ఆరోగ్యపరిస్థితి క్షీణించసాగింది. శరీరమంతా రసిఓడుతూ దుర్గంధభూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఎముకలగూడు వంటి శరీరంమాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆరాజు మంత్రులను ఒకనాడు తనవద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు.

సోమకాంతుడు:

“ఓ అమాత్యులారా! నా శరీరారోగ్యం నానాటికీ క్షీణిస్తున్నది! ఈజన్మలో నాకు తెలిసినంతవరకూ అన్నీ సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనులసేవ, ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్యపరిపాలననూ ఏ మాత్రం ఏమరుపటులేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను! బహుశ ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు. దుర్గంధభూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలచుకోలేదు. నా అనంతరం నా కుమారుడైన హేమక౦ఠుని రాజ్యాభిషిక్తునిగాచేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి!

మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలెనని నిశ్చయించాను. సర్వసంపదలనూ పరిత్యజించి జీవితపరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను.”

ఈ వాక్యం పూర్తిచేసి శరీరబాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు. అప్పుడు శైత్యోపచారములతోనూ, మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి, మంత్రులు ఆరాజుతో యిలా అన్నారు.

మంత్రులు:

“ఓ మహారాజా! నీ దయకు అనుగ్రహానికీ పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలనూ నీవల్ల, అనుభవించాము. ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీరబాధను అనుభవిస్తూoటే కృతఘ్నుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు. మీ అభీష్టంమేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి, మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము! అందుకు అనుమతించండి!” అంటూ వేడుకున్నారు.

అప్పుడు ఆరాజు భార్యయైన రాణీ సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది.

సుధర్మ:

“ఓ మంత్రిపుంగవులారా! నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికెళతాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి! అదే మీకూ, నాకూ – ఉభాయతారకము”

అలాగే కుమారుడైన హేమక౦ఠుడు కూడా :-

హేమక౦ఠుడు:

“తండ్రీ! మీ సేవకన్నా నేను ఇంక కోరుకునేదేమీలేదు! ఈ రాజ్యము, ధనమూ వీటివల్ల నాకేమీ ప్రయోజనంలేదు. మిమ్మల్నే అనుసరించి వచ్చి మీసేవలో తరిస్తాను” అన్నాడు.

అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుని చేరబిలిచి

సోమకాంతుడు:

“నాయనా! కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలనచేయటం, శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాదికములు చేయటమూ, గయలో పిండప్రదానము చేయడమూ ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి!

కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు! ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం! నేను ఒక్కడినే భార్యాసహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను!” అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచనా మందిరంలోకి వెళ్ళి అతనికి నానావిధములైన ఆచార వ్యవహారములనూ రాజనీతి రహస్యములనూ ఇలా ఉపదేశించసాగాడు.

Chapter 2 complete