3 – ఆచార నిరూపణం
సోమకాంతమహారాజు కుమారునకు ఆచారమూ ధర్మము రాజనీతులను ఉపదేశించుట
అలా రహస్యమందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమక౦ఠుని స్వర్ణమయమై, బహురత్నఖచితమై, ఇంద్రుని స్వర్గాసింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనంపైన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసంకలిగేలా తన కుడిచేతిని ఉంచి అతనితో యిలా అన్నాడు.
సోమకాంతుడు:
“కుమారా! అనేకవిధములైన ధర్మాలన్నింటిలోనూ సదాచారము మిక్కిలి విశిష్టమైనది. రాజైనవాడు దీనిని తప్పక పాటించాలి! అందువల్లనే ఆయువూ, ఆరోగ్యమూ, కీర్తీ వర్ధిల్లుతాయి. దేవతనుగ్రహమూ, వంశాభివృధ్ధీ కూడా కలుగుతాయి. ఆ సదాచార విశేషాలన్నీ శ్రద్ధగా విను!”
సదాచారము
సోమకాంతుడు:
అర్థరాత్రి ఇంకా యామం (షుమారు రెండున్నర గంటలు) కాలం వుoడగానే సూర్యోదయానికి ముందుగా బ్రాహ్మీముహుర్తంలోనే నిద్ర లేవాలి! వెంటనే పడుకున్న శయ్యను వీడి శుచియైన స్థానంలో కూర్చుని తన ఆచార్యుని (గురువును), దేవతలనూ, ప్రణవం (ఓంకార) సహితంగా భూమాతను ధ్యానించాలి. భూమిపై పాదాలు౦చుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరి, ఆ తరువాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై, సకల ఆగమములచేతా కొనియాడబడుతున్నవాడూ, చతుర్విధపురుషార్థములను ప్రసాదించేవాడూ వాక్కులకూ, మనస్సుకూ అతీతుడూ ఐన గజాననునికి నమస్కరించాలి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనూ స్మరించి, మానసోపచారముల పూజచేసి ఆ పిదప బహిప్రదేశానికి చేతిలో నీటిపాత్రను తీసుకుని గ్రామానికి నైఋతిదిక్కుగా వెళ్ళాలి. బ్రాహ్మనుడైనవాడూ, క్షత్రీయుడూ ఎఱ్ఱటి ఒండ్రుమట్టినీ, వైశ్యశూద్రులు నల్లటి ఒండ్రుమట్టిని తీసుకుని నదీతీరములో బ్రాహ్మణగృహాలూ, పుట్టలూవున్న ప్రదేశాలను విడచి – దూరంగా ఉన్న శౌచవిధులను నిర్వర్తించాలి.
దివారాత్రములలో ఉత్తర-దక్షిణ దిశలుగా మూత్రపురీష విసర్జన చేయాలి. ఆ తరువాత ఐదుసార్లు మట్టితో, నీటితో చేతులు కడుక్కోవాలి. పదిసార్లు ఎడమచేతిని, ఆ తరువాత మరో ఏడుసార్లు రెండు చేతులనూ, ఒక్కసారి మట్టితో పాదములనూ శుద్ధిచేసుకోవాలి! వ్రతం ఆచరించేవాడు ఇందుకు రెండురెట్లూ, వానప్రస్థుడైనవాడు మూడురెట్లు, సన్యాసులు నాల్గురెట్లూ శుద్ధిచేసుకోవాలి! స్త్రీలు, శూద్రులు ఇందులో సగము, పాతికవంతు మాత్రం శుద్ధిచేసుకుంటే చాలు.
ఆ తరువాత శుద్ధాచమనంచేసి గానుగ, వేప వంటి పుల్లలను ప్రార్థనాపూర్వకంగా (ఓ వృక్షమా! బలాన్నీ, ఓజస్సునూ, తేజస్సునూ, బుద్ధినీ, సంపదలను ప్రసాదించవలసింది) అని ప్రార్థించి వాటిని సేకరించి దంతధావన (పళ్ళు తోముకోవాలి) చేయాలి.
ఆ తరువాత నదీ లేక చెరువులో ‘అపవిత్రః పవిత్రోవా’ అన్న మంత్రంతో మలాపకర్షణ స్నానాన్నీ, ఆతరువాత మంత్రపూరితంగా అఘమర్షణస్నాన “అపోహిష్టానాన్ని మయోభువ” ఇత్యాది మంత్రాలతో చేసి, సంధ్యావందనాదికాలను నిర్వర్తించాలి! ఏకాగ్రచిత్తుడై గాయత్రీ మంత్ర జపం చేశాక, గురూపదిష్ట మంత్రాన్ని జపించాలి! హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి మంత్రదేవతా తర్పణాన్నీ, స్వాధ్యాయనమూ (వేద శాస్త్రగ్రంధాల అధ్యయనం) చేయాలి! దేవతాపూజలు చేశాక వైశ్వదేవమిచ్చి, బ్రాహ్మణులనూ అతిధులనూ కూడి భుజించాలి!
ఆతరువాత పురాణశ్రవణం చేయాలి! రాజైనవాడు ‘అభక్ష్యభక్షణం’ (తినకూడనివి తినడం), ఇతరులను నిందించడం మనాలి! ఇతరులకు ఉపకారం చేయడానికే తన మాటనూ, ద్రవ్యాన్నీ, శక్తియుక్తులనూ వినియోగించాలి. దానధర్మాలు తప్పక ఆచరించాలి! తన భార్యను విసర్జించడం, ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవడం కూడా దోషమే! పరదారలపట్ల దోష-బుద్ధి కూడదు!
మాతాపితరుల సేవ, గో, బ్రాహ్మణుల సేవ గురుశుశ్రూష అవశ్యం ఆచరించాలి! దీనులైనవారికి అన్నవస్త్రాలనిచ్చి ఆదరించాలి! సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. ప్రాణం పోయినా సత్యవచనాన్ని మాత్రం వీడకూడదు! సాదుసత్పరుల సేవాఫలితం అనంతమైనది. దానివల్ల భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రద్ధా, భక్తులతోనూ అనన్యమనస్సుతోనూ వారిని సేవించాలి.
ఇక రాజ్యపాలన విషయంలో రాజెప్పుడూ ఏమరుపాటు చెందకూడదు. దోషులను అపరాధనుసారమే నిష్పక్షపాతంగా దండించాలి. తనయందు విశ్వసపాత్రులుగాని వారిని విశ్వసించకూడదు. ఒకప్పుడు శత్రువుగా ఉండినవాడిని కూడా గ్రుడ్డిగా విశ్వసించడం దగ్గరగా మసలనీయడం చేయకూడదు. అలాగే తన శక్త్యానుసారం దానములు చేయాలి. దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడౌతాడు. సమర్థవంతమైన పాలనకై గూఢచారులనే నేత్రాలను కలిగి సదా అప్రమత్తుడై వు౦డాలి. సరియైన దండనీతిని పాటించినప్పుడే ప్రజలు ధర్మవర్తనులై భయభక్తులతో మెలుగుతారు. అలా జరగనప్పుడు రాజ్యంలో అరాజకత్వం చెలరేగుతుంది. రాజైనవాడు బహిశ్శత్రువులతో పాటు తన అంతశ్శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరింటినీ జయించాలి. వృత్తిచ్చేదము, సంతానచ్చేదము, దేవతాచ్చేదము కూడనివి! ఆరామములను, నీడనిచ్చే వృక్షాలను ఎన్నడూ నరకరాదు! సర్వ కాలములలో దానధర్మములు విరివిగా చేయాలి. త్యాగబుద్ధి గలిగి ప్రజలకు ఆదర్శప్రాయుడై జీవించాలి.
మిత్రద్రోహమూ, స్త్రీలకు రహస్యాలు చెప్పడం ఎన్నడూ చేయకూడని పనులు! తాను ప్రసన్నతతో, సహృదయతతో ప్రజానీకము యొక్కా భృత్యులయొక్కా అభిమానాన్ని ఆదరాన్ని చూరగొనాలి! బ్రాహ్మణులను ఋణ విముక్తుల్ని చేయడం, గోవులను సంరక్షించటం విధిగా ఆచరించాల్సినవి. ఎల్లవేళలా దేవబ్రాహ్మణ పూజలు చేయటం ధర్మజ్ఞుడైన రాజు ఆచరించాల్సిన ధర్మములు” అంటూ ఇంకా అనేక యితర రాజనీతులను, ధర్మ సూక్ష్మాలనూ సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమక౦ఠునకు ఉపదేశించాడు.
ఆ తరువాత ఒక శుభాముహుర్తాన్ని నిర్ణయించి మంత్రులు సమకూర్చిన సకలసంబారములతోనూ సమస్త రాజలా౦ఛనాలతోనూ ఎల్ల రాజలోకమూ, పురప్రముఖులూ చూస్తుండగా – పూజించి, నిర్విఘ్నతకై గణపతిని, ఇష్టదేవతారాధనను సల్పి సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణోత్తముల మంత్రఘోషల మధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు.
మంత్రులతో “ఓ అమాత్యవరులారా! ఇతడు నా కుమారుడూ, వారసుడూను! మీరంతా నాయందు చూపినట్లే అభిమానాన్ని, అనురాగాన్నీ, యితనికి పంచివ్వండి! నా ఆజ్ఞవలెనే ఇతని ఆజ్ఞను కూడా మీరూ, మీతోపాటూ మన రాజ్యంలో అందరూ నిర్వర్తించవలసింది!” అని ఆదేశించి, తన కుమారుణ్ణి వారికి అప్పగించాడు. అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులనూ, దానధర్మాలతో సమస్త ప్రజలనూ సంతృప్తిపరిచాడు సోమకాంతమహారాజు.
Chapter 3 complete