1 - ప్రశ్నము
శ్రీమహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువు నకును నమస్కరించుచున్నాను.
నైమిషారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రాసందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి.
ఋషయ ఊచుః:
ఋషులు పలికిరి : ఓ సూతుడా! నీవు (మాచేత పూజింపబడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలిసికొనినంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సార మైనదానిని మాకు చెప్పుము.
సూత ఉవాచః -
సూతుడు పలికెను - సృష్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహావిష్ణువే సారములలో కెల్ల సారమైన వాడు. “నేనే ఆ పరబ్రహ్మస్వరూపుడను” ఆని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్న చో సర్వజ్ఞత్వము కలుగును.
శబ్దములకు గోచర మగుసగుణబ్రహ్మయు, పర మగునిర్గుణబ్రహ్మయు తెలియదగినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ - “రెండు విద్యలు తెలిసికొనవలేను” అని చెప్పుచున్నది.
నేనును, శుకుడును, పైలుడు మొదలగువారును బదరికాశ్రమమునకు వెళ్లి వ్యాసుని నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారము నుపదేశించేను.
వ్యాసుడు పలికెను : నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సారభూతమును ఆగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ ! సూతా ! నీవును శుకాదులును వినుడు.
వసిష్ట ఉవాచః
వసిష్టుడు పలికెను : ఓ వ్యాసా! పూర్వము ఆగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధ మైన బ్రహ్మను గూర్చి చెప్పెదను; వినుము.
బ్రహ్మవిద్య నాశనరహిత మగు పర విద్య. అందుచే తత్రతిపాదక, మగు ఆగ్నేయపురాణము పరము. సర్వ దేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపరబ్రహ్మ. ఆపరబ్రహ్మను ప్రతిపాదించున దగుట చే దాని కాపేరు.
అగ్ని చెప్పిన పురాణము ఆగ్నేయపురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువువారికిని, వినువారికిని భుక్తిముక్తుల నొసగునది.
కాలాగ్ని స్వరూపుడును, జ్యోతిస్వరూపుడును, పరాత్పర మైన, బ్రహ్మయు, జ్ఞాన-కర్మలచే పూజింపబడువాడును ఆగు విష్ణుదేవుని మునినమేతుడై (వసిష్ఠుడు) ప్రశ్నించెను
వసిష్టుడు పలికెను : సకల విద్యల సారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు నర్వజత్వమును పొందునో అట్టిదియు, సంసార సాగరమును దాటించుటలో నావయు, సర్వశ క్తమును ఆగు బ్రహ్మను గూర్చి చెప్పుము.
ఆగ్ని పలికెను : విష్ణువు నైన నేనే కాలాగ్ని రుద్రుడను. నర్వస్వరూపమును, సర్వకార ణమును, ఆతి ప్రాచీ నమును అగు విద్యాసారమును గూర్చి నీకు చెప్పెదను.
మత్స్యకూర్మా రూపములను ధరించిన నేను సృష్టికిని, ప్రలయమునకును, వంశములకును, మన్వంతరములకును, వంశాను చరితము మొదలగుదానికి కారణ మైనవాడను. (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము. ప్రధాన రాజవంశముల వర్ణనము వంశాను చరితము)
వర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. ఓ బ్రాహ్మణా ! ఋగ్యజుస్సామాథర్వవేదములును, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగములారును, కోళము, మీమాంస, ధర్మ శాస్త్రము, పురాణము, న్యాయశాస్త్రము, ఆయు ర్వేదము, సంగీతశాస్త్రము. ధనుర్వేదము, ఆర్థశాస్త్రము - ఇవన్ని యు అపరవిద్య. చూడ శక్యము కానిదియు, పట్టుకొన శక్యము కానిదియు, గోత్రము గాని శాఖ గాని లేనిదియు, నిత్యమును ఆగు బ్రహ్మను బోధించు విద్య పర విద్య.
పూర్వము బ్రహ్మ దేవతల కెట్లు చెప్పెనో, విష్ణువు నా కెట్లు చెప్పెనో ఆ విధముగ మల్యాది రూపములను ధరించిన జగత్కారణభూతు డగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను.
ఆగ్ని మహాపురాణములో ‘ప్రశ్నము’ అను ప్రథమాధ్యాయము సమాప్తము.