2 - అథ మత్స్యావతార వర్ణనమ్ - మత్స్యావతార వర్ణనము
వశిష్టుడు పలికెను : మత్స్యారూపములను ధరించినవాడును, - సృష్ట్యాదులకు కారణ మైనవాడును అగు - విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున ఆగ్నేయపురాణమును గూర్చి యు, బ్రహ్మను గూర్చియు (లేదా ఆగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.
ఆగ్ని పలికెను : వసిష్ణా! విష్ణువు ధరించిన మల్స్యావతారమును గూర్చి చెప్పెదను; వినుము అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండును కదా ?
ఓ మునీ గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట. ఆను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్ని యు సముద్రములో మునిగిపోయినవి.
వైవస్వతమనువు భుక్తిముక్తుల నపేక్షించి తపస్సు చేసెను. ఒకనా డాతడు కృతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా ఆతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.
ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది ఆతనితో “మహారాజా ! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము” అని పలికెను. ఆది విని ఆతడు దానిని కలశములో ఉంచెను.
ఆ మత్స్యము పెద్దదిగా అయి రాజుతో “నాకొక పెద్ద స్థానము నిమ్ము” అని పలికెను. రా జా మాట విని దానిని చెదలో ఉంచెను.
అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను : “ఓ ! మనుచక్రవర్తీ ! నాకు విశాల మైన స్థానము నిమ్ము.” పిమ్మట దానిని సరస్సులో ఏడువగా ఆది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. “నా కింకను పెద్దదైన స్థానము నిమ్ము” అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడచేను.
ఆది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భుత మైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.
“నీ వెవరవు ? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా ! నీకు నమస్కారము. జనార్దనా ! మాయచేత నీవు నన్నీ విధముగ ఏల మోహ పెట్టుచున్నావు ?”
మను ఏ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలను పాలించుట యందు (లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను - “ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయుటకును అవతరించినాను”.
“(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. ఆపుడు నీదగ్గరకు వచ్చిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షి సమేతుడవై బ్రహ్మ నిద్రించు రాత్రి అంతయు సంచరించగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము”.
ఇట్లు వలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.
ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.
కేశవుడు బ్రహ్మ నుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేద మంత్రాదులను రక్షించేను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారము ధరించెను.
అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.