పురాణ పరిచయం
జయతిపరాశరసూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః
జయస్యాస్య కమలకోశే వాఙ్మయ మమృతం జగత్ పిబతి (వాయుపురాణం: 1-ఽ)
సత్యవతీ హృదయానందకరుడు, పరాశర మహాముని కుమారుడు, తన ముఖమనే కమలంలో సమస్త వాఙ్మయామృతాన్ని దాచుకొని ప్రపంచం చేత త్రాగిస్తున్నవాడు అయిన వ్యాసునికి నమస్కారము అని ఎవనిచేత రచింపబడిందో ఆవాయు పురాణం ఆ మహానుభావునికి నతమస్తకం అవుతుండగా
అచతుర్వదనో బ్రహ్మో ద్విబాహు రపరోహరిః
అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః (మహాభారతం-ఆదిపర్వం)
నాలుగు ముఖాలు లేని బ్రహ్మ, రెండు చేతులతో ఉన్న విష్ణువు, ఫాలభాగంలో కన్నులేని శివుడు బాదరాయణ వ్యాసుడని, తన జన్మకు కారణభూతుడైన కృష్ణద్వైపాయనునికి ప్రణతులర్పిస్తున్నది మహాభారతం.
అలాంటి వ్యాసమహాముని చేతిలో అష్టాదశ (18) పురాణాలు రూపుదాల్చాయని భారతీయుల విశ్వాసం. పురాణ శ్రవణం బహుకాలంగా ఈ దేశంలో సంప్రదాయమనే నదికి కాలువలు తీస్తున్నదే. అందుకే
యథా పాపాని పూయంతే గంగావారి విగాహనాత్
తథా పురాణ శ్రవణాద్ దురితానాం వినాశనమ్ (వామనపురాణం-95-86)
గంగానదిలో స్నానం చేయటం చేత పాపాలు నశిస్తాయి. అలాగే పురాణ శ్రవణం చేత కష్టాలు దూరం అవుతాయి అని భారతీయుల నమ్మకం.
పురాణాల ప్రాముఖ్యత
భారతీయ సంస్కృతికి అవిచ్ఛిన్నంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మూలాధారాలుగా నిలుస్తున్నవి వేదాలు. ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా, ఎన్ని సాంస్కృతిక దౌష్ట్యాలు చోటు చేసుకొన్నా మన సనాతన ఆర్షసంస్కృతి ఈనాటికీ నిలిచి ఉన్నది అంటే అందుకు కారణం వేదాలేనని చెప్పుకోవాలి. ఈ వేదాల యెడల మనకు గల భక్తి గౌరవాల కారణంగానే మనం ఐహిక సుఖాలనే కాకుండా ఆముష్మిక ఉన్నతికి మార్గాలు వేసుకోగలుగుతున్నాము. వేదాల ద్వారానే మనం జీవితంలో తప్పకుండా ఆచరించవలసిన కర్తవ్యాలను, విధులను తెలుసుకొని ఆచరించ గలుగుతున్నాము. ‘పుమాన్ పుమాంసం పరిపాతు విశ్వతః-అనే వేదమంత్రం ఒక మనిషి తన తోటి మనిషికి సహాయం చేసి దాని ద్వారా తన జన్మను సఫలం చేసుకోమని బోధిస్తున్నది. అలాగే “మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని” అనే మంత్రం సమస్త ప్రాణులను మిత్రభావంతో చూడాలని నిర్దేశిస్తున్నది. ‘కృణ్మో బ్రహ్మవో గృహే సంజ్ఞానాం పురుషేభ్యః’ అనే మంత్రం-ఓ ప్రజలారా మనమందరం కలసి మానవులలో సద్భావం కొరకు, సద్భావనకోసం దైవాన్ని ప్రార్ధిద్దామనే కర్తవ్యాన్ని బోధిస్తున్నది. ఇలా మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి వేదాలు సన్మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి, కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాయి. వేదాలలో చెప్పబడిన అంశాలు చాలా వరకు నిగూఢంగా ఉంటాయి. సామాన్యునికి కూడా అర్థం అయ్యే విధంగా ఉపదేశం చేయడానికి పురాణాలు ఉద్భవించాయి. అందుకే ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలనేవి నాలుగైతే, ఆ వేదాలతో సమానంగా ‘పురాణం పంచమోవేదః’ అని అయిదవ వేదంగా కీర్తించబడుతున్నది. భారతీయ సంస్కృతి యొక్క స్వరూప స్వభావాలను సమగ్రంగా తెలుసుకోవాలంటే పురాణ అధ్యయనం చాలా ముఖ్యం. పురాణాలు భారతీయ సంస్కృతికి కొలదండాలవంటివి. ఆ పురాణాల మీద ఆధారపడే, ఆధునిక భారతీయ సమాజం తన నీతి నియమాలను నిర్దేశించుకొంటున్నది. పురాణాల్లో లేని విషయాలు ఏమిలేవు. దేవతలు, ఋషుల వృత్తాంతాలు, సదాచారాలు, పదునాలుగు విద్యలు, మానవ కర్తవ్యాలు అన్నింటిని తనలో ఇముడ్చుకున్న ఈ పురాణ ప్రక్రియయే ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. అందుకే పురాణాలను గురించి కొంతైనా తెలుసుకొనటం ప్రతి భారతీయునికి అవశ్యకర్తవ్యం. భారతీయఇతిహాస దృష్టితో చూస్తే పురాణాలకు మహత్తరమైన స్థానం ఉన్నది. ప్రతి హిందువుకు పురాణ అధ్యయనం ఏదో విధంగా అనివార్యం అవుతున్నది. అందుకే భారతీయులపై పురాణ సాహిత్యం నెరిపినంత గాఢ ప్రభావం మరి ఏ సాహిత్యం చూపలేకపోయింది.
పురాణం అంటే ఏమిటి?
‘పురాణ’ శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోను, యాస్కుని నిరుక్తంలోను, పురాణాలలో కూడా కనిపిస్తుంది. పాణిని చెప్పిన ప్రకారం ‘పురాభవమ్’ (ప్రాచీనకాలంలో జరిగినది) అనే అర్థంలో ‘సాయంచిరం పాహ్ణే ప్రగే అవ్యయే భ్యష్టచ్య్ట్చ్యు లౌతృట్చ’ (4-3-23) అనే సూత్రం ద్వారా ‘పురా’ శబ్దానికి ‘టుచ్య్’ ప్రత్యయంచేరి, తరువాత దానిపై ‘తుట్’ ఆగమంగా వచ్చినందువలన పురాతన శబ్దం ఏర్పడుతుంది. ఇంతేకాకుండా పాణిని రచించిన “పూర్వకాలైక సర్వజరత్పురాణనవకేవలాః సమానాధి కరణేన” (2-1-49), “పురాప్రోక్తేషు బ్రాహ్మణ కల్పేషు” (4-3-105)అనే ఇంకో రెండు సూత్రాలలో పురాణశబ్దాన్ని ఉపయోగించాడు. యాస్కుని నిరుక్తం ప్రకారం ‘పురాణం’ పురానవం భవతి (3-4-19) అనే ఇంకో రెండుసూత్రాలలో పురాణ శబ్దాన్ని నిర్వచించాడు. అంటే ప్రాచీనమైనదైనా క్రొత్తదిగా ఉండేదానిని ‘పురాణం’ అంటారని భావం. వాయు పురాణంలో ‘పురాఅనతి’ అని పురాణానికి వ్యుత్పత్తి చెప్పబడింది. అంటే ప్రాచీన కాలంలో జీవించి ఉన్నదానిని పురాణం అంటారు అని బ్రహ్మాండపురాణం (1-1-1-173) ‘పురా ఏతద్ అభూత్’ అంటే ప్రాచీన కాలంలో ఈ విధంగా జరిగింది అనే దానిని తెలియజేసే శాస్త్రమే పురాణం అని వివరిస్తున్నది.
ఈ వ్యుత్పత్తులను పరిశీలిస్తే, పురాణం అనేది ప్రాచీన కాలానికి సంబంధించిందని తెలుస్తుంది. ఆర్యజాతి యొక్క వైదిక సాహిత్యానికి చెందిన జ్ఞానానికి, విజ్ఞానానికి అక్షయ నిధి పురాణం, ఇప్పటివరకు ప్రపంచంలో జ్ఞానులు, శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలన్నీ పురాణాలలో ఉన్నాయని (కొందరి) భావన. మొత్తంమీద ప్రాచీన కాలంలో జరిగిన విషయాలను ఇప్పుడు జరుగుతున్న వానివలె ధర్మోపదేశకంగా తెలిపేవి పురాణాలు అని చెప్పవచ్చు.
పురాణాల పాత్ర ఏమిటి?
పురాణం అంటేనే ప్రాచీనమైనదని అర్థం. సృష్టికి ప్రారంభంలో జ్ఞానరాశి సామాన్య శబ్దాలలోను, వాక్యాలలోను, చెప్పటానికి వీలుకాని సమయంలో పురాణాలను దేవతలు సేకరించారు. ఆ ప్రాచీన కాలపు ఆలోచనాధార, భావనాధార, జ్ఞానధారలు విస్తారంగా పురాణాలను కూర్చటంలో ప్రతిఫలించింది. దీనివలన వేదార్థాన్ని సరియైన పద్ధతిలో, సరిగా అవగాహన చేసుకొనే వీలు కలిగింది. అదే ‘పురాణ ఉపబృంహకత’ అని పిలువబడింది. ఈ విధంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలలోని తులలేని రత్నాలు పురాణాలలో పొదగబడ్డాయి. వానిని సూక్ష్మంగా, తులనాత్మకంగా పరిశీలించి అవగాహన చేసుకొనకపోతే వేదార్థం సరియైన పద్ధతిలో అవగాహనకాదు. ఈ విశ్వంలో పరమాత్ముడు ఒకడే. అయితే ఆయా స్థలాలలో, ఆయా పురాణ ఖండాలలో వివిధ దేవతల ఉపాసనను తెలిపిన కథలలో దేవతలు, ఋషులు, తపస్వులు, మునులు, విప్రులు, పర్వతాలు, సముద్రాలు, తీర్థాలు, వృక్షాలు, పశుపక్ష్యాదులు-అన్నీ ఆ విషయాన్ని ప్రతి పాదించేవిగానే పురాణాల్లో చెప్పబడ్డాయి. అన్నీ కూడా పరమాత్ముని దివ్య చైతన్య స్ఫూర్తిని ఒకదానికి ఒకటి సహకారకంగా వివరించేవే.
ఈ విధంగా సమగ్ర జీవన విధానంలో సమగ్ర బ్రహ్మాండ విషయాలలో, భావనలో ఒకే ఒక పరమాత్ముని సాక్షాత్కారం చేసుకొనే విధానాన్నే పురాణాలు ప్రతిపాదించాయి. అందుకు అవసరమైనంత సమర్థవంతంగా రూపుదిద్దుకున్నాయి. ఈ విషయాలనే పురాణ విద్య అన్నారు. అది మహర్షులకు సర్వస్వంగా నిలిచింది. ఎన్ని రకాలైన దరిద్రాలకు భారతదేశం గురి అయినా, ఆ నిధే తరతరాలుగా ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టింది. ఇదే చరిత్రలో పురాణాలు నిర్వహించిన పాత్ర.
పురాణాలు-జయము అనే పేరు
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయ ముదీరయేత్
అని మహాభారతము చెప్పుతున్నది. అందుచేత మహారతానికి జయము అనే పేరు ఉన్నట్లు తెలుస్తున్నది. ‘జ’ అంటే సంస్కృత సంఖ్యా పరిగణనాన్ని బట్టి 8. ‘య’ అంటే 1 అనగా 81.
‘అంకానాం వామతో గతిః’ అనే నుడిని బట్టి ఇది 18 అవుతుంది. 18 పర్వాలు గలది, 18 అధ్యాయాల భగవద్గీత కలది, 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం గలది, యుద్ధంలో పాల్గొన్న 18 అక్షౌహిణుల సైన్యం గలది, మహాభారతం-అందుకే ఆ మహాగ్రంథం ‘జయం’.
అలాగే పురాణాలకు కూడా ‘జయము’ అనే పేరున్నది. అసలు పవిత్రమైన హిందూ గ్రంథాలకు ‘జయము’ అనే పేరు ఉన్నట్లున్నది. చూడండి.
అష్టాదశ పురాణాని రామస్య చరిత్రం తథా
కార్ణ్షం వేదం పంచమం, యన్మహా భారతం విదుః
తథైవ విష్ణు ధర్మశ్చ, శివధర్మాశ్చ శాశ్వతాః
జయేతి నామతేషాం, చ ప్రవదంతి మనీషిణః-భవిష్యత్పురాణం.
అని అష్టాదశ పురాణాలకు, రామాయణానికి, మహాభారతానికి, విష్ణుపురాణం, శివధర్మ పురాణం, శారీరక సూత్ర భాష్యాలకు జయం అనే పేరు ఉన్నదని తెలుస్తున్నది.
జయం జయత్యనేన సంసారమితి జయో గ్రంథః
ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమై సంసార జయమునకు అనగా ఈ లోకము నందు విజయము పొందుటకు సాధకములైన గ్రంథాలను జయము అంటారని తెలుస్తున్నది.
పురాణాల ఆవిర్భావం
పురాణాలు ఎలా ఆవిర్భవించాయి అనే విషయాన్ని గురించి ప్రాచీన వాఙ్మయంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. పురాణాల ఆవిర్భావంలో రెండు ధారలు కన్పిస్తాయి. 1. వ్యాసునికి పూర్వపు సంప్రదాయం 2. వ్యాసోత్తర సంప్రదాయం. వ్యాసునికి ముందు ‘పురాణం’ అనే పదానికి లోకంలో బాగా ప్రచారంలో ఉండి, అవ్యవస్థితంగా ఇక్కడ అక్కడా చెల్లాచెదురుగా ఉన్న లోక వృత్తాత్మకమైన విద్య అని మాత్రమే అర్థం. దీనికి ప్రమాణంగా ప్రాచీన గ్రంథాలలో ‘పురాణము’ అని ఉన్నదేగానీ, పురాణ సంహిత అని లేక పోవడమే. అంటే దీనివలన ఏదీ గ్రంథంగా గాక విద్యావిశేషమనే దానిని భావించాలి.
పురాణాల తత్వాన్ని గురించి స్కాందపురాణంలోని రేవాఖండంలోను, పద్మ పురాణం (సృష్టిఖండం), మత్స్యపురాణంలోను ‘కల్పాంతరంలో పురాణం ఒకటిగానే ఉండేదని, అది త్రివర్ణాలైన ధర్మ అర్ధ కామాలకు సాధనంగా ఉండేదని, అది చాలా పెద్దగా శతకోటి శ్లోక విస్తారంగా ఉండేదని, ఆ పురాణం దేవలోకంలో ఉండేదని, కాలాంతరంలో క్షీణబుద్ధులైన మానవులు దానిని గ్రహించ లేనందువలన, శ్రీమహావిష్ణువు మానవుల క్షేమం కోసం దానని నాలుగు లక్షల శ్లోకాలకు వ్యాసునిగా అవతరించి పరిమితం చేశాడని చెప్తున్నాయి. అందువలన మనుష్యలోకంలో పురాణాలు చతుర్లక్ష శ్లోకాలకు పరిమితం అయింది. ఆ చతుర్లక్ష శ్లోకాలనే 18 పురాణాలుగా వేదవ్యాసుడు చేశాడు. అవే ఈనాడు లభ్యం అవుతున్నాయని ఆ పురాణాలు ఘోషిస్తున్నాయి. కొందరు ఇది చతుర్లక్షాత్మకమైన ఒకే పురాణంగా ఉండేదని దానినే బ్రహ్మాండ పురాణమని పిలిచేవారని అదే 18 విభాగాలుగా చేయబడిందని తెలుపుతున్నారు. ఏదైనా ఈ 18 పురాణాలను వేదవ్యాసుడు రచించాడని ఈ యుగంలో భావించడం సరియైనదే.
ఒకానొక కాలంలో ఒకటే పురాణం ఉండేదా?
పురాణ వాఙ్మయం విస్తృతంగా పెరిగి నాలుగు లక్షల శ్లోకాల పరిమితికి చేరిన నేడు ఈ విషయాన్ని నిర్ధారించటానికి అంతగా అవకాశం లేదుగానీ పండితులు అనేకులు ‘ఆరంభంలో పద్దెనిమిది కాదని తెలుపుతున్నారు. మొదట శ్లోకాత్మకమైన పురాణం ఒకటే ఉన్నట్లు అది క్రమంగా వేదోపబృంహణం చేయటం అనే అంశం ఆధారంగా క్రమంగా పెరిగినట్లుగా, దాని గ్రంథసంఖ్య మొదట కొద్దిగా ఉండి తరువాత పెరుగుతూ పోయి, వేఱువేఱు కాలాలలో పెరిగిన కూర్పులు బయలు దేఱినట్లుగా చెప్పటానికి పురాణాలలోనే కొన్ని సూచనలు ఉన్నాయని తెలుపుతున్నారు.
జాక్సన్ అనే ఐరోపీయ పరిశోధకుడు “వైదికయుగం చివరి భాగం నుంచి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం వరకు ఇతిహాసాలకు అనుబంధంగా పురాణం ఒకటి ఉండినట్లుగా అందులో సర్గము, ప్రతి సర్గము, వంశము, వంశాను చరితము, మన్వంతరమ అనేవి వర్గీకరింపబడినట్లు హిందువుల వ్రాతలవలననే తెలియవస్తున్నది. స్టీఫెనాకాలం వఱకు వేఱువేఱు మఠాలలో వ్రాయబడుతూ వచ్చిన శాక్జన్ వృత్తాంతా (శాక్జన్ క్రానికల్)ల వంటివే ఈ పురాణాలు. నార్మనుల దండయాత్ర తరువాత పరస్పర సంబంధంలేని భాగాలు ఆ వృత్తాంతంలో చేరిపోతూ వచ్చినట్లే హిందూ సామ్రాజ్య కేంద ప్రభుత్వం అంతరించిన పిదప పండిత సమావేశాలు అంతకుపూర్వం కంటే కష్టతరమైనా అప్పటి నుంచి ఆయా పుణ్యక్షేత్రాలలోని పండితులు తమ దగ్గరగల శ్లోకాత్మకమైన మూలపురాణ ప్రతులలో అక్కడక్కడా మార్చటం, కొన్నిచోట్ల స్థానిక విషయాలను చేర్చి గ్రంథాన్ని పెంచడం సంభవించి ఉండాలి. మూల గ్రంథమైన ఆది పురాణం నుంచి ఈ విధంగా బ్రహ్మపురాణం ఒరిస్సాలోను, పద్మపురాణం పుష్కర క్షేత్రంలోను, అగ్నిపురాణం గయలోను, వరాహపురాణం మధురలోను, వామన పురాణం స్థానేశ్వరంలోను, కూర్మపురాణం వారణాసిలోను, మత్స్యపురాణం నర్మదా ప్రాంతంలోను పుట్టాయి” అని వ్రాశాడు.
మూలపురాణంలోని శ్లోకాలు ఎన్ని?
దేశకాలాలను బట్టి పురాణాలు చాలా మార్పులను పొందాయి. ఇప్పుడు స్పష్టంగా ఆ మూల పురాణ రూపాన్ని కనుక్కోలేకపోయినా కొన్ని ఆధారాలను బట్టి ఒకపాటి నిర్ణయానికి రావచ్చు. భవిష్యత్పురాణంలోని “సర్వాణ్యేవ పురాణాని సంజ్ఞేయాని నరర్షభద్వాదశైవ సహస్రాణి ప్రోక్తానాం మనీషిభిః” అనే శ్లోకంవలన పురాణాలు అన్నీ కలిపి మొదట 12,000 శ్లోకాలకు పరిమితమేనని తెలుస్తున్నది. అలాగే ‘పునర్వృద్ధింగతా నీహ ఆఖ్యానైర్వివిధైర్నృప, యథాస్కాందంతథాభేదం భవిష్యం కురునందన” (ఓ రాజోత్తమా పురాణాలు అన్నీ కలిపి మొదట 12,000 గ్రంథంగా ఉండేది. కాలక్రమంలో అనేక వ్యాఖ్యానాలు చేరి అది వృద్ధి చెందింది అని చెప్తూ, ఇంకా స్కాందం శత సహ స్రంతులోకానాం జ్ఞాతమేవహి, భవిష్యమేతదృషిణా లక్షార్ధ సంఖ్యయాకృతం’ స్కాందం లక్షగ్రంథాల పరిమాణం భవిష్య పురాణం యాభైవేల గ్రంథంగా పెరిగిందని లోకులందరికీ తెలుసు అని తెలుపుతున్నది.
మొదటలో ఉన్న ఆది పురాణం పేరు ఏమిటి?
ఒక్క పురాణం నుంచి పెక్కుపురాణాలు పుట్టాయనటానికి విష్ణుపురాణమే ఒక దృష్టాంతము. విష్ణు పురాణం పురాణాలకే ఆదర్శమైనదని, పురాణాలలో పురాతనమైనదని పరిశోధకుల భావన. కానీ ఈ విష్ణుపురాణం కూడా స్వతంత్రం కాదు, ఒకప్పుడిది బ్రహ్మాండపురాణం అనే సర్వసమగ్ర పురాణం యొక్క భాగంగా ఉండేది. తరువాత కాలంలో దాని నుంచి చీలి, స్వతంత్ర పురాణం అయింది. 16వ శతాబ్దంవాడైన వెన్నెల కంటి సూరన విష్ణుపురాణాన్ని తెలుగులోకి అనువదించాడు. అందులో షష్ఠ్యంతాలైన తరువాత “అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన బ్రహ్మాండ పురాణంబు నందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునకు కథాక్రమంబెట్టిదనిన’ అని చెప్పాడు. ఇంతేకాక ప్రతి ఆశ్వాసం చివర గద్యలోను ఇలాగే వ్రాశాడు. దీనిని బట్టి 16వ శతాబ్దంలోని సంస్కృత విష్ణుపురాణ ప్రతిలో అది బ్రహ్మాండపురాణంలోని పరాశర సంహిత అనబడే భాగమని వ్రాసి ఉండాలని నిశ్చయంగా తెలుసుకొనవచ్చు. అయితే ఎందుకు ఈ విషయం ప్రస్తుత ముద్రిత సంస్కృత విష్ణు పురాణంలో చెప్పబడలేదంటే ఇది స్వతంత్ర పురాణం కాక ఒక మహాపురాణంలోని భాగం అంటే దాని గౌరవం తగ్గిపోతుందనే భయంవలన కావచ్చును. ఇటీవలి వారు సంస్కృత లిఖిత ప్రతులు వ్రాసుకొనే సమయంలో ఈ మాటను ఎత్తివేసి ఉండవచ్చు. అయితే కొన్నింటిలో మాత్రం పరాశర సంహిత అని ఉన్నది.
అయితే 11వ శతాబ్దంనాటి ఆల్బెరూనీ అనే పండితుడు భారతదేశం వచ్చి మన గ్రంథాలను కొంత పరిశీలించటం జరిగింది. ఆయన ఇచ్చిన పురాణాల పట్టికలో విష్ణుపురాణం, బ్రహ్మాండ పురాణాలు వేర్వేరుగా పేర్కొనబడ్డాయి. అందువలన పదకొండవ శతాబ్దానికి ముందే బ్రహ్మాండ పురాణం నుంచి విష్ణుపురాణం విడిపోయిందన్నమాట. భారతదేశంలో వైష్ణవమతం బాగా ప్రచారంలోకి వచ్చిన తరువాత విష్ణుపురాణం బ్రహ్మాండపురాణ భాగమని పేర్కొనడం ఆగిపోయి ఉండవచ్చు.
మొత్తంమీద మొదట బ్రహ్మాండమనే పురాణం ఒకటే ఉండేదని, అది అనేక సంహితలుగా ఉండేదని, విష్ణుపురాణం ఆ సంహితలలో ఒకటని చెప్పవచ్చు.
ఇక వాయుపురాణాన్ని పరిశీలించగా అందరు పండితులు వాయుపురాణాన్ని ప్రాచీన పురాణంగా అంగీకరిస్తున్నారు. ఇది హర్షచరిత్రంలోను, బాణుని కాదంబరిలోను పేర్కొనబడింది. ప్రస్తుతం బ్రహ్మాండపురాణంగా ముద్రితం అయిన గ్రంథంలో దాదాపు రెండువంతులు అంటే పరశురామ సర్గ వృత్తాంతము, లలితోపాఖ్యానం తప్ప మిగిలిన భాగం 78 అధ్యాయాలు, శ్లోకాలతో సహా మారకుండా వాయుపురాణంలో యథాశ్లోకంగా ఉన్నాయి. కాబట్టి వాయుపురాణం అసలు వాయుపురాణం కాదని గయాక్షేత్రమాహాత్మ్యం కూడా కలిసి ఉన్న బ్రహ్మాండపురాణంలోని ఒక భాగమని భావించవచ్చు. అనగా బ్రహ్మాండపురాణంలోని వాయు సంహితను వాయు పురాణంగా పరివర్థితం చేసి ఉండ వచ్చుని భావించటంలో ఎలాంటి అసంగతము ఉండదు. ఇందుకు బలంగా నారదపురాణంలోని ఒక కథలో దీనికి సూచన ఉన్నది. అందులో “నాలుగు పాదాలతోను బ్రహ్మాండ పురాణాన్ని వర్ణించి ఉన్నాను. ఇది పదునెనిమిదవది, అనుపమానమైనది. సారాతీతమైనది. బ్రహ్మాండ పురాణం నుండి పారాశర్యమహాముని దీనినే అందరికీ పదెనెనిమిది విధాలుగా చెప్పి ఉన్నాడు. ఆ మహాముని నావలన పురాణాలను విని, మననముచేసికొని ధర్మశీలురును, దీనానుగ్రహకరులైన మునులకు తెలియచెప్పి వానిని లోకమున వ్యాపింపచేసెను. (నారదపురాణం 100-29-35) అని చెప్పబడింది.
దీనినిబట్టి బ్రహ్మాండపురాణమే అన్ని పురాణాలకు మూలాధారమని ఒక పురాణ గాథ ఉన్నట్లు తెలుస్తున్నదిగదా. ఇంకొక ఆధారం మన భారతీయ హిందువులు క్రీ.శ. 5వ శతాబ్దానికంటే ముందే బలిద్వీపానికి వలసపోయారు. వెళ్లేటప్పుడు వారు తమతో తమ గ్రంథాలను కూడా కొన్నింటిని తీసుకొని వెళ్ళారు. అవి ఆ దేశ భాష అయిన ‘కవి’ భాషలోనికి అనువదించబడ్డాయి. ఆ గ్రంథాలలో సంస్కృతమూలాలతో సహా ఋగ్వజుస్సామఅధర్వవేదాలు, రామాయణ మహాభారతములు కూడా ఉన్నాయి. పురాణాలలో ఆ బలిద్వీపవాసులు ఒక్క బ్రహ్మాండాన్నే గానీ, మిగిలిన వాటిపేర్లను కూడా ఎరగరు. అంటే మిగిలిన వాటి పేర్లను కూడా తెలియనంతగా ఉన్నారంటే ఆనాటికి ఒక్క పురాణమే ఉండేదని భావించవచ్చుగదా. పైగా బలిద్వీపంలో ఒకతెగ శైవులు ఉన్నారు. వారు బ్రహ్మాండపురాణన్నే తమ పురాణంగా అంగీకరిస్తారు. అందువలన హిందువులు వలస పోయినప్పుడు ఒకటే పురాణం ఉండేదని భావించవచ్చు. అలాగే నేటి బ్రహ్మ పురాణంలో చాలా భాగాలు మక్కికి మక్కి విష్ణుపురాణంలోని భాగాలే భాగవతంలోని కథలు అన్నీ విష్ణుపురాణాన్ని అనుసరించి వ్రాయబడినవే. అలాగే అనేక పురాణాలలో ఉన్న శ్రాద్ధకల్ప విషయాలు దాదాపు ఏకరీతిగా ఉన్నాయి. అందువలన మొత్తంమీద క్రీస్తుశకం మూడు నాలుగు శతాబ్దాల వరకు పురాణం అనే పేరుతో ఒకే గ్రంథం ఉండేదని, దానికే అప్పుడుకానీ, అటుతరువాత కానీ బ్రహ్మాండపురాణం అనే పేరుండేదని దానిలో పన్నెండు వేల శ్లోకాలకంటే ఎక్కువగా ఉండేవి కావని, ఆ పురాణంలోని భాగాలు క్రమంగా దాని నుంచే వేరుపడి ప్రత్యేక పురాణాలు అయినాయని, ఈ విధంగా తగి పోవటం వలన మూల పురాణం క్రమంగా సన్నగిల్లి, కేవలం పేరుకు మాత్రం మిగిలిందని, మూల పురాణ భాగాలన్నింటిలోకి గొప్పవి. మొట్టమొదట చీలిపోయినవి విష్ణు వాయు పురాణాలు కావచ్చునని, కొంతకాలం వరకు ఏయే భాగాలు ఏయే మూల గ్రంథ భాగాలో తెలుపబడుతూ ఉండేవని, కాని క్రమంగా మతము మీది అభిమానము ఎక్కువైన కొద్దీ గౌరవ భంగం అని తలచి కావచ్చు మూలగ్రంథపు పేరును జారవిడిచి స్వతంత్రాలైన ప్రత్యేక పురాణాలుగా వాటిని ప్రకటించడం మొదలైందని నిర్ణయించవచ్చు.
పురాణం లౌకిక శాస్త్రం. ఇది వేదం కంటే భిన్నమైనది. కానీ వేదానికి అనుకూలమైనట్టిది. ఇదే వేదోపబృంహణం. ఇది ఎప్పుడూ స్థిర రూపాన్ని కలిగి ఉండదు. ఇది కాలాన్ని అనుసరించి, పరివర్తన శీలకమైనట్టిది. కాల ప్రభావంచేత మార్పులను పొందుతుంటుంది. అందుకే తంత్రవార్తిక మనే గ్రంథం వేదం అకృత్రిమమైనదని, పురాణం కృత్రిమ మైనదని చెప్తున్నది. అందుకే నిరుక్తం ‘పురాపినవం భవతి’ పాతది అయినా కొత్తగానే ఉంటుంది అని చెప్పింది. అంటే కాలాంతరం ఉత్పన్నమయ్యే మార్పులను పురాణం తనలో లీనం చేసుకొంటుందని దీని భావం.
వేదాలు పురాణాలను గురించి ఏమి అంటున్నాయి?
వైదిక కాలం నుంచి నేటివరకు వేదాలకు పురాణాలకు గల సంబంధం రక రకాలుగా వ్యక్తపరచబడింది. వేద పురాణాలు రెండూ ఒకరకంగా అవినాభావ సంబంధం గలవే, భారతీయతత్త్వం ప్రకారం వేదాలు అపౌరుషేయాలు అంటే మానవులు ఎవరూ వాటిని వ్రాయలేదు. భగవంతుడు వాటిని రచించలేదు. అవి నిత్యాలు, అనాదులు అని భారతీయుల విశ్వాసం. ప్రాచీనులు శబ్దాన్ని ధ్వనిని వేరువేరుగా భావించారు. వేద ధ్వని నిత్యం (వాచా విరూప నిత్యయా-ఋగ్వేదం 8-75-6) అంటే ఉచ్చరించటం చేతనే అది వినపడుతుందని, కానీ వేదశబ్దం నిత్యమని, ఉచ్చరించక పోయినా అది నిలిచే ఉంటుందని వారి విశ్వాసం. ప్రళయ కాలంలో వేదశబ్ద రాశి అంతా భగవంతునిలో నిక్షిప్తం చేయబడుతుంది. సృష్టి జరిగే సమయంలో పరమేశ్వరుని ద్వారానే వేదపురాణాలు వెలువడ్డాయి. వేదాలలోని గూఢమైన అర్థాలను తపస్సుద్వారానే అవగాహన చేసుకొనే వీలుంటుంది. వేదాలు ఈ నిగూఢమైన అర్థాలను గురించే భగవద్గీతలో భగవంతుడు ‘వేదాంతకృద్వేద వివేద చాహమ్’ (11-15) అని తెలిపాడు. ఈ విధంగా వేదాలలో నిక్షిప్తమైన గూఢార్థాలను గ్రహించటానికి సరళమైన భాష అవసరం. అందుకు పురాణాలు రామాయణ మహాభారతాలు రచింపబడ్డాయి. వేదాలు, పురాణాలు, రామాయణం, భారతం ఇవి అన్నీ కూడా ఒకే ఒక అఖండ ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఈ విధంగా వేదాలలో భాగమైన ఉపనిషత్తులలోని నిగూఢతత్త్వం పురాణాలలో విపులంగా విశదంగా చెప్పబడింది.
నారదపురాణం, వేదాలకంటే పురాణాలకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నది. వేదాలు సమగ్రంగా పురాణాలలోనే ప్రతిష్ఠితాలుగా ఉన్నాయి అని ఇంకా (‘న వేదే గ్రహ సంచారో నశుద్ధిః కాలబోధినీ’-(నారద పురాణం-2-24-19) అంటే వేదాలలో జ్యోతిష్యానికి సంబంధించిన గ్రహసంచారం, ఇతర వ్యావహారిక విషయాలు ఎక్కడా లేవు అంటుంది. ఒక ఉదాహరణను చూద్దాం. పురాణాలలో చంద్రగ్రహణ సమయంలో రాహువు చంద్రుడిని కబళిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం చంద్రుడు భూమి యొక్క నీడ (ఛాయ)లోనికి ప్రవేశిస్తాడని చెప్తుంది. కాబట్టి పురాణంలో చెప్పబడింది అభూతకల్పన అని భావించటం జరుగుతుంది. చంద్రుడు భూమి యొక్క ఛాయలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఛాయలో ఒక చేతన శక్తి ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యమే-ఆ చేతన శక్తే పూర్ణచంద్రుడిని కనపడకుండా చేసి కొంత సమయం పాటు చంద్రుడి తేజం కానరాకుండా చేస్తుంది. అందువలన అది ఆసురీశక్తిగా భావింపబడుతుంది.
దీనినే మనం రాహువు రాక్షస శక్తి అని అంటున్నాం. ప్రకృతిలో జరిగే అన్ని సంఘటనల లోను ఈ చేతన శక్తి యొక్క ప్రమేయం పైకి కనిపించకుండానే ఉంటుంది.
దేవీ భాగవతం ‘శృతిస్మృతీ, ఉభేనేత్రం పురాణం హృదయం స్మృతమ్ ఏతత్ర్యయోక్త ఏవ స్యాద్ధర్మోవాఽఅన్యత్ర కుత్రచిత్’ (11-1-21) అంటుంది. అనగా ధర్మ పురుషుడికి శృతులు, స్మృతులు రెండు కళ్ళైతే పురాణాలు హృదయం అవుతాయి. పురాణాలలో ఆరెండింటిలో (శృతులు, స్మృతులలో) చెప్పిన ధర్మాలు ఉంటాయి. వేరే ఎక్కడా ఉండవు అంటుంది.
ఋగ్వేదంలో అనేక మంత్రాలలో పురాణ శబ్దం ఉపయోగించబడింది. (ఋగ్వేదం 3-5 1-9, 3-58-6, 10-130-6) కానీ ఆ సందర్భాలలో ఆ పురాణ శబ్దానికి అర్థం కేవలం ‘ప్రాచీనమైనది అనేదే. అధర్వణ వేదంలో పురాణ శబ్దం రెండు స్థానాలలో ఉపయోగించబడింది. (ఋచః సామాని ఛందాంసి పురాణం యజుషాసహ, ఉచ్చిష్టజ్జజ్ఞిరే సర్వేదివి దేవా దివిశ్రితాః-11-7-24, తమితిహాసశ్చపురాణంచ-15-6-11) దీనివలన అధర్వవేద కాలానికి పురాణాలు రూపాన్ని సంతరించుకొన్నాయని నిశ్చయంగా చెప్పవచ్చు. కాబట్టి పురాణం నిగమ ఆగమాలనే మూలంగా గ్రహించినదనే విషయం స్పష్టం. ఇప్పుడు మనం సనాతన ధర్మం అని పిలుస్తున్నది వ్యవహారతయా పురాణ ప్రధానమే. ఇందులో సందేహం లేదు. వైదిక వాఙ్మయంలో సంహితలు మాత్రమే కాకుండా బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు కూడా భాగాలే-వీటిలో పురాణాలను స్పష్టంగా విపులంగా పేర్కొనటం జరిగింది. శతపథ బ్రాహ్మణం అనేది యజుర్వేదంలోని ఒక భాగం. అందులో పురాణం యొక్క పుట్టుకే విశేషమైన గాథగా చెప్పబడింది. (మధ్వా హృత యోహవా ఏ ఇతా దేవానాం యదనుశాసనాని విద్యావాకో వాక్యమితిహాస పురాణం గాథా నారా శంస్య (శ.బ్రా. 11-5-6-8) ఇక్కడ ‘ఇతిహాస పురాణమ్’ అనేవి కలిసిపోయిన రూపంలో ఒక సమస్త పదం ద్వారా నిర్దేశింపబడింది. అయితే అధర్వణ వేదంలోని గోపథ బ్రాహ్మణంలో (ఏవమిమే సర్వే వేదా నిర్మితాః ససంకల్పాః సరహస్యాః సబ్రహ్మణాః సోపనిషత్కాః సేతిహాసాః సాన్యాఖ్యానాః సపురాణాః (గో. బ్రా 1-2-10) అని పురాణము ఇతిహాసములను వేరువేరుగా పేర్కొని ఆరెండింటి విభిన్నతను తెలుపుతున్నది.
ఆరణ్యకాలు, ఉపనిషత్తులు బ్రాహ్మణక సాహిత్యం యొక్క అంతిమ స్వరూపాలు. బ్రాహ్మణక గ్రంథాల పరివర్థితరూపాలుగా ఆరణ్యకాలు, ఉపనిషత్తులు విలసిల్లుతున్నాయి. వీటిల్లో పురాణ ప్రసక్తి అనేక మార్లు కనిపిస్తుంది. తైత్తిరీయ ఆరణ్యకంలో పురాణ శబ్దం కనిపిస్తున్నది. అందులో పురాణాని’ అనే బహువచన రూపము (బ్రహ్మ యజ్ఞ ప్రకరణేయద్ బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథా నారాశంసీ భేదాహృతయో దేవానామ భవన్ (తై. ఆ. 2-9) అని కనిపిస్తుంది. దీనితో ముందు చెప్పబడిన ‘ఆఖ్యానాల బహుత్వం తెలుస్తుంది. అలాగే బృహదారణ్య కోపనిషత్ పురాణాన్ని వేదంతో సమానంగా (అస్య మహతో భూతస్యనిశ్వసిత మేతద్ యద్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాఙ్గిరస ఇతిహాసః పురాణమ్’ (బృ. ఉ. 2-4-10) పరిగణిస్తున్నది. అంటే ఇతిహాస పురాణాలు మహాభూతేశ్వరుడైన పరమేశ్వరుని శ్వాస రూపాలని తెలుపుతున్నది. అలాగే ఛాందోగ్యోప నిషత్తులో (అధర్వణ చతుర్థామితిహాసపురాణం పఞమం వేదానాం వేదమ్-భా. ఉ. 7-1-1) సనత్కుమారుని వద్ద బ్రహ్మ విద్యను నేర్చుకొనే సమయంలో నారదుడు తాను క్షుణ్ణంగా నేర్చుకొన్న విద్యలలో వేదాలతోపాటుగా ఇతిహాస పురాణాలను కూడా నేర్చుకొన్నానని స్పష్టంగా పేర్కొన్నాడు. ఇక్కడ ఉపయోగించిన పఙ్చమం అనే పదం పురాణాలను పంచమ వేదాలుగా భావించబడుతుండేదని చెప్పటానికి స్పష్టమైన ఉదాహరణ. పంచమ వేదమనే భావనలో స్థిరపడిన పురాణ విద్య వేదాలతో సమానంగా అతిప్రాచీన కాలం నుంచే భావించబడేదనే విషయం నిశ్చితం. అందువలన ఇతిహాస పురాణాలు పంచమ వేదాలుగా ప్రసిద్ధి చెందాయి.
పురాణాలు-వేదోప బృంహణము
పురాణాలన్నీ వేదాలకు ఉపబృంహకాలే. ఉపబృంహకం అంటే ఏమిటి? ఏ విషయం వేదంలో సూచింపబడిందో లేక సంక్షేపంగా చెప్పబడిందో ఆ విషయాన్ని విస్తారంగా నిరూపణగా వివరించటమే ఉపబృంహకత. పురాణాలు వేదాల ప్రామాణికతలను అన్నిటికంటె ఎక్కువగా వివరిస్తున్నాయి. మహాభారతం కూడా ఇదే విషయాన్ని పురాణ రూపంలోని పూర్ణ చంద్రుడు శృతి (వేదం) అనే వెన్నెలను కాస్తాడు అని ధృవీకరిస్తున్నది. కూర్మ (1-2-19) వాయు (1-201) పద్మ (5-2-51-52) బ్రహ్మాండ (1-1-1-27) మొదలైన పురాణాలు ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. ఉపబృంహణ పదంలోని ‘బృహి’ లేక ‘బృహ్’ అనే ధాతువుకు వర్ధనము, పెంచు అని అర్థం. అంటే వేదంలోని మంత్రాల ద్వారా ప్రతిపాదించబడిన అర్థం, సిద్ధాంతం లేక కథానకాలను విస్తరించి, వాటిని పోషించటమే పురాణాల ద్వారా చేయబడిన వర్ధనం. దీనివలన సమస్త పురాణాలు భారతాది ఇతిహాసాలు ఏదో ఒక రూపంలో వేదార్థాన్ని ఉపబృంహణం చేస్తున్నాయి అని తెలుస్తుంది.
వేదాలను అధ్యయనం చేసేవారు వానిని సాంగోపాంగంగా అర్థాన్ని కూడా తెలుసుకోవాలని మనువు చెప్పాడు. వాయుపురాణం నాలుగు వేదాలను, వాని అంగాలైన ఆరు శాస్త్రాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వ్యక్తి అయినా, పురాణాలను కూడా అతడు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే విచక్షణుడు కాగలడుకానీ లేకపోతే ఆ వేదాధ్యయనం విచక్షణారహితం అవుతుందని ఘోషిస్తున్నది. ఉదాహరణకు ఉపనిషత్తులలో ఒకే బ్రహ్మ చేసిన ఆకాశం యొక్క సృష్టిని గురించి కేవలం అతి సంక్షేపంగా సంకేతంగా మాత్రం (తైత్తిరీయ ఉపనిషత్తు-2-1) ఉన్నది. ఇదే విషయం అగ్ని (ఛాందోగ్యోపనిషత్తు 6-23) నీరు (ఛాందోగ్యోపనిషత్తు 6-2-4)ల సృష్టి విషయంలో కూడా ఇలాగే సూచనగా ఉండగా, పురాణాలలో దీనినే విస్తరించి ఈ తత్త్వాల ఉత్పత్తి, నాశనముల వివరణ (వాయు 4-2) (బ్రహ్మ (2-3)) బ్రహ్మాండ 2-36) కూర్మ (1-2, 4, 7, 8) పురాణాలలో సంపూర్తిగా ఇవ్వ బడింది. ఐతరేయ బ్రాహ్మణంలోను కఠోపనిషత్తులోను చెప్పబడిన హరిశ్చంద్ర నచికేత కథలు బ్రహ్మపురాణం (104వ 105వ అధ్యాయం) భారత సభాపర్వం (అధ్యాయం 12) అనుశాసన పర్వం (అధ్యాయం 91)లలో పర్యాప్త విస్తారంగా వివరించటం జరిగింది. ఋగ్వేదంలోని ఋచ వృత్తాంతం పురూరవ ఊర్వశీ వృత్తాంతాలు విష్ణుపురాణం (4-6-64)లో విపులంగా చెప్పబడ్డాయి.
పురాణాలలో వేదార్థ ఉప బృంహణం నాలుగు రకాలుగా జరిగింది.
1. వైదిక మంత్రాలలోని విశిష్ట పదాలకు అర్థాలు వివరించటం.
2. వైదిక మంత్రాలను వ్యాఖ్యానించటం
3. వైదిక ఆఖ్యానాల (కథల)ను విస్తరించటం
4. వైదిక ప్రతీకలను వ్యాఖ్యానించటం.
ఈ విధంగా పురాణాలు వేదార్థాన్ని అనేక విధాలుగా ఉపబృంహణం చేయటం జరుగుతున్నది. అందుకే గోస్వామి అనే పండితుడు పురాణ పదానికి ‘పూరణాత్ పురాణమ్’ అని వ్యుత్పత్తిని చెప్పటం చాలా సమంజసంగా ఉన్నది. వేదార్థాన్ని పూర్తి చేసేదే పురాణమని దీని అర్థం.
వ్యాసపరంపర
కృష్ణద్వైపాయనుడనే వ్యాస భగవానుడు పురాణ సంహితను కూర్చి పురాణాలను సువ్యవస్థిత రూపంలో ప్రతిష్ఠింప చేయటంలో పురాణ వికాసంలో కొత్త యుగం ప్రారంభం అయింది. పురాణాలలో చెప్పబడిన విషయాల ప్రకారం వ్యాసుడు విష్ణువు యొక్క అపరాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా ఉన్నది. అయితే వాయుపురాణం వ్యాసుడిని బ్రహ్మ అవతారం అని చెప్తుంటే, కూర్మ పురాణం శివుని అవతారం అని ప్రకటిస్తున్నది. ద్వైపాయనుడు అనే పేరు ఆయన యమునానది యొక్క ఒక సైకత ద్వీపంలో పుట్టినందువలన ఏర్పడింది. కృష్ణుడు అనే పేరు ఆయన శరీరవర్ణం నల్లగా ఉన్నందువలన ఏర్పడింది. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశర మహాముని. ఆయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటికి ఒక సువ్యస్థను ఏర్పాటు చేసిన వాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడని పేరు వచ్చింది. వేదవ్యాసుడు నాలుగు వేదాలను పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులకు బోధించాడు. వీళ్లు నలుగురు అనగా-పైలుడు ఋగ్వేదాన్ని, వైశంపాయనుడు యజుర్వేదాన్ని, జైమిని సామవేదాన్ని, సుమంతుడు అధర్వణ వేదాన్ని అభ్యసించి వేద పారంగతులైనారు. ఆయనకు అయిదవ శిష్యుడు కూడా ఉన్నాడు. అతడే సూతుడైన రోమహర్షణుడు. వేదవ్యాసుడు ఆ సూత రోమహర్షుణునికి ఇతిహాస పురాణాలను బోధించాడు. సూతుని పుత్రుడు సౌతి. పద్మ పురాణం ఈ సౌతి పేరు ఉగ్రశ్రవుడని చెప్తున్నది. ఈయనే నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు మహాభారతాన్ని వినిపించాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు, మానవ క్షేమానికి వ్యాసుడు అవతారం ఎత్తుతాడని పలువురు ధర్మరక్షకుల విశ్వాసం.
మన పద్దెనిమిది పురాణాలను వ్యాసుడే వ్రాశాడు (కూర్చాడు) అని భారతీయుల విశ్వాసం. కొందరు పండితులు కొన్ని శాస్త్రీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకొని ఈ పద్దెనిమిది పురాణాలను అనేకులు ఋషులు, మునులు కలసి రచించారని తెలుపుతున్నారు. మేథాతిధి అనే మనుధర్మశాస్త్ర వ్యాఖ్యానకర్త ఉద్దేశ్యంలో ‘పురాణాని వ్యాసాది ప్రణీతాని’ (మను-3-222) అన్నదానిలో ఆదిపదాన్ని అనుసరించి పురాణాలు కేవలం వ్యాసుడు మాత్రమే రచించినవి కాదని ఋషులు మునుల రచనా భాగస్వామ్యం వాటిల్లో ఉన్నదని అభిప్రాయ పడ్డాడు. ఇలాగే మార్కండేయ పురాణంలో కూడా ‘బహులాఃపరమర్షయః’ అని చెప్పిన విషయం కూడా ఆలోచించవలసినదే. బ్రహ్మముఖం నుంచి పురాణం (ఇక్కడ ఏకవచనం-ప్రత్యేకంగా గమనించాలి) వెలువడింది. ఆ తరువాత ఎందరో బ్రహ్మర్షులు పురాణ సంహితను కూర్చారు. అంటే బ్రహ్మముఖం నుంచి పురాణం విద్యారూపంలో వెలువడగా తరువాత మహర్షులు పురాణాలన్నీ గ్రంథరూపంలో సమకూర్చారన్నమాట. కూర్మ పురాణం కూడా ‘వ్యాసాద్యైః’ అని వ్యాసుడు మొదలైనవారు అని చెప్తున్నది. అంటే వేదవ్యాసుడు రెండు సంహితలను సమకూర్చాడన్నమాట మొదటిది ఇతిహాస విషయకమైన జయసంహిత (ఇది మహాభారత సంహితకు మూలరూపం) రెండవది పురాణ విషయక పురాణ సంహిత. తరువాత ఆయన శిష్యుడైనరో(లో) మహర్షణుడు, ఆయన ముగ్గురు శిష్యులు-అకృతవ్రణ, సావర్ణి, శాంశ పాయనులు మొత్తం నాలుగు పురాణ సంహితలను విస్తరించగా మొత్తం పద్దెనిమిది పురాణాలుగా క్రమపరిణామం చెందాయి. ఇందులో మూల కృషి వేద వ్యాసునిదే. పురాణ సంహితలను పద్దె నిమిదిగా విస్తరింపచేయటం ఆయన కృషి ఫలితమే. అందువలనే వేదవ్యాసుడే పద్దెనిమిది పురాణాల కర్త అని చెప్ప బడుతున్నది. బ్రహ్మాండ పురాణంలో “బృహస్పతిశ్చ శుక్రశ్చ వ్యాసః సారస్వతస్తథా, వ్యాసాః శాస్త్ర ప్రణయన వేదవ్యాస ఇతి స్మృతః” అని చెప్పటం కూడా ఈ విషయాన్ని బలపరుస్తుంది.
వ్యాసుడు యజ్ఞకర్మల నిష్పాదనం కోసం నాలుగు సంహితలుగా విభజించినప్పుడే పురాణ సంహితను ఏర్పాటు చేశాడని చెప్పబడింది. దానిని నలుగురు విశిష్ట శిష్యులకు బోధించి, వారిచే వాటిని అధ్యయనం చేయించి ప్రచార బాధ్యతను నిర్ధిష్ట పరిచాడు. రోమహర్షణుడు కూడా వ్యాసుడు తనతో చర్చించిన పురాణ సంహితపై ఆధారపడిన తన పురాణ సంహితను ఏర్పరచుకొని ఈ సంహితను తన ఆరుగురు శిష్యులకు బోధించాడు. ఈ శిష్యుల పేర్లు మనకు వాయుపురాణం నుంచి తెలుస్తున్నాయి. ప్రాచీనకాలంలో వ్యక్తుల పేర్లు, వారి స్వంత నామాలతో పాటు గోత్రకర్తల పేర్లు కూడా జోడింపబడి ఉండేవి. అందుకే ఈ ఆరుగురిపేర్లు వాయు పురాణంలో రెండు విధాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి వారి వైయక్తిక నామం రెండవది గోత్రజనామం. ఈ క్రమం ఇలా ఉంటుంది.
కృష్ణద్వైపాయన వ్యాసుడు
(కలియుగంలో పురాణ సంహితను మొదటగా కూర్చిన మహర్షి)
రోమహర్షణ సూతుడు
![]()
![]()
![]()
(వ్యాసుని నుంచి పురాణ సంహిత మొదట గ్రహించిన ముని)
![]()
![]()
![]()
1. సుమతి ఆత్రేయుడు 2. ఆకృతివ్రణకాశ్యప 3. అగ్నివర్చాభారద్వాజ
4. మిత్రాయువాశిష్ట 5. సోమదత్తసాకర్ణ 6. సుశర్మాశాంశపాయన
(విష్ణుపురాణం)
ఈ ఆరుగురు శిష్యులలో ముగ్గురు ఆకృతివ్రణ కాశ్యపుడు, సోమదత్త సావర్ణి, సుశర్మాశాంశపాయనులు తాము మరల కొత్త పురాణ సంహితను తయారుచేసుకొన్నారు. ఈ విధంగా మొత్తం నాలుగు పురాణసంహితలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ నాలుగు సంహితలు వేరువేరుగా భావించకూడదు. అవి అన్నీ ఒక అర్థాన్ని లేక భావాన్ని తెలియ జేసేవే. కేవలం కొన్ని సందర్భాలలో పాఠాంతరాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం లభ్యం అవుతున్న పురాణాలలో ఒక్క విష్ణుపురాణమే పరాశరమహాముని కృతంగా కనిపిస్తుంది. మిగిలిన అన్ని పురాణాలు వ్యాసుడు రచించినట్లే తెలుస్తున్నది. అయితే శ్రీకృష్ణ భగవానుడి మంగళ చరిత్రగల శ్రీమద్భాగవతం మాత్రం వ్యాసుని కుమారుడైన శుకమహర్షిచేత మొదటగా ప్రవచనం చేయబడింది. ఇదే పరంపరగా ఇప్పటి వరకు కొనసాగుతున్నది.
పురాణ సాహిత్య పరంపర వ్యాసుని పారివారిక పరంపర ఈ విధంగా ఉంటుంది.
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
వ్యాసుడు వశిష్ఠునికి ప్రపౌత్రుడు, శక్తికి పౌత్రుడు, పరాశరుని పుత్రుడు, శుకునికి తండ్రి. అప్పుడు వారి వంశ క్రమం ఇది.
బ్రహ్మ
వశిష్ఠుడు
శక్తి
పరాశరుడు
కృష్ణద్వైపాయన వ్యాసుడు
శుకమహర్షి
ఇది ఇప్పటి వ్యాసుని వంశక్రమం. వ్యాసుడు అనేది ఒకవ్యక్తి పేరు కాదు అది ఒక పదవి. ఈ విషయాన్ని దేవీభాగవతం స్పష్టంగా పేర్కొంది. అతడు ప్రతి ద్వాపర యుగములోను ప్రభవిస్తాడు. ప్రపంచ క్షేమంకోసం ఒక వేదాన్ని నాలుగు వేదాలుగా, ఒక పురాణ సంహితను 18 పురాణాలుగా (వ్యాసిస్తాడు) విభజిస్తాడు. వేదాలను విభజించిన కారణంగా ఆయన వేదవ్యాసుడు అని పిలువడతాడు.
పురాణాల సంఖ్య
అష్టాదశ సంఖ్య ప్రత్యేకత. ప్రాచీనకాలంలో భారతదేశంలో ముఖ్యంగా సంస్కృత వాఙ్మయంలో 18 సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉన్నది. పద్దెనిమిది సంఖ్యను పవిత్రమైనదిగా భావించే వారు. అందుచేత కూడా దీనికి విస్తృత ప్రాచుర్యం వచ్చింది. పంచమ వేదంగా భావించే వ్యాస మహాభారతంలో ప్రధాన పర్వాల సంఖ్య 18. అందులో శ్రీ కృష్ణపరమాత్ముడు ప్రవచించిన భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18. పాండవ కౌరవ పక్షాల మొత్తం సైన్యం సంఖ్య 18 అక్షాహిణులు. కురు పాండవ యుద్ధం జరిగిన రోజుల సంఖ్య 18. అలాగే మహాభాగవతంలోని శ్లోకాల సంఖ్య 18 వేలు. అలాగే మహాపురాణాల సంఖ్య 18. ఉపపురాణాల సంఖ్య 18. ఔపపురాణాల సంఖ్య 18. ఏయే పురాణాలు మహాపురాణాలు అనే దాంట్లో కొద్దిపాటి మతభేదం ఉన్నా పురాణాల సంఖ్య మాత్రం 18 అని ఏకగ్రీవంగా అందరూ అంగీకరించే విషయమే. ఈ 18 సంఖ్య ఏదో కారణం లేకుండా నిర్హేతుకంగా పెట్టింది కాదని అది సహేతుకమేనని సాభిప్రాయమని పండితుల భావన.
వ్యాసులు
అష్టాదశ పురాణాలను వ్యాసుడు రచించాడని చెప్పబడుతున్నది. వ్యాసుడు ఒక వ్యక్తి కాదు అనేకులని కొందరి అభిప్రాయం. కొందరు ఇంద్రుడు మొదలైన శబ్దాలలాగానే వ్యాస శబ్దం కూడా బిరుదవాచకం. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగు కలసి ఒక మహాయుగం అని పిలువబడుతుంది. వీనిలో
యుగ గణవం
దేవవర్షము మానుషవర్షములు
1. కృతయుగం 4800 17,28,000
2. త్రేతాయుగం 3600 12,96,000
3. ద్వాపరయుగం 2400 8,64,000
4. కలియుగం 1200 4,32,000
మొత్తం 12,000 43,20,00
ఈ మహాయుగాలలో ప్రతి ద్వాపరయుగాంతంలోను ఒక్కొక్క తపోనిధి వేద విభాగం, అష్టాదశ పురాణ రచనము, అష్టాదశ విద్యా వ్యాపనము చేసి ‘వ్యాసుడు’ అనే బిరుదు పొందుతాడు అని చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మన్వంతరంలో ఇప్పటికి ఇరవై ఎనిమిది ద్వాపరయుగాలు గడచిపోయాయి. ఆయుగాలలో అవతారం దాల్చిన వ్యాసులు వీరు. 1. బ్రహ్మ 2. ప్రజాపతి (మనువు) 3. ఉశనుడు 4. బృహస్పతి 5. సలిత 6. మాత్యువు 7. ఇంద్రుడు 8. వశిష్ఠుడు 9. సారస్వతుడు 10. త్రిధాముడు 11. త్రివృషుడు 12. భరద్వాజుడు 13. అంతరిక్షుడు 14. ధర్ముడు 15. త్రయ్యారుణి 16. ధనంజయుడు 17. మేధాతిథి 18. వ్రతి 19. అత్రి 20. గౌతముడు 21. ఉత్తముడు (హర్యాత్మ) 22. వేనుడు (వాజిశ్రవుడు) 23. సోముడు (ఆముష్యాయణుడు) 24. తృణ బిందువు 25. భార్గవుడు 26. శక్తి 27. పరాశరుడు 28. కృష్ణద్వైపాయనుడు.
రాబోయే ద్వాపరయుగంలో అశ్వత్థామ వ్యాసుడు కాగలడు. పై 27 వ్యాసుల పేర్లలో కొన్ని పురాణాలలో తేడా కనిపిస్తున్నది. వ్యాసనామాలలో కూర్మపురాణంలో కూడా కొంత భేదం కనిపిస్తుంది. అవి కల్పభేదాన్ని బట్టి ఏర్పడినవేనని భావించాలి.
పురాణము, వ్యాసుడు, సూతుల స్థానం
పురాణ పరిశోధన చేసిన కొందరు విద్వాంసులు ప్రాచీన కాలంలో పురాణానికి సంబంధించిన రెండు విధాన పరంపరలు ఉండేవని భావిస్తున్నారు. 1. సూతపరంపర 2. వ్యాస పరంపర. ఈ రెండు విధాన పరంపరలను గురించి తెలుసుకొనేముందు సూతుడు ఎవరు? వ్యాసుడు ఎవరు అనే విషయం మనం తెలుసుకోవటం అవసరం. మహాభారతంలోనూ పురాణాలలోను సూతుని వ్యక్తిత్వం ఒక ప్రహేళిక (చిక్కు ప్రశ్న) లాంటిది. సూతుడిని రోమహర్షణుడు లేక లోమ హర్షణుడంటారు. అంటే తన వాక్పటిమ చేత శ్రోతల రోమాలు నిక్కపొడుచుకొనేటట్లు చేసేవాడు అని దాని అర్థం. (లోమాని హర్షయాఙ్చక్రీశ్రోత్వంణాంయత్ సుభాషితైః, కర్మణా ప్రథితస్తేన లోకేఽస్మిం ల్లోమహర్షణః (వా.పు 1-16) కూర్మపురాణం కూడా ‘తస్యతే సర్వరోమాణి వచసా హర్షితానియత్, ద్వైపాయనస్య భగవాంస్తతో వే రోమహర్షణః’ (కూ.పు. 1-1-4) అని చెప్తుండగా స్కాందపురాణం ప్రభాసఖండంలో (1-6) పురాణంలో భగవంతుని విషయాలను గురించి వ్యాసుడు వివరిస్తున్నప్పుడు స్వయంగా సూతుని వెండ్రుకలే నిక్కపొడుచుకొనేవి కాబట్టి, ఆయనకు సూతుడనే పేరు వచ్చిందని తెలుపుతున్నది. కూర్మపురాణం ఈ రెండు జరుగుతాయి కాబట్టి ఆయనకు రోమహర్షణుడనే పేరు వచ్చిందని తెలుపుతున్నది. సూతుడు అంటే రథసారథి అని అర్థం. ప్రతిలోమ వివాహం వలన జన్మించినవాడని ఇంకొక అర్థం. ప్రతిలోమ వివాహం అంటే ఎక్కువ కులపు స్త్రీని తక్కువ కులానికి చెందిన పురుషుడు వివాహమాడటం. బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియ పురుషుని యందు జన్మించిన వ్యక్తి సూతుడు అనబడతాడు. ‘సూతులు’ అనే ప్రతిలోమజాతి గౌతమ ధర్మ సూత్రాలలో పేర్కొనబడింది. అయితే పురాణాలలో వర్ణించిన సూతుడు ఈ రకం పుట్టుకగల వ్యక్తి కాదు. అంటే ఆయన ప్రతిలోమ జాతికి చెందినవాడు కాదు. బ్రాహ్మణ క్షత్రియ జాతుల కంటె భిన్నుడు. పౌరాణిక సూతుడు గొప్ప లేక తక్కువ స్థాయికి చెందిన మునిగా కనిపిస్తున్నాడు. అతడు అర్థ దైవీశక్తి గల వ్యక్తిగా గౌరవింపబడతాడు.
వాయు, బ్రహ్మాండ, విష్ణుపురాణాలు-పితామహుడు బ్రహ్మచేస్తున్న యజ్ఞంలో సోమరసాన్ని తీసే రోజున విష్ణ్వంశతో సూతుడు అవతరించాడని చెప్తున్నాయి. కూర్మ పురాణం (1-1-6) కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది. సూతులు రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు సంకరజాతి వారు, రెండవరకం పురాణ ప్రవక్తలు. పురాణ ప్రవక్తలైన సూతులు బ్రాహ్మణ జాతికి చెందినవారు.
కూర్మ పురాణం ప్రారంభంలోనే (1-11-3-6) ఇతిహాస పురాణాల అధ్యయనం కోసం సూతుడు వ్యాసుని శిష్యరికం చేశాడని, స్వాయంభువ మనువు చేసిన యజ్ఞంలో ‘సుత్యాహ దినం’ నాడు ఈయన ఉత్పత్తి జరిగిందని చెప్పబడింది. ఇంతేకాకుండా అదే కూర్మపురాణంలో (1-18 12-17) వేన పుత్రుడు పృథువుచేత చేయబడిన పైతా మహయజ్ఞంలో స్వయంగా శ్రీమహావిష్ణువు పౌరాణిక సూతుడుగా సోమరసాన్ని ఆహుతి ఇచ్చే సమయంలో జన్మించాడని చెప్పబడింది. ఆహుతి ఇచ్చే సమయంలో దేవ గురువు బృహస్పతికి ఇవ్వవలసిన ఆహుతి దేవరాజైన ఇంద్రునికి, ఇంద్రునికి ఇవ్వవలసినది బృహస్పతికి ఇవ్వబడింది. ఈ ఆహుతి ఇచ్చే సమయంలో ఉచ్చరించిన మంత్రాలలో వర్ణ విపర్యయం అంటే అక్షరాలు పలకటంలో తారుమారు జరిగింది. దీన్నే వర్ణసంకరం అంటారు. వర్ణము అంటే అక్షరము అని కూడా అర్థం ఉన్నది కదా. అంటే ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియ వీర్యం వలన పుట్టిన వ్యక్తి అని పిలువబడ్డాడు అనీ, అదేవిధంగా ఇక్కడ సూతునికి కూడా వర్ణ విపర్యయం జరిగింది. ఇతడికి కేవలం పురాణ ప్రవచనం చేసే అధికారం ఇవ్వబడింది. వేదాధ్యయనం చేసే అధికారం అయితే లేదు. వాయు పురాణం మొదలైన ఇతర పురాణాలలోలేని ఈ విశేషం ఒక్క కూర్మ పురాణంలోనే స్పష్టంగా సూతులకు వేదాధ్యయనాధికారం లేదని చెప్పబడింది.
సూతుల యొక్క వృత్తేమిటి?
దేవతలు, మునులు, రాజుల వంశాల మీద దృష్టినిలిపి, వారిని సచేతనులుగా ఉంచటం అంటే సత్కార్యాలయెడ, ధర్మంపట్ల ప్రజలను అనురక్తులను చేసి సమాజాన్ని చైతన్యశీలంగా ఉంచటం. సూతులకు వృత్తి అని చెప్పబడుతున్నది. ఇందుకు వారికి ఆధారాలు ఏమిటంటే అప్పటి వరకు ఇతిహాస పురాణాలలో చెప్పబడిన ఆయా దేవతల, మునుల, రాజుల వంశాను చరిత్రలే. వీరు కాకుండా ఉన్న ఇంకొక సూతశాఖవారు క్షత్రియ ధర్మాన్ని అవలంబించటం లేకపోతే కనీసం రథాలను తోలి ఏనుగులు, గుఱ్ఱాలకు చికిత్స చేస్తూ తమ పొట్టపోసుకుంటారు.
దీనికి ఉదాహరణగా మనం మహాభారతంలో కర్ణుని పెంచిన తండ్రి యొక్క చరిత్రను తీసుకొనవచ్చు. ఆయా సందర్భాలలో తగినట్లుగా పురాణ ఇతిహాసాలలో సూతుల పుట్టుకతో పాటు మాగధుల (రాజాస్థానాల్లో రాజును స్తుతించటం రాజు రాకను తెలియజేయటం మొదలైన పనులు చేసేవారు) జన్మ వృత్తాంతం కూడా చెప్పబడింది. దాని ప్రకారం పృథువేనుడిని స్తుతించటానికి, ఈ సూతులే నియమింపబడ్డారని చెప్పబడింది. సూతుల ఈ జన్మ వృత్తాంతం విష్ణుపురాణం, బ్రహ్మాండపురాణము, వాయు పురాణాలలో కాస్త విస్తృతంగానే కనిపిస్తున్నది.
మార్కండేయ పురాణంలోని ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణుని అన్న బలరాముడు ఒక సూతుని వధించగా అందువలన కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి ప్రాయశ్చిత్తంగా బలరాముడు తీర్థయాత్రలు చేసినట్లు చెప్పబడింది. దీనిని బట్టి కూడా పౌరాణిక సూతులు బ్రాహ్మణులని తెలుపుతున్నది. కూర్మపురాణం కూడా (1-23-15) సూతుని నోటి ద్వారా స్వయంగా తన కులానికి చెందినవారు వేద వర్ణితులని చెప్పినట్లుగా వివరిస్తున్నది. శౌనకాది మహామునులు సూతుని నుంచే పురాణ విద్యను గ్రహించారు. సూతుల దైవిక ఉత్పత్తిని ఎవరూ సరైందిగా స్వీకరించకపోయినా అతి ప్రాచీన కాలంలోనే ఎటువంటి కించపడకుండా బ్రాహ్మణులు సూతుని నుంచే గాథలు, ఆఖ్యానాలు మొదలుగా గల పురాణ విద్యను గ్రహించారనేది సత్యం. ఇదే పరంపరగా ఉపనిషత్తులలో కూడా మనకు కనిపిస్తుంది. ఆయా ఉపనిషత్ గాథల్లో బ్రాహ్మణులు కేవలం క్షత్రియుల నుంచే కాదు శూద్రుల నుంచి కూడా ఎటువంటి శంక సంకోచాలు లేకుండా విద్యను గ్రహించే వారు అంటే జ్ఞాన ప్రాప్తిని పొందేవారన్నమాట. రైక్వ, జానశ్రుతి, సత్యకామ జాబాలి ఇంకా ఇతరుల గురించి ఐతరేయము మొదలైన గ్రంథాలలోని గాథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి.
రెండు ప్రాచీన వాఙ్మయాల ప్రవాహాలు
అతి ప్రాచీన కాలం నుంచి మనకు బ్రహ్మ నుంచి ఆవిర్భవించిన వాఙ్మయ ప్రవాహాలు పరస్పర ఉపకారకాలుగా ఉండి, రెండు మార్గాలలో ప్రవహిస్తున్నాయి. వాటిలో మొదటిది వేద వాఙ్మయ ప్రవాహము. రెండవది పురాణవాఙ్మయ ప్రవాహము. వేదవాఙ్మయ ప్రవాహం కర్మ ప్రధానమైనది. పురాణవాఙ్మయ ప్రవాహం కర్తృ ప్రధానమైనది. మొదటిదైన వేద వాఙ్మయ ప్రవాహాన్ని మునులు స్వీకరించి ప్రచారం చేశారు. అందుచేత ఈ రెండు సమాన ప్రమాణ్యంగలవే. కృష్ణద్వైపాయన వ్యాసుడు ఒకటే వేదంగా ఉన్నదానిని నాలుగుగా విభజించాడు. అలాగే ఒకటే పురాణ సంహితను అష్టాదశ పురాణాలుగా విభజించాడు. విభజించినవాడు కాబట్టి ఆయన వ్యాసుడైనాడు, ఇది ఇంతకుముందే వివరించబడింది.
పురాణాలు ఏవి?
వ్యాసుడు రచించిన పద్దెనిమిది పురాణాలను తేలికగా గుర్తుంచుకొనటానికి పద్మపురాణంలో ఒక సూత్రం ఉన్నది. అది
‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’ చతుష్టయం
‘అ’ ‘నా’ ‘ప’ ‘లింగ’ ‘కూ’ ‘స్కా’ని పురాణాని పృథక్ పృథక్ (దేవీ భాగవతం 1-3-ఽ1)
అంటే ఆయా పురాణాల పేర్లను అనుసరించి ‘మ’తో ప్రారంభమయ్యేవి రెండు-మత్స్య, మార్కండేయ పురాణాలు; ‘భ’ తో ప్రారంభయ్యేవి రెండు-భాగవత, భవిష్య పురాణాలు; ‘బ్ర’తో ప్రారంభమయ్యేవి మూడు-బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ పురాణాలు. ‘వ’తో ప్రారంభమయ్యేవి నాలుగు-వరాహ, వామన, వాయు, విష్ణు పురాణాలు. ‘అ’ తో ప్రారంభమయ్యేది అగ్నిపురాణం, ‘నా’తో ప్రారంభమయ్యేది నారదపురాణం, ‘ప’తో ప్రారంభమయ్యేది పద్మపురాణం; లింగ-అంటే లింగపురాణం, ‘కూ’తో ప్రారంభమయ్యేది కూర్మపురాణం, ‘స్కా’ తో ప్రారంభం అయ్యేది స్కాందపురాణం. భాగవతం అని చెప్పే దానిలో అది దేవీభాగవతమా లేక విష్ణు భాగవతమా అని పండితుల మధ్య విస్తృతమైన చర్చ జరిగింది. అలాగే వాయుపురాణం స్థానంలో కొందరు శివ పురాణాన్ని చేరుస్తున్నారు. ఎక్కువ మంది పండితులు విష్ణు భాగవతమే అష్టాదశ పురాణాలలో ఒకటని అలాగే వాయు పురాణాన్నే శివపురాణమని ఒకప్పుడు వ్యవహరించేవారని, అందుచేత వాయు పురాణమే అష్టాదశ పురాణాంతర్గతమని సమర్థిస్తున్నారు.
పురాణాల ప్రాచీనత
ఎందరో ఋషులు మహర్షుల ద్వారా ప్రచలితమైన సంస్కృత సాహిత్యం యొక్క వివిధ శాఖలను పరిశీలిస్తే వేదాలు, పురాణాలు భారతీయ సంస్కృతీ పరిరక్షక సహోదరులనే విషయం అవగతమౌతుంది. వేదకాలంనుంచే ఎందరో మహర్షులు తమ తమ విఖ్యాత గ్రంథాలలో పురాణాల యొక్క విశిష్టతను చాటుతూనే ఉన్నారు. పురాణాలలో చెప్పబడిన ఇహలౌకిక, పారలౌకిక అభ్యుదయ సాధక ఉపదేశాల బలం ఆధారంగానే హిందు సమాజం సృష్టి కాలం నుంచి నేటివరకు, అజరామరంగా విలసిల్లుతూ ఈ పవిత్ర భారతభూమిని సభ్యనాగరిక దేశాలలో అగ్రశ్రేణిలో నిలబడేటట్లు చేసింది.
పురాణాల ప్రాచీనతను నిరూపించాలంటే వేదకాలం నుంచి నేటి వరకు నిర్మితం అవుతున్న సంస్కృత సాహిత్యంలోని విశిష్ట గ్రంథాల ఆధారంగా నిరూపణ జరుగుతుంది.
అధర్వణ వేదం
ఋచః సామాని ఛందాంసి పురాణం యజుషాసహ
ఉచ్ఛిష్టా జ్జఙ్ఞిరే సర్వేదివిదేవా దివిశ్రితాః-అని తెలుపుతున్నది.
(ఋగ్వేదము, సామవేదము, ఛందము, యజుర్వేదాలతోపాటు పురాణము దేవలోకంలో ఉండే నక్షత్రమండలం ఆ ఉచ్చిష్టము అనగా ప్రపంచాన్ని పాలించే పరమాత్మ నుంచే ఉద్భవించినవి). అంతేగాకుండా, అదే అథర్వణవేదం
యంత్ర స్కంభః ప్రజనయన్ పురాణం వ్యవర్తయత్
ఏకం తదంగం స్కంభస్య పురాణమను సంవిదుః-అంటున్నది.
(వ్యాసరూపంలో ఉద్భవించి సర్వరక్షకుడైన ఈశ్వరుడు గురుశిష్య పరంపరతో వ్యాపించిన పురాణాలను రచనా బద్ధం చేయగా, వేదం యొక్క ఒక ప్రధాన అంగమైన పురాణాలు పరమాత్మను తెలిపేవేనని గ్రహించవలెను)
ఇక ఋగ్వేదం ‘సనాపురాణ మధ్యేరాత్ (ఇప్పుడు నేను సనాతన పురాణములను అధ్యయనము చేయుదును) అనియు
‘పురాణమోకః సఖ్యం శివమ్ వామ్’ (ఓ అశ్వినీ కుమారులారా! మీ ఇద్దరి స్థానము పురాణమే ఎందుకనగా పురాణాల ద్వారా మీ ఇద్దరి స్థానము తెలియగలదు. మీ ఇద్దరి సఖ్యముచేత ఎంతో శుభము కలుగగలదు) అంటుంది. ఇంకా శథపథ బ్రాహ్మణం “అథ నవమేఽహని కించిత్పురాణమాచక్షేత్” (యజ్ఞము చేయునప్పుడు తొమ్మిదవ రోజున పురాణ పఠనము చేయవలెను. ఇతిహాస పురాణాలను ప్రతి దినము పఠనము చేయవలెను. ఇంకా ఇతిహాస పురాణాలను ప్రతి దినము ఎవరు పఠనము చేయుదురో అతడు దేవతలను తృప్తి పరచగలడు అని కూడా చెప్తున్నది. అంతేగాకుండా ఆదే శతపథ బ్రాహ్మణం ‘ఈ విధంగా కల్పము, రహస్యము, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఇతిహాసము పురాణములతోనే వేదము నిర్మింపబడినదని చెప్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉన్నది. ఆ కథ ప్రకారం దేవర్షియైన నారదుడు విద్యాధ్యయనం కోసం సనత్కుమారుని వద్దకు వెళ్ళగా, అప్పుడు సనత్కుమారుడు, నారదుని ఇంతకు ముందు ఇక్కడకు రావటానికి పూర్వం నీవు ఏమేమి చదివావని ప్రశ్నించాడట. అప్పుడు నారదుడు ‘ఋగ్వేదం భగవోఽధ్యేమి యజుర్వేదం సామవేద మాథర్వాణం చతుర్థమితిహాస పురాణం పంచమం వేదానాం వేదమ్’ (భగవంతుడా లేక పూజ్యుడా! నేను ఋగ్వేదమును, యజుర్వేదమును, సామవేదమును, అథర్వణ వేదమును ఇంకా ఐదవది వేదాలకు వేదమైన ఇతిహాస పురాణాలను అధ్యయనం చేశాను) అని తెలిపాడు. దీనిని బట్టి వేదాలతో సమాన స్థానము పురాణాలకు ఉన్నదని తెలుస్తున్నది.
మనకు ఒక సందేహం కలగవచ్చు. అసలు ఈ సృష్టి జరిగి ఎంతకాలం అయింది అని. ఈ ప్రశ్నకు జవాబుగా మనం పురాణాలనుంచే వివరణ పొందవచ్చు. ఎందుకంటే హిందువులు చేసే ప్రతి పని ఈ తత్త్వాన్ని తెలుసుకొనే ప్రారంభించడం జరుగుతుంది. హిందువులు ప్రతిరోజు తమ నిత్యనైమిత్తిక కామ్య కర్మలను అనుష్ఠించేటప్పుడు నియమాను సారం అద్యబ్రహ్మణోద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతమే కలిగయుగే ప్రథమ పాదే ....... (ఫలాని కర్మలేక పనిని) కరిష్యే’ అని సంకల్పం పఠించి సృష్టి గణనను తెలుసుకొంటున్నాడు. దీని అర్థం బ్రహ్మయొక్క ఆయుషు 50 సంవత్సరాలు గడిచిన తరువాత ద్వితీయ పరార్థ సమయంలో శ్వేత వరాహ కల్పంలోని వైవస్వతుడనే ఏడవ మనువు కాలంలో 18వదైన కలియుగ ప్రథమ భాగంలో ఫలానా ధర్మకార్యం నెరవేరుస్తున్నాను అనేదే. గణితశాస్త్రాన్ని అనుసరించి దీనిని లెక్కిస్తే సృష్టి ఆరంభం నుంచి విక్రమశకం 2015 వరకు (దీనికి 58 తీసివేయగా ఇంగ్లీషు సంవత్సరం వచ్చును. అనగా 1957 వరకు). మనుష్య సంవత్సరంలో ఒక వంద తొంభై ఏడుకోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిదివేల యాభై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినాయి.
దీన్ని లెక్కగడదాము:
1. గత ఆరు మనువుల కాలం అంటే అమన్వంతర కాలం = 184,03,20,000
2. గత ఆరు మన్వంతరాల సంధ్యాకాలం = 1,20,96,000
3. ఏడవ మన్వంతరంలో గతించిన 27 చతుర్యుగాల కాలం = 11, 66, 40,000
4. 28వ చతుర్యుగంలో గడచిన సంవత్సరాల కాలం = 38,93,059
మొత్తం 197,29,49,059
ఇది క్రీ.శ. 1957 వ సంవత్సరం వరకు గణించిన గత సంవత్సరాలు. భారతీయ పురాణ పండితులను అనుసరించి ప్రస్తుత విజ్ఞానశాస్త్రజ్ఞులు 5, 6 వేల సంవత్సరాల కాలం నుంచి 30 కోట్ల సంవత్సరాల కాలం వరకు మాత్రమే అంచనాలు కడుతున్నారు. కానీ పురాణాలు, తెలిపిన సృష్టికాలం దాదాపు 200 కోట్ల సంవత్సరాల నాటి నుంచి గణిస్తున్నాయి. ఆధునిక విజ్ఞానం ఇంకా విస్తరించి క్రమంగా ఇంకా ప్రాచీన చరిత్రవైపు పోగలిగితే పురాణాలు లెక్కగట్టిన ఈ కాలం వరకు చేరుకొనగలుగుతుంది.
పురాణల క్రమంలోని అర్థం
పద్దెనిమిది మహా పురాణాలను చెప్పేటప్పుడు ఇది ఇన్నవ పురాణమని, క్రమ సంఖ్యలు ఇవ్వబడ్డాయి. ఈ క్రమం అనుసరించవలసినదేనా అంటే, పురాణవేత్తలు అయిన పండితులు ఇది సాభిప్రాయమని, ఈ క్రమం చారిత్రక కారణాలవల్ల ఏర్పడింది కాదని, ఆయా పురాణాలలో ప్రతిపాదించబడిన, వర్ణించబడిన విషయాలను బట్టి ఏర్పడిందని తెలుపుతున్నారు. అష్టాదశ పురాణాలలోను ఎన్నో విషయాలు వివరించ బడ్డాయి. కానీ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కవిషయం ప్రముఖంగా, ప్రాధాన్యతతో వివరించబడ్డది. ప్రాధాన్యతను బట్టి పేర్లు ఏర్పడటం (ప్రాధాన్యేన వ్యపదేశాభవంతి) అనేది లోకరీతిగా ఉన్నదే.
పురాణాల ప్రధానమైన లక్ష్యం ఈ సృష్టిని గురించి వివరంగా తెలపటం. మూలతత్త్వం నుంచి సృష్టి ఎలా ప్రారంభం అయింది? అది ఏ విధంగా జరిగింది? ఏయే పరిణామాలను పొందింది? ప్రధాన వంశాలు ఎలా ఏర్పడ్డాయి. అందలి కీర్తివంతులు ఎలాంటి జీవితాలను గడిపి ఆ కీర్తిని సంపాదించారు? చివరకు తిరిగి ఈ సృష్టి మూల తత్త్వంలో ఎలా విలీనం అవుతుంది? ఇదే సృష్టి ప్రవాహధార విశ్వసర్గంతో ప్రారంభమై ప్రతి సర్గంతో అంతం అవుతున్నది అనే ఈ ఆద్యంతాల మధ్యన ఉన్నవే మన్వంతర వంశవంశాను చరితలు. అనే ధారాప్రవాహాలు. పురాణ పంచలక్షణాల వివరణ ఆంతర్యం ఇదే. ఈ పంచలక్షణ స్వారస్యము, సమన్వయము ఇదే. ఇలా సృష్టితత్త్వ ప్రతిపాదనం పురాణ తాత్పర్యం అయినందున పురాణ క్రమంలో ఔచిత్యం తేటతెల్లం అవుతుంది.
1. సృష్టిని గురించి అవగాహన చేసుకొనేటప్పుడు ఈ బ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారు అనే సందేహం కలగటం సహజం. సకలాతీతుడైన పరమాత్మ లేక పరబ్రహ్మ సృజించాడని తెలుస్తుంది. సృష్టిని బ్రహ్మ చేశాడని పురాణాలు చెపుతున్నాయి. ‘తైత్తిరీయ సంహిత’ ‘బ్రహ్మ బ్రహ్మ భవత్ స్వయమ్’ అంటే పరబ్రహ్మమే బ్రహ్మ అయినదని తెలుపుతున్నది. కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మ గురించి తెలియచేసేది బ్రహ్మపురాణం.
2. సృష్టికార్యం నిర్వర్తించే బ్రహ్మ ఎలా జన్మించాడు అనేది తరువాత వచ్చే ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పేది పద్మపురాణం. పద్మం నుండి బ్రహ్మపుట్టాడు కనుక పద్మ పురాణం రెండవది.
3. సృష్టికి కారణభూతుడైన బ్రహ్మ పుట్టింది పద్మం నుంచి అయితే ఆ పద్మానికి మూలం ఏది? అది విష్ణువు నాభినుంచి పుట్టింది. అందులోనుంచే బ్రహ్మ ఉద్భవించి, తపస్సు చేసి సృష్టి చేశాడు. ఆ విష్ణుతత్త్వాన్ని ప్రతిపాదించేది విష్ణు పురాణం. కాబట్టి అది మూడవ పురాణం.
4. విష్ణువు వాసస్థానం ఏది? ఆయన శేషశయ్యపై పవళించి ఉంటాడు. ఆ శేషునికి ఆధారం వాయువు. ఆశేషశయ్యను నిరూపించేది వాయుపురాణం. అది నాల్గవ పురాణం.
5. శేషుడు క్షీరసాగరంలో ఉంటాడు. ఆ సముద్ర రహస్యాల్ని వివరించే పురాణం కనుక శ్రీమద్భాగవతం ఐదవ పురాణం.
6. విష్ణు భగవానుని నిరంతరం సేవిస్తూ తన మధురవీణాగానంతో కీర్తిస్తుండే నారదుని పేరనున్న నారదపురాణం-ఆరవ పురాణం.
7. ఈ సృష్టిచక్రాన్ని ఈ విధంగా తిప్పేదెవరు అనే ప్రశ్నకు చాలా సమాధానాలు ఉన్నా కానీ వానిలో ‘దేవి’ అన్న సమాధానం ఒకటి. ఆమెను గురించి తెలిపేది మార్కండేయపురాణం.
8. ఘటంలో ప్రాణంవలెనే బ్రహ్మాండంలో శక్తి ఉన్నది. ఆశక్తి అగ్ని రూపంలో ఉండి క్రియాశీలమైన వస్తువులకు మూలప్రేరణ ఇస్తూంటుంది అనేది ఒక అభిప్రాయం. దీనిని ప్రతిపాదించే అగ్ని పురాణం-ఎనిమిదవ పురాణం.
9. అగ్నితత్వం సూర్యునిపై ఆధారపడి ఉన్నది. అందువలన సూర్యుడే క్రియాశీల వస్తువులకు ప్రేరణ శక్తి. అందువలననే వేదం సూర్యుడే స్థావర జంగమ సృష్టికి ఆత్మ అని తెలుపుతున్నది. ఈ విధంగా సృష్టికి ఉత్ప్రేరకం ‘ఉత్పాదకుడైన సూర్యుడి మహిమ విశిష్టమైనది. ఆయన మహిమను ప్రతిపాదించేది భవిష్యపురాణం. తొమ్మిదవ పురాణం.
10. బ్రహ్మం నుంచే జగత్ సృష్టి జరుగుతున్నది. ఈ జగత్తంతా బ్రహ్మం యొక్క వివర్తం. వికార్తం- వివర్తం. ఈ రెండింటికి తేడా ఉన్నది. నిజంగా మారటం వికారం. నిజంగా మారకున్నా, మారినట్టు కనిపించడం వివర్తం. జగత్తు బ్రహ్మం వల్ల కలిగినదే. కానీ ఈ జగత్తు సత్యంకాదు. ఇది మాయికం. ఇది బ్రహ్మవైవర్తం. కనుక బ్రహ్మవైవర్తం అనే పేరుతోనే విశ్వానికి మూల కారణం బ్రహ్మమనీ, విశ్వం బ్రహ్మవివర్తమనీ తెలిపే బ్రహ్మవైవర్త పురాణం-పదవ పురాణం.
11. బ్రహ్మం నిర్గుణము. సగుణరూపంలో దానిని కనిపెట్టి, జీవుడు దానిని ఊహించాలి. అందుకు మార్గాన్ని సూచిస్తూ, సమాధానం ఇచ్చేవి మిగిలిన పురాణాలు. శివ విష్ణు రూపాలు బ్రహ్మం యొక్క సగుణ రూపాలుగా ప్రసిద్ధి చెందినవి. ఇందులో శివుని గురించి చెప్పేది లింగపురాణం-పదకొండవ పురాణం.
12. బ్రహ్మం యొక్క సగుణరూపంగా ప్రసిద్ధి చెందిన రూపాలలో శివుడుగల వివిధ తీర్థ క్షేత్రాలను, వ్రతాలను తెలిపేది స్కాందపురాణం-పన్నెండవ పురాణం.
13. బ్రహ్మం యొక్క సగుణ రూపంగా ప్రసిద్ధి చెందిన రూపం విష్ణు రూపం. ఆయన అవతారాలు ధరించి, భూమిపైకి దిగివచ్చి భక్తుల కష్టాలు తొలగించి వారికి ముక్తి పొందే ఉపాయాలను కూడా ఉపదేశిస్తాడు. అవతార ప్రయోజనం కేవలం రాక్షస సంహారమే కాకుండా జీవునికి సంసార జంబాలం నుంచి విముక్తిని కలిగించి ఆనందమయ ముక్తి పొందే విధానం కూడా నేర్పటం భగవానుడు మర్త్యరూపం ధరించడంలోని ప్రయోజనం అని భాగవతం తెలుపుతున్నది. కనుక అవతార రూపధారుడైన విష్ణుమూర్తి అవతారాలను తెలియజేసే వరాహపురాణం-పదమూడవ పురాణం.
14. అలాగే విష్ణువు యొక్క వామనామావతార వృత్తాంతాన్ని తెలిపే వామన పురాణం పధ్నాలుగవ పురాణం.
15. విష్ణువు యొక్క కూర్మావతార వృత్తాంతాన్ని తెలిపే కూర్మపురాణం పదిహేనవ పురాణం.
16. శ్రీమహావిష్ణువు యొక్క మత్స్యావతార వృత్తాంతాన్ని తెలిపే మత్స్యపురాణం పదహారవ పురాణం.
17. జ్ఞానంవలన, ఉపాసన వలన జీవులకు కలిగే గతులూ, మరణానంతరం జీవుని స్థితి, అతడు ఏమి అవుతాడనే ప్రశ్నలకు జవాబులు గరుడ పురాణంలో లభ్యం అవుతాయి. అందువలన గరుడ పురాణం పదిహేడవ పురాణం.
18. జీవుని సమస్త గతులను గురించి విపులంగా చెప్పే బ్రహ్మాండపురాణం 18వ పురాణం.
హిందూ ధార్మికసారం జీవులు తమ కర్మఫలాన్ని అనసరించి ఈ బ్రహ్మాండంలో సుఖ దుఃఖాలను అనుసరిస్తూ తిరుగుతూ ఉంటారనేదే.
ఈ విధంగా సృష్టివిద్యకు సంబంధించిన విషయాలను వివరిస్తూ జ్ఞాన, కర్మలను తెలియజేయటంలో అష్టాదశ మహాపురాణాలు దిశా నిర్దేశకాలుగా ఎంతో ఉపయోగకరమైనవిగా భావించబడుతున్నాయి. అందుకే వాని వరుసక్రమానికి కూడా సార్థకత ఉన్నదని మొదటే చెప్పబడింది.
పురాణ రచనా క్రమము
అష్టాదశ పురాణాలలో పద్మ పురాణాన్నే మొదట కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించాడని, తరువాత సర్వ పురాణాలనుంచి సారాన్ని ఆకర్షించి భాగవతం రచించాడని పద్మ పురాణం తెలుపుతున్నది.
తత్ర పద్మ పురాణంతు, ప్రథమంచ ప్రణీతవాన్
తతోఽన్యాని పురాణాని కృత్వా షోడశతు క్రమాత్
అష్టాదశం భాగవతం, సారమాకృష్య సర్వతః
కృతవాన్ భగవాన్ వ్యాసః శుక మధ్యాపయసత్స్యయమ్
(పద్మ పురాణాన్ని ముందుగా రచించి, తరువాత ఇంకొక పదహారు పురాణాలను క్రమంగా కూర్చాడని 18వదైన భాగవతాన్ని ఈ 17 పురాణాల యొక్క సారభూతంగా వ్యాసుడు కూర్చాడని తెలుస్తున్నది)
వ్యాసుడే శుకునికి భాగవతాన్ని స్వయంగా బోధించాడు.
పురాణ సంహిత
విష్ణు పురాణం, వ్యాసుడు పురాణాలను సమకూర్చిన విధానాన్ని తెలుపుతూ
ఆఖ్యానైశ్చాప్యుపాఖ్యానై, ర్గాథాభిః కల్ప శుద్ధిభిః
పురాణ సంహితాం చక్రే, పురాణార్థ విశారదః అని తెలుపుతున్నది.
ఆఖ్యానము, ఉపాఖ్యానము, గాథ, కల్ప శుద్ధులతో కూడిన రచనయే పురాణ సంహిత అని పురాణార్థ విశారదులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆఖ్యాన, ఉపాఖ్యానా దులకు అర్థం ఏమిటి అనే సందేహం వస్తే,
స్వయం దృష్టార్థకథనం, ప్రాహురాఖ్యానం బుధాః
శ్రుత స్మార్థ కథనముపాఖ్యానం ప్రచక్షతే-అని వివరించబడింది.
అనగా పురాణకర్త స్వయంగా చూసి చెప్పినది ఆఖ్యానము. ఉదా: భారత కథ మొదలైనవి. వేదము వలన విని చెప్పినది ఉపాఖ్యానము. ఉదా: హరిశ్చంద్ర కథ మొదలైనవి. పితృగీతలు, పృథివీ గీతలు మొదలైనవి గాథలు-
శ్వేత వరాహము, నీలలోహితము మొదలైనవి కల్పాలు. నిర్ణయము కల్పశుద్ధి.
పురాణ శబ్దము మహాపురాణ పరంగా కూడా అన్ని పురాణాలలోను వాడబడింది.
పురాణ సంహితకు సహాయకాలు
వ్యాస మహర్షి ఆఖ్యాన, ఉపాఖ్యాన, గాథా, కల్పశుద్ధులు అనే నాలుగు ఉపకరణాలను తీసుకొని, తన పురాణాన్ని కూర్చాడు.
ఆఖ్యానైశ్చాప్యుపాఖ్యానైర్గాథాభిః కల్పశుద్ధిభిః
పురాణ సంహితాం చక్రే పురాణార్థ విశారదాః (విష్ణు పు. 3-6-15)
‘స్వయం దృష్టార్థ కథనం ఆఖ్యానం’ అనగా వక్త తాను స్వయంగా చూసి చెప్పిన విషయము అని అర్థం. దీనికి వ్యతిరేకార్థమే ఉపాఖ్యానము. వేరొకని ద్వారా పరంపరా గతంగా తాను వినిన విషయాన్ని వివరించటమే ఉపాఖ్యానము అని చెప్పుకొనవచ్చు. ఈ వివరణ ద్వారా రామ, నచికేత, యయాతి వృత్తాంతము మొదలైన కథలు పరంపరాగతముగా వచ్చునట్టివి. రామోపాఖ్యానం, నచికేతోపాఖ్యానం, యయాత్యుపాఖ్యానం పేర్లతో అవి ప్రచారంలో ఉన్నాయి. అందువలన ఇవి ఉపాఖ్యానాలు. అయితే కొందరు ఆయా వృత్తాంతాల పరిమాణాన్ని బట్టి విభజన చేస్తున్నారు వివరిస్తున్నారు. ఆకారంలో పెద్దవిగా అంటే దీర్ఘంగా ఉండే వృత్తాంతాలు ఆఖ్యానాలని, కొద్దిపాటి వృత్తాంతంగలవి లేక చిన్నకథ గలవి ఉపాఖ్యానాలని చెప్పబడుతున్నాయి. ఈ వివరణ ప్రకారం రామాయణం సుదీర్ఘమైన కథగలది కాబట్టి రామాఖ్యానం కాగా, రామకథలో భాగంగా ఉండి కొద్దిపాటి కథగల సుగ్రీవ వృత్తాంతం మొదలైనవి ‘సుగ్రీవోపాఖ్యానం’ అని చెప్పవచ్చు. దీనికి సమర్థనగా మహాభారతం తనను గురించి తాను ‘ఇతిహాస’మని ‘ఇతహాసోత్తమ’మని చెప్పుకొన్నా ఆఖ్యానమని కూడా (ఇదం కవివరైః సర్వైరాఖ్యాన ముపజీవ్యతే-ఆదిపర్వం) చెప్పుకొన్నది.
గాథ: ప్రాచీన సాహిత్యంలో వేద, బ్రాహ్మణ, ఉపనిషద్, పురాణాలలో అనేక ప్రాచీన స్తుతులు, గీతాలు వంటివి ఉన్నాయి. వీటి కర్త ఎవరో తెలియదు. ఇది చాలావరకు ఒక గొప్ప చక్రవర్తిని స్తుతిస్తూనో ఒక మహాదాత దాతృత్వాన్ని ప్రశంసించేవిగానో అసామాన్య శౌర్యవంతుని శౌర్యాన్ని ప్రస్తుతించేవిగానో ఉంటాయి. ఋగ్వేద సంహితలో ఇలాంటి గాథలను “నారాశంసి” అనే పేరుతో ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణంలో కూడా అష్టమ పంచికలో ఇంద్రుని మహాభిషేక సందర్భంలో ప్రాచీన చక్రవర్తులైన రాజుల పట్టాభిషేకములు, వానివలన వారు ఆర్జించిన యోగముల వివరణ చేయబడింది. ఆ సందర్భంలో అనేక ప్రాచీన గాథలు ఈ సందర్భంలో ఉద్ధరించబడ్డాయి. వీటిల్లో చాలా పురాణాల్లో ఈ గాథలు రాజుల వర్ణనలలోను, ముఖ్యంగా భాగవత నవమ స్కంధంలో ఉద్ధరించబడ్డాయి. గృహ్యసూత్రాలు కూడా వివాహ సందర్భాలలో గాథలను పాడటం నిర్దేశిసున్నాయి. అంటే గాథలు ఆయా రాజులకు సంబంధించి ప్రఖ్యాతమైనవే. ప్రజల నాల్కలపై అవి సజీవంగానే ఉన్నాయి. వాటిని వ్రాసిన వారెవరో తెలియదు. ఈ లోకప్రియమైన అజ్ఞాతకర్తృకమైన శ్లోకాలనే ‘గాథ’లు అని పిలుస్తారు. వీటిని కూడా పురాణాలు సంహితల నిర్మాణంలో వ్యాసుడు సమకూర్చుకొని ఉపయోగించుకొన్నాడు. ఈ గాథలకు శ్లోకాలనే పేరు కూడా ఉన్నది. (తదప్యేతే శ్లోకా అభిగీతా (ఐతరేయ బ్రాహ్మణం-అధ్యాయం 39) ఐతరేయ బ్రాహ్మణంలోని 39వ అధ్యాయంలోగల గాథలే కొద్ది తేడాతో భాగవతం నవమ స్కంధంలో కనిపిస్తున్నాయి.
కల్పశుద్ధి: దీనికి బదులుగా కల్పజోక్తి అని బ్రహ్మాండ పురాణంలోను, కులకర్మభిః అని వాయు పురాణంలోను ఉన్నదని ఇంతకుముందు చెప్పబడింది. కల్పశుద్ధి అనే పదానికి చాల అర్థభేదాలు ఉన్నాయి. కల్పజోక్తి అనే పదానికి వివిధ కల్పాలలో పుట్టిన విషయములు లేక పదార్థాలు అని ఒక అర్థం అయితే శ్రీధరస్వామి కల్పశుద్ధి అంటే ‘శ్రాద్ధకల్ప’మని చెప్పాడు. ఈ పదాన్ని గురించి పురాణాలు ఏమి చెప్పడం లేదు. మరికొందరు పండితులు దీనికి ధర్మశాస్త్ర యుక్తంగా ఏవో అర్థాలు చెప్పారు. కానీ దీనికి వివిధ కల్పాలలో జరిగిన విషయములు అనగా పంచలక్షణాలు అందలి అంశాలైన వంశమన్వంతరాలని చెప్పుకొనవచ్చు. అయితే ఇది ఇప్పటికీ ఏ పండితుడు నిర్ధారించని అంశం. ఇక్కడగల కల్పశుద్ధిభిః అనే పదానికి బ్రహ్మాండపురాణంలోని కల్పజోక్తిభిః అనీ, వాయు పురాణంలో ‘కులకర్మభిః’ అని పాఠాంతరాలున్నాయి.
ప్రాచీన వాఙ్మయంలో మనకు ‘పురాణము’ ‘పురాణ సంహిత’ అనే రెండు పదాలు వినిపిస్తాయి. ఇంతకుముందే పురాణం అనే పదానికి లోకంలో బాగా ప్రచారంలో ఉండి అవ్యవస్థితంగా, ఇక్కడా అక్కడా చెల్లాచెదరుగా ఉన్న లోకవృత్తాత్మకమైన విషయంగల విద్య’ అని తెలుసుకొన్నాం.
దీనినే అన్ని శాస్త్రాలు పురాణాలు వేదాల కంటే పురాణమే ముందు బ్రహ్మ నోటి నుండి వెలువడ్డాయని, తరువాత వేదాలు పుట్టాయని తెలుపుతున్నాయి.
పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాకృతమ్
అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః-అని చెప్పింది ఇదే విషయాన్ని.
ఈ విధంగా పురాణాలు అవ్యవస్థిత రూపంలో చెల్లాచెదరుగా ఉండగా, వ్యాసుడు వాటికి ఒక వ్యవస్థను ఏర్పాటుచేశాడు. చెల్లాచెదురుగా ఉన్న ఆ విషయాలన్నింటినీ, గ్రంథరూపంలో క్రోడీకరించాడు. ఇదే పురాణ సంహిత, వ్యాసుడే పురాణ సంహితను రచించి రోమహర్షణ సూతునికి దానిని బోధించాడని, దానిని ప్రచారంలోకి తెచ్చే విధానం కూడా ఆయన సూతునికి తెలిపాడని తెలుపుతున్నారు.
పురాణ ప్రతిపాదిత విషయాలు
సామాన్య దృష్టితో చూచి పురాణాలలో ప్రతిపాదితమైన విషయాలను ఈ విధంగా సంగ్రహంగా భావించవచ్చు.
ఋషిదేశ మహావీర చరితాన్యవతారకాః
లాజావిధిద్ర్వతా, స్తీర్థానామ్నాం సాహస్ర మేవచ
ఋషి రాజ్ఞాం వంశసూచీ, యుగాస్సృష్టిశ్చ ద్వాదశ
సామాన్యతః పురాణేషు, విషయాః ప్రతిపాదితా.
ఋషులు, దేశాలు, మహావీరుల చరిత్రలు, అవతార కథలు, యజ్ఞాలు ఆచరింప వలసిన విధులు, వ్రతాలు, తీర్థాలు, ఋషుల రాజుల వంశాదికాలు, యుగాలు, సృష్టి క్రమము అనే పన్నెండు విషయాల వర్ణన సామాన్య దృష్టితో చూడగా పురాణాలలో ఉండాలని పెద్దలు తెలుపుతున్నారు.
పురాణవేత్తకు సర్వజ్ఞ బిరుదము
‘సర్వజ్ఞుండను నామము శర్వునకె’ అని శివుడు ఒక్కడే సర్వజ్ఞ పదానికి అర్హుడని పెద్దల వాక్యం కానీ, సర్వవిషయ సమన్వితమైన పురాణాలనుపుక్కిట పట్టినవాడు కూడా సర్వజ్ఞుడు కాగలడుగదా. అందుకే
యేత్వేతాని సమస్తాని పురాణానిచ జానతే
భారతంచ మహాబాహో; తే సర్వజ్ఞా మతానృణామ్
(మహాభారతము, అష్టాదశ పురాణాలను తెలుసుకొనినవాడు సర్వజ్ఞుడని అనవచ్చునని దీనివలన తెలుస్తున్నది)
యోవిద్యాచ్చతురో, వేదాన్, సాంగోపనిషదోద్విజః
నచేత్పురాణం సంవిద్యా, న్నైవ సస్యాద్విచక్షణః
(నాలుగే వేదాలు, ఉపనిషత్తులు, షడంగాలు తెలుసుకొన్నా బాగా పురాణాలను తెలుసుకొనకపోతే విచక్షణుడు కాదు అని బ్రహ్మాండపురాణం వ్యతిరేక మార్గంలో తెలుపుతున్నది)
పురాణము-ఆల్బెరూనీ
ఆల్బెరూని మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన పారశీక భాషలో మహాపండితుడు. ఇతని కాలం పదకొండవ శతాబ్ది ఉత్తరార్థం. ఇతడు దాదాపుగా మన తెలుగుకవి నన్నయ భట్టుకు సమకాలికుడని చెప్పవచ్చు. భారతదేశం మీదకు గజనీ మహమ్మదు దండెత్తి వచ్చేటప్పుడు తన వెంట ఎందరో పండితులు, కవులను తీసుకొని వచ్చాడని చరిత్రకారులు చెపుతున్నారు. వారిలో ఒకడు అల్బెరూని. ఇతడు మంచి పండితుడు. అనేక విద్యలమీద ఆసక్తి ఉన్నవాడు. భారతదేశం వచ్చిన తరువాత అతడు ఇచ్చట సంస్కృత పండితుల సహాయంతో మన దేశాన్ని గుఱించిన ఎన్నో విషయాలను తెలుసుకొన్నాడు. జ్యోతిషశాస్త్రం, దర్శనాలు ఇతనికి అభిమానపాత్రమైన విషయాలు, అందుకే ఆ రెండిటిల్లోను భారతీయ విజ్ఞానాన్ని మధించాడు. భారతదేశాన్ని గుఱించి అతడు రచించిన గ్రంథంలోని 12వ పరిచ్ఛేదంలో భారతీయుల ప్రాచీన సాహిత్యం గుఱించి విస్తృతంగా వివరించాడు. ఈ గ్రంథం రచనాకాలం క్రీ.శ. 1067 ప్రాంతం. ఆ సందర్భంలోనే అతడు అష్టాదశ పురాణాల పట్టికను ఇచ్చాడు. అయితే ఇతను రెండు రకాల పట్టికలను తన గ్రంథంలో ఇచ్చాడు. ఒక పట్టికను విష్ణుపురాణాన్ని అనుసరించి ఇచ్చాడు. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న పురాణాల పేర్లు తెలిపే సూచికే ఇది అని చెప్పవచ్చు. రెండవ పట్టికలో ఇచ్చిన పేర్లలో కొన్ని ఉపపురాణాలు కూడా చేరాయి. ఈ రెండో పట్టిక ప్రకారం అతడు పేర్కొనిన 18 పురాణాలు ఇవి. 1. ఆదిపురాణం 2. మత్స్యపురాణం 3. కూర్మపురాణం 4. వరాహ పురాణం 5. నరసింహపురాణం 6. వామన పురాణం 7. వాయుపురాణం 8. నందీ పురాణం 9. స్కాంద పురాణం 10. ఆదిత్యపురాణం 11. సోమపురాణం 12. సాంబపురాణం 13. బ్రహ్మపురాణం 14. మార్కండేయపురాణం 15. తార్ క్ష్య(గరుడ) పురాణం 16. విష్ణుపురాణం 17. బ్రహ్మాండపురాణం 18. భవిష్య పురాణం.
ఈ పట్టికను విశ్లేషణ చేస్తే
1. ఆల్బెరూనీ కాలానికే మహాపురాణ, ఉపపురాణాలు కలసి పోతూ ఉన్నాయి. ప్రజల దృష్టిలో వానికి అంతా తేడా లేదు.
2. ఉప పురాణాలు ఆరువరకు రచింపబడి ఉన్నాయి. అవి పురాణాలుగానే పరిగణింప బడుతున్నాయి. అవి 1. ఆదిపురాణం 2. నరసింహపురాణం 3. నందీపురాణం 4. ఆదిత్యపురాణం 5. సోమపురాణం 6. సాంబపురాణం.
3. ఆదిపురాణం వేరు. బ్రహ్మపురాణం వేరు. కొన్ని పురాణాలలో ఆది బ్రాహ్యం అని బ్రహ్మ పురాణం చెప్పబడింది.
4. ప్రస్తుత కాలంలో సౌర పురాణం అనే పేరుతో సూర్యుని గురించి చెప్పే పురాణం ఆనాడు లేదని ఆనాడు ఆదిత్య పురాణం ఉన్నదని చెప్పవచ్చు. అది నేడు అనుప లభ్యం. కానీ దాని తెలుగు అనువాదం ఉన్నది. దానిని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది.
5. నేటి కాలంలో సాంబపురాణం ఉన్నది. ఆదిత్యుని విషయంతో జోడింపబడిన చంద్రుని గురించి తెలిపే సోమపురాణం ఆనాడు ప్రచారంలో ఉండేది. ఇప్పుడు లేదు.
ఆల్బెరూనీ తాను ఈ అష్టాదశ పురాణాలలో కేవలం ఆదిత్య, మత్స్య, వాయు పురాణాలలోని కొన్ని అంశాలు మాత్రమే చదివినట్లుగా తెలుపుతున్నాడు. అతడు విష్ణు పురాణము, విష్ణుధర్మోత్తరాల నుంచే భౌగోళిక సంబంధమైన అనేక అంశాల వివరాలను తన గ్రంథంలో ఇచ్చాడు. దీనివలన నాటికి ఈ రెండు పురాణాలు అత్యంత ప్రచారంలో ఉన్నట్లు గ్రహించవచ్చు. ఇలా ఆల్బెరూనీ పురాణాల నుంచి, వాటిని గుఱించి విలువైన సమాచారం అందచేశాడు.
బల్లాలసేనుని దానసాగరము-పురాణము
క్రీ.శ. 1169లో వంగదేశపు చివరి స్వతంత్ర పరిపాలకుడు, లక్ష్మణసేను (1160-1210)ని తండ్రి బల్లాలసేనుడు. బల్లాల సేనుడు హేమంతసేనుని పౌత్రుడు. విజయసేనుని కుమారుడు. బల్లాల సేనుని కుమారుడైన లక్ష్మణసేనుడు యుగకర్త. అతనిపేరుమీద లక్ష్మణ సంవత్సరము లేక లక్ష్మణ శకము అనే కాలగణన ప్రారంభం అయింది. ఇతని ఆస్థానంలోనే జయదేవుడు, గోవర్ధనాచార్యుడు మొదలైన విఖ్యాత సంస్కృత కవులు ఉండేవారు. బల్లాలసేనుడు ‘సాగరము’ అని చివర వచ్చే అయిదు విశిష్ట గ్రంథాలను రచించాడు. అవి 1. అద్భుత సాగరము 2. దాన సాగరము 3. ప్రతిష్ఠా సాగరము 4. ఆచార సాగరము 5. వ్రత సాగరము. ఇందులో అద్భుత సాగరం, దానసాగరాలు మాత్రమే ముద్రితం. దానసాగరంలో వ్రత సాగరం పేర్కొనబడింది. అద్భుత సాగరం క్రీ.శ. 1167లో ప్రారంభించబడి అతని కుమారుడైన లక్ష్మణసేనునిచేత పూర్తి చేయబడింది. దానసాగరం క్రీ.శ. 1169లో రచింపబడింది. బల్లాలసేనుని సాహిత్య జీవనం క్రీ. శ. 1155 నుండి 1180 వరకు అని చెప్పవచ్చు.
దానసాగరం ప్రారంభంలో బల్లాలసేనుడు పురాణ స్వరూపాన్ని వివరించాడు. ఈతడు తాను ఏయే పురాణాల నుంచి ఏయే విషయాలను సేకరించాడో కొన్నింటిని ఎందుకు వదలివేశాడో తెలిపిన విషయాలు చాలా ప్రామాణికమైనవి. ఆ రోజుల్లో ఇంత ప్రామాణిక ఆలోచన ఉన్నవారే చాలా ఆరుదని చెప్పవచ్చు.
దానసాగర పురాణము ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి దాన విషయకమైన సర్వ విషయాలను సంగ్రహించి కూర్చిన గ్రంథం. ఆయన తన దానసాగరంలో బ్రహ్మ, వరాహ, ఆగ్నేయ, భవిష్య, మత్స్య, వామన, వాయు, మార్కండేయ, విష్ణు, శివ, స్కంద, పద్మ (అనే పురాణాలు), సాంబపురాణం, కాలికా పురాణం, నందిపురాణం, ఆదిత్య, నరసింహ, మార్కండేయ, విష్ణుధర్మోత్తర, విష్ణుధర్మాలనే ఉపపురాణాలు, గోపథ బ్రాహ్మణ, రామాయణం నుంచి మహాభారతం నుంచీ, మను, వశిష్ఠ సంవర్త మొదలైన స్మృతుల నుంచి ఉదాహరించాడు. పైన పేర్కొన్న 12 పురాణాలు తప్ప ఇతర పురాణాల నుంచి పేర్కొన లేదు. వాటి అప్రామాణ్య ప్రామాణ్యతల గుఱించి బల్లాల సేనుడు వెలిబుచ్చిన అభిప్రాయం చాలా విలువైనది. అతడు
భాగవతంచ పురాణం బ్రహ్మాండంచైవ నారదేయంచ
దానవిధి శూన్యమేతత్ త్రయమపి నిబద్ధమవధార్య”
(దానసాగరం-ఉపక్రమణిక 57)
అని భాగవతము, బ్రహ్మాండపురాణం, నారదీయ పురాణాలలో దాన సంబంధమైన విషయా లేమీ లేవు కాబట్టి వాటిని తాను స్పృశించలేదని చెప్పాడు. ఇలాగే ఇంకా మిగిలిన అనేక గ్రంథాల గుటించి అతడు సహేతుకమైన కారణాలిచ్చాడు. మత్స్య పురాణంలో చెప్పబడిన మహాదానముల యొక్క సారమే లింగపురాణంలో కూడా చెప్పబడడం వల్ల దానిని ప్రమాణంగా తీసుకొనలేదని చెప్పాడు. భవిష్యత్పురాణంలో సప్తమితిథుల వరకు మాత్రమే సంగ్రహంగా చెప్పబడింది. పైగా పాఖండులైన బౌద్ధులు దానిని ఖండించడం చేతను, శివరహస్యము, విష్ణు రహస్యాలనేవి ప్రజలలో ప్రచారంలో ఉన్నా దాన విషయకమైన వృత్తాంతాలు వాటిల్లో సంగ్రహంగా ఉన్నందువల్లనూ ఇవి మౌలిక గ్రంథాలుగా బల్లాల సేనుడు గ్రహించలేదు. భవిష్యోత్తర పురాణంలో ఆచార వర్ణన మొదలైన విషయాలున్నా దీనిలో ప్రామాణికంగా తీసుకోదగిన ఆధారాలు లేవని అతని ఉద్దేశ్యం. స్కాందపురాణంలోని మూడు ఖండాలు-కాశీ, రేవా, అవంతీ ఖండాలు కేవలం కథల మీదనే ఆశ్రితాలు. గరుడ, బ్రహ్మ, ఆగ్నేయ పురాణాలు. ఇరవైమూడు వేల శ్లోకాలున్న విష్ణుపురాణం, ఆరు వేల శ్లోకాలున్న రెండో లింగపురాణంలో దీక్ష, ప్రతిష్ఠ, నాస్తికుల (పాఖండికుల) యుక్తులు, రత్నపరీక్ష, మిథ్యావంశానుచరితం, కోశ-వ్యాకరణాది విషయాలు ఉండడం, అసంగతమైన కథలతో ఉండడం, పరస్పరం విరోధం కలిగిన విషయాలుండడం, మన్మథుని గుఱించిన కథలు, భండ, ధూర, పాఖండ (బౌద్ధులు), లింగి (సన్యాసి, పాశుపత-పంచ రాత్రులకు చెందినవాడు) అనే విషయాల ద్వారా ప్రపంచానికి ఉపకారం చేయని విషయాలున్నందువల్ల ఈ పురాణ ఉప పురాణాలన్నీ నిరాకరించబడ్డాయి. దేవీ భాగవతం కూడా ఇందులోకి చేరుతుంది. ఇందుకు కారణం ఇది పురాణ ఉపపురాణాలలో చేర్చబడ లేదు. రెండవది దీనిలో నిందిత కర్మలైన మారణ, మోహనాది కర్మలు వివరించబడి నందువల్లనూ, పాఖండ, తంత్రశాస్త్ర విషయాలు చెప్పబడి వానిని అనుసరిస్తున్నందు వలన ఇది కూడా నిరాకరించబడింది. కాబట్టి ఈ గ్రంథాల నుంచి శ్లోకాలు ఉద్ధరింప బడలేదు.
పై విషయాలనుబట్టి బల్లాలసేనుని దానసాగరమనే గ్రంథం ద్వారా క్రీ. శ. 12వ శతాబ్దానికి చెందిన పురాణాల గురించి తెలుసుకొన కలిగిన విషయాలు.
1. మహాపురాణాలలో విష్ణు భాగవతమే పరిగణింపబడెడిది. దేవీ భాగవతము కాదు.
2. వాయుపురాణం, శివపురాణం రెండూ మహాపురాణాలలోనివిగా పరిగణింపబడేవి.
3. స్కాందపురాణంలోని సంహితాత్మక భాగంలోని శివరహస్య ఖండం కూడా స్కాందంగానే పరిగణింపబడేది. కానీ ఈ విషయం ఇంకా లోతుగా ఆలోచించ వలసి ఉన్నది.
4. బ్రహ్మ, ఆగ్నేయ, లింగ, విష్ణు పురాణాలు ఆ రోజులలో రెండు విధాలుగా లభ్యం అవుతుండేవి. 23 వేల శ్లోకాలుండే విష్ణుపురాణం, ఆరువేల శ్లోకాలుండే లింగపురాణం ఆ కాలంలో ప్రామాణికంగా తీసుకొనబడలేదు. కూర్మపురాణంలో చెప్పినట్లుగా (1-17-20) ఉప పురాణాలుగా స్కంద, వామన, బ్రహ్మాండ, నారదీయ పురాణాలు ఆరోజులలో ఉండేవి. ఇవే పేర్లతో మహా పురాణాలు ఉండేవి. దీనివల్ల చాలా పురాణాలే సంక్షేపరూపంలో ఉపపురాణాలుగా ఆ రోజుల్లో ఉండేవని నిర్ణయించవచ్చు. కానీ ఆయా మహాపురాణాల పేర్లతోనే ప్రచారంలో ఉండేవని చెప్పగలం.
5. ఆ రోజులలో ప్రజలు తంత్ర విధానాలను సమర్థించేవారు కాదు. అందువలననే దేవీ భాగవతం ప్రామాణికంగా తీసుకొనబడలేదు. ఇలాగే స్కాందంలోని కొన్ని భాగాలు కూడా వదలి వేయబడ్డాయి.
6. గరుడ పురాణాన్ని బల్లాలసేనుడు పైన చెప్పిన అనేక కారణాలవల్ల ప్రామాణికంగా తీసుకొనలేదు.
ఇలా బల్లాలసేనుని ఈ కథనం ద్వారా 12వ శతాబ్దికి చెందిన పురాణాలను గురించిన అనేక విషయాలను మనం గ్రహించుకొనవచ్చు.
పురాణ పరిచయం
వేలకొలది శ్లోకాలు, వందల కొలది వృత్తాంతాలు ఉన్న ఒక్కొక్క పురాణం ఒకే విభాగంగా ఉండటం కుదరనిపని. అందుకే ఇవి భాగ, ఖండ, అంశ, స్కంధ, పాద, పర్వ, సంహిత అధ్యాయాలనే విభాగాలుగా చేయడ్డాయి. దీని అర్థం అన్ని విభాగాలు ఒకే పురాణంలో ఉంటాయని కాదు. కొన్నింటిలో కొన్ని కొన్ని ఉండవచ్చు. అలాగే భాగ, అంశ, ఖండాలలో కూడా అనేక అధ్యాయాలు ఉండవచ్చు. ఆ విధంగా అన్ని పురాణాల లోను అధ్యాయాలనే విభాగం ఉంటుంది. కానీ భాగ, ఖండ, అంశాలు వేటికవి ప్రత్యేకంగా కొన్ని కొన్ని పురాణాల లోనే ఉంటాయి. ఇక్కడ ఏయే పురాణాలు ఏయే విభాగాలుగా చేయబడిందో కూడా తెలుపబడింది.
అష్టాదశ పురాణాల గురించి చాలా విషయాలు ఇంతకుముందే తెలియజేయబడ్డవి కదా. ఇక ఇప్పుడు వానిలో చెప్పబడిన విషయాలను గురించి తెలుసుకొందాం.
1. బ్రహ్మపురాణం:
ఈ పురాణానికి ‘ఆదిబ్రాహ్మ్యం’ అనే పేరు కూడా వ్యాప్తిలో ఉన్నది. పురాణాలలో ఉండవలసినవిగా చెప్పబడే సమస్త విషయాలు ఇందులో ఉన్నాయి. సృష్టి వివరణ తరువాత సూర్య వంశం, చంద్రవంశ రాజుల వృత్తాంతం అతి సంక్షిప్తంగా ఉన్నది. పార్వతీ వృత్తాంతం చాలా ఎక్కువగా దాదాపు పది (30 నుంచి 40 వరకు) అధ్యాయాలలో వర్ణించబడింది. మార్కండేయాఖ్యానం తరువాత గౌతమీ, గంగ, కృత్తికా తీర్థం, చక్రతీర్థం, పుత్రతీర్థం, యమతీర్థం, ఆపస్తంబ తీర్థం మొదలైన అనేక ప్రాచీన తీర్థ విశేషాలు గౌతమీ మాహాత్మ్యంలో భాగంగా (అధ్యాయాలు 70 నుండి 175) వివరించబడ్డాయి. శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర 180 నుంచి 212వ అధ్యాయం వరకు 326 అధ్యాయాలలో విస్తృతంగా వర్ణించబడింది. శ్రీకృష్ణునిచరిత్ర అంతా భాగవతం దశమ స్కంధంలో చెప్పినట్లే ఉన్నది. భేదం ఏమాత్రం లేదు. ఇంతేకాకుండా ఈ పురాణంలో జీవుడు మరణించిన తరువాత పొందే వివిధ అవస్థల వర్ణనకూడా అనేక అధ్యాయాలలో కన్పిస్తుంది. అయితే పురాణాలలో మనకు సహజంగా కనపబడే భూగోళ వర్ణన అంత ఎక్కువగా దీనిలో కనిపించదు. కానీ ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న కోణాదిత్య (కోణార్క) అనే పేరుగల తీర్థ వివరణ దానికి సంబంధించిన సూర్య ఆరాధన గురించి వివరణ ఈ పురాణంలోని ప్రత్యేకత. సూర్యమహిమ, ఆయన ప్రసరించే శక్తిని గురించిన వివరణ ఆరు అధ్యాయాలలో ఉన్నది.
ఈ పురాణంలో దాదాపు పది అధ్యాయాలలో సాంఖ్యయోగ వివరణ చాలా విస్తృతంగా (234 నుండి 244) ఉన్నది. కరాళజనకుడు ప్రశ్నించటం వలన వశిష్ఠ మహర్షి చేత మహిమాన్మితమైన సాంఖ్యయోగ సిద్ధాంతాలు వివరించబడ్డాయి. ఇక్కడ గమనించ వలసిన ముఖ్య విషయం ఒకటి ఉన్నది. తరువాత కాలంలో ప్రచారంలోకి వచ్చిన సాంఖ్య యోగ విషయాలు అనేకం ఇందులో చెప్పబడిన ముఖ్య సాంఖ్య విషయాలతో విభేదిస్తున్నాయి. అంతకుపూర్వపు సాంఖ్యంలో తత్వాలు 25 అని చెప్పబడగా, ఇందులో మూర్ధస్థానీయంగా 26వ తత్త్వం యొక్క వివరణ ఉన్నది. పౌరాణిక సాంఖ్యంలో నిరీశ్వరవాదం ప్రతిపాదితంకాదు. ఇందులో జ్ఞానంతోపాటు భక్తికి కూడా విశిష్టమైన స్థానం ఇవ్వబడింది. ఈ పురాణంలోని ఇంకొక విశేషమేమంటే ఇందులోని కొన్ని అధ్యాయాలు వ్యాస మహాభారతంలోని పన్నెండవదైన శాంతిపర్వంలోని కొన్ని అధ్యాయాలతో అక్షరం అక్షరం ఏకీభవిస్తున్నవి. ధర్మమే పరమ పురుషార్థమని ఈ పురాణం ఉద్ఘోషిస్తున్నది.
ధర్మేమతిర్భవతు వః పురుషోత్తమానాం
సహ్యేక ఏవ పరలోకగతస్య బంధుః
అర్థాః స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమానా
నైవ ప్రభావ ముపయంతి న చ స్థిరత్వమ్ (బ్ర. పు. ఽ55-85)
పురుషోత్తములైన వారి కందరకు ధర్మమునందే బుద్ధి స్థిరమగుగాక, పరలోకమునకు పోయినప్పుడు అది ఒక్కటియే బంధువు కాగలదు. అర్థకామములను రెండింటిని ఎంత జాగ్రత్తగల వారుగా సేవించినను వానివలన లభించు ఫలము స్థిరములుకావు. అవి ఎట్టి సత్ఫలములను చూపలేవు.
ఇది రెండు భాగాలుగా చేయబడింది. 1. పూర్వభాగం, 2. ఉత్తర భాగం. రెండు భాగాలలోనూ కలిపి 245 అధ్యాయాలున్నాయి. నారదపురాణాన్ని అనుసరించి ఇందులో పదివేల శ్లోకాలు ఉండగా మత్స్యపురాణానుసారము 13,000 శ్లోకాలు ఉన్నాయి.
2. పద్మపురాణము
ఈ పురాణం విస్తృతిలో స్కాందపురాణానికి తరువాతదిగా ఉండి, మిగిలిన 16 పురాణాల కంటే పెద్దది. దీనిలోని శ్లోక సంఖ్య అర్థలక్ష (యాభైవేలు). అంటే లక్ష శ్లోకాల విస్తృతిగల మహాభారతంలో సగము, భాగవతానికి దాదాపు మూడురెట్లు పెద్దదైన పురాణం ఇది. ఈ పురాణం రెండు రకాలైన పాఠాలతో లభిస్తున్నది. వంగదేశ పాఠం ఒకటి. ఇది ఇప్పటికీ ముద్రితం కాలేదు. వ్రాతప్రతిగానే ఉన్నది. రెండవది ఆనందాశ్రమ పాఠ ప్రతి. ఇది ఆరుఖండాలు అనగా... 1) ఆది ఖండం, 2) భూమిఖండం, 3) బ్రహ్మఖండం, 4) పాతాళఖండం 5, సృష్టిఖండం, 6) ఉత్తరఖండం అనే ఆరు భాగాలుగా ముద్రితమైంది. ఇందులోని 125వ అధ్యాయంలోని శ్లో. 48-49 శ్లోకాల ప్రకారం ఈ ఖండ విభజన అనంతర కాలంలో జరిగినట్లు తెలుస్తున్నది. మూలంలో ఐదు ఖండాలు మాత్రమే ఉన్నాయని అముద్రిత వంగప్రతిలో అదే రకమైన విభజన ఉన్నదని పురాణపండితులు తెలుపుతున్నారు. దీనికే
ప్రథమం సృష్టిఖండం హి భూమిఖండం ద్వితీయకమ్
తృతీయం స్వర్గఖండంచ పాతాలశ్చ చతుర్థకమ్
పంచమంచోత్తరంఖండం సర్వపాప ప్రణాశనమ్-అని తెలుపుతున్నది.
1. సృష్టిఖండం: దీనిలో 82 అధ్యాయాలున్నాయి. ఇందులోని ప్రథమ అధ్యాయం వలన ఈ పురాణంలో 55,000 శ్లోకాలున్నాయని, ఈ పురాణం అయిదు పర్వాలతో విభజింపబడిందని తెలుస్తున్నది. అవి 1) పౌష్కర పర్వం-ఇందులో దేవతలు, మునులు, పితరులు, మనుష్యుల వంటి తొమ్మిది రకాల సృష్టిని గురించిన విపులవర్ణన ఉన్నది. 2) తీర్థపర్వం: ఇందులో పర్వత, ద్వీప, సప్తసాగర వర్ణన ఉన్నది. 3) తృతీయ పర్వం: దీనిలో ఎక్కువగా దక్షిణలను ఇచ్చే రాజుల వర్ణన ఉన్నది. 4) చతుర్థపర్వం: రాజుల వంశాను కీర్తనం ఉన్నది. 5) మోక్షపర్వం: మోక్షము దాని సాధన మార్గాల గురించిన వివరణ ఉన్నది. ఈ ఖండంలోనే సముద్రమథనం, పృథుజననం పుష్కర తీర్థవాసుల ధర్మవృత్తాంతం, వృత్రాసుర సంగ్రామం, వామనావతారము, మార్కండేయముని ఉత్పత్తి, కార్తికేయజననం, శ్రీరామచరిత్రం, తారకాసుర వధ మొదలైన వృత్తాంతాలు విస్తారంగా వర్ణింపబడ్డాయి.
2. భూమి ఖండం: ఈ ఖండం మొదట్లోనే శివశర్మ అనే పేరుగల బ్రాహ్మణుడు పితృ భక్తి చేత స్వర్గాన్ని పొందటం, పృథుమహారాజు పుట్టుక, చరిత్ర వర్ణనము, ఒక మాయా వేషధారి యొక్క బోధల ద్వారా జైన ధర్మ విషయాలు విని వేనుడు చెడుమార్గాన్ని ప్రవేశించడం, అప్పుడు సప్తర్షులవలన అతడి భుజమథనం జరిగి, పృథువు జన్మించడం, అనేక విధాలైన నైమిత్తిక, ఆభ్యాదాయక దానాల తరువాత, సతీసుకళ యొక్క పాతివ్రత్య సూచక కథలు చాలా విపులంగా వివరించబడ్డాయి. యయాతి, మాతలుల ఆధ్యాత్మిక విషయ సంవాదాలు, పాపపుణ్య ఫలవివరణలు, విష్ణుభక్తి ప్రశంస తెలుపబడ్డాయి. చ్యవన మహర్షి వృత్తాంతం సుదీర్ఘంగా తెలుపబడింది. పద్మ పురాణం ముఖ్యంగా విష్ణుభక్తికి ప్రతిపాదితము. కానీ ఇందులో ఇతర దేవీ, దేవతల యొక్క అనా దరభావ ప్రకటన లేదు. ఇందులో శివకేశవ అభేదత్వమే ప్రకటించబడింది. ఈ తత్త్వమే
శైవం చ వైష్ణువం లోకమేకరూపం నరోత్తమ
ద్వయోశ్చాప్యనంతరం నాస్తిఏకరూపం మహాత్మనోః
శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే
శివశ్చహృదయే విష్ణుః విష్ణోశ్చహృదయే శివః
ఏకమూర్తిస్త్రయోదేవాః బ్రహ్మవిష్ణు మహేశ్వరాః
త్రయాణామంతరంనాస్తి, గుణభేదాః ప్రకీర్తితా
అనే శ్లోకం ద్వారా తెలుపబడింది.
3. స్వర్గఖండం: ఈ ఖండంలో దేవ, గంధర్వ, అప్సర, యక్షాదిలోకాల విస్తృతవర్ణన వున్నది. ఈ ఖండంలోనే శకుంతలోపాఖ్యానం కూడా ఉన్నది. ఇది మహాభారతంలోని శకుంతలోపాఖ్యానంతో పూర్తిగా విభేదిస్తున్నది. కానీ కాళిదాసు అభిజ్ఞానశాకుంతల కథతో పూర్తిగా ఏకీభవిస్తున్నది. అందుకే కొందరు పండితులు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల కథేతిహాసం మహాభారతం నుంచి కాక ఈ పద్మపురాణం నుంచి గ్రహించాడని తెలుపుతున్నారు. విక్రమోర్వశీయం గురించి కూడా ఇలాంటి వాదమే ఉన్నది.
4. పాతాళఖండం: ఈ ఖండంలో నాగలోకం యొక్క విస్తృత వర్ణన ఉన్నది. ప్రసంగతః రావణ విషయం వచ్చినప్పుడు మొత్తం రామాయణకథ ఇందులో చెప్పబడింది. ఇందులోని ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కాళిదాసు తన రఘువంశంలో చెప్పిన రామకథతో ఇందలి వృత్తాంతం పూర్తిగా సరిపోలుతూ ఉన్నది. రావణవధానంతరం సీతాపరిత్యాగం, కుశలవ జననం, రామాశ్వమేధ వృత్తాంతాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఈ వృత్తాంతం అంతా భవభూతి రచించిన ఉత్తర రామచరిత కథావృత్తాంతంతో ఏకీభవిస్తున్నది. ఈ పురాణంలో వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించిన విషయం తెల్పి అందులో భాగవతపురాణం యొక్క మహిమ విస్తృతంగా వివరించబడింది.
5. ఉత్తర ఖండం: ఈ అయిదవదైన ఉత్తరఖండంలో వివిధ రకాలైన ఆఖ్యానాల సంక్షిప్త వర్ణనం ఉన్నది. ఈ ఖండంలోనే విష్ణుభక్తిని గురించిన ప్రశంస విస్తృతంగా కనిపిస్తుంది, దీనికి పరిశిష్ట అంశంగా ‘క్రియాయోగసారం’ అనే భాగం కూడా లభిస్తున్నది. ఇందులో వ్రతాలు, తీర్థసేవనం మొదలైన విషయాలతో శ్రీమహావిష్ణువు విశేషంగా ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడని చెప్పబడింది.
పద్మపురాణం విష్ణుభక్తి ప్రతిపాదక పురాణాలలో ముందుగా నిలిచే గ్రంథం. భగవంతుని నామ గుణగానం ఎన్ని విధాలుగా చక్కగా చేయవచ్చునో, ఎన్ని పేర్లు అపరాధ యుక్తాలైనవో మొదలైన విషయాలకు సమాధానం చాలా ప్రామాణికంగా ఈ పురాణంలో లభిస్తాయి. అందువలననే తరువాత కాలంలో వచ్చిన వైష్ణవ సంప్రదాయక గ్రంథాలు ఈ పురాణాన్ని విశేషంగా స్తుతించి ప్రామాణికంగా స్వీకరించాయి. సాహిత్య దృష్టితో చూచినా ఈ పురాణ శైలి బహుసుందరంగా ఉంటుంది. సామాన్యంగా పురాణ రచనలో అనుష్టుప్ ఛందం విశేషంగా ఉపయోగపడుతుండగా ఇందులో అనుష్టుప్ ఛందమేగాక ఇతర దీర్ఘ ఛందాలు కూడా విశేషంగా ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు ఈ శ్లోకం చూడండి:
సంసారసాగరమత్వీ గభీరపారం, దుఃఖోర్మిభిర్వివిధ మోహమయైస్తరంగైః
సంపూర్ణమస్తి నిజదోషగుణైస్తుప్రాప్తం, తస్మాత్ సముద్ధర జనార్దన మాంసుదీనం
ఇలాంటి చక్కని రచనా శైలితో ఉన్న పురాణం ఇది.
ఇందులో సృష్టి ఖండంలో 82 అధ్యాయాలు, భూ ఖండంలో 125 అధ్యాయాలు స్వర్గ ఖండంలో 39 అధ్యాయాలు, పాతాళ ఖండంలో 113 అధ్యాయాలు, చివరిదైన ఉత్తర ఖండంలో 282 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ గ్రంథంలో 641 అధ్యాయాలలో 55,000 శ్లోకాలు ఉన్నాయి.
3. విష్ణుపురాణం:
దార్శనిక ప్రభావ దృష్టితో చూస్తే విష్ణుభాగవతం, ప్రథమ గ్రంథంగా నిలిస్తే, ద్వితీయ స్థానాన్ని విష్ణుపురాణం ఆక్రమిస్తుంది. వైష్ణవదర్శనానికి మూలాలంబనం విష్ణుపురాణమే. అందువలననే వైష్ణవ మత ప్రతిపాదకులు శ్రీమద్రామానుజులవారు తమ శ్రీభాష్యంలో దీనినే ప్రమాణంగా తీసుకొని, ఎన్నో సందర్భాలలో దీనిలోని భాగాలను ఉద్ధరించారు. పరిమాణంలో ఇది చిన్న పురాణమే. కానీ ప్రభావంలో మాత్రం చాలా గొప్ప గ్రంథం. దీనిలోని భాగాలను ‘అంశాలు’ అంటారు. దీనిలో ఆరంశాలు ఉన్నాయి. ఈ ఆరు అంశాలు 126 అధ్యాయాలుగా విభజించబడ్డాయి. విస్తృతిలో ఇది శ్రీమద్భాగవతంలో మూడవవంతు మాత్రమే.
ఇందులోని ప్రథమ అంశంలో సృష్టి వర్ణన ఉన్నది. (11వ అధ్యాయం నుంచి 20 వరకు) ద్వితీయ అంశంలో భూగోళం యొక్క సాంగోపాంగ వివరణ విస్తృతంగా ఉన్నది. తృతీయాంశంలో వివిధాశ్రమ సంబంధమైన కర్తవ్యాల విధులు చెప్పబడ్డాయి. ఈ అంశం లోనే మూడు అధ్యాయాలలో (4,5,6) వేదముల యొక్క వివిధ శాఖల విశిష్టమైన వర్ణనము ఉన్నది. ఇది వేదాధ్యయనం చేసేవారికి వేద విజ్ఞాన జిజ్ఞాసువులకు చాలా అవసరమైన విషయము. నాల్గవ అంశం ముఖ్యంగా ఐతిహాసిక లేక చారిత్రక విషయాలకు సంబంధించినది. ఇందులో చంద్రవంశానికి చెందిన యయాతి చరిత్ర చెప్పబడింది. యదు, తుర్వసు, ద్రుహ్య, అను, పురులనే ఈ అయిదు ప్రసిద్ధ క్షత్రియ వంశాలను గురించిన విషయాల వర్ణన వివిధ అధ్యాయాలలో ఉన్నది. పంచమాంశం 37వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుని అలౌకిక చరిత్ర, వైష్ణవభక్తుల వృత్తాంతము ఉన్నది. ఈ అంశంలో భాగవతంలోని దశమ స్కంధంవలె శ్రీకృష్ణ చరిత్ర సంపూర్తిగా వర్ణించబడింది. కానీ ఈ చరిత్రలోని వృత్తాంతాలు సంగ్రహంగానే ఉన్నాయి. షష్ఠాంశంలో కేవలం ఆరు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ప్రళయము గురించి, భక్తి వివేచన గురించి వివరించబడి ఉన్నది.
సాహిత్యదృష్టితో చూస్తే విష్ణుపురాణం చాలా రామణీయకమైన గ్రంథం. వృత్తాంతాలను సరసంగా, సుందరంగా వివరించిన పురాణం ఇది. దీని నాల్గవ అంశంలో ప్రాచీన గద్యరూపాలకు విశిష్ట ఉదాహరణలు లభిస్తాయి. జ్ఞానంతోపాటు భక్తియొక్క సామంజస్యం ఈ పురాణంలో చాలా హృద్యంగా ప్రదర్శింపబడింది. ప్రధానంగా ఇది విష్ణుపారమ్యంగా రచింపబడిన పురాణం అయినా, ఇందులో సంప్రదాయక వైష్ణవేతర న్యూనత సుతరాము కనిపించదు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా తాను శివుడు అభిన్నులమని శ్రీముఖునితో చెప్పిన ఈ విషయం ద్వారా తెలుస్తుంది.
యోఽహం సత్వం జగచ్చేదం సదేవాసుర రమానుషం
మత్తో నాన్య దశేషం యత్, తత్తంజ్ఞాతుమిహార్వసి
అతిద్యామోహితాత్మానః పురుషాభిన్న దర్శినః
వదంతి భేదం పశ్యంతి, చావే యోరంతరంహర.
అంతేగాకుండా మనుష్యులు మాట్లాడాలి. ఆ మాట్లాడేది సుందరంగా ఉండాలని ఈ పురాణం తెలుపుతున్నది చూడండి.
హితం, మితం, ప్రియంకాలే వశ్యాత్మా యోఽభిభాషతే
సయాతి, లోకానాహ్లాదహేతు భూతాన్ నృపాక్షయాన్,
పురాణాల మిత్రసమ్మితంగా విషయాన్ని వివరిస్తుందనేది విష్ణుపురాణం ద్వారా ప్రతి అక్షరంలోనూ నిరూపించబడుతుంది.
ఇది రెండు భాగాలు. పూర్వభాగం, ఉత్తర భాగం అనేవే. ఇప్పుడు కేవలం పూర్వ భాగమే లభ్యం అవుతున్నది. ఈ పూర్వభాగం ఆరు అంశాలుగా విభజించబడింది. ప్రథమాంశంలో 22, ద్వితీయాంశంలో 16, తృతీయాంశంలో 28 చతుర్థాంశంలో 24 పంచమాంశంలో 38. షష్ఠ్యాంశలో 8 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఆరు అంశాలలోని 12 అధ్యాయాలలో 23 వేల శ్లోకాలు ఉండగా ఉత్తరభాగం లభ్యం కావటం లేదు. అయితే కొందరు విష్ణు ధర్మోత్తరమనే పురాణాన్ని విష్ణుపురాణ ఉత్తర భాగంగా భావిస్తున్నారు. విష్ణు ధరోత్తరాన్ని కలుపుకొంటే ఇంతకు ముందు చెప్పిన 23 వేల శ్లోక సంఖ్య సంపూర్ణం అవుతుంది.
4. వాయు పురాణం:
ఇది అన్ని పురాణాలలోకి చారిత్రకదృష్టితో చూస్తే ప్రాచీనమైన పురాణం. మహాకవి బాణభట్టు తన కాదంబరి గద్యకావ్యంలో ‘పురాణేవాయు ప్రలపితమ్’ అని దీనిని పేర్కొన్నాడు. అందువలన దీని రచనము బాణభట్టు కంటే చాలా పూర్వమే జరిగి ఉండాలని చెప్పవచ్చు. మిగిలిన వానితో పోలిస్తే ఇది పరిమాణంలో చిన్నదే. ఇందులో కేవలం 112 అధ్యాయాలున్నాయి. శ్లోకాల సంఖ్య దాదాపు పదకొండువేలు. ఈ పురాణం నాలుగు పాదాలుగా విభజించబడింది. వీటిని పాదాలు అంటున్నారు. అవి. 1) ప్రక్రియాపాదం, 2) అనుషంగపాదం, 3) ఉపోద్ఘాత పాదం, 4) ఉపసంహారపాదం అనేవి. దీని మొదటి ప్రక్రియాపాదంలో సృష్టిక్రమాన్ని గురించి చాలా విపులంగా అనేక అధ్యాయాలలో వర్ణించ బడింది. తరువాత చతురాశ్రమ విధానాల వివరణ ఉన్నది. ప్రాచీన భౌగోళిక విషయాల అధ్యయనం కోసం ఈ పురాణం చాలా ఉపయోగకరమైన గ్రంథం. ఇందులో జంబూ ద్వీపవర్ణన విస్తృతంగా ఉన్నది. అలాగే ఇతర ద్వీపాల విషయం కూడా చక్కని శైలిలో 6 అధ్యాయాలలో (34 నుంచి 39 వరకు) వివరించబడింది. ఖగోళవర్ణన కూడా ఈ పురాణంలో విస్తృతంగా చేయబడింది. (50 నుంచి 53 అధ్యాయాలు) అనేక అధ్యాయాలలో యుగ, యజ్ఞ, ఋషి, తీర్థవర్ణనలు విస్తృతంగా లభ్యం అవుతున్నాయి. 60వ అధ్యాయంలో నాలుగు వేదాలలోని వివిధ శాఖల వివరణ విస్తృతంగా ఉన్నది. సాహిత్య దృష్టితో ఈ పురాణం విస్తృతంగా అధ్యయనం చేయవలసిన అవసరం చాలా ఉన్నది. ప్రజాపతి వంశవర్ణన (అధ్యయం 61- 65) కశ్యపీయ ప్రజ్ఞాసర్గ (66-69 అధ్యాయాలు), ఋషివంశ వర్ణన (70వ అధ్యాయం), ప్రాచీన బ్రాహ్మణ వంశాల చరిత్రను తెలుసుకొనటానికి ఈ వివరాలు చాలా వరకు ఉపయోగపడతాయి. శ్రాద్ధవర్ణన కూడా అనేక అధ్యాయాలలో ఉన్నది. 86వ అధ్యాయం 87వ అధ్యాయం వరకు సంగీత విషయాలను గురించిన ప్రత్యేక వివరాలు ఉన్నాయి. 99వ అధ్యాయాల ప్రాచీన రాజుల చరిత్రను విస్తృతంగా వివరించింది. అందుచేత చారిత్రక దృష్టితో పరిశీలిస్తే ఇది చాలా ముఖ్యమైన పురాణం.
ఈ పురాణం యొక్క ముఖ్యవైశిష్ట్యం శివచరిత్రాన్ని విస్తృతంగా వర్ణించటం. కానీ ఇది సంప్రదాయిక దృష్టికోణంతో చూస్తే నిందార్హమైనది కాదు. చాలా అధ్యాయాలలో ఇందులో విష్ణువర్ణన కూడా ఉన్నది. విష్ణుమాహాత్మ్యము, ఆయన అవతారాల వర్ణన చాలా అధ్యాయాలలో కనిపిస్తుంది. పశుపతి ఆరాధనను తెలిపే పాశుపతయోగం ఈ పురాణంలో చాలా ప్రత్యేకంగా నిరూపించబడింది. అలాగే ఆ పాశుపతయోగ ప్రక్రియ చాలా విస్తృతంగా 11-15 అధ్యాయాలలో వివరించబడింది. ఈ విషయం ప్రాచీనయోగ శాస్త్ర అధ్యయనానికి చాలా అవసరమైనది. 24వ అధ్యాయంలో చెప్పబడిన శౌర్యస్తవం సాహిత్యదృష్టితో పరిశీలించటానికి చాలా ప్రభావవంతమైనది. 30వ అధ్యాయంలో దక్షప్రజాపతి చేసినట్లుగా చెప్పబడే శివస్తుతి చాలా సుందరమైన రచనగలది. ఇవి వేదంలోని రుద్రాధ్యాయస్తుతులకు పౌరాణికరూపాలుగా చెప్పవచ్చు, చూడండి:
నమఃపురాణప్రభవే, యుగస్య ప్రభవేనమః
చతుర్విధస్య సర్గస్య, ప్రభవేఽనంత చక్షుషే,
విద్యానాం ప్రభవేచైవ, విద్యానాం పతయేనమః
నమోవ్రతానాంపతయే, మంత్రాణాం పతయేనమః
దీని నాలుగు పాదాలలో మొదటిదైన ప్రక్రియా పాదంలో 1-6 అధ్యాయాలు, రెండవదైన ఉపోద్ఘాత పాదంలో 7-64 అధ్యాయాలు మూడవదైన అనుషంగ పాదంలో 65-99 అధ్యాయాలు నాల్గవదైన ఉపసంహార పాదంలో 100-112 అధ్యాయాలు వెరసి 112 అధ్యాయాలు ఉన్నాయి.
శివ పురాణమా, వాయు పురాణమా? ఏది మహా పురాణం అనే మీమాంస పురాణ పండితులలో ఉన్నదన్న విషయం ఇంతకుముందే చెప్పబడింది గదా. ఇక్కడ ఆ రెండింటిని గురించి పరిశీలిద్దాం:
శివ పురాణం ఏడు సంహితలుగా విభజించబడింది. 1. విద్యేశ్వర సంహిత 2. రుద్ర సంహిత, 3. శతరుద్ర సంహిత 4. కోటి రుద్ర సంహిత 5. ఉమా సంహిత 6. కైలాస సంహిత 7. వాయవీయ సంహిత అనేవి ఆ ఏడు విభాగాలు. ఇందులో రెండవదైన రుద్ర సంహిత 1. సృష్టి ఖండం 2. సతీ ఖండం, 3. పార్వతీ ఖండం 4. కుమార ఖండం 5. యుద్ధ ఖండాలనే అయిదు ఖండాలుగా విభజించబడింది. అలాగే ఏడవదైన వాయవీయ సంహిత పూర్వార్థ ఉత్తరార్థాలనే రెండు భాగాలుగా చేయబడింది. ఈ విధంగా మొదటిదైన విద్యేశ్వర సంహితలో 25 అధ్యాయాలు, రెండవదైన రుద్ర సంహితలో (20 + 43 + 55 + 20 + 19) 197 అధ్యాయాలు మూడవదైన శతరుద్ర సంహితలో 42, నాల్గవదైన కోటి రుద్ర సంహితలో 43, ఐదవదైన ఉమాసంహితలో 57 అధ్యాయాలు ఆరవదైన కైలాస సహింతలో 23, ఏడవదైన వాయవీయ సంహితలో (35 + 41 = 75) అధ్యాయాలు వెరసి 464 అధ్యాయాలు 24 వేలశ్లోకాలు ఉన్నాయి.
5. శ్రీ మద్భాగవతం:
భాగవతం భక్తి శాస్త్ర సర్వస్వంగా పండితులు భావిస్తారు. వైష్ణవ ఆచార్యులు ప్రస్థానత్రయంతో పాటు భాగవతాన్ని కూడా తమ ఉపజీవ్య గ్రంథంగా భావిస్తారు. వైష్ణవంలో శాఖలైన వల్లభ సంప్రదాయం, చైతన్య సంప్రదాయ అనుయాయులపై భాగవత తత్త్వ ప్రభావం చాలా ఎక్కువ. భాగవతమునందలి తత్త్వ గూఢార్థాలను వివరించటానికి వివిధ వైష్ణవ సంప్రదాయ అనుయాయులు, తమతమ తత్త్వవాదాలను అనుసరించి దీనికి ప్రత్యేక వ్యాఖ్యానాలు రచించారు. రామానుజమతాను సారం సుదర్శనసూరి రచించిన శుకపక్షేయము, వీరరాఘవాచార్యుని భాగవతచంద్రచంద్రిక, మధ్వమతానుసారం విజయా ధ్వజుని పదరత్నావళి, నింబార్క మతానుసారం రచించిన శుకదేవా చార్యుని సిద్ధాంత ప్రదీపము, వల్లభమతానుసారం స్వయంగా వల్లభుడే రచించిన సుబోధిని ఇలాంటివి ఇంకా లెక్కకు మిక్కిలిగా అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటే, భాగవతం యొక్క విశిష్టతను తెలుసు కొనవచ్చు. అద్వైతమతానుసారం శ్రీధరస్వామి రచించిన శ్రీధరీయవ్యాఖ్య విశేష ప్రచారంలో ఉన్న వ్యాఖ్య. ఆయా సంప్రదాయాల మౌలికమైన ఆధ్యాత్మిక కల్పనల ఆధారంగా నిలిచిన గ్రంథం, ఈ పద్దెనిమిదివేల శ్లోకాలు కలిగిన భగవంతుని స్వరూపమైన భాగవతం. వివిధ వైష్ణవ సంప్రదాయాలకు చెందినవారు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా వ్యాఖ్యలు వ్రాసినా, భాగవతంలో అద్వైత తత్త్వానికి మాత్రమే సరిగా సమన్వయం అయ్యే ఘట్టాలు చాలా ఉన్నాయి. ఇందుకు కారణం భక్తికి అద్వైతానికీ వైరుధ్యం లేకపోవటమే. భాగవతంలో
అహమే వాసమేవాగ్రే, నాన్వద్వత్సరసత్పరమ్
పశ్చాదహం యదేతచ్చయోన, శిష్యేతసోఽస్మ్యహమ్ (ఽ-9-3ఽ)
(సృష్టికి పూర్వం నేనే ఉన్నాను. అప్పుడు స్థూల ప్రపంచంగాని, తత్కారణంగానీ లేదు. తర్వాత ఆవిర్భవించిన ప్రపంచమూ నేనే. ప్రళయానంతరం మిగిలేది నేనే)-వంటి అద్వైత తత్త్వ ప్రతీకాలైన అనేక శ్లోకాలను ఉద్ధరించవచ్చు.
అద్వితీయ జ్ఞాన రూపమైన పరబ్రహ్మనే అనేక నామాలతో పిలుస్తూ ఉంటారు.
వ్రదన్తి తత్తత్వ విదస్తత్త్వం యద్ జ్ఞానమద్వయమ్
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే
జ్ఞానం విశుద్ధం పరమార్థమేకమనంతరం త్వ బహిర్బ్రహ్మసత్యం
ప్రత్యక్ ప్రశాన్తం భగవచ్చబ్ద సంజ్ఞం యద్యానుదేవం క్వయోవదన్తి (5-1ఽ-11)
అని చెప్పబడింది. అలాంటి పరబ్రహ్మతత్త్వాన్ని కనుగొనటానికి ఉత్తమ సాధనంగా భక్తిని ఉపదేశించటం భాగవతం యొక్క వైశిష్ట్యము.
భాగవతంలోని భాగాలను స్కంధాలంటారు. మొత్తం భాగవతం 12 స్కంధాలుగా విభజించబడింది. ఇందులో ప్రథమ స్కంధంలో 19, ద్వితీయ స్కంధంలో 10 తృతీయ స్కంధంలో 33, చతుర్థ స్కంధంలో 31, పంచమ స్కంధంలో 26, షష్ఠ స్కంధంలో 19, అష్టమ స్కంధంలో 15, నవమ స్కంధంలో 24, దశమ స్కంధంలో 90, ఏకాదశ స్కంధంలో 31 ద్వాదశ స్కంధంలో 13 వెరసి 335 అధ్యాయాలున్నాయి. ఇందులోని మొత్తం శ్లోకాల సంఖ్య 18,000. పురాణాలను గురించి తెలుపుతూ భాగవతం పురాణానికి దశ లక్షణాలుండాలని నిర్దేశించింది. పురాణం పంచలక్షణం అని చెప్పిన నిర్వచనం ప్రకారం ఈ గ్రంథానికి పంచలక్షణాలే గాక తాను స్వయంగా పురాణ లక్షణాలుగా చెప్పిన దశ లక్షణాలు కూడా దీనికి సమన్వయిస్తాయి. భాగవత రచన క్రీ.శ. 6వ శతాబ్దానికి ముందే జరిగి ఉండాలి. ఇందులో దక్షిణ దేశంలోని నదులు, పర్వతాలు, తీర్థక్షేత్ర ప్రశంసలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గ్రంథం ద్రవిడ దేశంలో విష్ణు భక్తి ఎక్కువగా ఉండగలదని చెప్తున్నది. ఆ కారణంచేత ఇందుకు దక్షిణ దేశంలో జన్మించిన ఆళ్వారు (వైష్ణవభక్తు)ల సూచనలు ఉండి ఉండవచ్చని భావించటం జరిగింది. ఈ పురాణం దక్షిణదేశంలో అందులోనూ ద్రవిడ దేశంలో రచింపబడి ఉంటుందని పురాణ విమర్శకుల అభిప్రాయం.
అయిదవ మహాపురాణమైన భాగవతం పరిగణనలోను విష్ణు భాగవతమే మహా పురాణమని దేవీ భాగవతం ఉప పురాణమని కొందరు భావిస్తుండగా శాక్తేయులు కాదు దేవీ భాగవతమే మహా పురాణమని వాదిస్తున్నారు. ఎవరి వాదాన్ని బలపరిచే ఉపపత్తులు వారికి ఉన్నాయి.
దేవీ భాగవతం కూడా పన్నెండు విభాగాలుగానే విభజించటం జరిగింది. ఒక్కొక్క విభాగం పేరు స్కంధం. ఇందులో వరుసగా 20, 12, 30, 25, 35, 31, 40, 24, 50, 13, 24, 24. అధ్యాయాలు వెరసి 328 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పురాణంలోను శ్లోకాల సంఖ్య 18,000 లే.
6. నారదపురాణం:
నారదపురాణము, మహాపురాణ రూపమున ఉపపురాణ రూపమున కూడా లభ్యం అవుతున్నది. అందువలన ఈ రెండింటిని వేరు వేరుగా పేర్కొనటానికి కొందరు నారదీయపురాణము అని పిలుస్తున్నారు. హెచ్. హెచ్.విల్సన్ వంటి కొందరు పండితులు ఇది సాధారణ వైష్ణవ భక్తి గ్రంథమని, 16వ శతాబ్దంలో రచింపబడిందని తెలుపుతున్నా ఇది అంతగా పరిగణించవలసిన విషయం కాదు. 12వ శతాబ్దంవాడైన బల్లాల సేనుడు తన దానసాగరం అనే గ్రంథంలో ఈ పురాణంలోని శ్లోకాలను ఉద్ధరించాడు. 11వ శతాబ్దంవాడైన ఆల్బెరూని కూడా తన యాత్రా విశేషాల గ్రంథంలో దీనిని పేర్కొన్నాడు. అందువలన ఈ పురాణం ఈ యిరువురి కాలం కంటే ప్రాచీనమైనదని చెప్పవచ్చు. ఈ గ్రంథం పూర్వభాగంలోని 24-25 అధ్యాయాలలో వర్ణాశ్రమాచారాలు, 28వ అధ్యాయంలో శ్రాద్ధవిధి ప్రాయశ్చిత్తము మొదలైనవి వర్ణించబడ్డాయి. దీని తరువాత వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం ఛందస్సు, మొదలైన వివిధ శాస్త్రాల విషయాలు వివిధ అధ్యాయాలలో వివరించ బడ్డాయి. అనేక అధ్యాయాలలో విష్ణువు, రాముడు, ఆంజనేయ, కృష్ణ, కాళి, మహేశ్వరుల మంత్రాల వివిధ విధులు నిరూపించబడ్డాయి. ఇందులో మోక్షం సాధించటానికి విష్ణు భక్తియే పరమసాధనంగా చెప్పబడింది. ఈ అంశాన్నే స్వీకరించి ద్వితీయ భాగంలో 7-37 అధ్యాయాలలో పరమవిష్ణుభక్తుడైన రుక్మాంగదమహారాజ చరిత్ర వర్ణింపబడింది.
ఐతిహాసిక దృష్టితో చూచినా ఈ పురాణానికి చాలా ప్రత్యేకత ఉన్నది. అష్టాదశ పురాణాలలో చెప్పబడిన విషయానుక్రమణిక పూర్వభాగంలోని 92 నుంచి 109 అధ్యాయాలలో ఇవ్వబడింది. అన్ని పురాణాలలోను చెప్పబడిన విషయాలను తెలుసు కొనటానికి ఈ అనుక్రమణిక చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా ప్రస్తుతం లభ్యం అవుతున్న పురాణాలమూల రూపము, ప్రక్షిప్త అంశాలను మనం తేలికగా తెలుసుకొనవచ్చు. దీనిలో విష్ణుభక్తికి ప్రాధాన్యత ఉన్నా ఈ పురాణంలో పురాణ పంచలక్షణాలు కూడా ఉన్నాయి. నారద పురాణం విష్ణు పారమ్యాన్ని బోధించే పురాణం మాత్రమే కాదు. పాంచరాత్ర విధాన వర్ణనం కూడా ఈ పురాణంలో కనిపిస్తుంది. ఇది అనేక వైష్ణవ ఆగమాలను పేర్కొంటున్నది. ఈ పురాణంలో బౌద్ధుల నింద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వైష్ణవులకు ముఖ్యదినమైన ఏకాదశీ వ్రతమాహాత్మ్య వర్ణనం అతి విస్తృతంగా కనిపిస్తుంది. వైష్ణవ భక్తుడైన రుక్మాంగదుని ఉపాఖ్యాసంలో తన రాజ్యంలోని 8 నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్నవారివరకు ఏకాదశీ వ్రతం చేయాలని, అలా చేయని పక్షంలో వారు వధ్యులు-దండ్యులు ఔతారని ఆజ్ఞ ఇచ్చాడని ఈ పురాణం తెలుపుతున్నది.
ఈ పురాణం క్రీ.శ. 700-800 ల మధ్య రచింపబడి ఉండాలని పండితుల భావన. నారదపురాణం రెండు భాగాలుగా చేయబడింది. అవి పూర్వభాగం, ఉత్తర భాగాలుగా పిలువబడుతున్నాయి. వీటిలో పూర్వ భాగంలో నాలుగు పాదాలు ఉన్నాయి. ఈ నాలుగు పాదాలలోను ఉండగా, 125 అధ్యాయాలు ఉత్తర భాగంలో 82 అధ్యాయాలు మొత్తం 207 అధ్యాయాలుగా విభజించబడి ఉన్నది. దీనిలోని మొత్తం శ్లోకాల సంఖ్య 25,000 లు.
7. మార్కండేయ పురాణం:
మార్కండేయ మహామునిచేత చెప్పబడిన పురాణం కాబట్టి దీనికి మార్కండేయ పురాణమనే పేరువచ్చింది. విస్తృతిలో ఈ పురాణం చిన్నదేనని చెప్పాలి. ఈ పురాణం మొత్తాన్ని పర్గీటర్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. దీనిలోని తొలి కొన్ని అధ్యాయాలు జర్మన్ భాషలోకి కూడా అనువదించబడ్డాయి. ఆ భాగంలో మరణానంతరం జీవుని స్థితి చెప్పబడింది. పశ్చిమదేశీయ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ పురాణం అతి ప్రాచీనమైనది. వారి దృష్టిలో ఇది చాలా ప్రజాదరణ గలది. అందరూ అవశ్యం అధ్యయనం చేయదగింది. నిజానికి వారి భావన సరియైనదే. ప్రాచీనకాలానికి చెందిన ప్రసిద్ధ బ్రహ్మవాదిని మహర్షిణి మదాలస పవిత్ర చరిత్ర ఈ గ్రంథంలో బాగా విస్తరించి వివరించబడింది. మదాలస తన పుత్రుడైన అలర్కునికి చిన్నతనం నుంచే బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించి నందువలన అతడు మహారాజు అయిన తరువాత గూడా జ్ఞాన యోగకర్మ యోగాలను సమన్వయించి చూపించి పరిపాలన సాగించాడు. ఇందులో చెప్పబడిన దుర్గాసప్తశతి చాలా ప్రత్యేకత గలది. ఇందులో దేవీ భక్తులకు సర్వస్వరూపిణియైన దుర్గ యొక్క పవిత్ర చరిత్ర చాలా విస్తారంగా వర్ణించబడింది. దుర్గాసప్తశతి మహాకాళి-మహాలక్ష్మి-మహాసరస్వతీ రూపురాలైన దేవి యొక్క మాహాత్మ్యాన్ని ప్రతిపాదిస్తూ 136 అధ్యాయాలలో విస్తరించింది. మన్వంతర వర్ణనం కూడా విస్తృతంగా కలిగిన పురాణం ఇది. కొన్ని వైదిక కర్మల ద్వారా అభీష్టఫలాలను ఏ విధంగా పొందవచ్చునో కొన్ని ఉపాఖ్యానాల ద్వారా విశదీకరించబడింది. అనేక విషయాలు మార్కండేయ పురాణం నుంచి దేవీ భాగవతంలోనికి స్వీకరింపబడ్డాయి. ఈ పురాణ రచనాకాలం క్రీ.శ. 400-500 మధ్యకాలం అని పురాణ విమర్శకుల అభిప్రాయం.
మార్కండేయ పురాణంలో 136 అధ్యాయాలు ఉన్నాయి. దీని శ్లోక సంఖ్య 9,000లు కానీ ఇప్పుడు లభ్యమవుతున్న మార్కండేయ పురాణంలో కేవలం 6,900 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి.
8. అగ్నిపురాణం:
అందులో చెప్పబడిన విషయాల వైచిత్ర్యంవల్ల అష్టాదశ పురాణాలలో అగ్ని పురాణానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం లభ్యం అవుతున్న అగ్నిపురాణంలో నారద పురాణం చెప్పిన విషయానుక్రమణిక యథాతథంగా ఉన్నది. కానీ నారదపురాణం ‘ఇది ఈశానుకల్పంలో జరిగిన వృత్తాంతం’ అని చెప్పిన విషయం మాత్రం లభ్యం కావటం లేదు. ఇందులోని రెండవ అధ్యాయంలో ప్రాప్తే కల్పేతువారాహే కూర్మరూపోఽఅభవద్ధరిః’ అని చెప్పుబడటం చేత ఇది వరాహకల్పవృత్తాంతం అని తెలుసుకొనవచ్చు. పైగా ‘వసిష్ఠాయాఽఅనలో అబ్రవత్’ అనగా వసిష్ఠునిచేత చెప్పబడిన అగ్నివృత్తాంతం కూడా లేదు. బ్రహ్మ మానసపుత్రుడైన మరీచిమహాముని ద్వాదశ వార్షిక సత్రయాగంలో అగ్నికి ధర్మానుష్ఠానాన్ని గురించి చేసిన ఉపదేశం మీద ఆధారపడి ఈ పురాణం ఆరంభం అవుతున్నది. స్కాంద పురాణంలోని శివరహస్య ఖండంలో ఈ పురాణం అగ్నిదేవుని మహాత్మ్య ప్రతిపాదనం ఈ పురాణ ప్రధాన లక్ష్యం అని పేర్కొంటున్నా, ఇలాంటి వృత్తాంతాలు అగ్ని పురాణంలో లేనేలేవు. ప్రస్తుతం అగ్ని పురాణమని, వహ్ని పురాణమని రెండు పురాణాలు లభ్యం అవుతున్నాయి. రెండింటిలో చెప్పబడిన విషయాలలోను కొంత ఐక్యత ఉన్నది. బల్లాలసేనుడు అగ్ని పురాణంలోనివిగా ఉద్ధరించిన కొన్ని శ్లోకాలు ప్రస్తుత అగ్ని పురాణంలో లభ్యం కావటం లేదు. అగ్ని పురాణంలోని చాలా విషయాలు, వహ్ని పురాణంలో కూడా ఉన్నాయి.
దీని వక్త అగ్ని. శ్రోత వశిష్ఠుడు. ఇందులో ఈశానుకల్ప వృత్తాంతం ఉన్నది. ఆధునికులు అగ్ని పురాణాన్ని భారతీయుల సమస్త విజ్ఞానకోశం అంటున్నారు. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే పురాణాల ముఖ్య ఉద్దేశ్యం భారతీయ విద్యలను జనసామాన్యం చేరువలోనికి తీసుకొనిరావటమే అనిపిస్తుంది. ఇందులోని 383 అధ్యాయాలలో అనేక విషయాలు వివరించటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో అవతారతత్త్వంతోపాటు రామాయణ మహాభారత హరివంశ కథలసారం ఇవ్వబడింది. అనేక విధాలైన దేవాలయాల నిర్మాణ కళను వివరించటంతో పాటు విగ్రహప్రతిష్ఠ పూజావిధానం మొదలైన వాటిని గురించి విస్తృతంగా వివరించబడింది. నాలుగు ఉపవేదాలు, వేదాంగాలు, తాత్త్విక, దార్శనిక విషయాలు మాత్రమే గాకుండా పశుచికిత్స, ధర్మశాస్త్ర, రాజనీతి, ఆయుర్వేదం మొదలైన శాస్త్రాల విషయాలు ప్రత్యేకంగా వివరించటం జరిగింది. చివరలో కావ్య సౌందర్య విషయాలతోపాటు అలంకార శాస్త్ర విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఛందశ్శాస్త్రం 8 అధ్యాయాలలో వివరించబడింది. వ్యాకరణ శాస్త్ర క్లుప్తీకరణ చాలా ప్రత్యేకంగా చెప్పబడింది, కౌమార వ్యాకరణం అనే పేరుతో ఒక చిన్న వ్యాకరణము, ఏకాక్షర కోశము, నామలింగానుశాసనము, యోగశాస్త్ర అంగాల వివేచనము అద్వైత వేదాంత సారము ఇందులో సమకూర్చబడ్డాయి. ఈ విధంగా అగ్ని పురాణంలో భారతీయ సాహిత్యము, సంస్కృతులకు సంబంధించిన అన్ని విషయాలు సంక్షిప్త రూపంలో సంకలనం చేయబడ్డాయి. అందువలననే ‘ఆగ్నేయేహి పురాణేఽస్మిన్ సర్వావిద్యాః ప్రదర్శితాః” అని చెప్పబడింది. ఇందులో ఆయుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రంవంటి వేదాంగాలకు సంబంధించిన విషయాల వర్ణన ఉన్నది. ఇందులో పురాణ పంచలక్షణాలతోబాటు హిందూ సంస్కృతి, సాహిత్యాల అన్ని విషయాల వివరణ ఉన్నది.
బ్రహ్మజ్ఞానం తతఃపశ్చాత్ పురాణ శ్రవణే ఫలమ్
ఏతదాగ్నేయకం విప్ర పురాణం ప్రకీర్తితమ్.
ఈ పురాణ శ్రవణం లేక మననం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ పురాణ రచన క్రీ.శ. 7-11 శతాబ్దాల మధ్య జరిగి ఉండవచ్చు. దీని సంస్కరణ క్రీ.శ. 13వ శతాబ్దిలో జరిగి ఉండవచ్చు. అగ్ని పురాణంలో అనేక తాంత్రిక అనుష్టాన విధానాలు ప్రతిపాదించబడ్డాయి. వీనిలోని కొన్ని ప్రత్యేక అనుష్టానాలు ఈనాటికి వంగదేశంలో ప్రచారంలో ఉన్నాయి. అందువలన ఇది వంగ దేశంలో రచింపబడి ఉండాలని భావించబడుతున్నది.
అగ్ని పురాణంలో 383 అధ్యాయాలు ఉన్నాయి. అందులో నారద పురాణానుసారం 25,000 శ్లోకాలు, మత్స్యపురాణాను సారం 13,000 శ్లోకాలు ఉండాలి. కానీ వాస్తవంలో నేడు లభ్యం అవుతున్న అగ్నిపురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి.
9.భవిష్యపురాణం:
ఈ పురాణ విషయంలో పండితులలో ఉన్నంత గందరగోళం వేరు ఏ పురాణం విషయంలో కూడా లేదు. రాబోయేకాలంలో జరుగబోయే వృత్తాంతాలను వివరించదలచిన పురాణం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇందువలన ఈ పేరును సార్థకం చేయ టానికి ఆయా కాలాలలో పండితులు రాబోయే చరిత్ర అంటూ అనేక అర్వాచీన విషయాలను చేర్చటం జరిగింది. తత్ఫలితంగా ‘ఇంగ్రేజ’ అనే పేరుతో ఇంగ్లీషువారు భారతదేశం రావటం కూడా చెప్పబడింది. జ్వాలాప్రసాద్ మిశ్రా అనే పండితుడు తమ దగ్గర నాలుగు భవిష్య పురాణ లిఖిత ప్రతులున్నట్లు, ఒకదానితో మరొకదానికి అంతగా సంబంధం లేనట్లు తెలిపారట. ఇవి అన్నీ కలిపివేయగా ఏర్పడిన పురాణం ఈనాడు భవిష్యపురాణంగా ప్రచారంలో ఉన్నది. ఈ పురాణాన్ని నారద, అగ్ని, మత్స్య, వాయు పురాణాలు పేర్కొంటున్నవి. అందుచేత ఇది ప్రాచీన పురాణమేనని చెప్పటంలో ఏమాత్రం సందేహించవలసిన అవసరం లేదు. నారద పురాణాన్ని అనుసరించి ఇందులో అయిదు పర్వాలున్నాయి. ఈ పురాణంలో సూర్యోపాసన విస్తృతంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబునికి కుష్ఠురోగం సంప్రాప్తించగా దాని నివారణ కోసం గరుత్మంతుడు శాకద్వీపం నుంచి బ్రాహ్మణులను తీసుకొనిరాగా వారు సూర్యోపాసనా విధానంచేత ఆ వ్యాధిని నయం చేశారని ఈ పురాణం తెలుపుతున్నది. సూర్యోపాసన రహస్యాలు, కలియుగంలో ఆవిర్భవించిన అనేక రాజుల వంశవర్ణన కూడా ఈ పురాణంలో విస్తృతంగా ఉన్నది. ఆ రాజుల చరిత్రను అధ్యయనం చేయటానికి ఈ భాగ అధ్యయనం చాలా ముఖ్యం.
సృష్టి, స్థితి, లయలకు సంబంధించిన విషయాలు, ఆదిత్య చరిత్ర వర్ణన, పుస్తకములు వ్రాయుట లేక రచయితల లక్షణాలు, అన్ని సంస్కారాలు లేక కల్పాల వర్ణన, బ్రహ్మ, విష్ణు, శివుల మహిమ వర్ణన, ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాల చతుష్టయ వివరణ ఈ పురాణంలో ఉన్నది.
భవిష్య పురాణం ఐదు పర్వాలుగా విభజించబడింది. అవి 1. బ్రహ్మ పర్వం 2. వైష్ణవ పర్వం 3. శైవ పర్వం 4. సౌరపర్వం 5. ప్రతి సర్గ పర్వం-ఈ మొత్తం అయిదు పర్వాలలోను 605 అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణానుసారం 14 వేల శ్లోకాలు, మత్స్యపురాణానుసారం 14,500 శ్లోకాలు ఇందులో ఉన్నాయి.
10. బ్రహ్మవైవర్తపురాణం:
ఈ పురాణంలో పద్దెనిమిదివేల శ్లోకాలున్నాయి. అంటే భాగవతంతో సమాన విస్తృతి కలిగిన పురాణమన్నమాట. దీనిలో నాలుగు ఖండాలున్నాయి. 1) బ్రహ్మఖండం, 2) ప్రకృతి ఖండం, 3) గణేశఖండం, 4) కృష్ణజన్మఖండం. ఈ నాలుగు ఖండాలలోను కృష్ణజన్మఖండం పురాణంలో దాదాపు సగంకంటే పైభాగమే ఉన్నది. ఈ ఖండంలో 133 అధ్యాయాలున్నాయి. శ్రీ కృష్ణచరిత్రాన్ని విస్తృతంగా వర్ణించడం ఈ పురాణ ప్రధాన లక్ష్యం అనిపిస్తుంది. రాధ కృష్ణుని యొక్క శక్తి అని అందువలన రాధయొక్క వృత్తాంతం సాంగోపాంగంగా వర్ణించిన పురాణం ఇది. ఈ రాధావృత్తాంతం వల్లనే పలువురు పురాణ తత్త్వజ్ఞులు దీనిని చాలా ఆధునిక పురాణం అని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి రాధ యొక్క కల్పన ప్రాచీనమైనదే. మహాకవి భాసుడు తన బాలచరిత్ర నాటకంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, రాధవర్ణన విస్తృతంగానే చేశాడనే విషయం మరువరాదు. భాసుడు క్రీ.శ. తృతీయ శతాబ్దంవాడు. అందువలన ఈ పురాణ రచనాకాలం మూడవ శతాబ్దానికి ముందే జరిగి ఉంటుందని భావించాలి. భాగవత దశమస్కంధంలోనూ ఈ పురాణంలో తప్ప వేరెక్కడా శ్రీకృష్ణచరిత్రం ఇంత విస్తృతంగా వర్ణించటం కనిపించదు.
1) బ్రహ్మఖండం: ఇందులో కేవలం ముప్ఫై అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ భాగంలో శ్రీకృష్ణుని ద్వారా జరిగిన జగత్సృష్టి వర్ణించబడింది. దీని 16వ అధ్యాయంలో ఆయుర్వేద శాస్త్ర విషయాలు చెప్పబడ్డాయి.
2) ప్రకృతి ఖండం: ఇందులో శ్రీకృష్ణుని ఆదేశానుసారం ప్రకృతి దుర్గ, లక్ష్మిసరస్వతి సావిత్రి, రాధల రూపంలో అప్పుడప్పుడు ఆవిర్భవించిన విషయాలు వర్ణించబడ్డాయి. ఈ ఖండంలో సావిత్రి, తులసిల కథలు విస్తృతంగా చెప్పబడ్డాయి.
3) గణేశఖండం: ఇందులో గణేశుని ఉత్పత్తి ఆయన చరిత్రలు వర్ణింపబడ్డాయి. గణేశుడు శ్రీకృష్ణుని అవతారమని ప్రతిపాదించబడింది.
వివృతం బ్రహ్మకార్స్త్యేన, కృష్ణేన యత్రశౌనక
బ్రహ్మవైవర్తకంతేన, ప్రవదంతి పురావిదః- 1-1-10
కృష్ణుడు బ్రహ్మను వివరించటం చేత దీనిని బ్రహ్మ వైవర్తకమనే పేరు వచ్చిందని ఇందులో చెప్పబడింది. దీనికి బ్రహ్మ కైవర్త పురాణమని ఇంకొక పేరు ఉన్నది. ఈ పేరు ఎందుకు వచ్చిందో అంత స్పష్టంగా తెలియటం లేదు. దాక్షిణాత్యులలో బ్రహ్మ కైవర్త మనే పేరే ఎక్కువ ప్రచారంలో ఉన్నది. నారదపురాణంలో ఉన్న ఈ పురాణ విషయాను క్రమణిక ప్రస్తుతం లభ్యం అవుతున్న బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడిన విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నది. శ్రీకృష్ణ పారమ్యాన్ని ప్రతిపాదించటం చేత కృష్ణభక్తులైన వైష్ణవులు ఈ పురాణానికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. ముఖ్యంగా గౌడీయవైష్ణవులు ఈ పురాణంపై హెచ్చుగా ఆదరణ చూపిస్తారు.
4) కృష్ణజన్మఖండం: సృష్టి ప్రకరణంలో నారద బ్రహ్మల సంవాదం, నారద శివలోక గమనము, తరువాత జ్ఞానలాభము, సావర్ణి, నారదుల శ్రీకృష్ణమాహత్య విషయక సంవాదము, ప్రకృతి అంశభూత కళల మాహాత్మ్యవర్ణనము గణేశ జన్మకథ, కార్తవీర్యచరిత్ర, పరశురామ గణేశ సంవాదము, శ్రీకృష్ణజననము, శ్రీకృష్ణుని వివిధ బాల్యలీలలు, కంసాది దుష్టుల హననము ద్వారకకు తిరిగివచ్చుట ఇందులో వర్ణింపబడ్డాయి.
బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మపారమ్యాన్ని బోధించే పురాణమని, అందుచేత ఇది రాజస పురాణాలలో చేరుతుందని అనేక పురాణాలలో చెప్పబడి ఉన్నది. మనకు లభ్యం అవుతున్న ఈ పురాణంలో శ్రీకృష్ణపారమ్యం చెప్పబడింది. అక్కడక్కడ బ్రహ్మనింద కూడా ఉన్నది. శ్రీకృష్ణుడే పరాత్పర బ్రహ్మ అనీ, ఆయన నివాసం గోలోకంలో అనీ, ఆయన భార్య రాధ అనీ, ప్రతిపాదించే బ్రహ్మవైవర్తం ప్రాచీన బ్రహ్మవైవర్తాన్ని వైష్ణవులు మార్చి వేయగా ఏర్పడినది. తంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాలు పురాణాలలో తొమ్మిది, పదవ శతాబ్దాలలో ప్రవేశించాయి కాబట్టి, ఈ పురాణంలోని ప్రకృతి ఖండ, గణేశ ఖండాలలో తంత్రశాస్త్ర ప్రభావం అత్యధికంగా కనిపిస్తున్నందు వలన ఈనాడు లభ్యం అవుతున్న బ్రహ్మవైవర్తపురాణం తొమ్మిదవ శతాబ్దం కంటె ప్రాచీనం కాదని, రాధాకృష్ణ సంప్రదాయం వర్ణింపబడి ఉండటం చేత ఇది 15వ శతాబ్దం ప్రాంతానికి చెంది ఉండవచ్చునని కొందరు పండితుల అభిప్రాయం.
ఈ పురాణంలో ముస్లిములను పేర్కొనటం జరిగింది. సంకర జాతులను వర్ణించే సందర్భంలో స్త్రీయందు మ్లేచ్ఛునివలన ‘జోలా’ జాతి పుట్టిందని తెలియజేయబడింది. “మ్లెచ్ఛాత్కువిందర కన్యాయాం జలా జాతిర్భభూవహ” (10-121) హిందీలోని ‘జులాహా’ (సాలెవాడు) వంగభాషలో ‘జోలా’ అయింది. అశ్వినీ కుమారుల వీర్యంవలన బ్రాహ్మణ కన్యయందు ‘వైద్యుడు’ పుట్టినాడని (10-123) తెలియజేయబడింది. ఈ ప్రసిద్ధి బెంగాల్ లో ఉన్నది. అందుచేతనే బెంగాల్ లో బ్రాహ్మణులలో ‘వైద్యుల’ను తక్కువ చూపు చూస్తారట. ఇందులో నేటికీ బెంగాల్ ప్రాంతంలో ప్రచారంలో వున్న ఆరాధనాపద్ధతులు, వివిధ దేవతా పూజా విధానాలు చెప్పబడినాయి. రాధా వల్లభ సంప్రదాయానికి బెంగాల్ ఆవాసము. అందుచేత వీనినన్నింటినీ పరిశీలిస్తే ప్రస్తుతం లభ్యం అవుతున్న బ్రహ్మవైవర్త పురాణం బెంగాల్ ప్రాంతంలో రచింపబడిందని, ఇది ప్రాచీన బ్రహ్మవైవర్త పురాణం కంటే వేరైనదని పండితులు, పురాణ విమర్శకులు భావిస్తున్నారు.
బ్రహ్మవైవర్త పురాణం 1. పూర్వ భాగ 2. ఉత్తర భాగాలనే రెండు భాగాలుగా చేయబడింది. ఇందులో మొదటిదైన బ్రహ్మ ఖండంలో 30, రెండవదైన ప్రకృతి ఖండంలో 57 మూడవదైన గణేశ ఖండంలో 46, నాల్గవదైన శ్రీకృష్ణ జన్మఖండం పూర్వ ఉత్తర భాగాలు కలిపి 133 అధ్యాయాలతో వెరసి 266 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో కూడా 18 వేల శ్లోకాలు ఉన్నాయి.
11. లింగపురాణం:
శివలింగచరిత్రం గురించి వివరించటం జరిగింది. (లింగస్య చరిత్రోక్తత్వాత్ పురాణం లింగముచ్యతే) కాబట్టి దీని పేరు లింగపురాణం అయిందని శివపురాణం పేర్కొంటున్నది. వివిధ పురాణాలలో లింగోద్భవం గురించి చెప్పిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈశానుకల్ప వృత్తాంత ప్రసంగం బ్రహ్మచేత చెప్పబడిందని ఈ పురాణంలో ఉన్నదని స్వయంగా లింగపురాణమే తెల్పుతున్నది. కానీ మత్స్య, నారద పురాణాలను అనుసరించి అగ్నికల్పంలోని కథావృత్తాంతం లింగ పురాణంలో చోటుచేసుకోవాలి. ఈశానుకల్ప వృత్తాంతాలు అగ్నిపురాణంలో ఉన్నాయి. ఇందులో శివకేశవుల వృత్తాంతాలు వర్ణింపబడినా, ఎక్కడా అన్యదేవతా నింద కనిపించదు.
లింగపురాణంలో శివలింగపూజా వర్ణన హృదయంగమంగా చెప్పబడింది. శివుని ద్వారా సృష్టి ఆవిర్భావం చెందిందని, శివుని 28 అవతారాల వృత్తాంతము, శివసంబంధమైన అనేక వ్రతాలు, తీర్థాలకు సంబంధించిన విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇందులో శైవ దర్శనాలకు అనుకూలమైన పశు, పాశ అలాగే పశుపతి శబ్దాల వివేచనాత్మక వ్యాఖ్య కనిపిస్తుంది. లింగోపాసన యొక్క ఆవిర్భావము చాలా చక్కగా విశకరించబడింది. శివతత్త్వమీమాంస అధ్యేతలకు చాలా ఉపయోగకరమైనది ఈ పురాణం.
స్కాందపురాణంలోని రేవాఖండం, భాగవతం, మత్స్య నారదపురాణాలు, బ్రహ్మ వైవర్త పురాణానుసారం ఇది పురాణాలలో 11వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీనిలో పదకొండు వేల శ్లోకాలున్నాయి. హలాయుధుడు తన ఒక గ్రంథంలో బ్రహలింగపురాణాన్ని ఒకదాని నుంచి ఒకవచనాన్ని ఉద్ధరించాడు. కానీ అలాంటి పురాణమేదీ లభించలేదు. ఇదికాకుండా వసిష్ఠ లింగపురాణం ఒకటి లభిస్తున్నది. ఈ పురాణంలో శివుడిని లింగరూపంలో ఆరాధించే విధానాలు చెప్పబడ్డాయి. ఇందులో శైవదర్శనానికి ముఖ్యంగా పాశుపత సిద్ధాంతానికి సంబంధించిన అనేక విషయాలు ప్రతిపాదించబడ్డాయి. అష్టమూర్తియైన శివునికి ఎనిమిది మూర్తులకూ ఎనిమిది వైదిక నామధేయాలు చెప్పబడ్డాయి. అవి: పృధ్వీమూర్తి-శర్వుడు; జలమూర్తి = భవుడు; అగ్నిమూర్తి = పశుపతి; వాయుమూర్తి = ఈశానుడు; ఆకాశమూర్తి = భీముడు; సూర్యమూర్తి = రుద్రుడు; సోమమూర్తి = మహాదేవుడు; యజమానమూర్తి = ఉగ్రుడు అనేవి. ప్రత్యేకమూర్తికి భార్యా, ఒక పుత్రుడు చెప్పబడ్డారు.
బౌద్ధధర్మ ప్రాబల్యం తగ్గి, బ్రాహ్మణధర్మం అభివృద్ధి పొందుతున్న సమయంలో ఈ పురాణం కొంత సంస్కారం జరిగినట్లు భావించటానికి అవకాశం ఉన్నది. అప్పుడు అగ్ని పురాణంలో చెప్పినట్లు ఈశాన కల్పవృత్తాంతం ఇందులో చేరి ఉంటుందని భావించటానికి అవకాశం ఉన్నది. ఈ లింగపురాణంలో అగ్నికల్ప వృత్తాంతం అని స్పష్టంగా లేకపోయినప్పటికీ, ఇందులో ప్రతిపాదించిన విషయాలతోపాటు అగ్నిమయ లింగ వివరణ కూడా ఉన్నందువలన అలా భావించవలసివస్తున్నది.
సంప్రదాయజ్ఞుల చేతివాటంతో ఇందులో కొన్ని ప్రక్షిప్తాలుగా చేరిన శ్లోకాలను తీసివేసినట్లైతే లింగపురాణ ప్రాచీన రూపం కంటికి కట్టకలదు. ఇందులో ఉండే వివిధ వృత్తాంతాలను విడివిడిగా మార్చి అరుణాచల మాహాత్మ్యం, పంచాక్షర మాహాత్మ్యం, రుద్రాక్ష మాహాత్మ్యం, రామసహస్రనామం వంటి విడి పుస్తకాలుగా కూర్చడం జరిగింది. అనేక బాహ్య ఆంతరంగిక ప్రమాణాలను బట్టి ఈ పురాణం అష్టమ నవమ శతాబ్దాలకు సంబంధించి ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. దాన సాగరం అనే ఇంకొక స్మృతి గ్రంథాన్నిబట్టి ఆరువేల శ్లోకాలుగల ఇంకొక లింగ పురాణం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే వసిష్ఠలింగ పురాణమేమో.
లింగ పురాణం 1. పూర్వభాగం 2. ఉత్తరభాగమనే రెండు విభాగాలుగా చేయ బడింది. అందులో పూర్వభాగంలో 108 అధ్యాయాలు, ఉత్తర భాగంలో 55 అధ్యాయాలు మొత్తం 163 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలోని మొత్తం శ్లోకాల సంఖ్య 11 వేలు.
12. వరాహ పురాణం:
విష్ణువు వరాహావతారాన్ని ధరించి భూదేవిని పాతాళలోకం నుంచి ఉద్ధరించిన వృత్తాంతం గల కథ ప్రధానంగా కలది కాబట్టి ఈ పురాణానికి వరాహ పురాణమనే పేరువచ్చింది. మత్స్య పురాణంలో చెప్పబడిన దానిని అనుసరించి ఈ పురాణంలో మానవ కల్పంలోని వృత్తాంతాన్ని పృథ్విసమక్షంలో విష్ణువుద్వారా మహావరాహమూర్తి యొక్క మాహాత్మ్యం వర్ణించబడింది, కాబట్టి ఇది వరాహపురాణం అయింది. దీనిలోని శ్లోకసంఖ్య 24,000. అధ్యాయాల సంఖ్య 218. ఉపలబ్దం అవుతున్న వరాహ పురాణాన్ని అనుసరించి నారదపురాణంలో చెప్పబడినట్లు మానవకల్ప వృత్తాంతం కానీ, మహా వరాహమాహాత్మ్య ప్రతిపాదనము ఏమీ ఇందులో కనిపించటం లేదు. ఇది గౌడదేశ పాఠము, దాక్షిణాత్య పాఠము అని రెండు విభిన్న రూపాలలో లభ్యం అవుతున్నది. రెండింటికి అధ్యాయాల సంఖ్య, శ్లోక సంఖ్యలలో కూడా మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం లభ్యం అవుతున్న వరాహ పురాణంలో పదకొండువేల శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గౌడదేశ పాఠమే ప్రచారంలో ఉన్నది. కానీ కలకత్తాలో అచ్చయిన ప్రతిలో కేవలం పదివేల ఏడువందల శ్లోకాలే ఉన్నాయి. అంటే ఇందులో చాలా భాగం ఇప్పటివరకు లభించలేదన్నమాట.
ఈ పురాణంలో విష్ణువుకు సంబంధించిన అనేక వ్రతాలు వివరించబడ్డాయి. ప్రస్తుతం లభ్యం అవుతున్న వరాహ పురాణం భవిష్యోత్తరపురాణం లాగా, అనేక పురాణాలనుంచి తీసుకొన్న విషయ సమాహారమేమో అనిపిస్తుంది. విష్ణు సంబంధమైన ద్వాదశీవ్రతమాహాత్మ్యం ఇందులో విస్తృతంగా చెప్పబడింది. పదకొండు నెలలలో ఉన్న పదకొండు ద్వాదశులకు పదకొండు విష్ణురూపాలతో సంబంధం ఉన్నట్లుగా చెప్పబడింది. ఇలా మార్గశిర శుక్ల ద్వాదశి-మత్స్యద్వాదశ, పుష్యద్వాదశి-కూర్మద్వాదశి, మాఘ ద్వాదశి, వరాహ ద్వాదశి, ఫాల్గుణ ద్వాదశి-నరసింహద్వాదశి, చైత్ర ద్వాదశి-వామన ద్వాదశి, వైశాఖ ద్వాదశి-పరశు రామద్వాదశి, జ్యేష్ఠ ద్వాదశి- రామద్వాదశి, ఆషాఢ ద్వాదశి-కృష్ణద్వాదశి- శ్రావణ ద్వాదశి-బుద్ధ ద్వాదశి, భాద్రపద ద్వాదశి-కల్కి ద్వాదశి, ఆశ్వయుజ ద్వాదశి-పద్మనాభ ద్వాదశి.
ఇందులో చెప్పబడిన బుద్ధద్వాదశిని పరిశీలిస్తే హిందూ సమాజం బుద్ధుని ఒక అవతారంగా స్వీకరించిన తరువాతనే ఈ పురాణరచన జరిగి ఉండవచ్చని భావించే అవకాశం ఉన్నది. ఆస్తికులు కొందరు వ్యాసమహాముని క్రాంతదర్శి కాబట్టి తనతర్వాత రాబోయే కాలంలో పుట్టబోయే బుద్ధుడిని పేర్కొని ఉంటాడని భావిస్తారు. ఇందులోని ఉత్తర భాగంలో పులస్త్య-కురురాజ సంవాదంలో చాలా విస్తరించి వివిధ వ్రతాలు, తీర్థాలు వాని మాహాత్మ్యాలు అనేక ధర్మ ప్రసంగ కథలు చెప్ప బడ్డాయి. వీటిలో ఎక్కువ భాగం విష్ణువ్రతాలే. అయితే వీటిలో రెండు విషయాలకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఒకటి మధురా మాహాత్మ్యం. మధురకు సంబంధించిన అనేక తీర్థాల విస్తృత ప్రసంగం ఇందులో ఉన్నది. రెండవది నచికేతోపాఖ్యానము. ఇందులో యమ నచికేతుల కథలో ప్రసంగవశాత్తు స్వర్గనరకలోకాల విస్తృతవర్ణన ఉన్నది. కఠోపనిషత్తులో చెప్పిన కథతో ఈ కథ ఏకీభవిస్తున్నా, అందులో చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు ఇందులో ఏమీ లేవు. నారద పురాణంలో చెప్పిన శ్లోక సంఖ్య ఇప్పుడు లభ్యం కావటం లేదు. శ్లోకాల్లో చాలా తక్కువే ఉన్నాయి. ఇది వరాహపురాణ పూర్వార్థం మాత్రమే అని భావించే అవకాశం ఉన్నది. నారదపురాణంలో పూర్వార్థ ఉత్తరార్థాలనే రెండు ఖండాలు చెప్పబడ్డాయి. దీనిలోని చాలా భాగాలు వేరేపురాణాలుగా లభ్యం అవుతూ అయినా ఉండాలి లేకపోతే పూర్తిగా దొరకకుండా పోయి అయినా ఉండాలి. ఇంతకు మించి ఇప్పుడు నిర్ణయించి చెప్పే అవకాశం లేదు. లభ్యం అవుతున్న గౌడీయ, దాక్షిణాత్య పాఠాలు ఒక విషయంపైన ఉన్నవానిలో కూడా శ్లోకాలలో తేడా ఉండి వేరు వేరు గ్రంథాలుగాను, భిన్నకర్తృకాలుగానున్నట్లు తెలుస్తున్నది. జర్మనీలోని బెర్లిన్ గ్రంథాలయంలో ఉన్న రెండు ప్రతులను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టం అవుతాయి. పదమూడవ శతాబ్దానికి చెందిన చతుర్వర్గ చింతామణి రచయిత హేమాద్రి వరాహ పురాణంలోని బుద్ధద్వాదశిని పేర్కొనడం, 12వ శతాబ్దికి చెందిన గౌడచక్రవర్తి బల్లాలసేనుడు వ్రాసిన దాన సాగరంలో దీని నుంచి అనేక శ్లోకాలను ఉద్ధరించటంచేత ఇది 10వ శతాబ్దానికి ముందు కాలానికి చెందినదిగా భావించవచ్చు.
ఇందులో చాతుర్మాస్య మాహాత్మ్యం, గీతామాహాత్మ్యం, వేంకటశైలమాహాత్మ్యం, విష్ణు మాహాత్మ్యం, అంబికా మాహాత్మ్యం మొదలైనవానిని అనేక విడి పుస్తకాలుగా చేయవచ్చు. రామానుజీయ వైష్ణవ మతానికి చెందిన అనేక విషయాలు ఇందులో చేర్చబడ్డాయి. నారాయణుడే ఆది దేవుడని స్థాపించటం, జ్ఞానవర్గ సముచ్చయం, శ్రాద్ధవర్జ్య పదార్థాలు, ద్వాదశి నాటి విష్ణు పూజా విధానం, వివిధ లోహాలతో భగవత్ ప్రతిమా నిర్మాణం, వాటి ప్రతిష్ఠ, పాంచరాత్రాగమ ప్రామాణ్యం మొదలైనవెన్నో రామానుజ సంప్రదాయం వారిచే యథాతథంగా గ్రహించబడ్డాయి. వరాహ పురాణంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పూర్వ భాగం రెండు ఉత్తర భాగం మొత్తం రెండు భాగాలలోను 218 అధ్యాయాలు 24 వేల శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు సంపూర్తిగా ఈ పురాణాం లభ్యం కావడం లేదు.
13. స్కాందపురాణం:
ఈ పురాణంలో, స్కందుడు అంటే కుమారస్వామి శైవతత్త్వాలను నిరూపణం చేశాడు కాబట్టి దీనికి స్కాందపురాణమనే పేరు వచ్చింది. పురాణాలు అన్నింటిలోకి అతిపెద్దదైన పురాణం ఇది. దీనిలో శ్లోక సంఖ్య 81,000లు. అంటే ఇది భాగవతం కంటే అయిదు రెట్లు పెద్దది. లక్ష శ్లోకాలున్న మహాభారతం కంటే అయిదవ వంతు చిన్నదన్నమాట. ఈ పురాణంలో సంహితలు, వాటిలో ఖండాలు, వాటిలో మాహాత్మ్యాలు ఇలా అంతర విభాగాలున్నాయి. ఈ పురాణంలో ఒకటైన సూత సంహిత (అధ్యాయం 20-12) ప్రకారం దీనిలో ఆరు సంహితాలు ఉన్నాయి. అవి.
1) సనత్కుమార సంహిత- 36,000 శ్లోకాలు
2) సూతసంహిత- 6,000 శ్లోకాలు
3) శంకర సంహిత- 30,000 శ్లోకాలు
4) వైష్ణవ సంహిత- 5,000 శ్లోకాలు
5) బ్రాహ్మసంహిత- 3,000 శ్లోకాలు
6) సౌరసంహిత - 1,000 శ్లోకాలు
మొత్తం- 81,000 శ్లోకాలు
ఈ సంహితలలో చెప్పబడిన విషయాలను గురించి నారదపురాణం విస్తృతంగా తెలుపుతున్నది. స్కాందపురాణానికి మరొకరకంగా కూడా ఖండరూపంలో విభజన ఉన్నది.
1) మాహేశ్వర ఖండం- 174 అధ్యాయాలు
2) వైష్ణవ ఖండం- 153 అధ్యాయాలు
3) బ్రహ్మ ఖండం- 87 అధ్యాయాలు
4) కాశీఖండం- 100 అధ్యాయాలు
5) అవంతీ ఖండం- 367 అధ్యాయాలు
6) నాగరఖండం- 178 అధ్యాయాలు
7) ప్రభాసఖండం- 414 అధ్యాయాలు
మొత్తం 1471 అధ్యాయాలు
ఈ విధానం ప్రకారం 81,000 శ్లోకాలు ఉన్నాయి. అందువలన ఒక్కొక్క ఖండం దాదాపు పన్నెండువేల శ్లోకాల పరిమాణంతో ఉంటుందని భావించవచ్చు. అలాగే స్కాందపురాణంలోని శంకర సంహితలోగల హాలాస్య మాహాత్మ్యం, దీనిలో ఆరు సంహితలు 50 ఖండాలు ఉన్నాయని తెలుపుతున్నది. సంహితలలో సూత సంహిత శివోపాసన విషయంలో అద్వితీయమైనది. ఈ సంహితలో వైదిక, తాంత్రిక విధానాలు రెండింటిలోను శివారాధనను విస్తృతంగా వర్ణించింది. ఈ సంహితలోని ఈ విలక్షణత వలననే విజయనగర సామ్రాజ్యంలో మంత్రి సాయణుని సోదరుడు మాధవుడు దీనిచే ఆకర్షితుడై తాత్పర్యదీపిక అనే అతి ప్రామాణికము విస్తృతమైన వ్యాఖ్యానాన్ని రచించాడు. ఈ సూత సంహితలో ఆరు ఖండాలు ఉన్నాయి 1) మొదటిది శివమాహాత్మ్య ఖండం. ఇందులో 13 అధ్యాయాలలో శివమాహాత్మ్యం విశేషంగా ప్రతిపాదించడం జరిగింది. 2) రెండవది జ్ఞానయోగ ఖండం-దీనిలో 20 అధ్యాయాలున్నాయి. ఇందులో ఆచార ధర్మాలు వర్ణించిన తరువాత హఠయోగ ప్రక్రియ సాంగోపాంగంగా వివేచించబడింది. 3) మూడవది ముక్తి ఖండం. దీనిలో 9 అధ్యాయాలున్నాయి. ముక్తి సాధన మార్గాలు వివరించబడ్డాయి. 4) నాల్గవది యజ్ఞ వైభవ ఖండం. ఇది అన్ని ఖండాలలోనికి పెద్దది. ఇది తిరిగి రెండు భాగాలు చేయబడింది. 1) పూర్వభాగం, 2) ఉత్తర భాగం. పూర్వ భాగంలో 47 అధ్యాయాలున్నాయి. వీనిలో అద్వైత వేదాంతం శైవభక్తితో జోడించి చాలా ప్రావీణ్యంతో ఆధ్యాత్మికతత్త్వ వివేచన చేయబడింది. దార్శనిక దృష్టితో చూస్తే ఈ ఖండం చాలా విలువగలది. తత్త్వవివేచన లోతుగా చేయటానికి అవ కాశం కల్పించేదిగా ఉంటుంది. దీని ఉత్తరభాగంలో రెండు గీతలు చేరి ఉన్నాయి. 1) బ్రహ్మ గీత, 2) ఇంకొకటి సూతగీత. బ్రహ్మగీతలో 12 అధ్యాయాలున్నాయి. రెండవదైన సూత గీతలో ఎనిమిది అధ్యాయాలున్నాయి. ఇవి కూడా ఆధ్యాత్మిక విషయశోభితాలు. ఆత్మ స్వరూప వివేచనము, దాని సాక్షాత్కార ఉపాయాలు చాలా చక్కగా ఇందులో ప్రతిపాదించబడ్డాయి. ఇందులో శివప్రసాదం వలననే సర్వకర్మ సమకూర గలవని ప్రతిపాదించబడింది.
శంకర సంహిత: ఇది కూడా అనేక ఖండాలుగా విభజించబడింది. ఇందులోని మొదటి ఖండమే శివరహస్య ఖండము. మొత్తం శంకర సంహితలో ఈ ఖండమే సగం వరకు ఉన్నది. ఈ శంకర ఖండంలో 13,000 శ్లోకాలు ఉన్నాయి. 7 కాండాలుగా విభజించ బడింది. ఆ ఏడుకాండలు: 1) సంభవకాండ, 2) ఆసురకాండ, 3) మాహేంద్రకాండ, 4) యుద్ధకాండ, 5) దేవకాండ, 6) దక్షకాండ, 7) ఉపదేశకాండ.
ఆరవ సంహిత సౌర సంహిత: ఇందులో శివ పూజా సంబంధమైన అనేక విషయాలు విపులంగా వర్ణించబడ్డాయి. మొదటిదైన సనత్కుమార సంహిత, ఇది షుమారు 20, 22 అధ్యాయాలుగల చిన్నసంహిత, ఇవి తప్ప మిగిలిన సంహితలు నేడు లభ్యంకావటం లేదు.
ఖండాత్మకమైన స్కాందపురాణం వివరాలు పరిశీలించగా.
1. మాహేశ్వరఖండం: ఈ ఖండంలో తిరిగి రెండు చిన్నఖండాలు ఉన్నాయి. 1) కేదార ఖండము, 2) కుమారికా ఖండం. ఈ రెండు ఖండాలలోను శివపార్వతుల అనేక విధాలైన చిత్రవిచిత్ర లీలలు సుందరంగా వర్ణించబడ్డాయి.
2. వైష్ణవ ఖండం: ఈ ఖండంలో భాగంగా ఉత్కళ ఖండం ఉన్నది. ఉత్కళ ఖండంలో ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోగల పూరీలోని జగన్నాథ మందిర విశేషాలు, పూజా విధానము, ప్రతిష్ఠ ఇంకా దానికి సంబంధించిన అనేక ఉపాఖ్యానాల వర్ణన ఉన్నది. ఇంద్రద్యుమ్న మహారాజు నారదుని ఉపదేశంతో జగన్నాథుడు ఉన్న స్థానాన్ని కనుక్కొన్న విశేషాలు, మొదలైన విషయాలు విస్తృతంగా ఈ ఖండంలో చెప్పబడ్డాయి. ఈ విధంగా పూరీ జగన్నాథ క్షేత్ర ప్రాచీన చరిత్ర తెలుసుకొనటానికి ఈ ఖండం అత్యంత ఉపయోగకారి.
3. బ్రహ్మ ఖండం: ఇందులో రెండు ఖండాలున్నాయి. 1) బ్రహ్మారణ్య ఖండము, 2) బ్రహ్మోత్తర ఖండం. బ్రహ్మరణ్య ఖండంలో ధర్మారణ్యం అనే ప్రదేశం యొక్క మాహాత్యం విశదంగా తెలుపబడింది. అదే ఖండంలో ఉజ్జయినీ మహాకాళేశ్వరుని పూజా ప్రతిష్ఠానాదులు తెలుపబడ్డాయి. రెండవదైన బ్రహ్మోత్తర ఖండం 22 అధ్యాయాలుగా విభజించ బడింది. ఇందులో శివభక్తి, శివమాహాత్మ్యం, శివవ్రతం, రుద్రాక్ష, విభూతి మాహాత్మ్యం మొదలైన శివారాధనకు సంబంధించిన అనేక విషయాలున్నాయి. ఈ బ్రహ్మోత్తర ఖండం ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. 17వ శతాబ్దంలో బ్రహ్మోత్తర ఖండం కూడా అష్టాదశ పురాణాలలో ఒకటిగా ప్రజలు భావించేవారని అయ్యలరాజు నారాయణా మాత్యుని హంసవింశతి ద్వారా తెలుస్తున్నది. దీనికి తెలుగులో అయిదు ప్రబంధశైలి అనువాదాలు, రెండు ద్విపద అనువాదాలు, మూడు వచన అనువాదాలు, ఒక్కొక్క మాహాత్మ్యం ఒక్కొక్క కావ్యంగా వచ్చాయంటే దీని ప్రభావం తెలుగునాట ఎంత ఉన్నదో గ్రహించవచ్చు.
4. కాశీఖండం: ఇందులో కాశీ క్షేత్ర మహిమ వర్ణించబడింది. కాశీలోని సమస్తదేవతలు, శివలింగాల ఆవిర్భావము, మాహాత్మ్యము విశేషంగా ఇందులో ప్రతిపాదింపబడ్డాయి. కాశీ యొక్క ప్రాచీన భూగోళ వివరాలు తెలుసుకోటానికి ఇది బహుళోపయోగకారి.
5. రేవా ఖండం: రేవానది అంటే నర్మదానది అని అర్థం. నర్మదానది ఉత్పత్తి దాని తీరంపైగల తీర్థ క్షేత్రాల విస్తృతవర్ణన ఇందులో ఉన్నది. సత్యనారాయణవ్రతం చేసుకొనే టప్పుడు చెప్పే కథ ఈ రేవాఖండంలోనే ఉన్నది.
6. అవంతీ ఖండం: అవంతీ నగరమే ఉజ్జయినీ నగరం. అక్కడ గల భిన్న భిన్న శివ లింగాల ఉత్పత్తి మాహాత్మ్యము ఈ ఖండంలో వివరించబడింది. ప్రాచీన అవంతీ దేశ ధార్మిక స్థితి యొక్క పూర్తి దిగ్దర్శనం ఈ ఖండంలో కనిపిస్తుంది.
7. తాపీ ఖండం: ఇందులో నర్మదకు ఉపనది అయిన తాపీనది ఒడ్డునగల నానా తీర్థక్షేత్ర వర్ణన ఉన్నది. నారద పురాణానుసారం దీని ఆరవ ఖండం పేరు నాగర ఖండం. ప్రస్తుతం లభిస్తున్న నాగర ఖండంలో మూడు భాగాలున్నాయి. 1. విశ్వకర్మ ఉపాఖ్యానం 2. విశ్వకర్మ వంశాఖ్యానం 3. హాటకేశ్వర మాహాత్మ్యం అనేవి అవి. ఈ మూడవ ఖండంలో నాగర బ్రాహ్మణుల ఉత్పత్తి చెప్పబడింది. భారతదేశీయ సామాజిక స్థితిని తెలుసుకొనటానికి ఈ ఖండం చాలా ముఖ్యమైనది.
8. ప్రభాసఖండం: ఇందులో ప్రభాస క్షేత్రవర్ణన చేయబడింది. ద్వారకానగర పరిసర ప్రాంతాలను గురించి తెలుసుకొనటానికి ఇది ఉపయోగపడుతుంది.
స్కాంద పురాణం ముఖ్యంగా శైవపురాణం. ఇందులో దేశంలోని అనేక మూలలలోగల తీర్థక్షేత్ర మాహాత్మ్యాల వర్ణన ఉన్నది. అలాగే ప్రాచీన భారతదేశ భౌగోళిక స్థితిని తెలుసుకొనటానికి ఇది ఉత్తమ ఆధార గ్రంథం. అందువలన వాటిని గురించిన అనేక అద్భుత గాథలు ఉపాఖ్యానాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఇందులో అనేక కథలు అనేక పర్యాయాలు అనేక స్థలాలలో భిన్న భిన్న రూపాలలో మరల మరల వస్తుంటాయి. ఇది అతి ప్రాచీనకాలంనాటి పురాణం అనే దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే క్రీ.శ. 1000 నాటి వ్రాతప్రతి కలకత్తాలో లభ్యం అయింది. అదే ఆశ్చర్యం అనుకొంటే అంతకంటే వింతగా స్కాందపురాణం వ్రాతప్రతి నేపాలు రాజప్రాసాద గ్రంథాలయంలో క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన ప్రతి ఉన్నదని పండితులు తెలుపుతున్నారు. దీని మూలరూపం ఏమిటి? అది ఎలా ఇంత బృహద్రూపాన్ని సంతరించుకొన్నది అనే విషయం భవిష్యత్తులో పురాణ పండితులు తేల్చాలి.
స్కాంద పురాణం ఏడు ఖండాలుగా విభజించబడింది. 1. మహేశ్వర ఖండం, 2. వైష్ణవ ఖండం 3. బ్రహ్మ ఖండం, 4. కాశీఖండం, 5. అవంతీ ఖండం 6. నాగర ఖండం 7. ప్రభాస ఖండము. ఒక్కొక్క ఖండం ఇంకా అనేక అవాంతర ఖండాలుగా కూడా విభజింపబడింది. ఇందులోని మాహేశ్వర ఖండంలో 174 అధ్యాయాలు వైష్ణవ ఖండంలో 156 బ్రహ్మ ఖండంలో 87 కాశీఖండంలో 100 అధ్యాయాలు అవంతీ ఖండంలో 387 నాగర ఖండంలో 279 అధ్యాయాలు ప్రభాస ఖండంలో 421 అధ్యాయాలు వెరసి 1671 అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణం ప్రకారం 81,000 శ్లోకాలు ఉండాలి. మత్స్య పురాణానుసారం 81,102 శ్లోకాలు ఉండాలి. స్కాందపురాణం ప్రస్తుతం సంహితాత్మకంగాను, ఖండాత్మకంగాను కూడా రెండు భిన్నభిన్న రచనలు లభ్యం అవుతున్నాయి.
14. వామన పురాణం:
మత్స్యపురాణంలో చెప్పిన ప్రకారం, బ్రహ్మ వామన అవతారాన్ని, మాహాత్మ్యాన్ని ఆధారంగా చేసుకొని, త్రివర్గాలకు సంబంధించిన విషయాలను వివరించిన పురాణం కాబట్టి దీనికి వామన పురాణం అని పేరు వచ్చింది. దీనిలోని శ్లోక సంఖ్య పదివేలు. ఇందులో 95 అధ్యాయాలున్నాయి. ఇది 1) పూర్వ, 2) ఉత్తర భాగాలుగా విభజించబడి ఉన్నది. ఉత్తర భాగానికే ఇంకొక పేరు బృహద్వామన పురాణం. ఇందులో నాలుగు సంహితలున్నాయి. 1) మాహేశ్వరీ సంహిత, 2) భాగవతీ సంహిత, 3) సౌర సంహిత, 4) గణేశ్వరీ సంహిత. ప్రతి సంహితలోను దాదాపు వేయి వేయి శ్లోకాలున్నాయి. మాహేశ్వరీ సంహితలో శ్రీకృష్ణ చరిత్రము ఆయన భక్తుల వృత్తాంతాలు ఉన్నాయి. భాగవతీ సంహితలో జగదాంబ పార్వతి యొక్క అవతార కథ ఉన్నది. సౌర సంహితలో సర్వసాక్షి సూర్య భగవానుని మాహాత్మ్యం వర్ణించబడింది. గణేశ్వరీ సంహితలో గణపతి యొక్క మాహాత్మ్యం వివరించి ఉన్నది. పులస్త్యుడు మొదటిసారిగా దీనిని నారద మహామునికి వివరించగా నారదుడు వ్యాసునికి చెప్పినట్లు, ఆయన రోమహర్షణ సూతునికి తెలుపగా ఆయన నైమిశారణ్యంలో ఋషులకు ఈ పురాణాన్ని వివరించినట్లు వక్తృశ్రోతృపరంపర తెలుపుతున్నది. వామన పురాణంలోని భిన్న విభిన్న కథలతోపాటు వామనావతార కథ విస్తృతంగా వర్ణించబడింది. ఇందులో శివ, శివమాహాత్మ్య, శివతీర్థ, శివశివా వివాహ, గణేశోత్పత్తి, కార్తికేయ జననం మొదలైన వృత్తాంతాలు కావ్యకళా దృష్టితో వర్ణించబడ్డాయి. అంతేగాకుండా అనేక తీర్థాలు, వనాలు, వాని మాహాత్మ్యం, సృష్టివర్ణన, ధర్మ నిరూపణం మొదలైనవి కూడా సుందరంగా వర్ణించబడ్డాయి.
ఇప్పుడు వామన పురాణ ఉత్తర ఖండం లభ్యం కావటం లేదు. కేవలం పూర్వ భాగం మాత్రమే లభిస్తున్నది. ఇందులో మొత్తం 95 అధ్యాయాలున్నాయి. అందువల్లనే దీనిని అసంపూర్ణ పురాణం అనవచ్చు. ప్రస్తుతం షుమారు ఆరు వేల శ్లోకాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది మొదట్లో వైష్ణవ పురాణమే అయినా కాలక్రమంలో శైవ ప్రభావం చేత దీనిలో శివచరిత్ర కూడా ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. ఇది కురుక్షేత్రంలో వ్రాయబడి ఉంటుంది. ఈ పురాణంలో కాళిదాసు రచనలతో అనేకమైన సామ్యాలు ఉన్నాయి. ఇందులో శైవవైష్ణవ చరిత్రల అందమైన కలయిక కనబడుతుంది. ఈ పురాణం బహుశః క్రీ.శ. ఏడవ-పదవ శతాబ్దం మధ్యన రచింపబడి ఉంటుందని ఒక ఊహ. దీనిలో నుంచి అనేక ప్రత్యేక గ్రంథాలను వెలువరించవచ్చు. వాటిలో నరకచతుర్థీ కథ, గంగా మాహాత్మ్యం, గంగా మానసిక స్నానం, వారాహ మాహాత్మ్యం, వెంకటగిరి మాహాత్మ్యం మొదలైనవి కొన్ని మాత్రమే. దీని నాలుగు సంహితలలో మొత్తం 95 అధ్యాయాలుండగా ఇందులో మొత్తం పదివేల శ్లోకాలు ఉన్నాయి. ఇందులో రెండవదైన ఉత్తరభాగం ప్రస్తుతం లభ్యంకావటం లేదు.
15. కూర్మపురాణం:
కూర్మరూపుడైన జనార్దనుడు పాతాళలోకంలో ధర్మ, అర్థ, కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ సాధన గురించి విష్ణు భక్తుడైన ఇంద్రద్యుమ్నునికి, ఇంద్రుడు మహర్షుల సమక్షంలో తెలుపుతూ చేసిన వివరణ అని ఈ పురాణం ద్వారా తెలుస్తున్నది. ఇందులో లక్ష్మీకల్పంలోని వృత్తాంతం కలదని తెలుపబడింది. దీనిలోని శ్లోకాల సంఖ్య 17 వేలు. కూర్మపురాణం రెండు భాగాలుగా ఉన్నది. పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగంలో 53, ఉత్తర భాగంలో 46 మొత్తం 99 అధ్యాయాలున్న పురాణం ఇది. కూర్మపురాణం నాలుగు సంహితలుగా విభజించబడింది. 1) బ్రాహ్మీసంహిత, 2) భాగవతీసంహిత, 3) సౌరీసంహిత, 4) వైష్ణవీ సంహిత. ఈ బ్రాహ్మీ సంహిత తిరిగి పూర్వార్థం, ఉత్తరార్థాలుగా విభజించబడింది. ఇందులో పూర్వార్థంలో 53, ఉత్తరార్థంలో 46 వెరసి 99 అధ్యాయాలున్నాయి. ఈ బ్రాహ్మీ సంహితలో మొత్తం ఆరువేల శ్లోకాలు ఉన్నాయి. నారద పురాణాను సారం నాలుగు సంహితలలోను కలిపి 17 వేల శ్లోకాలు, మత్స్యపురాణానుసారం 18 వేల శ్లోకాలు ఉన్నట్లు తెలుస్తున్నది. తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం లభ్యం అవుతున్న కూర్మపురాణంలో కేవలం ఆరువేల శ్లోకాలే ఉన్నాయి. అంటే దాదాపుగా మూడింట రెండువంతులు లభ్యం కాకుండా పోయిందన్నమాట. ఇందులో పురాణమంతటా శివుని ప్రాధాన్యమే చెప్పబడింది. అలాగే అనేక సందర్భాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు భేదం లేదని ప్రకటించబడింది. ఈ ముగ్గురు పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలని చెప్ప బడింది. ఇందులో శక్తి పూజకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. శక్తి యొక్క సహస్ర నామ స్తోత్రం (1-12) దీనిలో ఉన్నది. విష్ణు శివులు లక్ష్మీ గౌరిల ప్రతిరూపాలని చెప్పబడింది. శివ పారమ్యం ఎంత ఎక్కువగా ప్రతిపాదించబడిందంటే విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు శివుని ప్రసాదం చేతనే జాంబవతి యందు సాంబుడనే పుత్రుడిని పొందగలిగాడని విపులంగా తెలుపుతున్నది.
ఇందులోని పూర్వభాగంలోని సృష్టి ప్రకరణం తరువాత, పార్వతి తపస్సు, ఆమె సహస్రనామాలు వర్ణించబడ్డాయి. ఇక్కడే కాశీ ప్రయాగ క్షేత్రమాహాత్మ్యం తెలుపబడింది. ఉత్తర భాగంలో ఈశ్వర గీత, వ్యాసగీత అనే రెండు గీతలు ఉన్నాయి. ఈశ్వరగీతలో భగవద్గీతలో తెలిపిన విధానంలోనే ధ్యానయోగం ద్వారా శివసాక్షాత్కారం లభిస్తుందని చెప్పబడింది. వ్యాసగీతలో నాటి ఆశ్రమాల కర్తవ్యము, ఆచరింపవలసిన కర్మలు, వ్యాస మహర్షి ద్వారా బోధింపబడ్డాయి. ప్రస్తుతం ఇందులోని నాలుగు సంహితాలలోను కేవలం బ్రాహ్మీ సంహిత మాత్రమే లభిస్తున్నది. మిగిలిన సంహితలు అలభ్యాలు.
దీనిలో తాంత్రిక గ్రంథాలలోని చాలా విషయాలు కలిసిపోయినట్లుగా తెలుస్తున్నది. నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో చెప్పబడిన విషయాలు దామర, యామలాద తంత్ర గ్రంథాలలో ఉన్న విషయాలే. ఇందులో చాలా స్తోత్రాలు, మాహాత్మ్యాలు ప్రత్యేకంగా పరిగణన పొందుతున్నాయి. మహేశ్వరునికి శాంతి విద్యపై నాలుగు విధాలైన శక్తులున్నాయని, అందుచేతనే పరమేశ్వరుడు చతుర్వ్యూహుడనీ ఇందులో చెప్పబడింది. ఇది పాంచరాత్రాగమాల నుంచి గ్రహించిన పద్ధతి. వాస్తవంలో ఇది మొదట పాంచరాత్ర మతాన్ని ప్రతిపాదించే పురాణమని, కాలక్రమంలో పాశుపతులు దీనిలో పాశుపత ప్రక్రియను ప్రవేశపెట్టారని పండితుల అభిప్రాయం. ఈ పురాణం 5, 6 శతాబ్దాలలో రచింపబడి ఉండాలి.
16. మత్స్యపురాణం:
ఇది కూడా విస్తృతపురాణాలలో ఒకటి. ఇందులో 290 అధ్యాయాలున్నాయి. మొత్తం 15 వేల శ్లోకాలు ఉన్నాయి. మత్స్యరూపంలోని శ్రీమహా విష్ణువు కల్పాదియందు శ్రుతి అర్థమును నరసింహ వర్ణన సందర్భంలో ఏడుకల్పాల విషయ వివరణ చేసినట్టిదే మత్స్యపురాణమని స్వయంగా ఇందులో చెప్పబడి ఉన్నది. ప్రారంభంలో మన్వంతరాల గుఱించి సంక్షిప్తమైన వివరణ చేసిన తరువాత పితృదేవగణాల వర్ణన విస్తృతంగా ఉన్నది. అనేక రకాల వ్రతాలను గురించిన సుందరమైన వర్ణన ఇందులో కనిపిస్తుంది. తీర్థాలలో శ్రేష్ఠమైన ప్రయాగక్షేత్ర భౌగోళిక వివరణ, మాహాత్మ్యము చాలా విపులంగా ఉన్నది. రాజవంశ వర్ణనలలో సోమవంశ వర్ణన చాలా విపులంగా ఉన్నది. పరమేశ్వరుని త్రిపురాసుర యుద్ధము సంహారము సవివరంగా విపులంగా చెప్పబడింది. తారకాసుర వధకూడా ఇందులో విస్తృతంగా చెప్పబడింది. మత్స్యావతార కథ ప్రధానంగా ఉండడంచేత దీనికి మత్స్యపురాణం అనే పేరు సార్థకం అవుతున్నది. కాశీ ప్రయాగక్షేత్రాలు, నర్మదా నదీ ప్రాంతంలో ఉన్న క్షేత్రాలను గురించిన విపుల వర్ణన ఉన్నది. ఋషివంశాల వర్ణనం, 25 అధ్యాయాలలో రాజధర్మ ప్రతిపాదనము వివిధ దేవతామూర్తుల ప్రతిమ, నిర్మాణాదుల విస్తృత వర్ణనం ఈ పురాణంలో ప్రధానంగా ప్రతిపాదించబడిన విశేషం.
మత్స్య పురాణంలోని 53వ అధ్యాయంలో అష్టాదశ పురాణాల యొక్క లక్షణాలు, దానిలో చెప్పబడిన అంశాలు, శ్లోక సంఖ్య మొదలైనవి విపులంగా తెలియజేయబడ్డాయి. ఇది మిగిలిన పురాణాల ప్రస్తుత స్థితిని ఊహించటానికి ప్రముఖంగా పనికివస్తున్నది. మత్స్యమూర్తి, మనువులకు ప్రళయ విషయాన్ని గురించిన సంభాషణ, మానసిక సృష్టి తర్వాత, మైథున సృష్టి ఆరంభం, బ్రహ్మ సరస్వతుల చరిత్ర, పృథు చరిత్ర, సూర్య సోమవంశ వర్ణనము యయాతి చరిత్ర, సప్త సంతానాల ప్రతిష్ఠ అనేక వ్రత విధానాలు, దానఫల ప్రతిపాదనము, వివిధ నదీ పర్వత వర్ణనము, శాకము మొదలైన ద్వీపాల వృత్తాంతము, యుగవివరణ తారకోపాఖ్యానం, దేవాసుర సంగ్రామ వర్ణనం, నర్మదా మాహాత్మ్యము, సావిత్ర్యుపాఖ్యానం, రాజవంశవర్ణనము, శమనజ్ఞానము, గృహ నిర్మాణం మొదలైన అనేక విషయాలు ఇందులో వర్ణించబడ్డాయి.
ప్రళయ కాలంలో అన్ని నదులూ నశించినా, నర్మదానది మాత్రం నశించదని చెపుతూ నర్మదా నదికి గంగ కంటె కూడా ఎక్కువ వైశిష్ట్యాన్ని అంగీకరించడం నర్మదా నదీతీరాన్ని అనుసరించి ఉన్న చిన్న చిన్న తీర్థాలను కూడా వర్ణించటం మొదలైన ఆధారాలను బట్టి ఈ పురాణం నర్మదా నదీ తీరంలో రచింపబడి ఉండవచ్చని ఊహించవచ్చును.
కాళిదాసుని విక్రమోర్వశీయంలో ఉన్న కథకు ఈ పురాణంలోని ఊర్వశీ ఉపాఖ్యానానికి అత్యంత సామ్యం ఉండడంచేత ఇది కాళిదాసుకు అనంతరం రచింపబడి ఉంటుందని కొందరి ఊహ. నారద పురాణంలో చెప్పబడినట్లుగానే ఇందులోని, ఆధ్యాయ సంఖ్య శ్లోకసంఖ్య ఉన్నది. అందువలన పురాణ విమర్శకులందరూ దీని వాస్తవికతను ప్రామాణికతను, ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఇది 16వ పురాణం అయినా దేవీ భాగవతాన్ని అనుసరించి ఇది మొదటి పురాణం కావాలి. స్మృతిరఘునందనుడనే పండితుడు రచించిన ‘వృషోత్సర్గతత్త్వం’ అనే గ్రంథంలో ‘స్వల్ప మత్స్య పురాణమనే చిన్న గ్రంథం ఒకటి పేర్కొనబడినా, అసలు దాని ఉనికి ఏమాత్రం నేడు తెలియటం లేదు.
ఈ పురాణం కొన్ని ప్రత్యేకలను కలిగి ఉన్నది. మొదటిది ఇందులో 53వ అధ్యాయంలో చెప్పిన అన్ని పురాణాల విషయానుక్రమణిక. దీనివలన అన్ని పురాణాల క్రమాను గత వికాసం తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.
శ్రేష్ఠులైన ఋషిగణం యొక్క వంశ వర్ణనం ఇందులో ఇంకొక ప్రత్యేకత, భృగు, ఆంగీరస, అత్రి, విశ్వామిత్ర, కశ్యప, వసిష్ఠ పరాశర, అగస్త్యాది మహా ఋషుల వంశాల వర్ణన 195వ అధ్యాయం నుంచి 202వ అధ్యాయం వరకు చక్కగా చేయబడింది. ఇక మూడవది రాజ ధర్మాల విశిష్ట వివరణ. ఇది 215వ అధ్యాయం నుంచి 243 అధ్యాయం వరకు, దైవ, పురుషకార, సామ, దామ, దండ, భేద, దుర్గ, యాత్ర, సహాయసంపత్తి, తులాదానం వంటి వాని వివరణ, రాజనీతికి సంబంధించిన విశిష్టతలను నిరూపిస్తున్నది. ఈ రాజధర్మంలో ఒక భాగంగా శాంతిఖండాన్ని కూడా చేర్చడం అద్భుతమైన విషయం. (అధ్యాయం 228 నుంచి 238) ఇందులో విషయాలు చాలా నవీనంగా ఉంటాయి. నాల్గవ ప్రత్యేకత ఇందులో చెప్పబడిన ప్రతిమా లక్షణాలు, రకరకాల దేవతలు, దేవుళ్ల విగ్రహాల కొలతలు, తయారుచేయటం చెప్పబడింది. మన ప్రతిమాశాస్త్రం, శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి ఉన్నది. విభిన్న దేవతల విగ్రహాలు కొలతల ప్రకారమే జరగాలి. వాటి ప్రతిష్ఠ, పీఠ నిర్మాణం కూడా ఒక విశిష్ఠ శైలిపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నింటి వివరణ ఈ పురాణం (257-270)లో చాలా ప్రామాణికంగా చెప్పబడింది. రాజు తన శత్రువుల మీద దండెత్తి పోయేటప్పుడు ఏ ఏ విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి వంటి విషయాలు, రాజధర్మాలు మొదలైనవి విపులంగా వివరించబడ్డాయి.
మత్స్యపురాణం కేవలం అధ్యాయాలుగా మాత్రమే విభజించబడింది. ఇందులో 290 అధ్యాయాలున్నాయి. ఈ 290 అధ్యాయాలలో 14 వేల శ్లోకాలున్నాయి. కానీ నారద పురాణానుసారం ఇందులోని శ్లోకాల సంఖ్య 15 వేలు.
17. గరుడ పురాణము:
శ్రీమహావిష్ణువు గరుడ కల్పంలో గరుడుడు ఉద్భవించిన విషయ వివరణ చేస్తూ బ్రహ్మాండ ఆరంభం దగ్గర నుంచి గరుడునికి వివరించిన పురాణం కాబట్టి దీనికి గరుడ పురాణమనే పేరు వచ్చింది. ఇందులో 264 అధ్యాయాలు 18వేల శ్లోకాలు ఉన్నాయని నారదపురాణం తెలుపుతున్నది. ఇది రెండు ఖండాలుగా ఉన్న పురాణం. పూర్వఖండంలో లౌలిక ఉపయోగానికి అవసరమైన సమస్త విద్యల వివరణ విస్తృతంగా ఉన్నది. పురాణ ప్రారంభం లోనే విష్ణువు ఆయన అవతారాల మాహాత్మ్యం గురించి తెలియజేయబడింది. దీనిలోని ఒక అంశంతో అనేక రకాల రత్నాల పరీక్ష, అలాగే ముత్యము (69 అధ్యాయం) పద్మరాగం (70వ అధ్యాయం) మరకత, ఇంద్రనీల, వైడూర్య, పుష్పరాగ, కరకేతన, భీష్మరత్న, పులక, రుధిరాఖ్య రత్నాలు, స్ఫటికము, విదృమ పరీక్షలు (71 నుంచి 80 అధ్యాయాల వరకు) తెలుపబడ్డాయి. ఇందులో రాజనీతి (108-115 అధ్యాయాల వరకు) కూడా బాగా విస్తృతంగా వివరించబడింది. ఆయుర్వేదము యొక్క ఆవశ్యకత, రోగనిధానము, చికిత్సా విధానములను గురించి (15 నుండి 181 అధ్యాయాల వరకు) అనేక అధ్యాయాలలో వివరించబడింది. అనేక రకాల రోగాలను పోగొట్టటానికి ఔషధ విధానం (170-196వ అధ్యాయం వరకు) చెప్పబడింది. ఇది చాలా ప్రశంసనీయ విషయం. ఇంకొక అధ్యాయం (199) మనస్సును నిర్మలంగా ఉంచుకొనటానికి ఔషధాలను నిర్దేశించింది. ఆయుర్వేదాన్ని ప్రతిపాదించే ఈ 50 అధ్యాయాలు వేరు పుస్తకంగా ప్రకటించి, ఇతర ఆయుర్వేద గ్రంథాలలాగా దీనిని కూడా పరిశీలించ వలసిన అవసరం ఉన్నది. ఛందశాస్త్ర విషయాలు (211-216) అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. సాంఖ్య యోగాన్ని గురించి విపులంగా 14 (230)-243) అధ్యాయాలలో వివరించబడింది. ఒక అధ్యాయం (242)లో గీతాసారాంశం ఉన్నది. ఈ విధంగా గరుడపురాణం ఈ పూర్వాంశం అగ్ని పురాణం వలెనే సమస్త విద్యలకు విజ్ఞాన కోశంగా చెప్పవచ్చును.
ఈ పురాణం యొక్క ఉత్తర ఖండానికి, ‘ప్రేతకల్పం’ అని పేరున్నది. ఇందులో 45 అధ్యాయాలున్నాయి. జీవి మరణించిన తరువాత మనుష్యునికి ఏ స్థితి కలుగుతుంది. అతడు ఏ యోని యందు తిరిగి పుట్టగలడు ఏఏ భోగాలను అనుభవిస్తాడు మొదలైన విషయాలు అక్కడక్కడా ఇతర పురాణాలలో ఉన్నా, ఈ పురాణంలో అత్యంత విస్తృతంగా సాంగోపాంగమైన వర్ణన ఉన్నది. ఇంత విస్తృతంగా వేరు పురాణాలలో లేదు. ఇందులో గర్భావస్థ, నరకము, యమ నగరమునకు మార్గము, ప్రేత గణముల వాసస్థానము ప్రేత యోని నుంచి ముక్తి, ప్రేతముల రూపము, మనుష్యుల ఆయుర్దాయము, యమలోక వివరణము, సపిండులైనందున చేయవలసిన విధులు, వృషోత్సర్గ విధానము మొదలైన విషయాలు ఆయా అధ్యాయాలలో విస్తృతంగా ఆసక్తికరంగా వివరించబడ్డాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు అశౌచకాలంలో ఈ ఉత్తరఖండం పురాణంగా చెప్పటం, దానిని ప్రేతబంధువులు వినటం సంప్రదాయంగా హిందువులలో ఉన్న విషయమే. ఈ ప్రేతకల్ప భాగం జర్మన్ భాషలోకి కూడా అనువదించబడింది.
నారదపురాణం, మత్స్యపురాణాలలో గరుడపురాణ విషయాలుగా చెప్పబడినవి. యథాతథంగా లభ్యం అవుతున్నాయి. ప్రస్తుతం లభ్యం అవుతున్న గరుడ పురాణంలో ఏడువేల శ్లోకాలు ఉన్నాయి. లభ్యం అవుతున్న గరుడ పురాణంలో శ్లోకసంఖ్య తక్కువగా ఉన్నా, చెప్పబడిన విషయాలు మాత్రం కొరత లేదు. ఇందులోని భవిష్య రాజవంశాఖ్యానాన్ని చదివితే ఇది జనమేజయుని కాలంలో సంకలింపబడినట్లు తెలుస్తుంది. మత్స్య, విష్ణు పురాణాలలోని భవిష్యరాజ వంశాఖ్యాన వృత్తాంతాలలో ఆంధ్ర, గుప్త రాజవంశాలు పేర్కొనబడ్డాయి. కానీ ఇందులో ఆ వృత్తాంతాలు లోపించటంవలన, ఇది ఆ పురాణాలకంటే ప్రాచీనమని భావించటం సమంజసంగా ఉంటుంది.
శూద్రక మహారాజు కాలంలో బౌద్ధ హిందూ ధర్మాలు కలసిపోయాయి. ఆ సమయంలో బౌద్ధమతము, బుద్ధుని ఆరాధన మనదేశంలో ఎక్కువగా ఉండేది. అందువలననే బుద్ధుడు విష్ణువు యొక్క 21వ అవతారంగా పేర్కొనబడ్డాడు. ఇందులో బుద్ధుని తండ్రి ఆయన వంశం (శుద్ధోధకో రాహులశ్చ సేనజత్ శూద్రక్తసథా) స్పష్టంగా చెప్పబడ్డాయి.
ఇందులోని వృత్తాంతం తార్ క్ష్యకల్పం నాటిది అని చెప్పబడింది. తార్ క్ష్యుడు గరుడుడే. అదే గరుడ కల్పవృత్తాంతం. ఇందులో గయామాహాత్మ్యం చాలా విపులంగా చెప్ప బడినందున గయ క్రీ.శ. 6,7 శతాబ్దాలలో విస్తృత ప్రచారంలోకి బౌద్ధమత పతనం తరువాత వచ్చినందున ఇది ఎనిమిదవ శతాబ్దం కాలంనాటి పురాణంగా భావించవచ్చు. మిథిలా ప్రాంతంలో దీని రచన జరిగి ఉండవచ్చని భావించబడుతున్నది. దీని నుండి ప్రత్యేకంగా త్రివేణీస్తోత్రము, పంచపర్వ మాహాత్మ్యము, విష్ణు ధర్మోత్తరము, వేంకటగిరి మాహాత్మ్యము, శ్రీరంగనాథ మాహాత్మ్యము, సుందరపుర మాహాత్మ్యము మొదలైనవానిని ప్రత్యేక గ్రంథములుగా ఏర్పాటు చేయవచ్చును.
గరుడ పురాణం రెండు ఖండాలుగా విభజించబడింది. పూర్వ ఖండం, ఉత్తర ఖండం. దీనిలోని ఉత్తర ఖండానికే ప్రేత కల్పమనే ఇంకొక పేరు ఉన్నది. ఈ పురాణంలో పూర్వఖండంలో 240, ఉత్తర ఖండం (ప్రేత కల్పం)లో 78 అధ్యాయాలు మొత్తం 318 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో నారదపురాణానుసారం 19 వేల శ్లోకాలు మత్స్య పురాణాను సారం 18 వేల శ్లోకాలు ఉన్నాయి.
18. బ్రహ్మాండ పురాణము:
సమస్త బ్రహ్మాండాన్ని ఆధారంగా తీసుకొని బ్రహ్మచేత భవిష్యకల్పవృత్తాంతంగా చెప్పబడిన పురాణం కాబట్టి దీనిపేరు బ్రహ్మాండ పురాణం అయ్యింది. ఇందులోని శ్లోక సంఖ్య 12, 200 భువన కోశం లేక ఈ సకల చరాచర బ్రహ్మాండ వర్ణన అన్ని పురాణాలలోను ఉంటుంది. కానీ ఈ పురాణం ఈ బ్రహ్మాండం (విశ్వం) అంతటిని సాంగోపాంగంగా వరిస్తుంది. నారదపురాణాన్ని అనుసరించి దీనిలో 161 అధ్యాయాలు, 12,000 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు పురాణంలో ఉన్న విషయానుక్రమణి నారద పురాణంలో చెప్పబడిన విషయానుక్రమణికతో సరిపోతున్నది. కూర్మ పురాణం చెప్పిన పురాణపు పేర్లలో ఇది వాయవీయ బ్రహ్మాండపురాణం అని పేర్కొంటున్నది. ఈ విషయాన్ని అనుసరించి మన పురాణాలపై పరిశోధన చేసిన పాశ్చాత్య పురాణ పండితులు ఇది వాయు పురాణము యొక్క విస్తృత రూపమని, దీనికి మూలం వాయు పురాణమేనని భావించారు. కానీ ఇది సరియైన అభిప్రాయం కాదు. నారదపురాణాన్ని అనుసరించి వాయుదేవుడు వ్యాసునికి ఈ పురాణాన్ని బోధించాడని తెలుస్తున్నది. అందువలననే సరిగా ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ పురాణమని చెప్పబడింది.
ఈ పురాణ ప్రథమ ఖండంలో విశ్వభూగోళ వర్ణన విస్తృతంగా చేయబడింది. జంబూద్వీపము, అందులోని పర్వత, నదీ నద వర్ణన అనే అధ్యాయాలలో ‘66-72 వరకు) చేయబడింది. భద్రాశ్వ, కేతుమాల, చంద్రద్వీప, కింపురుషవర్ష, కైలాస, శాల్మిల ద్వీప, కుశద్వీప, క్రౌంచద్వీప, శాకద్వీప, పుష్కరద్వీపము వంటి అనేక వర్షములు, దీపముల వర్ణన విభిన్న అధ్యాయాలలో, ఆకర్షణీయంగా సమగ్రంగా లభ్యం అవుతున్నది. ఈ పురాణపు తృతీయ పాదంలో భారతదేశంలోని ప్రసిద్ధులైన క్షత్రియ వంశ వివరణ చారిత్రక దృష్టితో చాలా విలువగల భాగము.
ఈ పురాణాన్ని గురించిన ఇంకొక ప్రత్యేకత ఏమంటే క్రీ. శ. 5వ శతాబ్దంలో బ్రాహ్మణులు ఈ పురాణాన్ని జ్వాలా(బలి) ద్వీపానికి తీసుకొనిపోయారు. అక్కడ ఇది ప్రాచీన జావాభాష అయిన ‘కలిభాష’లోకి అనువదించబడింది. ఆ అనువాదం ఈ రోజుకు ఉపలబ్ధం అవుతున్నది. అందువలన ఈ పురాణం చాలా ప్రాచీన కాలానికి చెందినదిగా భావించవచ్చును. ఈ పురాణము యొక్క 16, 17, 18 అధ్యాయాలలోని భవిష్య కల్పవృత్తాంతం విస్తారంగా వర్ణితమైంది. ఈ రకమైన విస్తృత కల్పవర్ణనం మిగిలిన ఇతర పురాణాలలో లభించదు. అందువలన లభ్యం అవుతున్న బ్రహ్మాండపురాణ అస్తిత్వం, మౌలికత, మహాపురాణత్వాన్ని గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకొనవలసిన అవసరం లేదు. బ్రహ్మాండపురాణం అష్టాదశ పురాణాలు అన్నింటిలోను ప్రాచీనతమమైనదని పురాణతత్త్వజ్ఞుల భావన. స్కాందపురాణంలాగానే దీనిలో కూడా అనేక మాహాత్మ్యాలు వర్ణింపబడ్డాయి.
దీని ప్రథమ ఖండంలో నదులు తీర్థాల వర్ణనతరువాత నక్షత్రమండలము యుగములు, మన్వంతరాల విపుల వివరణ ఉన్నది. విశ్వ విఖ్యాతులైన క్షత్రియ ప్రభువుల వంశ వర్ణనము చారిత్రకంగా విలువైనట్టిది. నారదపురాణ సూచికను అనుసరించి అధ్మాత్మ రామాయణము ఇందులోని భాగమే. కానీ ప్రస్తుతం ఉపలబ్ధం అవుతున్న బ్రహ్మాండ పురాణంలో అధ్యాత్మ రామాయణం లభ్యంకావటం లేదు. ఈ అధ్యాత్మరామాయణము శ్రీరామ చరిత్రను ఆధ్యాత్మికముగా వ్యాఖ్యానించిన గ్రంథము. దీనిని అనుసరించి రాముడు పురుషుడు. సీత ప్రకృతి. శ్రీరాముడు పరబ్రహ్మము, సీత ఆయన యొక్క అనిర్వచనీయమైన మాయ. ఈ ఇద్దరి లీలా విలాసమే ఈ సర్వప్రపంచము. బ్రహ్మ, మాయతో కూడా భారాన్ని తగ్గించడంకోసం పరబ్రహ్మమైన రాముని కోరగా ఆయన ఈ భూలోకములో శ్రీరామునిగా అవతరించి తన లీలలను విస్తారంగా ప్రదర్శించాడు.
బ్రహ్మాండ పురాణం నుంచి రామాయణ కథ విడిపోయి అధ్యాత్మ రామాయణంగా ప్రసిద్ధి చెందిందని పండితుల విశ్వాసం. లేకపోతే రామాయణ కథ దాదాపు అన్ని ఇతర పురాణాలలోను ఉన్నదే. కానీ అధ్యాత్మ రామాయణంలో అది బాగా విస్తరించబడింది. నారదపురాణంలో చెప్పబడిన బ్రహ్మాండ పురాణ విషయానుక్రమణికలో రామాయణ ప్రసక్తి లేదు. చెప్పబడుతున్న శ్లోకాల సంఖ్య అధ్యాత్మ రామాయణము, లలితోపాఖ్యానము కలవనిదే పూర్తికాదు. ఈ రెండు విడి గ్రంథాలే గాక బ్రహ్మాండ పురాణం నుంచి ఇంకా గణేశ కవచం, తులసీకవచం హనుమత్కవచం, సిద్ధ లక్ష్మీ స్తోత్రం, సీతాస్తోత్రం, లలితా సహస్రనామస్తోత్రం, లలితోపాఖ్యానం, సరస్వతీస్తోత్రం వంటివి వేరుగా విడదీయవచ్చును.
ఈ పురాణంలో పరశురామచరిత్ర కూడా సవిస్తరంగా చెప్పబడింది. పరశు రామునితో దృఢ సంబంధం ఉండటం చేతను, సహ్యపర్వత గోదావరీ ప్రాంతాలను అధికంగా వర్ణించటం చేతను, ఈ పురాణం ఆ ప్రాంతాలలో రచింపబడి ఉంటుందని, దీనిలోని కొన్నిభాగాలు ప్రాచీనమైనవని అందువలన ఇది క్రీ.పూ. 1, 2 శతాబ్దాలలోనే రచితం అయి 600-900 సంవత్సరాలలో పరిపూర్ణం అయి ఉంటుందని పండితుల అభిప్రాయం.
మహా పురాణాలలో చివరి స్థానాన్ని ఆక్రమిస్తున్న బ్రహ్మాండ పురాణం వాయు పురాణంలాగానే నాలుగు పాదాలుగా విభజించటం జరిగింది. 1. ప్రక్రియాపాదము 2. అనుషంగ పాదము, 3. ఉపోద్ఘాత పాదము, 4. ఉపసంహార పాదము.
ఇందులో మొదటి రెండు పాదాలైన ప్రక్రియ, అనుషంగాలను పూర్వ భాగమని తరువాత తృతీయ పాదమైన అనుషంగ పాదాన్ని మధ్యభాగమని నాల్గవదైన ఉపసంహార పాదాన్ని ఉత్తర భాగమని పిలుస్తారు. దీనిలో మొత్తం 161 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పురాణంలో నారద పురాణాను సారం 12 వేల శ్లోకాలు మత్స్య పురాణానుసారం 12 వేల రెండువందల శ్లోకాలు ఉన్నాయి.
పురాణాలలోని విషయ ఐక్యత
మొత్తం మీద పరిశీలించగా కొన్ని పురాణాలలో ఒక కథ విస్తృతంగా వర్ణించబడి ఉంటే ఇంకొక దాంట్లో అతి సంక్షిప్తంగా ఉండవచ్చు. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. వాయు పురాణంలో గయామాహాత్మ్యం విస్తృతంగా 56 శ్లోకాలలో ఉంటే అగ్ని పురాణంలో సంక్షిప్తంగా 23 శ్లోకాలలోనే చెప్పబడింది. అలాగే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనావతార కథలు వాయుపురాణంలో అతి సంక్షేపంగా ఉన్నాయి.
రామాయణంలోని ఏడుకాండల కథ అగ్ని పురాణంలో ఏడు అధ్యాయాలలో చెప్పబడింది. కానీ గరుడపురాణంలో ఒక అధ్యాయంలోనే సరిపెట్టబడింది. అలాగే మహాభారతకథ అగ్ని పురాణంలో మూడు అధ్యాయాలలో ఉంటే గరుడ పురాణంలో ఒక అధ్యాయంలో ముగించబడింది. హరివంశం మొత్తం కేవలం 55 శ్లోకాలలో గరుడపురాణంలో ముగించబడింది.
ఆయుర్వేదాన్ని గురించి గరుడ, పురాణంలో 57 శ్లోకాలలో ఉంటే అగ్ని పురాణంలో అది 200 శ్లోకాలుగా ఉన్నది. అగ్ని పురాణం, గరుడ పురాణం రెండింటిలోను కార్తికేయుని మొదలుకొని కాత్యాయనుడి వరకు వ్యాకరణ విషయాలు వచ్చాయి. కానీ పాణిని గురించిన ఊసేలేదు. అగ్ని పురాణంలో ‘విద్య’కు సంబంధించిన విషయాలు చెప్పబడినను గరుడు నారద పురాణాలలో కనీసం దానిని పేర్కొనలేదు.
అదేవిధంగా గరుడపురాణంలో నాట్యశాస్త్రానికి సంబంధించిన చర్చ, ఆనందవర్ధనాచార్యుని ద్వారా చెప్పబడిన ‘ధ్వని’ యొక్క వికాసవర్ణన చక్కగా ఉన్నా, గరుడ పురాణంలో కనిపించదు. ఇలాంటివి అనేక భేదసాదృశ్యాలు పురాణాల గురించి చెప్పతగినవి ఎన్నో ఉన్నాయి.
వివిధ పురాణాల ఆది శ్రోత-వక్త
ఇక్కడ చెప్పబడినవి ఆయా పురాణాలను మొదటగా చెప్పిన వక్తలు వారి నుంచి మొదటిసారి విన్న శ్రోతలు, తరువాత ఒక్కొక్క పురాణానికి వక్తృ శ్తోతృపరంపర ఉండ వచ్చును.
సం. పురాణం ఏకల్పవృత్తాంతం వక్తృశ్రోతలు
1. బ్రహ్మ పురాణాన్ని బ్రహ్మ కల్పంలో బ్రహ్మ మరీచి మహామునికి బోధించాడు
2. పద్మ పురాణాన్ని పద్మ కల్పంలో స్వయంభువుమనువు బ్రహ్మకు బోధించాడు 3. విష్ణు పురాణాన్ని వరాహ కల్పంలో పరాశరుడు బ్రహ్మకు బోధించాడు
4. శివ (వాయు) పురాణాన్ని శ్వేత కల్పంలో శివుడు వాయువుకు బోధించాడు
5. భాగవత పురాణాన్ని సారస్వత కల్పంలో విష్ణువు బ్రహ్మకు బోధించాడు
6. నారద పురాణాన్ని బృహత్ కల్పంలో పూర్వ భాగాన్ని-సనకాదులు
నారదునికి బోధించారు.
ఉత్తరభాగాన్ని-వశిష్ఠుడు
మాంధాతకు బోధించాడు
7. మార్కండేయ పురాణాన్ని శ్వేత వారాహకల్పంలో మార్కండేయుడు జైమినికి బోధించాడు
8. అగ్ని పురాణాన్ని ఈశాన కల్పంలో అగ్నిదేవుడు వశిష్ఠునికి బోధించాడు
9. భవిష్య పురాణాన్ని అఘోర కల్పంలో బ్రహ్మ మనువుకు బోధించాడు
10. బ్రహ్మ వైవర్త పురాణాన్ని రథంతర కల్పంలో సావర్ణి నారదునికి బోధించాడు
11. లింగ పురాణాన్ని కల్పాంతకల్పంలో పరమశివుడు నారదునికి బోధించాడు.
12. వరాహ పురాణాన్ని మనుకల్పంలో విష్ణువు పృథ్వికి బోధించాడు
13. స్కాంద పురాణాన్ని తత్పురుషకల్పంలో స్కందుడు భూమికి బోధించాడు
14. వామన పురాణాన్ని కూర్మ కల్పంలో బ్రహ్మ పులస్త్య మహామునికి బోధించాడు
15. కూర్మ పురాణాన్ని లక్ష్మీ కల్పంలో విష్ణువు పులస్త్య మహామునికి బోధించాడు
16. మత్స్య పురాణాన్ని సప్త కల్పంలో విష్ణువు మనువుకు బోధించాడు.
17. గరుడ పురాణాన్ని గరుడ కల్పంలో విష్ణువు మనువుకు బోధించాడు.
18. బ్రహ్మాండ పురాణాన్ని భవిష్య కల్పంలో బ్రహ్మ మనువుకు బోధించాడు

జైన సాహిత్యంలో పురాణాలు
అతిప్రాచీన కాలంలోనే అంటే క్రీ.పూ. 600 సంవత్సరాల ప్రాంతంలోనే హిందూ మతం నుంచి వేరై విరోధ భావనలతో ఏర్పడిన మతం జైనం. అయినా హిందూ ధర్మం యొక్క బలమైన ప్రభావం వలన పెద్దగా హిందూమతంతో వేరుపడలేకపోయింది. జైనం. కాబట్టి హిందువుల యొక్క వేద వేదాంగాలు అంటే వైదిక సాహిత్యం, పురాణ వాఙ్మయం మొదలైనవాటివలెనే జైనమతాను యాయులు కూడా తమవైన ధర్మ గ్రంథాలు, దర్శన గ్రంథాలు వంటి వానితోపాటు పురాణ సాహిత్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నారు. ఇతర ధర్మాలకు చెందిన గ్రంథాలపై హిందూ పురాణాల ప్రభావం ఎలా ఉన్నదో అలాగే జైన ధార్మిక వాఙ్మయంపైన హిందూ పురాణాల ప్రభావం ఎక్కువగానే ఉన్నది.
మధ్య యుగాలలో భారతీయ దర్శన శాస్త్రాలలో న్యాయగ్రంథాలను రచించినవారు జైనులు బౌద్ధులే. అయితే బౌద్ధ జైనులు వేదాలను ప్రామాణికంగా అంగీకరించనందువలన వారి దర్శనాలను నాస్తిక దర్శనాలనటం మొదలైంది. ఆస్తిక దర్శనాలు న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంసలనే ఆరని మనకు తెలిసినదే. అలాగే నాస్తిక దర్శనాలనే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని దర్శనాలు ఆరు భాగాలుగా ఉన్నాయి. అవి: చార్వాక దర్శన, జైనదర్శన, బౌద్ధ దర్శనాలు అనేవి. మళ్ళీ బౌద్ధ దర్శనాలు సంప్రదాయ భేదాలతో నాలుగు భాగాలుగా విభజించబడ్డాయి. అవి: 1. మాధ్యమిక, 2. యోగాచార, 3. సౌత్రాంతిక వైభాషికభాగాలు, ఎవరో తెలీదు కానీ ఈ నాలుగు విధాల బౌద్ధ సంప్రదాయాన్ని ముఖ్య లక్షణాలన్నింటినీ ఒక్క శ్లోకంలో ఎంత బాగా చెప్పాడో చూడండి.
ముఖ్యోమాధ్యమికో వివర్తమఖిలం శూన్యస్యమేనేజగత్
యోగాచారమతేతు సంతి మతయస్తానాం వివర్తోఽఖిలః
అర్థోస్తి క్షణికస్త్వసావనుమితో బుద్ధ్యేతి సౌత్రాంతికః
ప్రత్యక్షం క్షణ భంగురంచ సకలంవై భాషికో భాషతే
నాస్తిక దర్శనాల చారిత్రక ప్రభావంచేత ఆస్తిక దర్శనాలు ఆరూ ప్రభావితమైనాయి. యథార్థానికి బౌద్ధ జైనాలు రెండూ విశాల హిందూజాతికి అంగాలే. హిందువులపై తమ ధర్మము, దర్శనాల ప్రభావం ఉన్నట్లుగానే జైనులపైగూడా వారి పురాణముల ప్రభావం ఉన్నది.
బ్రాహ్మణకపురాణాలలో అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు ఉన్నట్లుగానే జైన ధర్మంలో కూడా 24 పురాణాలు ఉన్నాయి. ఈ 24 పురాణ గ్రంథాలలో జైన ధర్మానికి చెందిన 24మంది తీర్థంకరులైన మహాపురుషుల మాహాత్మ్యం చెప్పబడింది. అయితే బ్రాహ్మణ మతానికి చెందిన అష్టాదశ పురాణాలు పంచ లక్షణ సమన్వితాలు. కానీ జైన పురాణాలకు ఈ పంచలక్షణాలు ఉండవు. పైగా పురాతనం పురాణం ‘స్యాత్తన్మహన్మహ దాశ్రయాత్’ అని చెప్పటం చేత తమజిన ధర్మానికి చెందిన ప్రాచీన మహాపురుషుల కథా ప్రతిపాదకాత్మకాలుగా ఉంటాయి. జైనుల ఇరవై నాలుగు పురాణాలలోను వరుసగా 24 మంది జైనతీర్థంకరుల మాహాత్మ్య కథలు చెప్పబడి ఉంటాయి.
ఈ పురాణాలలో
1. ఆదిపురాణం 2. అజితనాథపురాణం
3. సంభవనాథ పురాణం 4. అభినందపురాణం
5. సుమితనాథపురాణం 6. పద్మ ప్రభ పురాణం
7. సుపార్వ్మ పురాణం 8. చంద్రప్రభపురాణం
9. పుష్పదంత పురాణం 10. శీతలనాథ పురాణం
11. శ్రేయాంస పురాణం 12. వాసుపూజ్య పురాణం
13. విమలనాథ పురాణం 14. అనంతజీత పురాణం
15. ధర్మనాథ పురాణం 16. శాంతినాథ పురాణం
17. కుంథనాథ పురాణం 18. అమరనాథ పురాణం
19. మల్లినాథ పురాణం 20. ముని సువ్రత పురాణం
21. నేమినాథ పురాణం 22. అరిష్టనేమి పురాణం
23. పార్శ్వనాథ పురాణం 24. సమ్మతి పురాణం అనేవి.
ఈ ఇరవై నాలుగు జైన పురాణాలలో బాగా ప్రసిద్ధి గలవి ఆది పురాణం, పద్మప్రభ పురాణం, అరిష్టనేమి పురాణం (దీనికే ఇంకొక పేరు హరివంశపురాణం) ఉత్తరపురాణాలే. మళ్ళీ వీటిల్లో ఆదిపురాణం, ఉత్తర పురాణాలు అనే వాటికి విశేష ప్రభావం ఉన్నది.
ఆదిపురాణం
జినధర్మంలో మొదటి తీర్థంకరుడైన ఋషభదేవుని కథలు ఈ పురాణంలో వర్ణించబడ్డాయి. ఈ పురాణం ప్రకారము, జైన సంప్రదాయం ప్రకారం పరంపరగా వస్తున్న వినికిడిని అనుసరించి ఈ ఋషభ దేవుడు సర్వార్థ సిద్ధియోగంలో ఉత్తరాషాఢ నక్షత్రం ధనూరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసం కృష్ణాష్టమీ రోజు ఇక్ష్వాకు వంశరాజు నాభి అతని భార్య మరుదేవి గర్భంలో, వినీత మనే నగరంలో జన్మించాడు. ఆయన చతుర్యుగాల సమాప్తి పర్యంతం అంటే ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పాటు జీవించి మోక్షప్రాప్తి చెందగలరని జైనమత సంప్రదాయం తెలుపుతున్నది. భాగవతంలో ఈ తీర్థంకరుని వర్ణన హృదయంగమంగా ఉంటుంది. భాగవతంలో కూడా ఈ తీర్థంకరుని తల్లిదండ్రుల పేర్లు మరుదేవి, నాభి అనే చెప్పబడింది. ఈయన భగవద్గుణ సంపన్నుడని భాగవతం వర్ణిస్తున్నది. ఈయన భార్యపేరు జయంతి అని, ఆమె ఇంద్రుని కుమార్తె అని, ఆమె ద్వారా ఆయనకు ధర్మాత్ములు, వేదజ్ఞులు, భాగవత ధర్మానుయాయులైన భరతుడు కుశావర్తుడు మొదలైన నూర్గురు పుత్రులు జన్మించారని అదే గ్రంథం వివరిస్తున్నది. భాగవతంలో చెప్పబడిన భగవంతుని అవతారాలలో ఎనిమిదవది ఈ ఋషభ దేవుని అవతారము.
ఈ పురాణంలో 47 పర్వాలు ఉన్నాయి. మహాభారతంలో గూడా గ్రంథాంతర విభాగాల పేరు పర్వాలే గదా, ఈ గ్రంథ రచయిత జనసేనుడు ఈ గ్రంథంలో సిద్ధసేనుడు, వాదీంద్ర చూడామణి, సమంత భద్రుడు, దేవముని మొదలైన వారి పేర్లను పేర్కొన్నాడు. ఇందువలన గ్రంథ రచనా కాలం సుగమం అయింది. రచయితకు వీరందరి సహాయం లభించినట్లు తెలుస్తున్నది. ఈ గ్రంథంలో సృష్టి తత్త్వ విచారణకు సంబంధించి వ్యక్తీకరించిన భావాలను పరిశీలిస్తే రచయిత రాబోయే కాలంలో ఆచార్య శంకరుల వారి అద్వైత మత సిద్ధాంత బ్రహ్మసంబంధ వాదాలను ఖండించటానికే చెప్పబడిందా అన్నట్లు ఉంటుంది.
ఉత్తర పురాణం
ఇది ఆది పురాణానికి ఉత్తర భాగం. ఆదిపురాణకర్త జిన సేనాచార్యుడు. అందులో 44 సర్గలు వ్రాసిన తరువాత పరమపదం చెందాడు. తరువాత 45వ సర్గ నుండి 47వ సర్గ వరకు వ్రాసి ముగించి చివరలో జినసేనుని చరిత్రను కూడా కలిపి రచించి జినసేనుని శిష్యుడైన గుణభద్రుడు ఆదిపురాణ ఉత్తర భాగాన్ని సమాప్తం చేశాడు. గ్రంథం చివరి భాగంలో సమస్త శాస్త్రాలకు సారభూతమైన ఈ పురాణం ధర్మపరులైన, శ్రేష్ఠులచేత శకం 820, పింగళ సంవత్సర ఆశ్వయుజమాస శుక్ల పక్ష పంచమి బృహస్పతి వారంనాడు పూర్తిచేయబడ్డది అని పేర్కొనబడింది. ఈ కాలం విశ్వవిఖ్యాత కీర్తిశాలి, సర్వశత్రు వినాశకుడు అకాలవర్స చక్రవర్తి రాజ్యాధిరోహణం చేసిన సంవత్సరానికి సరిపోతుంది.
వస్తుతః ఉత్తర పురాణం జైనుల చతుర్వింశతి (ఇరవై నాలుగు) పురాణాలకు సారభూతమైన కోశం లాంటిది. ఇందులో అన్ని జైన పురాణాల సారము ఇమిడి ఉన్నది. ఇది 48వ పర్వంతో మొదలు అవుతుంది. రెండవ జైనతీర్థంకరుడు అజితనాథుని నుంచి 24వ తీర్థంకరుడైన మహావీర స్వామి వరకుగల అందరు తీర్థంకరుల చరిత్రలు ఇందులో ఉన్నాయి. ఆదిపురాణం ఉత్తర పురాణాలలో తీర్థంకరుల జీవిత చరిత్ర చిత్రణకు ముందుగా చక్రవర్తులు, రాజుల చరిత్రలు ఉన్నాయి. జైన పురాణాలను అనుసరించి పూర్వజన్మలో ఈ రాజులు, చక్రవర్తులే మరుజన్మలో తీర్థంకరులుగా జన్మనెత్తారు. ఈ రెండు పురాణాల తోను కలిపి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు, పన్నెండు మంది చక్రవర్తులు, తొమ్మిది మంది వాసుదేవులు తొమ్మిది మంది శుక్లబలులు, తొమ్మిది మంది విష్ణుద్విసులు మొత్తం అరవై మూడు మంది మహాత్ముల చరిత్రలు వివరించబడ్డాయి. అందుకే దీనిని ‘త్రిషష్ట్య వయవి’ అని కూడా అంటారు.
బౌద్ధ సాహిత్యంలో పురాణాలు
బౌద్ధ పురాణాలనే త్రిపిటకాలంటారు. హిందూ ధర్మంలో పురాణాలకు ఎంత వైశిష్ట్యం ఉన్నదో బౌద్ధ ధర్మంలో త్రిపిటకాలకు అంతే విశిష్టత ఉన్నది. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం కలిగి బుద్ధత్వాన్ని పొందిన తరువాత ఆయన మహాపరినిర్వాణం (స్వర్గా రోహణం) పొందేంతవరకు ఉన్న మధ్యకాలంలో ఆయన ఉపదేశించిన విషయాలు సమస్తమూ సంగ్రహంగా త్రిపిటకాలలో సంకలించబడ్డాయి. త్రిపిటకాల (అంటే మూడు గంపలు)లో బోధిసత్త్వుడు అయిన బుద్ధ భగవానుని బోధనలు అన్నీ పొందుపరచబడి ఉన్నాయి.
1. సుత్త పిటకం,
2. వినయ పిటకం,
3. అభిధర్మ పిటకం
అనేవి ఆ మూడు బౌద్ధ పిటక గ్రంథాలు.
1. స్తుతపిటకం లేక సూత్ర సమూహము అనే మొదటి గ్రంథంలో బౌద్ధులు అనుసరించవలసిన ఉపదేశాలు సూత్ర రూపంలో సంగ్రహించబడ్డాయి.
2. వినయ పిటకం అనే రెండవ గ్రంథంలో సంక్షేమ విషయాలను తెలిపే బోధనలు సంకలించబడ్డాయి.
3. అభిధమ్మ పిటకం అనే మూడవ గ్రంథంలో నైతిక, మనోవైజ్ఞానిక ధర్మాలు విశ్లేషించబడ్డాయి. ఇవి దార్శనికత ఆధారంగా శిలలపై చెక్కించబడిన, వాటి ఆధారంగా నిలిచి ఉన్నందుకు ఏమి కారణమో తెలియకుండా ఉన్నది.
తధాగత బుద్ధుని అనుయాయులైన విద్వాంసులు ఈ త్రిపిటకాలను సంపాదించి సంకలనం చేశారు. ఈ గ్రంథాల ఆధారంగానే బౌద్ధ ధర్మానికి చెందిన ధార్మిక, ఆధ్యాత్మిక, భౌతిక, తాత్త్విక విషయాలను, వానిని ఆచరించవలసిన విధానాలను గురించి తెలుసుకొనే వీలుకలుగుతున్నది. వీటి ద్వారా శీలము, సమాధి, బుద్ధి అనే మూడు గుణాలతో సుసంపన్నుడైన వ్యక్తి మాత్రమే ఈ భవసాగరబంధనాలనుంచి విముక్తుడు కాగలడని బుద్ధ భగవానుని ఉపదేశాల సారమని గ్రహించవచ్చు.
పురాణ పురుషుడు నారాయణుడు
అష్టాదశ పురాణాలు నారాయణుడైన శ్రీమహావిష్ణువు యొక్క శరీరముగనే భావింపబడింది. నారాయణుడు పురాణపురుషుడు అని భావించటం సమర్ధనీయమే కదా. అందుచేత ఆ పురాణ పురుషుని అష్టాదశ పురాణ మూలమూర్తిగా భావించటం జరిగింది. ఈ విషయం పద్మపురాణం ఆదిఖండంలో చెప్పబడింది. విష్ణువు యొక్క వివిధ అవయవాలు వివిధ పురాణాలుగా భావించ బడ్డాయి. అప్పుడు మొత్తం అష్టాదశ పురాణాలు ఆయన స్వరూపమే అవుతుంది.
సీ. పాద్మము హృదయంబు బ్రాహ్మము మూర్థంబు
మజ్జగారుడము వామనము త్వచము.
భాగవతము దొడల్ బ్రహ్మాండమస్థులు
మాత్స్యము మెదడు కౌర్మంబు వెన్ను
లైంగవారాహముల్ దక్షిణ వామ గు
ల్ఫంబులు నారదీయంబు నాభి
రోమముల్ స్కాందము వామ దక్షిణ భుజ
ద్వంద్వంబు శైవంబు వైష్ణవంబు
గీ. వామపాద మాగ్నేయంబు వామజాను
తలము బ్రహ్మవైవర్తంబు దక్షిణోరు
పర్వము భవిష్య మపసవ్య భావమొంది
నట్టి పదము మార్కండేయ మచ్యుతునకు.
(ఆంధ్రపద్మ పురాణం. ఆది ఖం. 828)
అని పద్మ పురాణం తెలుపుతున్నది. దీనిని అనుసరించి పురాణ పురుషుడైన నారాయణుని అవయవములతో వివిధ పురాణములు ఏకీభవిస్తాయి.
1. పద్మ పురాణము - హృదయము
2. బ్రహ్మ పురాణము - శిరస్సు
3. గరుడ పురాణము - మజ్జ
4. వామన పురాణము - చర్మము
5. భాగవత పురాణము - తొడలు
6. బ్రహ్మాండ పురాణము - ఎముకలు
7. మత్స్య పురాణము - మెదడు
8. కూర్మ పురాణము - వెన్ను (పృష్ఠము)
9. లింగపురాణము - కుడిచీలమండ
10. వరాహ పురాణము - ఎడమ చీలమండు
11. నారద పురాణము - బొడ్డు
12. స్కాందపురాణము - వెంట్రుకలు
13. శివపురాణము - ఎడమ భుజము
14. విష్ణుపురాణము - కుడి భుజము
15. అగ్ని పురాణము - ఎడమ పాదము
16. మార్కండేయ పురాణము - కుడి పాదము
17. బ్రహ్మవైవర్త పురాణం - ఎడమ మోకాలు
18. భవిష్య పురాణం - కుడి మోకాలు.
పురాణ లక్షణాలు
ప్రపంచంలో ప్రతివస్తువుకు ధర్మాలు లేక లక్షణాలు అనేవి ఉంటాయి. అలాగే పురాణమంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. తేలికగా ‘పురాణం పంచలక్షణం’ అని పెద్దలు చెప్తుంటారు. అంటే అయిదు లక్షణాలు గలది పురాణం అని ఆ అయిదు లక్షణాలేవి అంటే
సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ
వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణమ్ (మత్స్యపు-53-64)
అంటే 1. సర్గము, 2. ప్రతి సర్గము 3. వంశం 4. మన్వంతరం 5. వంశాను చరితమనే అయిదు లక్షణాలుగలది పురాణము. ఈ శ్లోకం దాదాపు అన్ని పురాణాలలోను, సంస్కృత నిఘంటువు అమరకోశంలోను కనిపిస్తుంది. ఈ పంచలక్షణాలు సర్వేసర్వత్ర పరిగణింపబడే పరంపరాగత విషయంగా భావించవచ్చు. పురాణాలకు భాగవతం వంటి కొన్ని పురాణాలు దశ లక్షణాలను నిర్దేశిస్తున్నాయి. అయితే పంచలక్షణాలే ప్రాచీనమైనవిగా భావించబడుతున్నాయి.
ఈ అయిదు లక్షణాలు అన్ని పురాణలలోనూ కొంత సమన్యూనాధిక రూపంలో వర్ణించబడినవే. కొన్నింటిలో ఒక లక్షణం గురించి అధికంగా, కొన్ని లక్షణాలు అల్పంగా చెప్పబడి ఉండవచ్చు. కొన్ని పురాణాలలో ఒక విషయమే చాలా విస్తృతంగా వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మార్కండేయపురాణంలో కేవలం మన్వంతర విషయాన్ని గురించే విపుల వివరణ ఉండగా, భాగవతంలో వంశాను చరితం మాత్రమే ప్రధానం చేయబడింది. విష్ణుపురాణంలో సర్గ అంటే సృష్టి విషయాన్ని గురించిన విపుల వర్ణన ఉన్నది. ఆయా పురాణాలలో ఒక విషయం యొక్క ఆధిక్యత ఇంకొక విషయం యొక్క న్యూనత కనిపిస్తుంది. అందువలన పురాణాలలోని రహస్యాలను తెలుసుకొనాలంటే అన్ని పురాణాల సవిమర్శనాత్మక అధ్యయనం అవసరం. అప్పుడు పురాణ రహస్యాల యథార్థ జ్ఞానం కలుగుతుంది.
1. సర్గం: ఈ సర్వ ప్రపంచము అందులోని నానా పదార్థాల ఉత్పత్తి అనగా సృష్టినే సర్గ అంటారు. సర్వానికి మూలమైన ప్రకృతిలో మూల గుణాలు క్షుబ్దం అయిపోయినప్పుడు మహతత్త్వం ఉద్భవిస్తుంది. ఈ మహత్తత్వం నుంచి సత్వరజస్తమోగుణాలనే మూడు గుణాలు అహంకారాలు అవుతాయి. ఈ త్రివిధాలైన అహంకారాల నుంచి పంచతన్మాత్రలు (భూతములు మాత్రం) ఇంద్రియాలు, అలాగే (పంచ) భూతాలు పుడతాయి. ఈ ఉత్పత్తి క్రమవిధానమే సర్గము అని పిలువబడుతుంది.
దీని ముఖ్య వర్ణన పురాణాల ద్వారానే లభ్యం అవుతున్నది. శ్రీమద్భాగవతంలో (12-7-11)
అవ్యాకృత గుణక్షోభాన్ మహతస్త్రివృతోఽహమ్
భూతమాత్రేంద్రియార్థానాం సంభవః సర్గ ఉచ్యతే
అని సర్గ యొక్క లక్షణం తెలుపబడింది.
అంటే ఈ జగత్తు అందలి నానా పదార్థాల ఉత్పత్తి లేక సృష్టి సర్గ అని చెప్పబడుతుంది. ఈ సృష్టిలో శాశ్వతుడు పరమాత్మయైన భగవంతుడు. ఆయనలో నిక్షిప్తంగా ఉండే ప్రకృతితత్త్వం యొక్క సత్త్వ, రజస్తమోగుణాల క్షోభ్యతచేత మహత్తత్త్వము జనించి దాని నుంచి అహంకార తత్త్వము, ఆ అహంకార తత్త్వం నుంచి పంచతన్మాత్రలు, ఏకా దశ ఇంద్రియాలు పంచమహా భూతాలు, వీనికి అధిష్ఠాతలైన దేవతల ఉత్పత్తిని లేక సృష్టిని సర్గ అంటారు.
2. ప్రతి సర్గము: సర్గం అనే పదానికి వ్యతిరేకమైనది ప్రతిసర్గం. అంటే సమస్త ప్రపంచం యొక్క ప్రళయం. విష్ణుపురాణంలో ప్రతి సర్గము అనే లక్షణానికి బదులుగా ‘ప్రతి సంచరము’ అని చెప్పబడింది. ఈ బ్రహ్మాండం స్వభావరీత్యానే ప్రళయకారి. ఈ ప్రళయం నాలుగు విధాలు. నైమిత్తికము ప్రాకృతికము, నిత్యము, ఆత్యంతికములనేవే ఆ నాలుగు.
3. వంశం: ‘రాజ్ఞాం బ్రహ్మప్రసూతానాం వంశం స్రైకాలికోఽన్వయః అంటుంది భాగవతం. అంటే బ్రహ్మ ద్వారా ఎందరు రాజులు సృష్టించబడ్డారో వారి యొక్క భూత, భవిష్యవర్తమాన కాలంలో గల సంతాన పరంపరను వంశము అని అంటారు. వాస్తవానికి పురాణాలలో రాజవంశాల వర్ణన మాత్రమే కాక ఋషులవంశాల వర్ణనకూడా చేయబడింది.
4. మన్వంతరం: పురాణాలలో చెప్పబడిన ప్రకారం ఈ పదానికి అర్థం విభిన్న కాలాలలో జరిగిన సంఘటనలకు గుర్తుగా ఉండే కాలగణనం. పురాణాలను అనుసరించి మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మన్వంతరానికి ఒక అధిపతి ఉంటాడు. ఆయన ఒక మనువు. ఆ మనువు సహాయం వలననే పంచ పదార్థాలు ఇంకా అనేక విభజనలుగా ఉత్పత్తిని పొందుతాయి. దేవతలు, మను పుత్రులు, ఇంద్రుడు, సప్తర్షులు, భగవంతుని యొక్క అవతారాలు అనే ఆరు విశేషాలతో కూడిన కాలాన్నే మన్వంతరం అని అంటారు.
5. వంశాను చరితము: ‘వంశాను చరితం తేషాం వృత్తం వంశ ధరాశ్చయే’ అంటుంది భాగవతం (12-7-16). ఇంతకుముందు తెల్పినట్లుగా చక్రవర్తుల, ఋషుల వంశాలలో ఉత్పన్నం చెంది, ఆయా వంశాలకు మూల పురుషులైన రాజుల విశిష్ట వర్ణనమే వంశాను చరితం అనబడుతుంది. ఇందులోనే మనుష్య సంతతిగా వివిధ వంశాలలో జన్మించిన మహర్షులు రాజుల చరిత్ర కూడా చేర్చబడి ఉంటుంది. మహర్షుల చరిత్రలను తెలుపుతూ వివిధ రాజ వంశాల చరిత్రను కూడా ప్రత్యేకంగా పురాణాలు వివరించాయి.
కానీ ప్రాచీన రాజనీతి శాస్త్రాలలో ‘పురాణం పంచ లక్షణమ్’ అనే పంచ లక్షణాలకు ఒక కొత్త విశ్లేషణ కనిపిస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పిన అయిదు లక్షణాలతో పూర్తిగా విభేదిస్తున్నది. కౌటిల్యుని అర్థశాస్త్రానికి చేసిన వ్యాఖ్య (1-5)లో జయమంగళుడు ఒక ప్రాచీన గ్రంథం నుంచి ఉద్ధరించిన.
సృష్టి-ప్రవృత్తి-సంహార-ధర్మ, మోక్ష ప్రయోజనమ్
బ్రహ్మాభిర్వివిధైః ప్రోక్తం పురాణం పంచ లక్షణమ్
అనే శ్లోకం ద్వారా ఈ భేదం తెలుస్తున్నది. ఇందులో ముఖ్యంగా చెప్పుకొనవలసినది ధర్మ విషయం. మొదటి నుంచి ‘ధర్మం’ అనే అంశం పురాణాలకు అవిభాజ్య విషయం అనేది సర్వాంగీకారమైనదే. అంటే దీనిని బట్టి పురాణాలలో మూల భూతమైన విషయం ధార్మిక విషయాల సమాహారం. అందువలననే కాలం గడిచే కొద్దీ ధర్మ సంబంధ విషయాల వివరణలో సహకాలీన వృత్తాంతాలు, విషయాలు కూడా చోటుచేసుకొని విస్తృతి పొందాయి. ఆధునిక పురాణ విమర్శకులు కూడా అందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
పురాణ దశ లక్షణాలు:
పురాణాల పంచ లక్షణాలను సర్వేసర్వత్ర అంగీకరించినా కాలం గడిచేకొద్దీ ఈ పంచ లక్షణాలనే మరికొంత విస్తృత పరచి దశ లక్షణాలు కలిగినది మహాపురాణమని, కేవలం పంచ లక్షణాలున్నది పురాణమనే వాదం ఒకటి బయలుదేరింది. శ్రీమదాగ్భవతంలో రెండు స్థలాలలోను (2-10-1-7, 12-79) బ్రహ్మవైవర్త పురాణంలోను దశ లక్షణాలతో ఉండేది మహాపురాణమనే నిర్ణయం చేయబడింది. అలాగే కేవలం ఐదు లక్షణాలుగలది సామాన్య పురాణంగా పరిగణించబడింది. భాగవతంలో రెండు స్థలాలలోను చెప్పిన దశ లక్షణాలలోను కొంత విభేదం ఉన్నా, మూలతః అవి ఒకటే. భాగవతంలోని ద్వాదశ స్కంధంలో చెప్పిన దశలక్షణాలు ఇవి:
1. సర్గ 2. విసర్గ 3. వృత్తి 4. రక్షణ 5. అంతరములు 6. వంశము 7. వంశాను చరితము 8. సంస్థా. 9. హేతువు 10. అపాశ్రయము.
1. సర్గ: ఇంతకుముందు చెప్పిన సర్గ లక్షణానికి దీనికి భేదం ఏమీ లేదు.
2. విసర్గ: దీని అర్థం జీవుల సృష్టి. పరబ్రహ్మ యొక్క అనుమతితో సృష్టించగలిగిన శక్తిని పొందిన బ్రహ్మ మహత్తత్వము మొదలైన పూర్వ కర్మలను అనుసరించి మంచి చెడు వాసనల ప్రాముఖ్యాన్ని అనుసరించి ఈ చరాచర శరీరాలతో ప్రత్యేక జీవులను సృష్టించిన విధాన వర్ణనమే విసర్గం అనబడుతుంది.
3. వృత్తి: జీవుల జీవన యాత్ర కోసం ఉద్దేశించిన సామాగ్రి అంటే చరముల కోసం అచర వస్తువుల సృష్టి వృత్తి. అంటే జీవులు జీవయాత్రను సాగించటం కోసం ఏవస్తువులను మనుష్యుడు ఉపయోగించుకొంటాడో అదే అతడి వృత్తి. అంటే మనుష్యుడు బ్రతకటానికి తినే బియ్యం, గోధుమలు మొదలైనవి వృత్తి క్రిందకే వస్తాయి. కొన్ని వృత్తులు అతడు తాను తన ఇచ్ఛ చేత ఏర్పరచుకొన్నవైతే మరికొన్ని జీవునికి ధర్మశాస్త్ర విధి ప్రకారం ఆచరించవలసినవి. కానీ ఏదైనా మానవ జీవనము, రక్షణ కోసం ఉద్దేశించినవే.
4. రక్షణ: ఇది భగవంతునికి సంబంధించినది. యుగయుగాలలోను భగవంతుడు పశు, పక్షి, మనుష్య, ఋషి, దేవుడు మొదలైన రూపాలుగా అవతారం ధరించి అనేక లీలలను ప్రదర్శిస్తాడు. ఈ అవతారాల ద్వారా వేదాలను, వేదధర్మాలను రక్షించి, వాటిని విరోధించే వారిని శిక్షిస్తాడు. సంహరిస్తాడు. అందువలన భగవంతుని అవతార లీలలు విశ్వ రక్షణకు జరిపినట్టివి. అందుకే ఇది రక్షణ అని చెప్పబడుతున్నది.
5. అంతరములు: ఇవే మన్వంతరములని పంచ లక్షణాలో చెప్పబడినట్టివి.
6. వంశము: వివిధ, రాజ, ఋషి వంశాల పుట్టుకను, వృద్ధిని వర్ణించేది.
7. వంశాను చరితము: రాజ, ఋషి వంశాల క్రమాన్ని తరతరాల చరిత్రను తెలిపేవి వంశాను చరితలు. ఇవి కూడా పంచ లక్షణములలో చెప్పిన ధర్మాలు కలవే.
8. సంస్థ: ప్రతి సర్గము అని పంచ లక్షణాలలో చెప్పిన దానికి దీనికి భేదం లేదు.
9. హేతువు: అంటే జీవుడు అనే అర్థాన్ని గ్రహించాలి ఇక్కడ. జీవుడు అవిద్య ద్వారా తాను చేసే, ఆచరించే పనులకు కర్త అవుతున్నాడు. ప్రపంచ సృష్టిలో జీవుడికి ఏం ప్రమేయం ఉందంటే, జీవుని అదృష్టం ద్వారా జరిగే కర్మల వలన సర్గం అంటే సృష్టి విసర్గం అంటే నాశనం జరుగుతున్నాయి. అందుకే ఈ సృష్టి ప్రళయాలకు కారణం లేక హేతువుగా జీవుడు పరిగణింపబడుతున్నాడు. అందువలన పురాణాలలో చెప్పబడిన ఈ విషయానికి సంబంధించిన విస్తృతినే హేతువు అంటున్నారు.
10. అపాశ్రయము: పరబ్రహ్మకే ఇంకొక పేరు. జీవునికి మూడు వృత్తులు లేక అవస్థలు ఉన్నాయి. జాగ్రదవస్థ స్వప్నము సుషుప్తి అనేవి ఆమూడు అవస్థలు. ఈ మూడు దశలలోను జీవునిలో చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యమే విశ్వము, తేజస్సు, ప్రజ్ఞా అనేపేర్లతో పిలువబడుతుంది. ఈ మాయామయ వృత్తులలో సాక్షిరూపంగా ఎల్లప్పుడు జీవునిలో ఉండే మహాశక్తే అధిష్ఠాన రూపంలోని అపాశ్రయతత్త్వం. ఆ మహాశక్తే పర బ్రహ్మము లేక అపాశ్రయము అని పిలువబడుతుంది. జీవుని అన్నిస్థితులలోనూ ఈ అపాశ్రయశక్తి ఉంటుంది. ఆశక్తి నామరూపాత్మక పదార్థాలతోపాటుగా ఒకప్పుడు యుతంగా (ప్రత్యక్షంగా) మరొకప్పుడు అయుతంగా (అంటే కనిపించకుండా) ఉండవచ్చు. ఈ అపాశ్రయతత్వాన్ని వివరించటం పురాణం నిర్వర్తించవలసిన పదవ లక్షణము.
భాగవతం ద్వితీయ స్కంధంలో చెప్పిన దశ లక్షణాలు ఇవి.
1. సర్గ 2. ప్రతిసర్గ 3. స్థానం
4. పోషణం 5. ఊతయము 6. మన్వంతరమ్
7. ఈశానుకథ 8. నిరోధము 9. ముక్తి
10. ఆశ్రయము.
పై వాని శబ్దార్థ, తత్త్వార్థాలను నిశితంగా పరిశీలిస్తే ఇంతకుముందు చెప్పిన-అంటే ద్వాదశ స్కంధంలోని దశలక్షణాలకు వీటికి పెద్దగా భేదం లేదు.
మొత్తం మీద పంచలక్షణాలైనా, దశ లక్షణాలైనా ఒకదాని కొకటి పరస్పర సంబంధం కలవి. ఒకటి రెండవ దానిలో ఐక్యం చెందేవే. పురాణ సాహిత్యం విస్తృతి చెందటంతో సమగ్ర లక్షణం కల్పించాలనే భావనతో పంచ లక్షణాలు దశ లక్షణాలుగా వికాసం చెందాయని భావించటం సముచితం.
పురాణ వర్గీకరణం
మొత్తం అష్టాదశ పురాణాలు రకరకాల వర్గీకరణ చేయబడ్డాయి. ఆవర్గీకరణ వివిధ పురాణాలలో చెప్పబడిన విషయ ప్రధానంగా ఉన్నది. కానీ ఇవి అంతగా శాస్త్రీయం కాదు.
మొదటి వర్గీకరణ పురాణాలు సత్త్వరజస్తమో పురాణాలని అవి ప్రతిపాదించే గుణాలను ఆధారం చేసుకొని మూడు రకాలుగా విభజించడ్డాయి. వీటిలో
1. విష్ణు, నారదీయ, భాగవత, గరుడ పద్మ వరాహపురాణాలు సత్త్వ గుణం కలవి (విష్ణువు యొక్క పారమ్య కారణమైన సాత్త్విక అంశాలు కలవి) కాబట్టి ఈ ఆరు సాత్త్విక పురాణాలు.
2. మత్స్య, కూర్మ, లింగ, శివస్కంద, అగ్నిపురాణాలు తామస గుణప్రధానం కలవి (పరమ శివుని సంహారక తామస అంశాన్ని అనుసరించి) కాబట్టి ఈ ఆరు తామస పురాణాలు.
3. బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త, మార్కండేయ, భవిష్య, వామన పురాణాలు రజోగుణ ప్రాధాన్యం కలవి. (బ్రహ్మ ప్రపంచ సృష్టిని చేయటానికి అవసరమైన రజో గుణం కలవి) కాబట్టి ఈ ఆరు రాజస పురాణాలు. వీటిల్లో మొదటి ఆరు విష్ణు పారమ్యాన్ని బోధించేవి అంటే వైష్ణవ మత ప్రతిపాదకాలు రెండవ ఆరు శక్తి శివుని పారమ్యాన్ని బోధించేవి అంటే శైవ, శాక్తేయ ప్రతిపాదకాలు. చివరి ఆరు బ్రహ్మకు ప్రాధాన్యత ఇవ్వబడినవి. బ్రహ్మపారమ్యాలు. అందుచేత అవి బ్రహ్మసంబంధాలు.
ఈ వర్గీకరణ ఇలాగే చేసినా మత్స్య, పద్మ గరుడ పురాణాలలో పురాణాలను పేర్కొనటంలో కొంత భేదాలు ఉన్నాయి. గరుడపురాణంలో, కూర్మపురాణం సాత్త్విక పురాణంగా చేర్చబడింది. గరుడపురాణం సాత్త్విక పురాణాలను తిరిగి మూడు భాగాలుగా సాత్త్విక ఉత్తమ (విష్ణు, భాగవత గరుడపురాణాలు) సాత్త్విక మధ్యమ-(వాయుపురాణం) సాత్త్విక అధమ (మత్స్యకూర్మ పురాణాలుగా) పేర్కొంటున్నది. ఏదైనా ఈ రకమైన విభాగం ప్రాచీనమేకానీ, అంతశాస్త్రీయం కాదు. స్కాందపురాణం, పురాణాలలో పది శివుడిని, నాల్గింటిలో బ్రహ్మను రెండింటిలో దేవి, రెండింటిలో విష్ణు ఉపాసన చెప్పబడిందని వర్గీకరించింది. దీని ప్రకారం. 1. శివప్రధానం-10 2. బ్రహ్మపారమ్యం 4 3.దేవీ పారమ్యం-2 4. విష్ణు పారమ్యం-2
ఇదే స్కాంద పురాణం శివరహస్య ఖండంలోని సంభవ కాండలో (2-30-38) ఇంకొక వర్గీకరణ కనిపిస్తుంది.
1. శైవ (శివ విషయక పురాణం) శివ, భవిష్య, మార్కండేయ, లింగ,
వరాహ, స్కంధ, మత్స్య, కూర్మ వామన బ్రహ్మాండ - 10
2. వైష్ణవ (విష్ణు విషయక పురాణాలు, విష్ణు, భాగవత, నారదగరుడ - 4.
3. బ్రహ్మ (బ్రహ్మ విషయక పురాణాలు) బ్రహ్మ, పద్మ - 2
4. సవిత్రు (సూర్య విషయక పురాణాలు) బ్రహ్మ వైవర్త - 1
5. ఆగ్నేయ (అగ్ని విషయక పురాణం) అగ్ని - 1
మొత్తం 18
ఆధునికులు కొందరు ఈ అష్టాదశ పురాణాలను వేరొక విధంగా వర్గీకరించారు.
1. విజ్ఞాన కోశీయ పురాణాలు-అగ్ని, గరుడ, నారద పురాణాలు
2. తీర్థ సంబంధ పురాణాలు-పద్మ, స్కంద, భవిష్య పురాణాలు
3. సాంప్రదాయిక విషయ పురాణాలు-లింగ, వామన, మార్కండేయ పురాణాలు
4. ఐతిహాసిక విషయ పురాణాలు-వాయు, బ్రహ్మాండపురాణాలు
ఈ సందర్భంలో వాయు, బ్రహ్మాండ మత్స్య విష్ణు పురాణాలు ఉన్న వాటిలో అతి ప్రాచీనాలని గుర్తుంచుకోవాలి. వీటిలో మొదటి రకానికి చెందినవానిలో విజ్ఞాన సర్వస్వం అంటే మానవ సమాజానికి ఉపయోగపడే సమస్త విద్యలు (ఆధ్యాత్మిక భౌతిక విద్యలు) అన్నింటి సారాంశం ఉన్నది. వీటిల్లో ప్రాచీన కాలంలో వర్తించిన విద్యలు సంక్షేపంగా, చక్కని విధానంలో తెలుపబడ్డాయి.
రెండవ రకానికి చెందిన వానిలో తీర్థాలు, వ్రతాలు, వాని మాహాత్మ్యాలు మొదలైనవి తెలియ జేయబడ్డాయి. పద్మ స్కాంద పురాణాలు ఈ కోవకు చెందినవి. వీటిని ‘ప్రాధాన్యే వ్యపదేశా భవన్తి’ అనే న్యాయంగా అర్థం చేసుకోవాలి.
మూడవ వర్గంలోకి, బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, భాగవత పురాణాలు వస్తాయి. ప్రాచీన హైందవ సంప్రదాయిక విషయాలెన్నో వీనిలో ఉంటాయి. ఇవి రెండుసార్లు మార్పులను పొందాయని, దాని కేంద్రంగా ఉన్న భాగమే మూలభాగమని పండితుల నమ్మకం.
చతుర్థ విభాగంలో ఐతిహాసిక విషయాలు చెప్పబడిన పురాణాలు వస్తాయి. అంటే ఆయా పురాణాలలో కలియుగ వంశరాజుల చరిత్రలను, చారిత్రక దృష్టితో చెప్పిన అంశాలు వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగానే భారతదేశ చరిత్ర రచింపబడిందనే విషయాన్ని మనం విస్మరించ గూడదు. ఈ రకమైన పురాణాల్లో వాయు, బ్రహ్మాండ పురాణాలు ఎక్కువగాను, విష్ణు, మార్కండేయ పురాణాలు కొంతవరకు ఉపయోగిస్తాయి.
ఏ విధంగా వర్గీకరణ చేసినా, అది పూర్తిగా సమర్థనీయంగా చేయటం కుదిరేది కాదు. ఒకే పురాణంలో అనేక విషయాలు కలగాపులగంగా ఉంటాయి గదా. కేవలం దానిని ఒక సూచనగా మాత్రమే గ్రహించాలి.
పురాణ సాహిత్యం-మరోవర్గీకరణ:
కాలక్రమేణా పురాణ సాహిత్యం వృద్ధి పొందిందని భావించటంలో ఎలాంటి అభిప్రాయ భేదము లేదు. అనంతర కాలంలో వివిధ స్థలాలలో దైవ తీర్థ క్షేత్ర ప్రశస్తిని ఇనుమడింపచేయటానికి అష్టాదశ పురాణాలను అనుకరిస్తూ కొన్ని పురాణఖండాలు రచింపబడ్డాయి. ఈ రచనలలో అష్టాదశ పురాణాలను అనుకరిస్తూ కొన్ని చోట్ల అందులోని తీర్థక్షేత్ర దైవ మాహాత్మ్యాలను పెంచి కొన్ని సందర్భాలలో హ్రస్వీకరించి, ఏవో కొన్ని కారణాలతో కొంతమార్చి పురాణాలు రచింపబడ్డాయి. వీటినే ఉప పురాణాలన్నారు. ఈ ఉప పురాణాలు కూడా పద్దెనిమిదని చెప్పి వాటికి ప్రామాణ్యతను కల్పించారు.
మహాపురాణాన్యేతానిహ్యష్ఠా దశమహామునే
తథాచోప పురాణాని మునిభ్యాం కథితానిచ (వి.పు. 8-6ఽ4)
అని అష్టాదశ మహాపురాణ ఉప పురాణాలను మునులే రచించారని విష్ణుపురాణం తెలుపుతున్నది. అయితే మత్స్యపురాణం
అష్టాదశభ్యస్తుప్పథక్ పురాణం తత్ర్యదృశ్యతే
విజానీధ్వంద్విజ శ్రేష్ఠస్తథాతేభ్యో వినిర్గతమ్ (53- 63)
అని ఈ అష్టాదశ మహాపురాణాలే కాక ఇంకా ఉన్న పురాణాలు వాటి నుండే ఆవిర్భవించాయి అని కూడా తెలుపుతున్నది. ఈ ఉపపురాణాల నుంచి వాటికి మూలాలైన అసలు పురాణాలను వేరుగా తెలియజేయటానికే అసలైన మూలపురాణాలకు ‘మహా’ అనే విశేషణం చేర్చి మహా పురాణాలంటున్నారు.
అయితే కొన్ని ఉపపురాణాలు కూడా తమ పేర్లకు ముందు ‘మహా’ చేర్చుకొని ఈ వర్గీకరణనంతా గజిబిజి చేశాయనేది అసలు విషయం. మహాపురాణాల ప్రామాణికతను శంకించవలసినపనిలేదు. అయితే ఈ ఉపపురాణాల ప్రామాణికత ఎంతఅంటే (అన్యాశ్చ సంహితాః సర్వామరీచిక పిలాదయః సర్వత్ర ధర్మకథనే తుల్యసామర్థ్యముచ్యతే) మహా పురాణాలకు ధర్మ విషయాలలో ఎంత ప్రామాణికత ఉన్నదో ఉపపురాణాలకు కూడా సమానమైన ప్రామాణ్యత ఉన్నదని చెప్పబడింది.
నిజానికి లభ్యమవుతున్న ఉపపురాణాలు, సంఖ్యలో కొంత ఎక్కువగానే ఉన్నా, వాటి సంఖ్య కూడా పద్దెనిమిదే-అష్టాదశ పురాణా నామేవ విదుర్భుధాః, ఏవంచో ఏ పురాణానామష్టాదశ ప్రకీర్తితాః (131-22) అని బ్రహ్మ వైవర్త పురాణం తెలుపుతున్నది. స్కాంద పురాణం కూడా పారాశరం భాగవతం క్రౌంచ మష్టాదశమ్ మతమ్ (స్కాంద-రేవాఖండం-1-55) అని ఈ విషయాన్ని బలపరుస్తున్నది. ఉపపురాణాలు:
1. ఆదిపురాణం 2. నరసింహ పురాణం
3. స్కాంద పురాణం. 4. శివ ధర్మ పురాణం
5. దూర్వాస పురాణం 6. నారదీయ పురాణం
7. కపిల పురాణం 8. వామన పురాణం
9. ఔశసన పురాణం 10. బ్రహ్మాండ పురాణం
11. వరుణ పురాణం 12. కాళికా పురాణం
13. మాహేశ్వర పురాణం 14. శాంబపురాణం
15. సౌర పురాణము 16. పారాశర పురాణము
17. మారీచ పురాణము 18. భాస్కర పురాణం
ఈ పురాణాల వరుస ఎవరెవరు ఎవరికి చెప్పారనే విషయాన్ని కూర్మ పురాణం (పూ. అ. 1-17-20)
ఆద్యంసనత్కుమారోక్తం నారసింహ మధాపరమ్
తృతీయం స్కాందముద్దిష్టం కుమారేణచ భాషితమ్
చతుర్థం శివధర్మాఖ్యం సాక్షాన్నందీశ భాషితమ్
దూర్వాస సోక్త మాశ్చర్యం నారదీయమతః పరమ్
కపిలం వామనంచైవ తథైవోశన సేరితమ్
బ్రహ్మాండం వారుణం చాథ కాపీలాహ్వ యమేవచ
మాహేశ్వరం తథా శాంబం సౌరం సర్వార్థ సంచయమ్
పరాశరోక్తమపరం మారీచం భాస్కరాహ్వయమ్
అని ధృవీకరిస్తున్నది. పై సూచికను పరిశీలిస్తే స్కాందపురాణం, బ్రహ్మాండ పురాణం, వామన పురాణం, నారదపురాణం మహాపురాణాలలోను ఉన్నాయి. అలాగే భాగవతాలు దేవీ భాగవతం, విష్ణుభాగవతాలు ఈ సూచికలో లేకపోయినా ఏది మహాపురాణం అనే దానిలో కొంత అభిప్రాయభేదం ఉన్నది. మహాపురాణాల జాబితాలో ఉన్నది శివపురాణమా వాయు పురాణమా అనేది కూడా సందిగ్ధాంశమే. చాలామంది పండితులు శివపురాణ దేవీ భాగవతాలు ఉపపురాణాలనే వాదాన్ని అంగీకరిస్తున్నారు కానీ ఈ ఉపపురాణాల జాబితాలో అసలు భాగవత ప్రస్తావనే లేదు. అప్పుడు దేవీ భాగవతం ఏ శాఖ క్రిందకు రావాలి? కానీ ఔప పురాణాలని ఉన్న ఒక శాఖలో భాగవతం ఉన్నది. అదే దేవీ భాగవతం అయి ఉండాలి.
అష్టాదశ మహాపురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు ఉన్నట్లే అష్టాదశ ఔపపురాణాలు ఉన్నాయి. బృహద్వివేకము అనే గ్రంథం వాటిని గురించి
ఆద్యం సనత్కు మారంచ నారదీయం బృహచ్చయత్
ఆదిత్యం భావనం ప్రోక్తం నందికేశ్వర మేవచ
కౌర్మ భాగవతం జ్ఞేయం వాసిష్ఠ భార్గవం తథా
ముద్గలం కల్కిదేవ్యౌచ మహా భాగవతం తతః
బృహద్ధర్మం పరానన్దం వహ్నిం పశుపతిం తథా
హరివంశం తతోజ్ఞేతు మిదమౌపపురాణకమ్
అని చెప్పాడు. అప్పుడు అష్టాదశ ఔప పురాణాలు ఇవి:
1. సనత్కుమారు 2. బృహన్నారదీయ
3. ఆదిత్య 4. సౌర (సూర్య)
5. నందికేశ్వర 6. కౌర్మ
7. భాగవత 8. వాసిష్ఠ
9. భార్గవ 10. ముద్గల
11. కల్కి 12. దేవీ
13. మహాభాగవత 14. బృహద్ధర్మ
15. పరానంద 16. వహ్ని
17. పశుపతి 18. హరివంశ పురాణాలు
ఈ జాబితాలోవి కూడా కొన్ని మహాపురాణాలలో ఉన్నాయి. కొన్ని ఉప పురాణాలలో ఉన్నాయి. భారతానికి ఖిలపర్వంగా చెప్పబడే హరివంశం ఇందులో పురాణస్థాయికి చేర్చబడింది. ధర్మ కల్పద్రుమం అనే గ్రంథంలో జ్ఞానానంద సరస్వతి ఇంకా పురాణాలు ఉన్నాయని తెలిపి ఆ పురాణాలను అయిదు విధాలుగా వర్గీకరించాడు.
1. మహాపురాణాలు 2. ఉపపురాణాలు
3. ఔపపురాణాలు 4 ఉపోప పురాణాలు
5. ఉపౌప పురాణాలు
ఇలా రక రకాల అవాంతర భేదాలు పురాణాలలో ఉండగా వీనిని గుర్తించ కుండానే కొందరు ముఖ్యంగా మన తెలుగుకవులు కొంత గందరగోళానికి లోనైనారు. ఇది ఆధునిక కాలంలోనే కాదు. ప్రాచీన కాలంలోనే జరిగింది. శ్రీనాథకవి సార్వభౌముడు మహాపురాణాలలోని స్కాందంలో భాగమైన కాశీఖండాన్ని తెలుగులోనికి అనువదించేటప్పుడు సప్తఖండాత్మక స్కాందమన్నాడు. గోదావరి ఖండంలోని భీమఖండాన్ని రచిస్తూ పంచాశత్ఖండ మండితస్కాందం అన్నాడు. మహాపురాణమైన స్కాందంలో ఉన్నవే ఏడు ఖండాలు. వాటిల్లో గోదావరీ ఖండం లేనే లేదు. పంచాశత్ఖండ మండితమైన స్కాందంలోను గోదావరి ఖండం ఒకటిగా లేదు. ద్రాక్షారామ భీమేశ్వరునికి ప్రసిద్ధి కల్పించటానికి సంస్కృత భీమఖండాన్ని శ్రీనాథుడే రచించాడని ఒక ప్రతీతి. యథార్థం భీమేశ్వరునికే ఎరుక.
ఇక పద్దెనిమిదవ శతాబ్దం ప్రథమ పాదానికి చెందిన హంసవింశతి కర్త అయ్యలరాజు నారాయణామాత్యుడు తన హంసవింశతిలో అష్టాదశ పురాణాలను తెలుపుతూ బ్రహ్మోత్తర ఖండం వాటిలో ఒకటి అని తెల్పాడు. నిజానికి సప్తఖండాత్మకమైన స్కాందపురాణంలో మూడవ ఖండమైన బ్రహ్మ ఖండంలో ఉత్తర భాగమే బ్రహ్మోత్తర ఖండం. ఇది తెలుగు దేశంలో విస్తృత ప్రచారం పొందిన స్కాందంలోని భాగం. ప్రాచీన కాలంలోనే దీనికి ఐదు పద్యానువాదాలు వచ్చాయంటే దాని ప్రసిద్ధి అర్థం చేసుకోవచ్చు. అందుకే అయ్యలరాజు నారాయణకవి పొరపాటు పడినట్లున్నాడు.
మహా పురాణాలలో అనేక విషయాలు కలగాపులగంగా ఉన్నాయి. ముఖ్యంగా శివ, విష్ణు, దేవీ, అగ్ని మొదలైన దైవతాల పారమ్యాన్ని తెలిపే విషయంలో ఏ పురాణమూ పూర్తిగా ఒక పక్షమే వహించదు. అసలు హిందూ ధర్మమే అందుకు వ్యతిరేకం గదా. కానీ కాలంగడిచే కొద్దీ ఈ పారమ్య భావం ఎక్కువై ఒక్కొక్క దైవపారమ్యంగా ప్రత్యేక పురాణాలే కనిపిస్తున్నాయి. అందువలననే ఈ ఉపపురాణాలలో కూడా శైవ, వైష్ణవ, సౌర, శాక్తాది భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పండితులు పురాణ రచనా కాలాలను గురించి చాలా చర్చలు చేశారు. వారి చర్చల సారాంశం ఇవి అన్నీ ఒక కాలంలో రచించటం జరగలేదని మాత్రమే కాకుండా, ఒక పురాణంలోని వివిధ భాగాలు వివిధ కాలాలలో రచింపబడ్డాయనేదే. ఏదైనా ఉపపురాణౌప పురాణాదులలో చాలా వరకు క్రీ.శ. పదవ శతాబ్దానికి ముందు కాలంలోనే రచించటం జరిగిందనేది ఒక ఊహ. కొన్ని ఉప పురాణాలు. క్రీస్తుకు పూర్వమే పంచమ శతాబ్దంలోనే ఉన్నాయని మరికొన్ని క్రీ.శ. షష్ఠ శతాబ్దం ప్రాంతానికి చెందినవని మరి కొందరు పండితుల అభిప్రాయం. ఇలా పురాణ సాహిత్యం విస్తృతిని పొంది మహాపురాణ ఉపపురాణ ఔపపురాణ ఔపోప పురాణ భేదాలతో విలసిస్తూ వట వృక్షంలాగా విస్తరించి జాతి జీవనంలో నరనరాలా జీర్ణించుకొనిపోయింది. ఇది ఎంత విస్తృతమైనదో దానిని అధ్యయనం చేసినవారికే తప్ప ఇతరులకు ఊహైక గమ్యము.
పురాణాలకు కల్ప సంబంధం
ఇంతకుముందు ఏ పురాణం ఏ కల్పాలలో జరిగిన విషయాలను తెలుపుతున్నదో ఆయా పురాణాలలోని విషయాలను తెలిపేటప్పుడు తెలియజేయబడింది. ఇక్కడ ఆ వివరాలు పట్టికలో ఇవ్వబడ్డాయి చూడండి.
1. బ్రహ్మపురాణం బ్రహ్మకల్పం 10,000 శ్లోకాలు
2. పద్మపురాణం పద్మకల్పం 55,000 శ్లోకాలు
3. విష్ణుపురాణం వరాహ కల్పం 8,000 శ్లోకాలు
4. శివ/వాయు పురాణం శ్వేత కల్పం 24,000 శ్లోకాలు
5. భాగవత పురాణం సారస్వత కల్పం 18,000 శ్లోకాలు
6. భవిష్య పురాణం అఘోరకల్పం 31,000 శ్లోకాలు
7. నారదపురాణం బృహత్ కల్పం 25,000 శ్లోకాలు
8. మార్కండేయ పురాణం మధురకల్పం 9,000 శ్లోకాలు
9. అగ్నిపురాణం ఈశాన కల్పం 8,000 శ్లోకాలు
10. బ్రహ్మవైవర్తపురాణం రథంతర కల్పం 12,000 శ్లోకాలు
11. లింగపురాణం అగ్నికల్పం 11,000 శ్లోకాలు
12. వామనపురాణం కూర్మకల్పం 14,000 శ్లోకాలు
13. స్కాందపురాణం తత్పురుష కల్పం 1,00,000 శ్లోకాలు
14. మత్స్యపురాణం సత్యకల్పం 6,000 శ్లోకాలు
15. కూర్మపురాణం లక్ష్మీకల్పం 24,000 శ్లోకాలు
16. వరాహపురాణం మానవ కల్పం 24,000 శ్లోకాలు
17. గరుడ పురాణం గారుడ కల్పం 19,000 శ్లోకాలు
18. బ్రహ్మాండపురాణం భవిష్యకల్పం 12,000 శ్లోకాలు
మొత్తం 4,00,000 శ్లోకాలు
ఇంతకుముందు చెప్పిన శ్లోక సంఖ్యపైన చూపిన శ్లోక సంఖ్యతో కొంత భేదించవచ్చు. అది సంహితాభేదం మొదలైన కారణాల వలన కావచ్చునని విష్ణుచిత్తీయ వ్యాఖ్య తెల్పుతున్నది. అలాగే ఆయా పురాణాలలో తరువాత చొరబడిన ప్రక్షిప్తాలు, దొరకని భాగాలు వీటి అన్నింటి కారణాల చేత ఈ భేదం ఏర్పడి ఉండవచ్చు. కానీ వ్యాస ప్రోక్తమైన పద్ధెనిమిది పురాణాలలోని మొత్తం శ్లోక సంఖ్య నాలుగు లక్షలని అన్ని పురాణాలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి.
మన్వంతరము
ఒక్కొక్క మన్వంతర కాలమున ఒక్కొక్క మనువు పాలన చేస్తాడు. ఈ మన్వంతరాలు 14. మొత్తం వానికి అధిపతులైన మనువులు 14 మంది. వారు 1. స్వాయంభువుడు 2. స్వారోచిషుడు 3. ఉత్తముడు 4. తామసుడు 5. రైవతుడు 6. చాక్షుషుడు-ఇక్కడి వరకు మన్వంతరములు గడిచి పోయినవి. ప్రస్తుతము ఏడవదైన వైవస్వతమన్వంతరము జరుగుతున్నందువలన 7. వైవస్వతుడు (ఇతడు ఇప్పటి మనువు) 8. సావర్ణి 9. దక్ష సావర్ణి 10. బ్రహ్మసావర్ణి 11. ధర్మసావర్ణి 12. రుద్రసావర్ణి 13. దేవసావర్ణి 14. ఇంద్రసావర్ణి (వీరంతా రాబోయే మనువులు). వివిధ పురాణాల్లో ఈ మనువుల పేర్లతో కూడా కొన్ని భేదాలు కనిపిస్తున్నాయి. అది కల్పభేదముచేత కలిగినదని పురాణ పండితుల ఉద్దేశ్యము.
మన్వంతరాలు, కల్పాల స్వరూపం
చారిత్రక గణనంలో మన్వంతరం చాలా ముఖ్యమైనది. లేకపోతే సృష్టి నుంచి ప్రళయం వరకు సాగే ఈ మహత్తరమైన అంతులేని కాలంలో కనీసం కొండ గుర్తులుగానైనా ఏది ఎప్పుడు జరిగిందో గుర్తించడం ఎలా. అందుకే భాగవతం
మన్వంతరం మనుర్దేవా మనుపుత్రా సురేశ్వరః
ఋషయోఽశాంవతారాశ్చ హరేః షడ్విధముచ్యతే
అనగా మనువు, మనుపుత్రులు, దేవతలు, ఋషులు, అంశావతారాల, ప్రసిద్ధ సంఘటనలు జరిగిన విషయాలు చెప్పినప్పుడు దానిని మన్వంతరం అంటారు.
స్వాయంభువమనువు యొక్క కాలం ఏ ఏ ఋషులు, మహర్షులు, రాజులు ఉన్నారు, స్వారోచిష మనువు కాలంలో ఆయనకు సహాయంగా ఉన్న మహాపురుషు లెవరు, ఉత్తమ మనువు కాలంలో ఏయే పురాణాల ప్రాముఖ్యత ఉన్నది, లేకపోతే రైవతక మనువు కాలంలో ఎటువంటి సంఘ నిర్మాణం ఉన్నది. ఇలాంటి విషయాలన్నింటని గురించి తెలుసుకొనటానికి పురాణాలలో తప్పితే వేరు ఆధారభూతమైనవి ఏమున్నాయి. అలాగే మన్వంతర జ్ఞానం లేకుండా ఏ రాజు యొక్క వంశము యొక్క సరియైన జ్ఞానము, అవగాహనలు అవసరము కదా. ఒక కల్పంలో పధ్నాలుగా మంది మనువులుంటారు. మనుష్యమానానికి కొద్ది ఎక్కువగా ఉండే 71 మహాయుగాలకు అంటే 30,85,71,428 సంవత్సరాల 6 నెలల 25 రోజుల 42 గడియల కాలాన్ని ఒక మన్వంతరం అంటారు. ఇలాంటి మన్వంతరాలు 14 అంటే 432 కోట్ల మనుష్య సంవత్సరాలు-బ్రహ్మదేవునికి ఒక పగలు. దీనికి ‘ఉదయ కల్పం’ అని పేరు. ఇందులో బ్రహ్మాదుల సృష్టి జరుగుతుంది. తిరిగి ఇంతేకాలం బ్రహ్మదేవునికి రాత్రి. దీనికి ‘క్షయ కల్పము’ అని పేరు. ఈ సమయంలో సంకర్షణ అగ్ని చేత భూర్భువస్సువర్మహర్లోకాలు దగ్ధం అవుతాయి. దీనిన నైమిత్తిక ప్రళయం అంటారు. ఉదయ కల్పం, క్షయకల్పం రెండూ కలిస్తే బ్రహ్మకు ఒక అహోరాత్రం అవుతుంది. దీనికే కల్పం అని పేరు. 360 కల్పాలు ఇలాంటివి బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు నూరు బ్రహ్మదేవునికి పరమ ఆయుర్దాయము. దీనికి ఒక మహా కల్పం అని పేరు. ఈ మహాకల్పం తరువాత వచ్చే ప్రళయాన్ని ప్రాకృతిక ప్రళయము అంటారు.
ఈ కల్పాలు అనంతం. కొన్ని పేర్లను మాత్రం తెలుసుకొందాం.
1. శ్వేత వరాహ 2. నీలలోహిత 3. వామదేవ 4. వథంతర 5. గౌరవ 6. ప్రాణ (దేవ) 7. బృహత్ 8. కందర్ప 9. సత్య 10. ఈశాన 11. ధాన (తమః) 12. సారస్వత 13. ఉదాన 14. గరుడ 15. కలార్మ 16. నారసింహ 17. సమాధి 18. ఆగ్నేయ 19. విష్ణుజ 20. సౌర 21. సోమ 22. భావన 23. సుప్తమాలి 24. వైకుంఠ 25. ఆర్చిష 26. వల్మీక 27. వైరాజ 28. గేరీ 29. మాహేశ్వర 30. పితృ 31. మానవ 32. తత్పురుష 33. వైకుంఠ 34. లక్ష్మీ 35. సావిత్రీ 36. అఘోర 37. పద్మకల్పం మొదలైనవి. ఈ కల్పాలు అనంతాలు.
పురాణాలలో కథలలో తేడాలు ఎందుకుంటున్నాయి
వివిధ పురాణాలను పరిశీలిస్తే, కొన్ని కథలు ఒక పురాణంలో ఒక విధంగాను, ఇంకొక పురాణంలో ఇంకొక విధంగాను కనిపిస్తున్నాయి. మన పురాణాలపై అంతగా గురిలేనివారు పురాణాలకు ఐక్యతలేదని, పరస్పర విరుద్ధాలని అందుచేత అవి అప్రమాణాలని తీవ్రంగా నిందాపూర్వక విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి వ్యాసుడు ఏకార్థాని పురాణాని వేదాశ్చైకార్థ సమ్మితాః అని మహాభారతంలో వివరించాడు. అలాగే
క్వచిత్క్వచిత్పురాణేషు, విరోధో యది దృశ్యతే
కల్పభేదాది భిస్తత్ర, వ్యవస్థాసద్భిరిష్యతే - (పద్మ పురాణం )
అని పద్మ పురాణంలో చెప్పబడింది. అనగా ప్రతికల్పంలోను సృష్టి జరుగుతుంది. ఈ జరిగే సృష్టిలో రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాల, ఇతర మహాపురుషుల సృష్టి జరుగుతుంది. ఆ గాథలలో కల్పభేద ప్రయుక్తాలైన కొద్దిపాటి భేదాలు కలుగవచ్చును. అది దోషం కాదు. అలాంటి విషయాలను కూడా పురాణాలు వదలకుండా తెలియచేస్తాయి అని అర్థం. ఈ విషయం పద్మపురాణం పాతాళఖండంలో పూర్వకల్ప రామాయణ కథ సమయంలో తెలియజేయబడింది. అందువలననే ప్రతి పురాణంలోనూ, ఈ పురాణం ఈ కల్ప వృత్తాంతాన్ని తెలుపుతుంది అని వ్యాసుడు తెలుపుతున్నాడు.
చివరగా చెప్పాలంటే పురాణంలో స్పృశించని, స్పృశించకూడని విషయాలు ఏమి ఉండవని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ విషయమైనా పురాణ పంచలక్షణాలలోనికి అంతర్భవిస్తాయనటం సరియైనదే.
తొమ్మిది రకాల సృష్టులు, నాల్గువిధాల ప్రళయాలు, పద్నాలుగు మన్వంతరాల విశేషాలు, కాలగణనం, వ్రతదాన తీర్థ ధర్మశాస్త్ర విషయాలు, అశ్వ, రత్న, గజవాస్తు జ్యోతిస్సాముద్రిక శాస్త్రాలు, ఆయుర్వేద, ధనుర్వేదాలు, అనులేపన స్వేచ్ఛారూప ధారణాది బహువిచిత్ర విద్యలు, సప్తద్వీప బహునదీనద కులపర్వత సముద్రాది అనేక భౌగోళిక విషయాలు, లోకాంతర గ్రహాంతర బ్రహ్మాండాంతర విశేషాలు, తాంత్రిక విద్య, ఇక్ష్వాకు చంద్ర కలి వంశ వర్ణనలు, భగవత్తత్వం, భక్తకర్మజ్ఞాన వైరాగ్యా ధ్యాత్మిక విషయాలు. వివిధ దేవీ దేవతాతత్త్వస్తోత్ర పూజావతారాది వర్ణనలు, మహిమలు, నీతులు, ప్రపంచ రీతులు, ధర్మాలు, అలంకారం, వ్యాకరణం. ఈ విధంగా పురాణాలలో లేనిది లేదు. అవి విజ్ఞాన సర్వస్వాలు. కనుకనే
యో విద్యాచ్చతురోవేదాన్ సాంగోపనిషదో ద్విజః
న చేత్పురాణం సంవిద్యాన్నైవ సస్యాద్విచక్షణః (వాయుపురాణం 1.1.180)
(నాల్గు వేదాలు, ఆరు శాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు చదివినా పురాణం తెలియని వాడు విచక్షుణుడు కాడు” అని తెలుపుతున్నది)
ఇదే విషయాన్ని నారదపురాణం ‘యాస్మిన్ జ్ఞాతే భవేద్ జ్ఞాతం వాఙ్మయం స చరాచరమ్ (1.92.21) పురాణం తెలుసుకొంటే సమస్త వాఙ్మయం తెలుసుకొన్నట్టే అని తెలుపుతుంది.
అందుకే అలాంటి పురాణాలలోని విషయాల గురించి ఇక్కడ తెలుసుకొందాం.