శ్రీ అగ్ని మహాపురాణ విశేషాలు
పురాణ గణన క్రమములో అగ్ని పురాణము ఎనిమిదవది. ఈశాన కల్పమునందు జరిగిన వృత్తాంతమును తెలుపు పురాణమిది. అగ్నిచేత వశిష్ఠునికి వివరింపబడినట్లు ఉన్నందున ఈ పురాణము ఆగ్నేయమని చెప్పబడుచున్నది.
అథాతః సంప్రవక్ష్యామి తవాగ్నేయపురాణకం
ఈశాన కల్పవృత్తాంతం వసిష్ఠాయా అనలో అబ్రవీత్
తత్పంచదశ సాహస్రం నామ్నా చరిత మద్భుతమ్
పఠతాం శృణ్వతాం చైవ సర్వపాపహరం నృణాం
(అగ్ని పురాణమును ఈశాన కల్పంలో జరిగిన వృత్తాంతమును వశిష్ఠునికి అగ్నిదేవుడు ఉపదేశించాడు. అందులో పదిహేనువేల శ్లోకాలు ఉన్నాయి. అద్భుతమైన ఆ పురాణమును వినిన, చదివినవారికి సర్వపాపములు హరింపబడును) అని తెలుపుతున్నది. ప్రస్తుతం ఉపలబ్ధం అవుతున్న అగ్నిపురాణంలోని విషయానుక్రమణిక నారద పురాణంలో చెప్పిన విషయాలకు యథాతథంగా సరిపోతున్నది. కానీ ఈశాన కల్పవృత్తాంతం అని మాత్రం లేదు. కానీ అగ్ని పురాణంలోని రెండవ అధ్యాయంలో ‘ప్రాప్తే కల్పేతు వారాహే కూర్మ రూపో అభవద్ధరిః’ అని అనగా వారాహ కల్పవృత్తంలో అని చెప్పబడింది. బ్రహ్మ యొక్క మానస పుత్రుడైన మరీచి మహర్షి ద్వాదశ సత్ర యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు అగ్ని తెల్పిన ధర్మానుష్ఠాన ఉపదేశముతో ఈ పురాణం ప్రారంభం అవుతున్నది.