అగ్నిపురాణ ప్రాముఖ్యత

పురాణ వాఙ్మయంలో అగ్నిపురాణ స్థానం చాలా విశిష్టమైనది. పురాణ వాఙ్మయం గరిష్ఠ స్థాయికి వికాసం చెంది విజ్ఞాన సర్వస్వాత్మకంగా పరిణమించిన కాలానికి చెందినట్టిది అగ్నిపురాణం. అందుకనే దానిలో స్పృశించని విజ్ఞాన విషయాలు లేవు. అందుకే నిర్మా ణంలో అగ్నిపురాణం వాయు, బ్రహ్మాండ, విష్ణు, మత్స్య, భాగవతాలనుంచి కొంత విభేదిస్తున్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రాచీనానంతరకాలీన పురాణం ఇది. ఇదే కోవలోకి గరుడ, కూర్మ, లింగ, భవిష్య, స్కాంద పురాణాలు కూడా చేరుతాయి. ఇంతకు ముందు చెప్పిన ప్రాచీన పురాణాలలో ఒకే విషయాన్ని కొంత విస్తృతంగా వివరించటం కనిపిస్తుండగా, ఆ విధానం క్రమంగా తగ్గిపోయి ఈ అర్వాచీన పురాణాలలో అనేక విషయాలు సంక్షిప్తంగా వివరించటం కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే పురాణ వాఙ్మయ వికాసంలో అగ్నిపురాణాన్ని ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. అందుకే అగ్నిపురాణంలో వివిధ విష్ణు అవతార ఘట్టాల కప్తీకరణం జరిగింది. ఈ అవతారాలన్నీ ఇందులో ఒక చిన్న అధ్యాయంలో తెలిపితే, బ్రహ్మాండ, వాయు, మత్స్య, విష్ణు పురాణాలలో ఒక్కొక్క అవతారం ఒక అధ్యాయాన్ని దాటిపోయింది. ప్రాచీన చరిత్రను తెలుసుకోటానికి వివిధ రాజవంశాల వర్ణనం చాలా అవసరమైన విషయం. అందువలననే ఆయా పురాణాలలో ఈ భాగం విస్తృతంగా కనిపిస్తుండగా, ఇందులో సంక్షిప్తంగా ఉన్నా ఏ విషయం వదలివేయటం జరగలేదు. అందువలననే ఇందులో అన్ని రాజవంశాల చరిత్ర స్పృశించబడింది. ఈ విధంగా అధ్యయనం చేస్తే ప్రజలు ఆ కాలానికి చెందిన సామాజిక ప్రాముఖ్యతగల అంశాలపై ఎలా ఆసక్తి ప్రదర్శించారో, సాంస్కృతిక విషయాలను గమనించేవారో, వాటిని ధార్మిక, మతసంబంధమైన ఏ విధమైన దృష్టితో అవగాహన చేసుకొన్నారో తెలుసుకోవచ్చు. దీనిని ఆ కాలానికి చెందిన కళా, సాహిత్య, విజ్ఞానాలను ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వం అని భావించటం సమంజసం. అంతేగాకుండా ఆ కాలపు సాహిత్య, సాంస్కృతిక కృషి కేవలం పండితులవరకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలవరకు చేరవేయవలసిన ఆవశ్యకతను గుర్తించి, అందులో కృతకృత్యత పొందిందని అగ్నిపురాణాన్ని భావించవచ్చు.

ఈ పురాణపు ముఖ్య ఉద్దేశ్యం ప్రాచీన భారతీయులకు సమస్త భారతీయ విద్యలను ఒక స్థాయి వరకు ప్రజాబాహుళ్యానికి పరిచయం చేయటమని అనిపిస్తుంది. ఈ పురాణంలో వాని అన్నింటి పరిచయం కనిపిస్తుంది. సంక్షేపంగా విష్ణు అవతారాలను గురించి తెలుపుతూ రామాయణ, మహాభారత కథలను ఒక మోస్తరు విస్తృతితో వివరించటం జరిగింది. మందిర నిర్మాణ కళను గురించి తెలుపుతూ దానితో పాటు ప్రతిష్ఠా విధానము, పూజా విధానం కూడా తెలియజేయ బడింది. జ్యోతిషశాస్త్ర, ధర్మశాస్త్ర, రాజనీతి, ఆయుర్వేద శాస్త్రాల వివరణ ఇందులో విపులంగా కనిపిస్తుంది: ఎనిమిది అధ్యాయాలలో ఈ పురాణంలో ఛందశ్శాస్త్రం వివరించబడింది. అలాగే అలంకార శాస్త్రం మార్మిక విధానంలో వివేచించబడింది. వ్యాకరణం కూడా తగినన్ని అధ్యాయాలలో వివరించబడింది. అలాగే నిఘంటుశబ్దాలను కూడా తగినన్ని అధ్యాయాలలో వివరించటంచేత, దీని అధ్యయనంచేత శబ్దజ్ఞానాన్ని వృద్ధిపరచుకొనవచ్చు. యోగానికి సంబంధించి యమ, నియమాది అష్ట విధానాల (అంగాల) వర్ణన సంక్షేపంగా ఈ పురాణంలో లభిస్తుంది. సమస్త అద్వైత వేదాంతం చాలా చక్కని పద్ధతిలో మహత్త్వపూరకంగా ఈ పురాణం వివరించటంలో కృతకృత్యం అయింది. ఒక అధ్యాయంలో గీతాసార సంగ్రహ వివరణ ఉన్నది. అలాగే యమగీత కూడా ఇందులో సంక్షిప్తీకరింపబడింది. 383వ అధ్యాయాలలో చెప్పబడిన అనేక విషయాల, శాస్త్రాల సమాహారం ఆశ్చర్యం కలిగిస్తుంది. రామాయణ, మహాభారత, హరివంశ కథలసారం ఇందులో ఉన్నది. అలాగే అనేక విధాలైన మందిర నిర్మాణ కళా విశేషాలు, విగ్రహ ప్రతిష్ఠ, పూజా విధానాలు విస్తృతంగా ఇందులో చోటుచేసుకున్నాయి. నాలుగు ఉపవేదాలు, వేదాంగాలు, దార్శనిక విషయాల సారం దిక్ప్రదర్శనంగా ఉన్నది. అంతేగాకుండా పశుచికిత్స, ధర్మశాస్త్రం, రాజనీతి, ఆయుర్వేదం మొదలైన శాస్త్రాల సారం ఉన్నది. అంతేకాకుండా, కావ్యాల వర్గీకరణ, అలంకారశాస్త్ర విషయాలు ‘8’ (ఎనిమిది) అధ్యాయాలలో ఛందశ్శాస్త్ర వివరణ ఉన్నది. వ్యాకరణ శాస్త్ర సంగ్రహం సుందరంగా కూర్చబడింది. కుమార వ్యాకరణం అనే పేరుతో చక్కని ప్రయోజనకరమైన వ్యాకరణము, ఏకాక్షర కోశం, నామలింగాను శాసనం, యోగశాస్త్ర విషయాలు, అద్వైత వేదాంతసారం కూడా ఈ పురాణంలో కనిపిస్తుంది.

అగ్నిపురాణం ప్రత్యేకంగా ఏ శాఖ వైపుకు మొగ్గుచూపే గ్రంథం కాదు. దీనిలో శైవ, వైష్ణవ, శాక్తపర విసయాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతము ముద్రితమై ఉన్న అగ్నిపురాణం వివిధ కాలాలకు చెంది, వివిధ గ్రంథాల సారోద్ధారమని చెప్పవచ్చు. కాబట్టి నిబంధన (స్మృతి) గ్రంథాలలో అగ్ని పురాణంలోనివని ఆయా వ్యాఖ్యా కర్తలు ఉద్దరించిన భాగాలు ప్రస్తుత అగ్నిపురాణంలో కన్పించటం లేదు. ప్రస్తుత అగ్నిపురాణం వైష్ణవానికి చెందిన పాంచరాత్రీయ శాఖీయుల ద్వారా సంస్కరింపబడి వైష్ణవుల అర్చన, పూజాదికాలను వివరించే గ్రంథంగా మారి ఉన్నది. కాబట్టి ఈ పాఠంగల పురాణాన్ని ప్రాచీనమూ మౌలికమూ అని చెప్పలేము. ఇది సామాన్య జనోపయోగం కోసం అత్యంత ప్రౌఢ గ్రంథాల సారాంశాన్ని క్రోడీకరించిన రచన. జన సామాన్యానికి విద్య గరపటం కోసం రచింపబడి ఉండవచ్చును. స్కాంద పురాణ శివ రహస్య ఖండంలో, అగ్నిదేవుని మహిమను వర్ణించటం అగ్నిపురాణ లక్ష్యం అని చెప్పబడింది. ఈ లక్ష్యం ప్రస్తుతం ముద్రితంగా లభ్యం అవుతున్న అగ్ని పురాణంలో కనిపించదు.