అగ్నిపురాణంలో ఏం చెప్పబడింది

ఈ పురాణం వైష్ణవ పురాణమని చెప్పబడినా, శివారాధనకు కూడా సముచిత గౌరవాన్ని కలిగిస్తున్నది. లింగరూపంలో శివుని ఆరాధించాలని తెలుపుతూ అనేక విధాలైన తాంత్రిక పద్ధతులను శివారాధన విశేషాలను తెలుపుతున్నది. అందువలన ఈ పురాణం శైవ వైష్ణవ శాఖలు పూర్తిగా విడిపోయి ఈర్ష్యా, అసూయలు భక్తులలో పొటమరించని కాలంలోనే రచింపబడి ఉండాలి. అంతే కాకుండా వైష్ణవశాఖ శ్రీకృష్ణ, రాధలకు విశేష ప్రత్యేకత కలిగించిన కాలానికి ముందుగానే, కేవలం కృష్ణుని గోపబాలకునిగా శ్రీకృష్ణుని విష్ణవు అవతారంగా, బాలకృష్ణునిగా ఆరాధించిన కాలానికే రచింపబడి ఉండాలి. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ పేరు అయినా ఎక్కడా ఈ పురాణంలో కనిపించదు.

ఇక, భగవంతుడంటే ఎవరు? అనే ప్రశ్నకి ఇలా సమాధానం కనిపిస్తుంది అగ్ని పురాణంలో-

ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిమ్ ।

వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ॥

సృష్టి, స్థితి, ప్రళయాలు, ప్రాణుల జీవన-మరణాలు, విద్య-అవిద్యలను ఎఱిగిన వాడే భగవంతుడని భావం.

ఈ పురాణంలో అర్చావిధానాలైన అనేక కర్మకాండలు, హోమాలు, నివేదనలు, బలులు, మంత్రాలు, బీజాక్షరాలు, బీజాక్షరమంత్రాలు, అర్చామండలాలు, లేక ముగ్గులు, పవిత్రము అనే దర్భతో చేసిన ఉంగరం వంటి కూర్పు, యజ్ఞోపవీతం, దేవాలయాల స్థాపన, నిర్మాణం, ప్రతిష్ఠలు, ఇంకా హిందూధర్మ ఆరాధనా విశేషాలు అనేకం అధ్యాయాలు, అధ్యాయాలలో వివరింపబడ్డాయి. తాంత్రిక విధానాలలో, రూపాలలో దుర్గామాత ఆరాధన, లింగరూపంలో శివారాధన వివరించటమే కాకుండా, అనేక మంత్రాలు వానిని ఆరాధనలో ఉపయోగించటం, ఉచ్చారణా విధానాలు వివరించబడ్డాయి. ఇందులో వివరించబడిన తాంత్రిక విధానాలు, మంత్రోచ్చారణ, వాని ఉపయోగాల వివరణ ఒక క్రమ విధానం దీనిలో లోపించినట్లు అనిపిస్తుంది. ఇందులో వివరించిన ఈ విషయాలకు, శారదాతిలకము, మంత్రమహోదధి వంటి తాంత్రిక గ్రంథాలలో చెప్పబడిన విధానాలకు కొంత సాపత్యం కనిపిస్తుంది. కానీ అందులో ఉన్నవే ఇందులో ఉన్నవని చెప్పలేము.

ప్రారంభంలోనే ఉన్న భువనకోశవర్ణనగల అధ్యాయం ఇతర పురాణాలలో ఈ విషయం పై చెప్పబడిన వృత్తాంతాలతో ఏకీభవిస్తున్నా, వానిలో కంటే కొంత విపులంగా ఉన్నది. ఇందులో చెప్పబడిన తీర్థాలు, యాత్రా స్థలాలను గురించి సంక్షిప్తంగానూ, సంఖ్యలో తక్కువగాను ఉన్నా, నర్మదా నది శ్రీశైలాలను గురించి ప్రత్యేకంగా పేర్కొనటం గమనించవచ్చు ఉత్తర భారత దేశంలోని పర్వతాలు పేర్కొనబడలేదు. కాశీ క్షేత్రం ఇందులో అవిముక్త క్షేత్రంగా పేర్కొనబడింది. ఇందుచేత కాశీ విశ్వేశ్వరుడుగా గాక అవిముక్తేశ్వరుడే ఆ క్షేత్ర ప్రధాన దైవతమా? అని సందేహం కలుగుతుంది. నిజానికి కొన్ని శతాబ్దాలపాటు ఈ అవిముక్తేశ్వరుడే కాశీలో ముఖ్య దైవతంగా వెలసిన విషయం విస్మరించలేనిది, కాశీ క్షేత్రం నేటివలెనే నాడు కూడా వరుణ, అసి నదుల మధ్యన ఉన్న ప్రదేశమే.

దీనిలో చెప్పబడిన పురాణగాధలు, తీర్థాలు చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. గయా మాహాత్మ్యం కూడా అలాగే అతిసంక్షిప్తంగా ఉన్నది. అందుకే కొందరు ఇది ప్రక్షిప్త భాగం అని భావిస్తున్నారు. అంతేగాకుండా ఈ మాహాత్మ్యాన్ని వర్ణించిన తీరు మిగిలిన వానిని వర్ణించినట్లుగా లేదు. పైగా, ఇలాంటి విషయాల వివరణ చేయవలసిన పద్ధతిలో కూడా లేదు. దక్షిణాది ప్రతులలో అగ్నిపురాణ భాగంగా ‘కావేరీ మాహాత్మ్యం’ అనే గ్రంథం ప్రచారంలో ఉన్నదట. కానీ ఇది ఎప్పుడూ అగ్ని పురాణంలో భాగం అయినట్లుగా తెలియటం లేదు. నిజానికి ఈ కావేరీ మాహాత్మ్యం అనే గ్రంథం పరిమాణంలో ప్రస్తుతం లభ్యం అవుతున్న అగ్నిపురాణం అంత ఉన్నదట కానీ ఇది అగ్ని పురాణంలోని భాగం అని మెకంజీ వ్రాత ప్రతుల (ప్రథమ భాగం) వలన తెలుస్తున్నది.

తీర్థమాహాత్మ్యాలను గురించి తెలుపుతూ భారత ఉపఖండం వర్ణించబడింది. అలాగే, ప్రపంచం లోని ఇతర ప్రదేశాల వర్ణన కనిపిస్తుంది. అలాగే వాటి మధ్య దూరాలు, వాటి విస్తీర్ణాలు ఆ భాగాలకు క్రిందగల లోకాలు, పైనగల లోకాలు వివరింపబడ్డాయి. ఈ భాగాలను ఇతర పురాణాలలో చెప్పబడిన వివరాలతో పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఇందులో సూర్యుని సూర్యరథవర్ణన, మొదలైన విషయాలు ప్రత్యక్షరం విష్ణుపురాణంలోని ఈ భాగాలతో ఏకీభవిస్తున్నాయి. ఇతరవిషయాలలో విష్ణుపురాణానికి దీనికి పెద్దగా సాపత్యం కనిపించదు.

తరువాత సూర్యుడు, గ్రహాలను గురించి వివరిస్తూ, ఖగోళ, జ్యోతిష విషయాలను వివరించటం జరిగింది. ఆ సందర్భంలోనే మన్వంతరాల వివరాలు తెలియజేయబడ్డాయి. ఆ సందర్భంలోనే భారత ధర్మ విధానాలైన, వర్ణ, జన్మ, స్థాపన, వివాహం, మరణం, ధార్మిక విధులు, దేవతారాధన, వేదాంత విధానాలు, వివిధ వ్రతాలు, నిత్యనైమిత్తిక, ఆత్యయిక మత విధుల వివరణ ఉంటుంది. శారీరక ధర్మాలు, పవిత్ర విధుల వర్ణన కూడా ఉన్నది. తరువాత విభాగంలో రాజధర్మాలు, పట్టాభిషేక విధానం, వారి రాజకీయ, న్యాయవిధులు, నీతి అనగా రాజనీతి, ప్రభుత్వం మొదలైన విషయాలు తెలియజేయ బడ్డాయి. ఇందులో చెప్పబడిన రాజనీతికి సంబంధించిన కొన్ని అంశాలు దండి దశకుమార చరిత్రలో చెప్పబడిన అంశాలకు సరిగా సరిపోతున్నాయి. బహుశః ఈ రెండు గ్రంథాలు ఒకే మూలం నుండి విషయాలను గ్రహించి ఉండవచ్చు. ఈ వివరాలకు మూలం చాణక్యుని అర్థశాస్త్రం అయి ఉండే అవకాశం ఉన్నది. ఈ విషయాలు ఏమాత్రం విదేశీ విషయాలను పోలి ఉండనందున, ఈ భాగం భారతదేశం పైకి మహమ్మదీయుల దండయాత్రలు జరగకముండు నాటి రచనే అని భావించవచ్చు. అంతేగాకుండా ఆయుధాల ఆకారాలు, పరిమాణాలు (సైజులు), విలువిద్య మొదలైన ఇందులో చెప్పబడిన విషయాలు దీనిని బలపరుస్తాయి. ఈ సందర్భంలో అనేక పదాలు ప్రాచీన, రాజరిక యుద్ధ సంబంధ పదాలతో నిండి ఉన్నది. ఇందులో తరువాత వివరింపబడిన న్యాయ, నేర విచారణకు సంబంధించిన విషయాలు అనేకం యాజ్ఞవల్క్యస్మృతికిగల మితాక్షరి వ్యాఖ్యానంతో ఏకీభవిస్తున్నాయి. అంటే ఇదిచాలా ప్రాచీన కాలానికి చెందినది అని అనుకొనవచ్చు.

వేదాలను గురించి తెలిపిన భాగంలో అవి ఆర్షేయాలని, పరమ పవిత్రాలని తెలు పుతూ, హోమాలు పాపపరిహారాలు, ప్రాయశ్చిత్తాలను గురించి తెలుపుతున్నది. పురాణాలను గురించి తెలుపుతూ, వ్యాసుని నుంచి ఆరుగురు శిష్యులు పురాణాలను ఉపదేశం పొందారని, వారు సూత, లోమహర్షణ, సుమతి, మైత్రేయ, శాంశపాయన సావర్ణులని-ఈ ఆరుగురు అనేక పురాణాలకర్తలని అలాగే శాంశపాయనాదులు ఒక పురాణ సంహితను కూర్చారని తెలుపుతున్నది.

పురాణ అధ్యయనం తరువాత పఠిత చేయవలసిన దానాలను గురించి తెలుపుతున్నది. అలాగే వివిధ పురాణాలలోని శ్లోక సంఖ్యను కూడా వివరిస్తున్నది. ఈ భాగంలో ఇతర పురాణాలలో, అష్టాదశ పురాణాలను గురించి చెప్పబడిన విషయాలతో చాలా ఎక్కువగా విభేదిస్తున్నది. శివపురాణ ప్రసక్తి ఇందులో చెప్పబడలేదు. ఇందులో చెప్పబడిన వివిధ పురాణాల వక్త శ్రోతల విషయంలో కూడా ఇతర పురాణాలతో ఏకీభవించుటలేదు.

తరువాత సూర్య చంద్ర వంశ రాజుల వృత్తాంతాలు, వంశాలు వివరించబడ్డాయి. వీటిలో ముఖ్యంగా యదు, పురువంశ చక్రవర్తుల వివరాలు పాండవ, శ్రీకృష్ణుల వరకు తెలియజేయబడ్డాయి. ఈ విషయాలు ఇతర పురాణాలలోని విషయాలతో ఏకీభవిస్తున్నా, అనేక శ్లోకాలు కేవలం పేర్ల పట్టీలతో నిండి ఉంటాయి. ఎక్కడో సకృత్తుగా కొన్ని గాథలు అతి సంక్షిప్తంగా మాత్రమే వివరించటం కనిపిస్తుంది. అవి కూడా అతి సాధారణ విషయాలతోనే ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆయన ప్రత్యేక విశిష్టత గురించి కొంత వివరణ ఉన్నా, అది పురాణ రచనా కాలాన్ని నిర్ణయించటానికి ఉపయోగపడదు.

తరువాత వైద్యశాస్త్రం గురించిన వివరణ ఉన్నది. ధన్వంతరి నుంచి సుశ్రుతుని వరకుగల విషయాలు ఇందులో కనిపిస్తాయి. అలాగే చెప్పిన విషయాలలో పెద్దగా ప్రత్యేకత కనిపించకపోయినా, మంత్రాలతోను, తాంత్రిక విధానాలతోను వైద్యం చేయటాన్ని కొంత వరకు తెలుపుతున్నది. తరువాత భాగంలో తాంత్రిక విధానంలో శివుని, దేవిని ఆరాధించే విధానాల ప్రస్తావన ఉన్నది. ఈ విషయాలు ఈ వైష్ణవ పురాణంలో ఉండటం విరుద్ధమనుకొన్నా, ఇవి తరువాతి వారు చేర్చినవని భావించే అవకాశం లేదు.

ఇందులో సాహిత్య శాస్త్రానికి సంబంధించిన ఛందో, అలంకార, వ్యాకరణ, రస, కావ్య శాస్త్రాలకు సంబంధించిన విషయ వివరణ ఉండటం అగ్నిపురాణ ప్రత్యేకత. ప్రథమ ఛందః కర్త పింగళుని విశిష్టత నిరూపించబడింది. అలాగే వ్యాకరణంలో పాణిని, కాత్యాయన విధానాలు వివరించబడ్డాయి. పాణిని సూత్రాలు ప్రామాణికంగా గ్రహించబడ్డాయి.

అగ్నిపురాణంలో కూర్మావతార వర్ణన ఈ రీతిగా ఉంది-దేవాసుర సంగ్రామం భయంకరంగా జరిగింది. దేవతలు ఓడిపోయారు. వారి సంపదలన్నీ పోయాయి. దీనికి కారణం దూర్వాసమహాముని శాపమే. బ్రహ్మాది దేవతలందఱు మహావిష్ణువును దర్శించారు. అసురుల్ని గెలిచే ఉపాయము అడిగారు. వెంటనే వారితో సంధిచేసికొమ్మని శ్రీమహావిష్ణువు వారికి సెలవిచ్చాడు. “మంథర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగ క్షీరసాగరం మధించాలి. అలాచేస్తే అమృతం బయటికొస్తుంది. అది అసురలకు అందరాదు. మీకే దక్కాలి. అందుకు నా సంపూర్ణ సహకారము ఉంటుంది” అన్నాడు దేవదేవుడు. అంగీకరించారు దేవతలు. క్షీరసాగరమథనం ఆరంభమైంది. అయితే ఒక అవాంతరమొచ్చి పడింది. మంథర పర్వతానికి ఆధారం లేదు. అందువల్ల మథనం చేసేటప్పుడు అది జారిపోతుంది. ఆ సమయంలో విష్ణు భగవానుడు కూర్మ రూపం ధరించాడు. పర్వతానికి ఆధారంగా నిలిచాడు. అవాంతరంతొలగింది. మెల్లిగా మథనం జరుగుతోంది. ముందుగా హాలాహలం బయటికి వచ్చింది. దాన్ని పరమశివుడు ఆనందంగా తీసికొన్నాడు. నీలకంఠుడు అయ్యాడు. ఆ తరువాత పారిజాతం, కౌస్తుభం, అప్సరసలు, లక్ష్మీదేవి వగైరాలు శ్రీమన్నారాయణ మూర్తికి దక్కాయి. ధన్వంతరి కమండలంతో బయటి కొచ్చాడు. అందులోనే ఉంది అమృతం. అసురులు కమండలం లాగేసుకొన్నారు. దేవతలకు సగమిచ్చారు. మిగిలిన సగభాగం తీసికొని వెళ్ళబోతున్నారు. అంతే, వైష్ణవమాయ చోటు చేసుకొన్నది. విష్ణువు మోహినీ రూపం దాల్చాడు. ఆ దివ్యసౌందర్యానికి అసురులు మోహవశులయ్యారు. “నీవు మాదానివై అమృతం పంచి పెట్టు” అని కోరారు. “అలాగే” అన్నాడు ఆయన. ముందుగా దేవతలకు ఒడ్డించాడు. అసురులకు మిగలదని రాహు-కేతువులకు అర్థమైంది. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇద్దఱు దేవతల వరుసలోకి వచ్చారు. అమృతమందింది. హాయిగా త్రాగారు. ఈ దృశ్యం జాగ్రత్తగా గమనించారు సూర్య చంద్రులు. లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు. రాహు-కేతువులకు శిక్ష తప్పలేదు. ఈ కారణంగా ఈ ఇద్దఱు సూర్య చంద్రుల్ని తఱచు కబళిస్తుంటారు. దాన్నే సూర్య గ్రహణము, చంద్రగ్రహణము అంటాము. ఈ విధంగా కూర్మావతార వర్ణన సంక్షిప్తంగా ఉంది ఈ పురాణంలో.

రామాయణంలోని కొన్ని ఘట్టాలను పరిశీలించగా .

వాలి వధ జరిగాక కిష్కింధాధి పతియైన సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో పెద్దగ శ్రద్ధచూప లేదు. శాంతమూర్తి అయిన శ్రీరామచంద్రుడు సైతం కళ్ళెర్రజేశాడు. లక్ష్మణుని ద్వారా ఒక సందేశం పంపాడు సుగ్రీవునికి. ఆ సందేశము ఇలా ఉంది -

నచ సంకుచితః పంథా యేన వాలీ హతో గతః ।

సమయే తిష్ఠ సుగ్రీవ। మా వాలిపథమన్వగాః ॥

సుగ్రీవా! చెడుదారిపట్టి వాలి మరణించాడు. అలాంటి దారిలో నీవు నడవకు, సీతాన్వేషణ విషయంలో దృష్టిపెట్టు. అలా చేయకపోతే వాలికి పట్టినగతే నీకూ పడుతుందని భావము. దీన్ని సందేశమనడం కంటె హెచ్చరిక అంటేనే బాగుంటుందేమో?!

రామాయణంలోని మరో సన్నివేశం -

సీతను ఎత్తుకు రమ్మని మారీచుణ్ణి ఆదేశిస్తాడు రావణాసురుడు. అది రాజాజ్ఞ, తప్పక పాటించి తీరాలి. ఆ సమయంలో మారీచుని మనోగతము ఎంత ఆర్ధంగా ఉందో ఈ శ్లోకం చెబుతోంది -

రావణాదపి మర్తవ్యం మర్తవ్యం రాఘవాదపి ।

అవశ్యం యది మర్తవ్యం వరం రామాన్న రావణాత్ ॥

సీతను ఎత్తుకొని రాకపోతే రాజాజ్ఞ ఉల్లంఘన అవుతుంది. దీని సహించడు రావణుడు. తనని చంపేస్తాడు. సరే, అతని ఆజ్ఞను పరిపాలిద్దామంటే రాముని చేతిలో చావు తప్పదు. ముందు గొయ్యి, వెనుక నుయ్యి. మరణం ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు రావణుని చేతిలో చావడం కన్నా రామబాణానికి గురికావడం శ్రేయస్కరమని భావం.

రామాయణంలోనిదే ఇంకో సన్నివేశం-

యుద్ధరంగంలో రావణుని సైన్యాలు అంతకంతకూ క్షీణించి మహాయోధులందఱు మరణించారు. ఈ ప్రపంచంతో సంబంధంలేని కుంభకర్ణుడిని నిద్ర నుండి లేపాల్సిన పరిస్థితి వచ్చింది. అతి కష్టం మీద అతడిని నిద్రనుంచి లేపగలిగారు. యుద్ధం గుఱించి తెలిసి కొన్నాడు. సమరానికి కారణము అడిగాడు. సీతను ఎత్తుకుని రావడమే కారణమని తెలిసింది. అపుడు రావణాసురునితో ఇలా అంటాడు కుంభకర్ణుడు-

సీతాయా హరణం పాపం కృతం త్వం హి గురుర్యతః ।

అతో గచ్ఛామి యుద్ధాయ రామం హన్మి న సంశయః ॥

అన్నయ్యా! సీతను అపహరించి పాపం మూటకట్టుకున్నావు. నీవు చేసింది ముమ్మా టికీ తప్పే. అయినా నీవు నాకు పూజ్యుడవు. గనుక తప్పకుండా రణరంగానికి వెళ్లాను. రాముణ్ణి సంహరిస్తాను అన్నాడు. మహోన్నతులైనా సరే, అక్రమాలకు పాల్పడరాదని కుంభకర్ణుని ఉపదేశం ద్వారా హితవు పలుకుతోంది అగ్నిపురాణం. ఈ విధంగా అయిదవ అధ్యాయం మొదలుకొని పదకొండవ అధ్యాయం వఱకు శ్రీమద్రామాయణ వర్ణన ఉన్నది.

12, 13, 14 అధ్యాయాల్లో మహాభారత ప్రస్తావన దర్శనమిస్తుంది. మహాభారత సంగ్రామంలో మహావీరులందఱు వీరమరణం పొందారు. దుర్యోధన వర్గీయులు ముగ్గురు, పాండవ వర్గీయులు ఏడుగురు మాత్రమే మిగిలారని అగ్నిపురాణం చెబుతున్నది.

కృతవర్మా కృపో ద్రౌణి స్త్రయో ముక్తాసతో రణాత్ ।

పాండవాః సాత్యకిః కృష్ణస్సప్త ముక్తా న చాపరే ॥

దుర్యోధనవర్గానికి సంబంధించి కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ అనే ముగ్గురు, పాండవ పక్షానికి సంబంధించి అయిదుగురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి మిగిలారు అంటే రెండు పక్షాలకు సంబంధించి 10 మంది మాత్రమే రణరంగంలో బ్రతికారని భావం.

దేవాలయ నిర్మాణం పవిత్ర కార్యం. మనసులో కనీసము ఆ సంకల్పం కలిగినా నూరు జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి. దేవాలయ నిర్మాతలు అభీష్ట లోకాలను చేరుకోగలరు. బ్రహ్మహత్య మొదలై మహాపాతకాలు దూరమవుతాయి. సకల తీర్థస్నాన ఫలం దక్కుతుంది. ఈ రీతిగా దేవాలయ నిర్మాణాన్ని ప్రేరేపిస్తున్నది ఈ పురాణం.

అగ్ని పురాణంలో కథలకు పెద్దగా చోటివ్వలేదు. కాని, సృష్టిలోని విద్యలు, పదార్థాల లక్షణాలు, వాటి పరీక్షా విధానం, స్వప్నాలు, శకునాలకు సంబంధించిన ఫలితాలు మొదలైన విషయాలెన్నో దర్శనమిస్తాయి. స్వప్నాలకు సంబంధించి పరిశీలిద్దాం. శుభ స్వప్నాలు, అశుభస్వప్నాలని స్వప్నాలు రెండు రకాలు.

స్వప్నకాలం                             ఫలించే సమయం

తొలిజాము                             ఒక సంవత్సరం లోపు

రెండవ జాము                        ఆరు మాసాల్లోపు

మూడవ జాము                      మూణ్నెల్ల లోపు

నాలుగవ జాము                    15 రోజుల్లోపు

శుభ స్వప్నాలు: పర్వతం, మేడ, ఏనుగు, గుఱ్ఱం వీటిని ఎక్కడము, తెల్లని పూలు చూడటం, తెల్ల బట్టలు కట్టుకోవడం, శత్రునాశం, వాదం, జూదం, యుద్ధం వీటిలో గెలుపు, పాలు త్రాగడం, దేవతలు, రాజు, గురువు తనను అభినందించడం, రాజ పట్టాభిషేకం మొదలైనవి శుభ స్వప్నాలు. స్వప్నంచివర్లో రాజు, ఏనుగు, గుఱ్ఱం, బంగారు, ఆవు, ఎద్దు ఇవి కనిపిస్తే కుటుంబవృద్ధి, ఈ కారణంగా నాలుగవ జాములో ఇలాంటి శుభస్వప్నాలను చూసినపుడు వెంటనే నిద్రనుంచి లేవాలి. మళ్ళీ నిద్రపోతే ఆ స్వప్న ఫలితం దక్కదు.

అశుభ స్వప్నాలు: గుండుగీయించుకోవడం, నగ్నంగా ఉండటం, కుళ్లిన బట్టల్ని కట్టుకోవడం, పామును చంపడం, పంది, కుక్క గాడిద, ఒంటెల నెక్కడం, పక్షిమాంసం తినడం, తల్లి గర్భంలో ప్రవేశించడం, చితి ప్రవేశం, దేవతలు, రాజు, గురువు వీరి కోపానికి గురికావడం, నదిలో కొట్టు కొని పోవడం, పేడనీళ్లతో స్నానం, వాంతులు, విరేచనాలు కావడం, దక్షిణ దిక్కుకు ప్రయాణం, ఇల్లు పడిపోవుట, పిశాచాల క్రీడ, ఓటమి, కాషాయ వస్త్రాలను ధరించడము మొదలైనవి. ఈ స్వప్న ఫలాలను నమ్మినవారు నమ్మవచ్చు.

నారద పురాణం 92వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం అగ్ని పురాణంలోని విషయాను క్రమణిక ఇది:

ప్రశ్నపూర్వం పురాణ స్య కథా సర్వావతారజా

సృష్టి ప్రకరణం చాథ విష్ణు పూజాదికం తతః

అగ్నికార్యం తతః పశ్చాన్మంత్రము ద్రాది లక్షణమ్

సర్వదీక్షా విధానం చ అభిషేక నిరూపణమ్

లక్షణం మండలాదీనం కుశాపామార్జునంతతః

పవిత్రారోపణ విధిర్దేవాలయ విధిస్తథా

శాలగ్రామాది పూజా చ మూర్తి లక్షణమ్ పృథక్ పృథక్

న్యాసాదీనాం విధానం చ ప్రతిష్ఠా పూర్తకాతతః

వినాయకాది దీక్షాణాం విధిః జ్ఞేయస్తతః పరమ్

ప్రతిష్ఠా సర్వదేవానాం బ్రహ్మాండస్య నిరూపణమ్

గంగాది తీర్థ మాహాత్మ్యం జంబ్వాది ద్వీప వర్ణనమ్

ఊర్ధ్వాధోలోక రచనా జ్యోతిశ్చక్ర నిరూపణమ్

జ్యోతిషంచ తతః ప్రోక్తం శాస్త్రం యుద్ధ జయార్ణవమ్

షట్కర్మచతతః ప్రోక్తం మంత్ర యంత్రౌ షధీగణః

కుబ్జికాది సమర్చా చ షోఢా న్యాస విధిస్తథా

కోటి హోమ విధానంచ తదంతర నీరూపణమ్

బ్రహ్మచర్యాది థర్మాశ్చ శ్రాద్ధ కల్ప విధిస్తతః

గృభయజ్ఞ స్తతః ప్రోక్తో వైదిక స్మార్త కర్మచ

ప్రాయశ్చిత్తాను కథనం తిథీనాంచ వ్రతాదికమ్

వారవ్రతాను కథనం నక్షత్ర వ్రత కీర్తనమ్

మాసికవ్రత నిర్దేశో దీపదాన విధిస్తథా

నవ వ్యూహార్చనం ప్రోక్తం నరకాణాం నిరూపణమ్

వ్రతానాంచాపి దానానాం నిరూపణ మిహాదితమ్

నాడీ చక్ర సముద్దేశః సంధ్యా విధిరనుత్తమః

గాయత్ర్యర్ధస్య నిర్దేశో లింగస్తోత్రమ్ తతః పరమ్

రాజ్యాభిషేక మంత్రోక్తి ర్ధర్మ కృత్యంచ భూ భుజామ్

స్వప్నాధ్యాయస్తతః ప్రోక్తః శకునాది నిరూపణమ్

మండలాదిక నిర్దేశో రణదీక్షా విధిస్తతః

రామోక్తమీతి నిర్దేశో రత్నానాం లక్షణం తతః

ధనుర్విద్యా తతః ప్రోక్తా వ్యావహార ప్రదర్శనమ్

దేవాసుర విమర్దాఖ్యా హ్యాయుర్వేద నిరూపణమ్

గజాదీనాం చికిత్సాచ తేషాం శాంతిస్తతః పరమ్

గోనసాది చికిత్సాచ నానా పూజాస్తతః పరమ్

శాంత యశ్చాపి వివిధా శ్ఛందః శాస్త్ర మతః పరమ్

సాహిత్యంచ తతః పశ్చాదే కార్ణాది సమాహ్వయాః

సిద్ధశిష్టాను శిష్టశ్చ కోశః స్వర్గాది వర్గకే

ప్రళయానాం లక్షణం చ శారీరక నిరూపణమ్

వర్ణనం నరకాణాంచ యోగశాస్త్రమతః పరమ్

బ్రహ్మజ్ఞానం తతః పశ్చాత్ పురాణ శ్రవణే ఫలమ్

దాగ్నేయకం విప్ర। పురాణం పరికీర్తితమ్

అగ్ని పురాణం ఈశానుకల్పవృత్తాంతాన్ని వివరిస్తుందని మత్స్య, స్కాంద పురాణాలలో ఉన్నా, ఈ పురాణంలోమాత్రం ఆ విషయం ఎక్కడా పేర్కొనబడలేదు. అయితే కూర్మావతార కథనంలో ఆ వృత్తాంతం వారాహకల్పంలో జరిగిందని చెప్పబడింది. (2-37) ఈ విధంగా వ్యత్యయం ఉండటం వలన ఈపురాణం అసలు అగ్నిపురాణము అనగా ప్రాచీన అగ్నిపురాణం కాదనే వారు ఉన్నారు.