అగ్ని పురాణ శ్లోక సంఖ్య
ఇందులో మూడు వందల ఎనుబది మూడు అధ్యాయములు ఉన్నాయి. భాగవతం ఈ పురాణంలో మొత్తం ఇరవై అయిదు వేల నాలుగు వందల శ్లోకాలు ఉన్నాయని చెప్తున్నది. దేవీ భాగవతం దీనిలో ఇరవై ఆరువేల శ్లోకాలు ఉన్నాయని వక్కాణిస్తుండగా అగ్నిపురాణం స్వయంగా తనను గుఱించి పదిహేనువేల శ్లోకాలుగల గ్రంథమని చెప్పుకొన్నది. మత్స్యపురాణం పదహారువేల శ్లోకాలున్నాయని, నారదీయపురాణం పన్నెండువేల శ్లోకాలున్నాయని చెప్తున్నది. ఈ విధంగా దీని శ్లోక సంఖ్యను గురించి పురాణాలలోనే ఏకాభిప్రాయం లేదు. కానీ ప్రస్తుతము ముద్రితమై లభ్యమగుచున్న ఆనందాశ్రమ ప్రతియందు దాదాపు 11,457 శ్లోకములు మాత్రము గలవు. ఈ శ్లోక సంఖ్య నారదీయ పురాణంలో చెప్పబడిన సంఖ్యకు కొంతవరకు దగ్గరగా ఉన్నది. వాస్తవవానికి పంచలక్ష్మణ సమన్వితమైనదే పురాణమని చెప్పబడుచున్నను, ఈ పురాణమున పంచలక్షణములకు ఏ మాత్రము సంబంధములేని భారతీయ విజ్ఞానమునకు సంబంధించిన అనేక విషయములు వివరింపబడినవి. వీటిలో శిక్ష, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము, గాంధర్వము, శిల్పము, వాస్తువు, భారత, రామాయణాది ఇతిహాస కావ్యముల కథలును వివరింపబడినవి. ఈ పురాణము నందు మూడు వంతులకుపైగా, వీనికి సంబంధించిన విషయముల వివరణయే గలదు. దీనిని సమస్త భారతీయ విజ్ఞానసర్వస్వమని చెప్పినను అతిశయోక్తి కాదు. జన సామాన్యమునకు భారతీయ విద్యల, విజ్ఞానము యొక్క స్వరూప నిరూపణ చేయుట ఈ పురాణ ముఖ్య లక్ష్యమై ఉండవచ్చును. ఆగ్నేయేహి పురాణేఽస్మిన్ సర్వాః విద్యాః ప్రదర్శితాః-(అగ్ని 383–52) అని ప్రశస్తిగనిన పురాణ మిది. పౌరాణిక వర్గీకరణము ప్రకారము అగ్ని పురాణము తామస పురాణములలో చేరును. అనగా ఇది శివభక్తి పారమ్యమైన పురాణము.