1. కథా ప్రస్తావనము

తాత్పర్యము - సకల లోకాలకు వెలుగు నిచ్చువాడు, లోకకర్త అయిన సూర్యునకు జయమగును. నీలదేహుడును, శార్జమను విల్లును దాల్చిన వాడైన విష్ణువునకు విజయమగును. రుద్రుడను పేరుతో విఖ్యాతుడైన శంకరునకు జయమగును. చిత్ర కిరణములు గలవాడైన అగ్ని దేవునకు జయమగును. ఒకప్పుడు మహాత్ముడైన భృగువు, వశిష్ఠుడు, పులస్త్యుడు, పులహడు, క్రతువు, పరాశరుడు, వ్యాసుడు, సుమంతుడు, జైమిని, పైలుడు, యాజ్ఞవల్క్యుడు, మహాతపస్వి అయిన గౌతముడు, ధీరుడైన భారద్వాజుడు, నారదుడు, పర్వతుడు, వైశంపాయనుడు, మహాతపస్వి అయిన శౌనకుడు, దక్షుడు, అంగిరసుడు, గర్గుడు, గాలవుడు మొదలైన మహర్షులు, తేజస్వి, మహాబలశాలి అయిన శతానీక మహారాజును సందర్శింపగోరి సమీపించిరి.  

తా ॥ ఆ విధంగా వచ్చిన మునులను చూసి మహామేధావి అయిన శతానీకుడు వారిని సమీపించి యథావిధిగా పూజించెను. ఆ శతానీకుడు పూజ్యుడైన పురోహితుని మరియు గోవును ముందడుకొని ఆ మునులను స్వాగత నమస్కారాలతో సత్కరించెను. ఆ మునులు తమ తమ ఆసనములపై సుఖంగా కూర్చొని విశ్రాంతులైన మీదట ఆ శతానీకుడు తన కుడిచేతిని పైకెత్తి వినయంతో ఇట్లు పలికినాడు. “ఓ బ్రాహ్మాణోత్తములారా! ఇంతకాలానికి నాజన్మ, కీర్తి, ప్రతిష్ఠ మరియు బలము సఫలములైనవని భావిస్తున్నాను. ఏ మునులను తలచినంతనే మానవుడు పవిత్రుడగునో అటువంటి మహరులైన మీరు నన్ను సమీపించుట వలన నేనెంతో పుణ్యము చేసికొన్నవాణ్ణిగా, ధన్యునిగా అనుకొంటున్నాను.”

తా॥ ఓ మహాతపోబలులారా ! సర్వోత్తమమైన ధర్మశాస్త్రమును వినగోరుచున్నాను. కాన దయతో నాకు చెప్పుడు పూర్వము నా తండ్రి భారతమును విని సద్గతి నే విధముగా పొందెనో అట్లే నేనును ధర్మ శాస్త్రమును విని ఉత్తమగతిని పొందెదను. అట్లు శతానీక మహారాజుచే విన్నవింపబడిన బ్రాహ్మణులు (బ్రహ్మరులు) ఏకాంతముగా సమావేశమై పరస్సరము చర్చించుకొనిన పిదప వ్యాసుని పూజించి రాజుతో ఇట్లు పలికిరి. ఓ రాజా! వ్యాసుని పూజించి సంతోష పెట్టుము. ఈ వ్యాసుడే నీకు ధర్మశాస్త్రమును చెప్పును. ఓ వీరుడా ! వ్యాసుడిచటనుండగా మేము శాస్త్రమును చెప్పుటకు యోగ్యులము కాము. ఏలనన, ఓ ధీశాలీ! గురువు ముందుండగా శిష్యుడెట్లు పలుక శక్తుడగును.? . ఈ వ్యాసుడే సదా మన గురువు. ఇతడు ప్రత్యక్ష నారాయణుడు.

తా॥ దయామయుడును మరియు దివ్య విధానముల నెరిగినవాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల వారిని పవిత్రము చేయుటకై ధర్మప్రధానాంశములచే చక్కగా పొందుపరుపబడిన ధర్మశాస్త్రము నీతడు చెప్పెను. ఔషధము వలన వ్యాధివలే అతిక్లిష్టమైన శాస్త్రము వలన లోకము భయపడును. సర్వధర్మ సంకలనమైన మహాభారతమును విస్తారముగా వ్యాసముని చెప్పినాడు. వైద్యుడు మంచి రుచికరమైన పధ్యాన్ని ఔషధంగా (రోగికి) ఇచ్చువిధముగా వ్యాసముని మహాభారతమును రమ్యమగు శాస్త్రముగా నిర్మించియిచ్చెను. ఆస్తికత్వమనెడు నిచ్చెనకు భారతము ఒక మెట్టుగా చెప్పబడును. భారతమును వినిన జనుడు స్వర్గనరకముల (మంచి చెడులను) ప్రత్యక్షముగా దర్శించును. దేవతలు, పుణ్యతీర్థములు, తపస్సులు సిద్ధించుట భారతమూలమున నిశ్చితములు. మీమాంసకులుకూడా దానికి నాస్తికతను ప్రతిపాదింపరు .

తా II భారత శ్రవణము వల్లనే విష్ణునీయందు, దేవతలయందు, వేదములయందు, గురువులయందు, విప్రులయందు బుద్ధిమంతులకు భక్తిభావము ఘటిల్లుచున్నది. ధర్మార్థ కామమోక్షములయొక్క సిద్ధి భారతము వలననే కలుగును. మోక్షపదగాములకు భారతము ఒక చక్కని మార్గము. ధర్మార్థ కామ మోక్షములగూర్చి భారతమున విస్తారముగ చెప్పబడినది. జనులు ముక్తికై తాత్కాలికములైన తాపములచే కృశించుచున్నారు. పండితుడగువాడు భారతము వలన యాదవ పాండవ వంశసంపదల నాశమును గూర్చి వీని దుఃఖమును తొలగించుకొనుట ద్వారా పుణ్యమునొందును. ఇట్లు భారతమును చెప్పిన మహాత్ముడును, వ్యాసముని రూపమున నున్న సాక్షాన్నారాయణుడును ఈ మహామునియే . ఆ మునుల యొక్క వచనమును విని ప్రతాపవంతుడగు ఆ శతానీక మహారాజు -

తాII శాస్త్రకుశలుడైన ఆ వ్యాసమునిని పూజించి సంతోషపెట్టెను. పిదప శతానీకుడిట్లు పలికెను. ఓ దేవా! నీ పాదములకిదియే శిరస్సువంచి నమస్కరించితిని. దేనిచే నేను పవిత్రతను పొందెదనో అట్టి ధర్మశాస్త్రమును నాకు ప్రవచింపుము. పూర్వము భారతమును స్మరించి ముక్తుడైన నా తండ్రినివలె నాకును శుభమైన ధర్మ శాస్త్ర కథను చెప్పి నన్ను ఈ సంసారమునుండి లేవ నెత్తుము. శతానీకుని ఆ వచనమును విని వ్యాసుడిట్లు పలికెను. ఓ భరతకుల శ్రేష్టా! పూర్వము నీ తండ్రికి వైశంపాయనుడు భారతము చెప్పినట్లుగా నా యీ శిష్యుడైన సుమంతుడు ప్రీతినిచ్చు అద్భుతమైన, శ్రవ్యమైన, సర్వపాపభయనివారకమైన ఏ కథను నీవు కోరుచున్నావో అట్టి బ్రహ్మహత్యాపాతక నివారకమైన భారత కథను నీకు చెప్పును  

తా॥ అంత ఆ రాజునుగూర్చి మునులందరు ఈ మాటను పలికిరి. ఓ మహావీరా ! మిక్కిలి ధీమంతుడైన వ్యాసుడు యుక్తముగా పలికెను. ఓ రాజర్షి నీవు సకల శాస్త్రములలో నేర్పరియైన సుమంతుని అడుగుము. మాకు కూడా అట్టి కథను వినుటకై కోరిక కలుగుచున్నది. అంత, మహాతేజస్వియైన వ్యాసముని సుమంతునితో నిట్లు పలికెను. ఓ ఆర్యా! ఈ రాజు ఏ కథను విని ఆనందింపగలడో ఏ కథయందు ఈతని మనస్సు ఉల్లాసమునొందునో అట్టి భారతాదుల యొక్క కథను నీవు చెప్పుము.  

మహాతేజస్వి, విప్రశ్రేష్ఠుడును అగు ఆ సుమంతుడు మహాధరుడైన వ్యాసునియొక్క, మిగతా మునుల యొక్క అభిప్రాయమును విని -

            తా॥ వ్యాసుని యొక్క, మరియు సర్వ మునుల యొక్క ఆజ్ఞాను సారముగా మహాబుద్ధిశాలియగు శతానీకునకు కథను చెప్పుటకు సమ్మతించెను. అంతట కుమారుడు, గొప్ప తేజస్వియగు శతానీక మహారాజు బ్రాహ్మణోత్తముడైన సుమంతునికి నమస్కరించి అతనితో పలుకుటకుపక్రమించెను. శతానీకుడిట్లు పలికెను. ఓ బ్రాహ్మణ శ్రేషా! ఏ కథాశ్రవణము వలన నేను సర్వపాపములనుండి విముక్తుడనగుదునో అట్టి పుణ్యకథను నన్ను పవిత్రము చేయుటకై ప్రవచింపుము. సుమంతుడిట్లు పలికెను. ఓ భరతకుల సంభవా! రాజా! ఏ శాస్త్రములను వినుటద్వారా మానవుడు సకల పాపములనుండి విముక్తుడగునో అట్టి పవిత్రములైన శాస్త్రములు చాలా ఉన్నవి .

తా॥ ఓ మహవీరా! అట్టి నానా ధర్మ శాస్త్ర కథలయందు నీవు దేనిని వినగోరెదవో దానిని చేప్పెదను. శతానీకుడిట్లు పలికెను. ఓ నిష్టాగరిష్ణా ! వేనిని వినుటచే నరుడు. సర్వపాపవిముక్తుడగునో, అట్టి ధర్మశాస్త్రములలో నేవి అభిలషణీయములు?. సుమంతుడిట్లు పలికెను. ధర్మశాస్త్రము లేవి కలవో వినుము. మనువు, విష్ణువు, యముడు, అంగీరసుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితులు, హారీతుడు, అత్రిమున్నగు వారు రచించిన ధర్మశాస్త్రములు కలవు. ఓ భారత! ఈ శాస్త్రములను విని తెలిసికొనుట ద్వారా మానవుడు స్వర్గమును పొంది సుఖించుననుటలో ఎట్టి సందేహము లేదు .

తా॥ ఓ సువ్రతా! విప్రశ్రేషా! నీవు పలికిన ఆ ధర్మశాస్త్రములన్నియు విద్వాంసులచే చెప్పబడిన మొదటి మూడు వర్ణముల శ్రేయమునకే కాని శూద్రుల శ్రేయమునకు కాదని నేను విన్నాను. అందువలన నేను అట్టి వానిని వినగోరుట లేదు. కావున నామాటను వినుడు. ఓ సువ్రతా ! బ్రాహ్మణోత్తమా! ఏ శాస్త్రములు నాలుగు వర్ణముల వారి శ్రేయస్సునకై ప్రసిద్ధములై యున్నవో, అందునా విశేషించి నాలుగవ వర్ణము వారైన శూద్రుల శ్రేయమునకు ఉద్దేశింపబడినవో వానిని వినగోరెదను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను మూడు వర్ణముల సంక్షేమమునకై, ధర్మాది ప్రయోజనముల సిద్ధికై, వేదాలు, వేదాంగాలు మరియు మన్వాది స్మృతులు ఏర్పరుపబడినవి. ఓ ద్విజప్రభూ! మిక్కిలి దీనులైన శూద్రులు ధర్మార్థకామ మోక్షములకు ఎట్లు అర్హులగుదురు? వారిని కాపాడుట ఎట్లు?.

తా II ఓ ద్విజోత్తమా ! అట్టి శాస్త్ర జ్ఞాన విహీనులగు శూద్రుల విషయమున నాకు బాధ కలుగుచున్నదికాన వారి శ్రేయమునకై మరియు ధర్మార్థకామఫలసిద్ధికై విద్వాంసులగు విప్రులు ఏ శాస్త్రమును చెప్పిరో తెలుపుడు.

సుమంతుడు పలికెను!

ఓ వీరా ! నీవు పలికినది మిక్కిలి యుక్తముగానున్నది. నామాటను వినుము. నాలుగు వర్ణముల యొక్క శ్రేయమునకై, విశేషించి శూద్రులకు శ్రేయమును గూర్చుటకై పండితులు ఏ పవిత్రములైన ధర్మశాస్త్రములను చెప్పిరో వానిని వినుము.  ఓ కురూత్తమా! చతుర్వర్ణముల వారికి ధర్మార్థకామఫలసిద్ధి కలుగుటకై పద్దెనిమిది పురాణములు మరియు శ్రీరామ కథయైన రామాయణము చెప్పబడినవి. అట్లే ధీమంతుడైన వ్యాసునిచే సకల వేదార్థ సమన్వితమైన మహాభారతము మరియు ధర్మశాస్త్రములును చెప్పబడినవి.

తా II దయామయుడైన వ్యాసుడు, సంసారసాగరమున మునిగిన నాలుగు వర్ణముల వారిని తరింపజేయుటకై పరమోత్తమమైన ఈ భారతమును ఒక పడవగా కల్పించేను. అష్టాదశపురాణాలను మరియు ఎనిమిది వ్యాకరణములను తెలిసికొని వ్యాసమహర్షి బ్రహ్మహత్యా నివారకమైన భారత సంహితను రచించెను. ఓ రాజా! ఎనిమిది వ్యాకరణముల లేవియో తెలిసికొనుము. మొదటిది బ్రాహ్మము, రెండవది ఐంద్రము, మూడవది యామ్యము, నాలుగవది రౌద్రము, ఐదవది వాయవ్యము, ఆరవది. వారుణము, ఏడవది సావిత్రము, ఎనిమిదవది వైష్ణవము ఓ వీరా ! ఇక పద్దెనిమిది పురాణముల గూర్చి తెలిసికొనుము. 1) బ్రహ్మ-పురాణము 2) పద్మ పురాణము, 3) విష్ణు పురాణము 4) శివ పురాణము 5) భాగవతము 6) నారద పురాణము 7) మార్కండేయ పురాణము 8) అగ్ని పురాణము 9) భవిష్య పురాణము 10) బ్రహ్మ వైవర్త పురాణము 11) లింగపురాణము 12) వరాహ పురాణము 13) స్కంద పురాణము 14) వామన పురాణము 15) కూర్మ పురాణము 16) మత్స్యపురాణము 17) గరుడ పురాణము 18) బ్రహ్మాండపురాణము. ఓ కురుశ్రేష్టా! నాలుగు వర్ణాల వారి శ్రేయమునకై ఈ పద్దెనిమిది ధర్మశాస్త్రాలను పండితులు చెప్పిరి. ఓ రాజోత్తమా ! ఇందులో నీవేది వినగోరెదవో చెప్పుము. శతానీకుడిట్లు పలికెను. ఓ విప్రోత్తమా ! నా తండ్రి సమీపములో నేను భారతము వినియున్నాను. అట్లే రామచరితమును మిగతా పురాణములను కూడా విన్నాను. కాని భవిష్య పురాణమును వినలేదు. కాన నాకు విన కుతూహలముగల భవిష్య పురాణమును చెప్పుడు.  

తా ॥ ఓ వీరా! నీవు చాలా చక్కగా అడిగితివి. ఏ తొమ్మిదవ పురాణమైన భవిష్యపురాణమును వినుటవల్ల మానవుడు సర్వపాపవిముక్తుడగుచు అశ్వమేథ యాగఫలమును పొంది నిస్సంశయముగా తేజోమూర్తియగు దేవునిలో లీనమగునో అట్టి భవిష్యపురాణమును చెప్పెదను వినుము. సర్వోత్తమమైన ఈ ధర్మశాస్త్రమును గూర్చి బ్రహ్మజ్ఞానులిట్లు చెప్పిరి. విద్వాంసుడైన విప్రుడు ముందు ఈ పురాణమును మిక్కిలి యత్నముతో చదువవలెను. పిదప శిష్యులకు, చతుర్వర్ణముల వారికిని దానిని బోధింపవలెను. ఎందుకనగా బ్రాహ్మణ క్షత్రియులు తప్ప ఇతరుడు దీనిని చదువ యోగ్యుడు కాడు. ఈ పురాణము శూద్రునకెప్పుడూ చదువదగినది కాదు. అతనిచే వినదగినది మాత్రమే. ఓ రాజశ్రేష్టా ! ముందుగా దేవతార్చన చేసి విప్రులు వినవలెను . ఓ రాజా! శౌత స్మార్త ధర్మాలు ఇందు చెప్పబడినవి కాన బ్రాహ్మణుడు లేకుండా శూద్రులు ఈ పురాణాన్ని వినకూడదు.

తా॥ నీయమవ్రతుడై ఈ శాస్త్రమును చదువుచున్న బ్రాహ్మణునకు ఎప్పుడును మనోవాక్కాయములవల్ల కలిగే దోషములు అంటవు. ఓ రాజా! భక్తితో దీనిని వినేడు బ్రాహ్మణాదులును సకల పాపములనుండి ముక్తులై స్వర్గమునకు వెళ్ళెదరు. ఓ రాజోత్తమా ఏ బ్రాహ్మణుడు సకల వర్ణాలకు ఈ శాస్త్రమును వినిపించునో అతడు అన్ని వర్ణాలలోను మిక్కిలి గొప్పవాడుగాను మరియు అన్ని వేళలలోను అన్ని వర్ణాలచేత పూజింపదగిన వాడుగానగును. ఈ భూమి పై యోగ్యుడైన వాడతడేయగును. ఈ శాస్త్రము ఉత్తమమైనది. ఇది శుభానికి ఆస్పదమైనది. ఇదియే బుద్దీని పెంచునది. కీర్తిని కలిగించునది మరియు స్వర్గమును పొందించునది. ఈ శాస్త్రమున సకల ధర్మములు, కర్మల యొక్క గుణదోషములు, నాలుగు వర్ణముల వారి నిత్యాచారములు చెప్పబడినవి.

తా॥ ఓ రాజశ్రేష్ఠా! ఆచారమే వేదోక్తమైన మొదటిధర్మము. అట్టి నిత్య ఆచారయుక్తుడగు ఆత్మవంతుడు ద్విజుడనబడును. ఆచార రహితుడగు విప్రుడు వేద ఫలముననుభవింపలేడు. ఆచారసహితుడు సంపూర్ణవేద ఫలానుభవమునకు యోగ్యుడగును. ఈ విధముగా ఆచారమువల్లనే ధర్మము ప్రవర్తిల్లునని గమనించిన మునులు సకల తపస్సునకు మూలము ఉత్తమమైన ఆచారమేయని గ్రహించిరి. ఓ రాజా! అందుకే మానవులును ఎల్లప్పుడు ఆచారమునాశ్రయించినారు. ఈ విధముగా ఈ పురాణమున ఆచార ప్రశస్తి, దానికి సంబంధించిన పండితులచే చెప్పబడిన గాథలు ఉత్తమ సంస్కార విధి, త్రిలోకాల ఉత్పత్తిక్రమము, ఇతిహాస శ్రవణ విధానములు చెప్పబడి యున్నవి  

తా ॥ అదే విధముగా ఓ రాజా! ఈ పురాణములో వాక్కు యొక్క మహత్తు బ్రహ్మచర్యవ్రతాది చతురాశ్రమాచారాలు, స్నాతకవిధి, వివాహలక్షణము, భార్యా సంగమ వీధి, పురుష స్త్రీ లక్షణాలు, మహాయజ్ఞ విధానము, శాస్త్ర విధి, భూమి లక్షణము, దేవతా పూజా లక్షణము, సత్ర్పవర్తనా లక్షణము, స్నాతక వ్రతములు, తినదగిన తినగూడని పదార్థములు, త్రికరణ శుద్ధి, వస్తు శుద్ది, స్త్రీల ధర్మాలు, తపోవిధానము, మోక్షము, సన్యాసము, రాజధర్మాలు, కర్తవ్య నిర్ణయము, సూర్యుని మాహాత్మ్యము, పుణ్యతీర్థాల మహత్తు, మరియు శివకేశవుల మాహాత్మ్యములు చెప్పబడియున్నవి .

తా॥ అట్లే ఓ మహామతీ ! బ్రాహ్మణ మహాభాగ్యము, పుస్తక మాహాత్మ్యము, దుర్గా మాహాత్మ్యము, సత్య మహత్తు, స్త్రీ పురుషుల ధర్మము, ధర్మద్యూతము, దాని విభాగము, కథకుల శోధనము, వైశ్యశూద్రుల యొక్క ఆచారము సంకీర్ణ జాతుల పుట్టుక, వర్ణాల యొక్క ఆపద్ధర్మము, ప్రాయశ్చిత్తవిధి, సంధ్యానుష్టానము, ప్రేతశుద్ధి, స్నానతర్పణ విధి, వైశ్వదేవ విధానము, భోజన విధానము, దంతకాష్ఠ లక్షణము, చరణ వ్యూహము, సంసారమున వర్తించు పద్ధతి, త్రివిధమైన కర్మ సంభవము, మోక్షప్రాప్తి, కర్మల యొక్క గుణదోషముల పరీక్షణము, సతుల లక్షణము, పాత్ర పరీక్షణము ఈ పురాణమున ప్రకృష్టముగా చెప్పబడినవి.

గర్భప్రసవమును, అట్లే కర్మఫలమును, జాతి, కుల, వేద ధర్మలను, వైతాన ప్రతధర్మాలను గూర్చియు ఈ పురాణమున వ్యాసభగవానుడు చెప్పియున్నాడు. ఓ కురుకుల శ్రేష్టా ! ఈ పురాణము బ్రహ్మనుండి శంకరునకు, శంకరుని నుండి విష్ణువునకు, విష్ణువునుండి నారదునకు, నారదుని నుండి ఇంద్రునకు, ఇంద్రుని నుండి పరాశరునకు ప్రవచింపబడగా పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి నేను పొందినాము  

ఇట్లు పరంపరా గతముగానగు ఈ ఉత్తమమైన, హితకరమైన పురాణమును నీవునూ నానుండి వినవలసినది .

 ఓ నరశ్రేష్ఠా! పన్నెండు వేలుగా చెప్పబడిన పురాణములన్నియును బుద్ధిమంతులు తెలిసికొనదగినవైయున్నవి. స్కాందము మరియు భవిష్యపురాణము వలెనే పురాణములన్నియు వివిధ అఖ్యానములచే పెంపు చేయబడినవి. స్కాందపురాణము ఒక లక్షశ్లోక పరిమితి గ్రంథమని లోకులకు తెలిసినదే. ఇక నీ భవిష్య పురాణమును వ్యాసముని లక్షార్థశ్లోక సంఖ్యగల గ్రంథముగా నిర్మించేను. ఈ పురాణమును భక్తితో విన్న నరుడు సత్ఫలమును పొందగలడు. దీని వినుట వలన నతనికి మేథాభ్యుదయ సంపదలు నిశ్చయముగా కలుగును.

భవిష్య పురాణమందలి బహ్మ పర్వములోని ప్రథమాధ్యాయము సమాప్తము.