2. సృష్టి వర్ణనము - బ్రహ్మదేవుని ఐదవ ముఖమునుండి పురాణముల ఆవిర్భావము
తా ॥ ఓ వీరుడా ! ఈ పురాణం వినుట వల్ల బ్రహ్మహత్యాపాపము కూడా తొలగిపోవును. అటువంటి పురాణము పంచలక్షణాలు కలది. అట్టి పురాణమును నీవు వినవలసింది. ఈ భవిష్య పురాణాన్ని బ్రహ్మ ఐదు పర్వాలుగా పేర్కొన్నాడు. అందు మొదటీని బ్రాహ్మము, రెండవది వైష్ణవము, మూడవది శైవము, నాలుగవది సౌరము (త్వాష్టము), అయిదవది సకలలోకాలు కొనియాడే ప్రతిసర్గము. ఇక పురాణ లక్షణాలను తెలిసికొమ్ము - 1) లోక సృష్టి, 2) ప్రతిసృష్టి, 3) వంశము, 4) మన్వంతరములు 5) వంశానుచరితము - (అనగా సూర్య చంద్ర వంశ రాజుల చరిత్రలు) -ఈ అయిదు పురాణానికుండే అయిదు లక్షణాలు-అంతేకాక పురాణము పదునాలు విద్యలచే అలంకరింపబడినది. పధ్నాలుగు విద్యలేవనగా - ఋగ్యజుస్సామాధర్వణములనే నాలుగు వేదో లు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అనే ఆరు వేదాంగాలు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము అనునవి.
తా॥ పైన పేర్కొన్న పద్నాలుగు విద్యలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము అనే నాలుగింటితో కలిసి పద్దెనిమిది విద్యలవుతాయి. మొదటగా మనిషికి పాపవిముక్తి హేతువై, ఉత్తమ శాంతిని ప్రసాదించే ప్రాణి సృష్టి క్రమాన్ని వివరిస్తాను. పూర్వం లోకమంతా చీకటితోనిండీ, లక్షణహీనమై గుర్తించరాని విధంగా నిద్రించినట్లుండ (అచేతనము)గా, తమస్సును తొలగించగల సమర్థుడు, అవ్యక్తుడు అయిన భగవంతుడు పంచభూతాలను వ్యక్తపరుస్తూ తాను వ్యక్తుడైనాడు. ఇంద్రియాతీతుడు, ఎవరికినీ గ్రహింపవీలుకాని మహత్తుగలవాడు, సూక్ష్మరూపుడు, అవ్యక్తుడు, సనాతనుడునూ సకలజీవులలో ఉన్నవాడునూ అయిన ఆ దేవుడు స్వయం ప్రకాశుడు. ఓ వీరుడా! స్వయంభువై వెలిగే ఆ దేవుడే పరబ్రహ్మగా పేరొందినాడు. ఆ పరబ్రహ్మ తననుండి సుసిని సారంబింపగోరి మొటమొదట వీటిని సుసీంచి ఒంగులో తన తేజసుకు
తా॥ ఆ తేజస్సే దేవ రాక్షస మానవ జాతులతో కూడిన లోక సృష్టికి హేతువగును. ఆ తేజస్సుకే వీర్యము, బీజము, శుక్రము, రేతస్సు అనే పేళ్ళుకలవు. ప్రకాశవంతమైన ఆ వీర్యమే తేజోయుతమైన అండమై అందుండి సర్వజగత్పితామహుడు, పరమేష్ఠి, నాలుగు ముఖాలున్నవాడు, దేవతలలో పెద్దవాడు, క్షేత్రజ్ఞుడయిన బ్రహ్మదేవుడు జన్మించెను. ఆ బ్రహ్మనే శంభుడని, నారాయణుడని, కమలభవుడని పండితులు చెప్పెదరు. నారమనగా నీరు, నీరే అయనంగా (నివాసస్థానంగా) కలవాడు కాబట్టి ఆదేవుని నారాయణుడని అందురు. సదసదాత్మకము అవ్యక్తమైన కారణము కలది యగు సృష్టికి కారకుడైన ఆ భగవంతుడే బ్రహ్మవాచ్యుడయ్యెను .
తా ॥ విశ్వసృష్టి చేయవలెనను ధ్యానముతో, ఆ అండమును రెండు భాగాలు చేసి వానిచే భూమ్యాకాశాలను కల్పించేను. ఆ భగవంతుడే ఊర్వగతుడై అన్ని లోకాల అభివృద్ధికై అంతరాకాశమును. అష్టదిక్కులను, వారుణస్థానమును మహదహంకారమును సృష్టించి దానినుండి సూక్ష్మములు బుద్ధిగమ్యాలైన సత్వరజస్తమో గుణాలను కల్పించెను. ఆ త్రిగుణాలే పంచమహా భూతాల ఉత్పత్తికి హేతువులైనవి. పంచమహాభూతాల నుండియే పంచేంద్రియాలను ఉద్భవింపచేసెను.
తా॥ అటు పిమ్మట మిక్కిలి సూక్ష్మములైన ఇంద్రియ విషయములైన శబ్ద, స్పర్శ, రూప రసగంధములను ఐదు తన్మాత్రలను మనస్సును సృజించెను. ఆ తర్వాత సర్వ ప్రాణులను సృజించెను. శబ్ద స్పర్శ రూప రస గంధాలు మరియు మనస్సు అను నీ ఆరు శరీరమును ఆశ్రయముగా కలిగి ఉంటాయి. అందుచే జీవుని మూర్తిని శరీరంగా వ్యవహరిస్తారు పండితులు. జీవులు వారి వారి పుణ్య కర్మలచేతను పాప కర్మల చేతను విరాడ్రూపుడైన ఆ పరమాత్మచే జీవత్వమును పొందెదరు. పంచ మహాభూతాలు మొదలుగా కలిగిన మహత్తత్వమునుండియే ఈ జగత్తు వ్యాపించినది. ఇటువంటి సర్వ జగద్వ్యాప్తికి మూలమైన ఏ పరమాత్మకలడో ఆయనయే ప్రతి కల్ప ప్రారంభమున తనను తాను సృజించుకొని వివిధ ప్రజా సృష్టిని చేయగోరినాడు .
తా ॥ సృష్టిని చేయగోరిన పరమాత్మ ముఖ్యంగా పదార్థ సృష్టి చేసి సుఖదుఃఖాది నానా విధ వికారములను కలిగిస్తాడు. మహత్తత్వమునుండియే హరి, హరి నుండి 'వృక మను పేరుగల అగ్ని, దాని నుండి దేవతలు అదే విధంగా సకల సృష్టి సంభవించును. ప్రాణులన్నింటియందు సత్వరజస్తమో గుణాల ఆధిక్యం ఉంటుంది. సత్వరజస్తమో గుణాలే ప్రాణుల సృష్టికి పంచమహాభూతాలకు కూడా కారణాలు. సృష్టిచేయగోరిన ఆ పరమాత్మ ముందు ఆకాశాన్ని కల్పించి దానినుండి వాయువును వాయువు నుండి అగ్నిని, అగ్ని నుండి నీటిని, నీటి నుండి భూమిని, భూమి నుండి ఓషధులను, వాని నుండి అన్నమును, అన్నమునుండి పురుషుని, క్రమంగా సృజించినాడు. సృష్టి చేసిన వివిధ ప్రాణులకు వేరువేరుగా పేర్లను (గుర్తులను) పెట్టి వాని కర్మలను కూడా నిర్దేశించినాడు.
తా ॥ సకల ప్రభువగునతడే. కర్మోద్భవులైన జీవులకు, దేవతలకును వైదికశబ్దానుసారంగా వేరు వేరు నివాసస్థానముల నేర్పరిచెను. తోషుడు, ప్రతోషుడు మున్నుగు తుషిత' గణమును, సనాతనమగు యజ్ఞమును రహస్య యజ్ఞ బ్రహ్మను కూడా కల్పించి యజ్ఞము సిద్ధించుటకై ఋగ్యజుస్సామ లక్షణములను ప్రసాదించెను. సృజనేచ్ఛగల ఆ విభుడే కాలమును, కాల విభాగాలను, గ్రహాలను, ఋతువులను, సప్తనదులను, చతుస్సముద్రాలను, సప్త సముద్రాలను, సప్త పర్వతాలను, కామక్రోధాలను, సుఖాన్ని మరియు వాక్కును సృష్టించాడు. ఇంకా కర్మ వివేకముకొఱకై ధర్మాధర్మములను కల్పించాడు. సుఖదుఃఖాలు, శీతోష్ణాలు మున్నగు ద్వంద్వాలచే కూడియుండునట్లుగా స్వల్ప కాల వినాశకులు గాను ప్రజలను యోజించినాడు. పూర్వ జన్మలలో నిర్వహించిన కర్మలనుబట్టి మళ్లీ మళ్లీ జన్మించే జీవుణ్ణి ఆ పురాకర్మ సంచయనం చేరుకుంటుంది. క్రూరాక్రూరములు, మృదు కఠినములు, ధర్మాధర్మములు, సత్యాసత్యములు పూర్వ జన్మలలో జీవునిచే ఏ విధంగా ఆచరింపబడునో ఆ ఆచరణ ఫలితం అట్లే జీవుణ్ణి ఉత్తర జన్మలలో ప్రవర్తింపజేస్తూ ఉంటాయి. వివిధ ప్రకృతులను ఆరు ఋతువులు ఎట్లాగైతే అనుసరిస్తాయో అట్లే దేహధారులైన మానవులను స్వీయములైన పూర్వకర్మలు పొందగలవు .
తా ॥ ఓ రాజోత్తమా! ఈ లోకాభ్యుదయమునకై బ్రహ్మ తన ముఖమునుండి బ్రాహ్మణుని, బాహువులనుండి క్షత్రియుని, తొడల నుండి వైశ్యుని, పాదముల నుండి శూద్రుని పుట్టించేను. ఆ బ్రహ్మయొక్క నాలుగు ముఖములనుండి వేదములు బయల్వెడలినవి. అతని మొదటి ముఖము (తూర్పు ముఖము) నుండి వసిష్ఠముని సమేతంగా ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యాజ్ఞవల్క్యమునితో బాటుగా యజుర్వేదము, పడమటి ముఖము నుండి గౌతమునితో సహా సామవేదము, ఉత్తర ముఖము నుండీ లోక సన్నుతుడగు శౌనకమహామునితో సహా అధర్వవేదము ఆవిర్భవించెను.
తా ॥ ఓ వీరుడా! అతని అయిదవ ముఖమునుండి ఇతిహాసములతో బాటుగా పద్దెనిమిది పురాణములును, అదేవిధంగా ధర్మశాస్త్రాలు (స్మృతులు) లోక సన్నుతులగు యమాది దేవతలును ఆవిర్భవించిరి. అంత నా భగవంతుడు తన దేహమును రెండు సమభాగాలుగా చేసి మొదటి అర్థ శరీరమును పురుషుడుగాను, రెండవ అర్థశరీరము స్త్రీగాను పరిణమింపజేసి, తన తపోనిష్టతో ఆ స్త్రీయందు విరాట్పురుషుని సృష్టిజేసెను. ఓ రాజా, అట్టి విరాట్పురుషుడు స్వయంగా వివిధ ప్రజాసృష్టి జేయగోరీ తపమాచరించినాడు. అతడు మొదటగా మహాతేజోవంతులు, మహర్షులు అయిన నారదుడు, భృగువు, బ్రహ్మ ప్రచేతసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, అత్రి, అంగిరసుడు, ఆద్యప్రజాపతియైన మరీచిని గొప్పతేజోవంతులైన ఇతరులను సృష్టిజేసెను.
తా ॥ ఓ భారతవంశీయా! పిమ్మట నా విరాట్పురుషుడగు దేవుడు దేవదానవులను, మునులను, యక్ష, రాక్షస, పిశాచ, అసుర, గంధర్వ, అప్సరసలను, మనుష్య, నాగజాతులను, పితృగణమును, మరియు క్షణకాంతి గలిగిన మెరుపుల సమూహములను, ఎరుపురంగు ఇంద్రధనుస్సులను, తోకచుక్కలను, ఉల్కలను, నక్షత్ర సమూహములను, మనుష్య, కిన్నెర జాతులను, చేపలను, వరాహ, గజ, అశ్వ, పశు మృగ సర్ప జాతులను, పక్షి కీటకములను, పేండ్లను, పేను గ్రుడ్లను, నల్లులను సృజించెను. ఇదే విధంగా లోక ప్రకాశకారి యగు ఆ భగవానుడు స్థావరాత్మకమగు ముల్లోకములను సృష్టిజేసెను. సర్వ ప్రాణులచే పొగడబడిన ఆ భగవంతుని ఏ విధమగు సృష్టి కార్యము కలదో దానిని ఇంకా వివరించెదను. భిన్న భిన్న విధములగు గజ, సర్ప, మృగ పశుజాతులు.
తా ॥ అట్లే మావివల్ల పుట్టిన క్రిములు, పిశాచ, రాక్షస, మానవజాతులు, పక్షులు, సర్పాలు, ఇంకా చేపలు, తాబేళ్ళు మరియు మొసళ్ళు, భూమియందును, నీళ్ళ నుండి పుట్టినట్టి ప్రాణులు అడవి ఈగలు, దోమలు చెమటవల్ల పుట్టునవికాన స్వేదజములుగా పిలువబడగా, పేను, పేనుగ్రుడ్లు, నల్లులు వేడి కారణంగా జన్మిస్తాయి. విత్తనముల మూలమున మొలకెత్తినట్టి స్థావరములగు చెట్లు ఉద్భిజ్జములుగా (భూమిని చీల్చుకొని పైకి వచ్చునవి) చెప్పబడినాయి. నానావిధ ఫలములను పొందు ఫలకాంతములే ఓషధులు కాగా పుష్పాలు లేనిపై ఫలములు కలిగి యున్నవి వనస్పతులని పిలువబడును. పుష్ప ఫలములతో కూడియుండు చెట్లు. ఓషధులనియు వనస్పతులనియు ఉభయనామములతో పిలువబడును. అట్లే నానా గుచ్ఛగుల్మములు, తృణ జాతులు అవిచ్ఛిన్నంగా ప్రాకే తీగెలు నానా కర్మలయొక్క హేతువుచే తమోబద్ధములైనవి. ఈ ఓషధులు పైకి సంజ్ఞలు చేయలేకున్నను మిగతా జీవులవలె సుఖదుఃఖాలు కలిగి ఆంతర చైతన్యముతో కూడియున్నవి.
తా ॥ ప్రకాశకారకుడు, మహాత్ముడు అయిన ఆ దేవునివల్లనే ఈ ప్రాణులన్నియు వెలుగులోకి వచ్చాయి. నిరంతర గమన శీలం కలిగిన ఈ ప్రపంచమునందు ఇట్లు సర్వ ప్రాణులను రాజులను సృష్టించి, భూతాత్ముడు, ధీరుడు అగు ఆ భగవానుడు కాలమును కాలముచేతనే అణచివేయుచు వెనుదిరుగును . ఆ భగవానుడు జాగరూకుడై ఉన్నప్పుడు ఈ జగత్తు తన పనులను చేయగలుగును. ఎప్పుడైతే అతడు నిద్రిస్తాడో అప్పుడు సర్వజగము చైతన్యమును కోల్పోవును. సృష్ట్యనంతరం సృష్టికర్త విశ్రమించి నిద్రాగతుడై యుండగా కర్మ బద్ధులైన ప్రాణులన్నియు స్వస్వకర్మనివృత్తిని చెంది, మనస్సు దుఃఖగతముగా ఆపరమాత్మయందు ఒకేసారి విలీనమౌతాయి. ఇంద్రియయుక్తుడైన జీవుడు తమోగుణాశ్రయం వల్ల నిశ్చేష్టుడైనట్లే ఆ పరమాత్మ విశ్రాంతుడైన వేళ ఈ జగచ్చరీరము నుండి కర్మ చేష్టలు వైదొలగును. కాన జగత్తు చేతనారహితమగును. ఎప్పుడైతే అంగుష్ఠమాత్రుడై జీవుడు బీజమును స్థాపించి చలన శీలుడగునో అప్పుడు తమోవృత్తిని విడుచును .
తా ॥ ఈ విధముగా జాగ్రత్ స్వప్నావస్థల మూలంగా అవ్యయుడగు ఆ పరమాత్మ జగత్తును ఎల్లప్పుడు సృజించి నశింపజేయుచుండును. కల్పారంభంలో జగత్తును సృష్టించి కల్పాంతంలో లయము చేయుచుందును. అట్టి పరమాత్మకు ఒక కల్పకాలము దీనంగా చెప్పబడును. ఓ భారతా! ఇక కాల సంఖ్యను కల్ప సంఖ్యను గూర్చి వినుము. పద్దెనిమిది కనురెప్పపాట్ల కాలమును 'కాష్ఠమ'ని పిలుస్తారు. ముప్పది కాష్ఠముల కాలమునకు ఒక 'కలా' అని పేరు. అటువంటి ముప్పది 'కల'ల కాలమును ఒక 'క్షణ'మంటారు. పన్నెండు క్షణముల కాలమునకు ఒక ముహూర్తమని జ్యోతిష్కులు పిలుస్తారు. ముప్పది ముహూర్తముల కాలం ఒక రోజుగా ఉద్దేశింపబడింది. అట్టి ముప్పది దినము కాలం ఒక నెలగా, రెండు నెలల కాలం ఒక ఋతువుగానూ చెప్పబడును . "
తా ॥ మూడు ఋతువులు ఒక అయనంగా, రెండు అయనాలు ఒక సంవత్సరంగా చెప్పబడును. సూర్యునివల్ల దివసము రాత్రింబవళ్ళుగా విభజింపబడును. అట్టి దివసము మానవ మానమని దైవిక మానమని రెండు విధాలు. ప్రాణులు నిద్రించుటకై రాత్రి, కర్మలనాచరించుటకై పగలు నిర్దేశింపబడినది. మానవ మానము ప్రకారం రెండు పక్షములు ఒక మాసమగును. అట్టి మాసము పితృదేవతలకు ఒక దినగా పరిగణింపబడును. మానవ మానం ప్రకారం కృష్ణ పక్షము శుక్షపక్షము - అని రెండు పక్షములు. నెలలోని 15 రోజుల కృష్ణ పక్షకాలము పితృదేవతలకు రాత్రిగా లెక్కింపబడును. అయనమనగా ఆరు నెలల కాలము. రెండు ఆయనములతో కూడిన ఒక మానవ సంవత్సరము దేవతలకు ఒక దీవసమగును. అందు ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయనం రాత్రిగా భావింపబడును. ఇక యుగ ప్రమాణమెట్లనగా - 4,600ల దైవ సంవత్సరాలు కృతయుగమగును. 3000ల దైవ సంవత్సరాలు త్రేతాయుగమగును. 2,400లదేవ సంవత్సరాల కాలము ద్వాపర యుగమగును. 1,200ల దైవ సంవత్సరాల కాలము కలియుగమగును.
తా ॥ ఓ రాజోత్తమా! నాలుగు యుగముల కాల పరిమితిని చెప్పియున్నాను. ఈ నాలుగు యుగాలు పన్నెండు వేల మార్లు ఆవర్తనం అయితే దేవతలకు ఒక యుగమవుతుంది. ఇటువంటి వేయి దేవయుగాలు బ్రహ్మకు ఒక పగలు. అట్టి వేయి దేవయుగాలే బ్రహ్మకు ఒక రాత్రి - అంటే రెండు వేల దేవయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినము అవుతుంది. యుగాంతంలో బ్రహ్మ నిద్రించి మరల మేల్కొంటాడు. అట్లు మేల్కొని లోకమును సృజించుకోరికతో సదసదాత్మకమైన మనస్సును సృష్టి చేస్తాడు. ఆ మనస్సు నుండి ఆకాశం పుడుతుంది. ఆకాశానికి శబ్దమే గుణంగా చెబుతారు. ఆకాశం నుండి అన్ని గంధములను వహించేవాడు, పవిత్రుడు, బలవంతుడు అయిన 'వాయువు 'పుట్టును. అట్టి వాయువు స్పర్శగుణం కలది. అట్టి వాయువు నుండి తేజశ్ళీలుడు, తమస్సును అణచేవాడును, విచిత్ర కిరణాలు కలవాడును అగు అగ్ని జన్మిస్తాడు.
అతని రూపమే గుణము అని తెలియుదురు. ఆ అగ్ని నుండి నీరు పుట్టునని పండితులు చెప్పుదురు. ఆ నీటి గుణం రసము. నీటి నుండి గంధ గుణం కల భూమి ఉద్భవిస్తుంది. ఇది మొదటి నుండియు సృష్టి క్రమము.
తా ॥ ఇంతకుముందు చెప్పినట్లు ఏ పన్నెండు వేల చతుర్యుగాల కాలం ఒక దేవయుగమౌనో, అట్టి డెబ్బది దేవయుగాల కాలం ఒక మన్వంతరంగా చెప్పబడును. మన్వంతరాలు చాలా ఉన్నాయి. బ్రహ్మ దిన కాలంలో 14 మంది మనువులు పాలిస్తారు. స్వాయంభువ మనువు వంశానికి చెందిన వారే మిగతా ఆరుగురు ఉన్నారు. వీరందరు వారి వారి మన్వంతర కాలాలలో మహాత్ములైన తేజోబలయుతులైన ప్రజలను సృష్టిచేస్తారు. అట్లాగే సావర్ణుడు మరియు రౌచ్య దౌత్య నామములతోను ఏడుగురు మనువులు భవిష్యత్తులో కాబోయే మనువులుగా చెప్పబడ్డారు. ఈ పద్నాలుగురు మనువులు వారివారి మన్వంతర కాలాలలో ఈ చరాచర సృష్టిని పాలిస్తారు. ఓ రాజోత్తమా! ఈపద్నాలుగు మన్వంతరాల కాలమే బ్రహ్మకు ఒక దినము బ్రహ్మ దినము ముగియగానే మళ్లీ అతడు సృష్టిని ఆరంభిస్తాడు.
తా ॥ ఓ రాజాధిపా! ఈప్రపంచ సృష్టిని బ్రహ్మ ఒక ఆటలాగా కొనసాగిస్తాడు. ధర్మంసమస్తం నాలుగు పాదములు కలదై ప్రవర్తిస్తుంది. అందు కృతయుగంలో సత్యమే సంపూర్ణంగా ఉంటుంది. ఏ శాస్త్రము కూడా అధర్మంగా ప్రవర్తింపుమని నిర్దేశింపదు. మనువు చెప్పినట్లుగా త్రేతాదియుగాలలో చౌర్య, అసత్యాల వలనను మాయ వల్లనూ ఒక్కొక్క పాదము చొప్పున ధర్మము నశిస్తుంది. కృతయుగంతో జనులు రోగములు లేని వారై సకల సిద్దులతో సంవత్సరాల సంపూర్ణాయుష్యం కలిగివుంటారు. ఇక త్రేతాది యుగాలలో ప్రజల ఆయుష్యం ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తుంది. ఓ కురునందనా! వేదాలలో చెప్పబడినట్లుగా మనుష్యుల ఆయురాశీస్సులు, కర్మ ఫలాలు ఆయా యుగానుసారంగా ఫలిస్తూ ఉంటాయి.
యుగధర్మమును బట్టి కృతయుగ ధర్మాలు వేరు, త్రేతాయుగ ధర్మాలు వేరు. అట్లే ద్వాపర కలియుగ ధర్మాలును భిన్న భిన్న ములు. కృతయుగంలో తపస్సే శ్రేష్ఠంగా, త్రేతాయుగంలో జ్ఞానమే విశిష్టంగా, ద్వాపరంలో యజ్ఞం శ్రేష్ఠ కర్మగాను, కలియుగంలో దానం విశిష్ట కర్మగాను చేప్పెదరు.
తా ॥ ఓ తేజశ్శాలీ? ఈసర్వసృష్టి రక్షణ కొరకై ఆ బ్రహ్మ తన ముఖ, బాహు, ఊరు, పాదాల నుండి జన్మించిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్గాల వారికి వేరువేరు కర్మలను ఏర్పరిచాడు. అధ్యాపనం, అధ్యయనం, యజ్ఞం చేయుట, యజ్ఞాన్ని చేయించుట, దానాన్ని గ్రహించుట అనే కర్మలు బ్రాహ్మణులకు విహితములు. ఓ రాజా! ప్రజాపాలనం, దానం, అధ్యయనం, ఇంద్రియ సౌఖ్యానుభనం, యజ్ఞాసక్తి మొదలైనవి క్షత్రియకర్మలు. పశురక్షణం దానం, యజ్ఞ నిర్వహణ, అధ్యయనం, వాణిజ్యం, అప్పివ్వడం, కృషి మొదలగునవి వైశ్య కర్మలు. పై మూడు వర్ణాల వారిని సేవించడమే శూద్రునకు కర్మగా లోకమున విశ్రుతమైయున్నది. ఓ రాజోత్తమా! ఆ విరాట్పురుషుని యొక్క నాభి పై భాగం (శరీర పూర్వార్థం) సదా శ్రేష్ఠం. దాని కంటేను అతని ముఖం మిక్కిలి శ్రేష్ఠం అని వేదమున వినబడుచున్నది. అట్టి సర్వ ధర్మమునకు బ్రాహ్మణుడే అధికారి. సర్వ హవ్యకవ్యముల రక్షణకై బ్రాహ్మణుడు మొట్టమొదట సృజింపబడినాడు.
తా ॥ బ్రాహ్మణుని ముఖం ద్వారా దేవతలు హవ్యాన్ని భుజిస్తారు. అతని ముఖం ద్వారానే పితృదేవతలు కవ్యాన్ని భుజిస్తారు. కావున బ్రాహ్మణుని కంటే మించిన ప్రాణి మరొకటి లేదు. సకల భూతములలో ప్రాణులు శ్రేష్టములు. అట్టి ప్రాణులలో బుద్ధియుత జీవులు శ్రేష్ఠములు. బుద్ధి కలిగిన జీవులలో మానవులు శ్రేషులు. అట్టి మానవులలో బ్రాహ్మణుడు చాలా శ్రేష్టుడు. బ్రాహ్మణులలో విద్వాంసుడైన వాడు శ్రేష్ఠుడు. విద్వాంసులైన బ్రాహ్మణులలో కర్తలు శ్రేష్ఠులు కర్తలలో బ్రహ్మజ్ఞానులైనవారు శ్రేష్ఠులు. కనుక ఓ రాజేంద్రా! ధర్మార్థముల కొరకే ఈ లోకాన విప్రుడు జన్మించాడు. సకల సిద్ధుల కొరకై జన్మనొందిన విప్రుడు బ్రహ్మపదాన్ని పొందగలడు!. సకల ప్రాణుల అభ్యుదయమునకు, ధర్మార్థముల రక్షణకు ఈ భూమి పై బ్రాహ్మణుడు జన్మించాడు. ఏ కొంచం ధర్మమైనా భూమిగతమై యున్న దన్నచో అది బ్రాహ్మణుని మూలంగానే కాన బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది. ఈ పృథివియందున్న దంతయు బ్రాహ్మణునిదే అతడు సర్వమునకు అరుడు. బ్రాహ్మణుడు కర్మశీలిగా సత్కర్మాచరణంతో స్వకీయ ఫలాన్ని అనుభవిస్తాడు. అతని అనుగ్రహం వల్ల ఇతర వర్ణాల జనులు సత్ఫలసౌఖ్యాలను అనుభవిస్తారు పదాన ప్రకటన యెడల ద్విజుడు సంతసిపాడు. అట్టి పద్భ్యానం లోపించినచో.
తా ॥ ఓ రాజా! లోక కళ్యాణం కొరకై విప్రుడు సత్కర్మ చేస్తాడు కనుక అతడు స్వర్గమును పొంది అక్కడి నుండి మహార్లోకమును మహర్లోకం నుండి జనోలోకమును అక్కడి నుండి బ్రహ్మ లోకమును చేరగలడు. ఇట్లు బ్రాహ్మణుడు బ్రహ్మత్వమును పొందుటలో ఎట్టి సంశయమూ లేదు. అప్పుడు శతానీకుడిట్లు పలికెను. ఓ సువ్రతా! బ్రహ్మత్వం అనేది పొందశక్యం కానిది కదా! అలాంటి బ్రహ్మత్వాన్ని బ్రహ్మలోకాన్ని ఎలాంటి విప్రుడు పొందగలడు. విప్రుడు నామమాత్రంగా బ్రాహ్మణుడా? అతనికి బ్రహ్మకు సంబంధించిన బ్రహ్మత్వమేమిటి? బ్రహ్మప్రాప్తి విషయంలో అతనిని ఏ బ్రహ్మగుణాలు పొందుతాయో చెప్పుము. అప్పుడు సుమంతుడిట్లు పలికెను. ఓవీరుడా! చాలా బాగా అడిగితివి. విశిష్టమైన నా వచనమును వినుము. బ్రాహ్మణునకు వేద శాస్త్రములు విధించిన గర్భాదానాది నలుబది ఎనిమిది సంస్కారాలు శాస్త్ర ప్రకారంగా అతనికి నిర్వహింపబడినచో అతడు గౌరవప్రదమైన బ్రహ్మ స్థానమైన బ్రహ్మత్వమును పొందగలడు. బ్రహ్మత్వ ప్రాప్తి విషయంలో సంస్కారాలే హేతువులనడంలో ఎట్టి సందేహం లేదు .
తా ॥ ఓ విప్రోత్తమా ! బ్రాహ్మణునకు బ్రహ్మత్వ కారకములైన సంస్కారాలేవియో వివరింపుమని శతానీకుడడుగగా సుమంతుడిట్లు చెప్పుచున్నాడు. వేద శాస్త్రములలో చెప్పబడిన బ్రాహ్మణ సంస్కారాలేవనగా - గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ అన్నప్రాశనము, చౌలము, ఉపనయనము, ప్రాజాపత్య సౌమ్యాగ్నేయ, వైశ్యదేవములను నాలుగు బ్రహ్మవ్రతాలు మరియు స్నాతకము గార్హస్థ్యము, అట్లే గృహస్థుడు తన శ్రేయమునకై చేయదగిన బ్రహ్మదేవ పితృ మనుష్య భూత యజ్ఞములను పంచయజ్ఞాలు, అట్లే, ఔపాసన వైశ్యదేవ పార్వణ అష్ట మాసశ్రాద్ధ సర్వబలి ఈశానబలులు అనుసప్త పాక యజ్ఞాలు, ఇంకనూ అగ్న్యాధాన అగ్నిహోత్ర దర్శపౌర్ణమస్య చాతుర్మాస్య నిరూఢపశుబంధన సౌత్రామణి, అను సప్తహవిర్యజ్ఞాలు, ఇక అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉర్థ్య, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామములను సప్తసోమయజ్ఞములును చెప్పబడియున్నాయి.
తా ॥ ఓ భారత ! ఈ పై చెప్పినవి నలుబది బ్రాహ్మణ సంస్కారాలు. ఇక ఎనిమిది ఆత్మగుణాలున్నాయి. వానిని చెప్పెదను వినుము. అనసూయ, దయ, క్షమ, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, శౌచము, అస్పృహ అను ఎనిమిదింటిని ఆత్మగుణాలుగా విద్వాంసులు చెప్పెదరు. ఇక ఈ గుణాల లక్షణాలన్నింటిని వినుము. గుణవంతుని గుణాలను చెడుగా చెప్పకుండుట, తన గుణాలను పొగడుకొనకుండుట, ఇతరుల దోషాల యెడల హర్షింపకుండుట అనేది 'అనసూయ' అనే గుణంగా చెప్పబడును. తనవారియందు, పరవారియందు. మిత్రునియందు, శత్రువునందు తనయందువలే సద్భావం కలిగియుండుటయే దయ' అని అంటారు వాచికంగా, మానసికంగా, శారీరకంగా కష్టము సంభవించినపుడు కోపగింపకుండుట, దుఃఖింపకుండుటయే 'క్షమ' అని పిలువబడును. తినకూడని పదార్థాలను విసర్జించుట, సజ్జన సాంగత్యము, సదాచారమును పాటించుటను 'శాచ' మని అంటారు ,
తా ॥ శుభకర్మచే శరీరము తపించుచున్ననూ భంగము లేకుండా శుభకర్మను కొనసాగించుటయే “అనాయాసమ”ని చెప్పబడును . ప్రశస్త కర్మను చేయడం, అప్రశస్త కర్మను విడచి పెట్టడాన్ని 'మంగళం'అని బ్రహ్మవాదులైన మునులు చెబుతారు . తనకున్న కొంచెము సంపదనుండియైనను ఎలాంటి దైన్య హృదయం లేకుండా నిరంతరం దానం చేయుటయే అకార్పణ్యము.పరులను బాధింపకుండా తనకు కలిగిన స్వల్పవస్తువుతోనైననూ సంతుష్టి చెందుటయే 'అస్పృహ'గా చెప్పబడును. ఇట్లు నలుబదిఎనిమిది సంస్కారాలచే బ్రాహ్మణ దేహం సంస్కరింపబడి బ్రహ్మత్వము నొంది బ్రహ్మలోకం చేరుకుంటుంది . ఇట్లు వైదికములైన పుణ్యకర్మలచేత, ప్రోక్షణాదులచేతనూ విప్రశరీరము ఇహలోకముననూ మరణానంతరం కూడా సంస్కరింపదగినది. పిదప గర్భశుద్దిని ఆశ్రమలక్షణ ధర్మములను పొంది ఈ పురాణమునందిచ్చగల బ్రాహ్మణులు ముక్తిని పొందుననుటలో సందేహం లేదు. ఓ కురుశ్రేష్టా! ఆశ్రయించిన వారికి స్వస్తి పలికే సమీపస్థులైన బ్రాహ్మణులను వదిలి పెట్టి ఇతరులను ఎవడైతే పూజిస్తాడో, అట్టి బ్రాహ్మణ అగౌరవం వల్ల వచ్చే పాపం చెప్పనలవి కానిది.
తా ॥ అందువల్ల సమీపముననున్న బ్రాహ్మణుని అతిథిలను పూజించినట్లుగా అన్నపానాది దానములతో శాస్త్రప్రకారం పూజించాలి. బ్రాహ్మణుడు సర్వవర్ణాలలోకెల్లా అగ్రగణ్యుడు, శ్రేష్టుడు, ఉత్తముడు, ఇట్లు పురాణమున చెప్పబడిన విప్రసంస్కారములను ఎవడైతే వినునో, తెలిసికొనునో మరియు చదువునో, అతడు సమృద్ధిని, అభ్యుదయమును, కీర్తిని, ఉత్తమ సంపదను, ధన ధాన్యాలను, పుత్రమిత్రులను, మంచి రూపాన్ని సూర్యలోకాన్ని పొంది పిదప బ్రహ్మలోకాన్ని పొందుతాడు.
ఇది శ్రీ భవిష్య పురాణములోని బ్రాహ్మీపర్వమందలి ద్వితీయాధ్యాయము.