3. ఉపస్పర్శన విధి వర్ణనము
తా II శతానీకుడిట్లు పలికెను - ఓ ద్విజోత్తమా ! నాలుగు వర్ణముల వారికి నిర్దేశించిన జాతకర్మాది సంస్కారాలను మరియు ఆశ్రమధర్మాలను గూర్చి చెప్పుము. సుమంతుడిట్లు పలికెను - గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ అన్నప్రాశనము, చూడ, మౌంజీ బంధము. స్వాధ్యాయము, ప్రతహోమాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అను త్రివిద్యలు వేదములు, యజ్ఞాలు మొదలైన వానిచే బ్రాహ్మణులకు గర్భ సంబంధమైన బీజదోషం తొలగుతుంది. మహాయజ్ఞాలచేత, యజ్ఞాలచేత విప్రదేహం నిర్మాణమవుతుంది. ఓ రాజా విప్రదేహం ఎలా నిర్మాణమవుతుందో చెప్పెదను. ఏకాగ్రచిత్తుడవై వినుము
తా ॥ మగశిశువు యొక్క నాభిసూత్రాన్ని కత్తిరించుట కంటే ముందు జాతకర్మ నిర్వహింపబడును. పిదప తేనె, నేయితో మంత్రయుక్తంగా అన్నప్రాశనము చేయబడును. అనంతరం శిశువుకు ఒక మాసం పూర్తి కాగానే పదియవ దీనమున నామకరణ కర్మను పుణ్యతిథి నక్షత్ర యుక్త ముహూర్తమున నిర్వహించుటకు కొందఱు ఇష్టపడేదరు. కొందఱు పన్నెండవదినమున, మణికొందఱు ఈ ఆచారాన్ని శిశువు పుట్టిన పద్దెనిమిదవ రోజున నిర్వహిస్తారని, కొందరు చెబుతుంటారు. బ్రాహ్మణ కుమారునుకు శుభమైన 'శివశర్మ నామకరణం చేయాలి. క్షత్రియ కుమారునకు విశిష్టమైన “ఇందువర్మ' అను పేరు, వైశ్యునకయితే ధనయుక్తమైన 'ధనవర్ధన' అను పేరు, హీనకులజుడుగు శూద్రునకు 'సర్వదోస' అను పేరు విధింపబడును. మనువుకూడా నామకరణ లక్షణాన్ని ఇట్లాగే చెప్పాడు. బ్రాహ్మణునకు శర్మనామము వలెనే రాజులకు రక్షార్థ సూచకమగు 'వర్మ' పేరు, వైశ్యునకు ధనపుష్టియుతమగు పేరు, శూద్రునకు 'దాస' పదముతో కూడిన పేరు, స్త్రీలకు స్పష్టార్థముతో కూడిన సుకుమారమైన, మంగళకరమైన, దీర్ఘసౌభాగ్యసూచకమైన పేరు విధింపబడాలి. శిశువు పుట్టినది మొదలు పన్నెండవ దినమున పితృగృహమునకు నిష్క్రమింపచేయుట విధి విహితము.
తా ॥ ఆరవమాసమున అన్నప్రాశనం యథేష్టంగా ఆచరింపవచ్చును కాగా నాలుగవ నెలలో దానిని ఆచరించాలి అని ఇతర విద్వాంసుల అభిప్రాయము. బ్రాహ్మణులు మొదలుకొని మిగతా వర్ణముల వారికిని చూడాకర్మ శిశివు పుట్టిన మొదటి ఏటగాని మూడవ ఏట గాని చేయవలెను. ఎనిమిది ఏండ్ల వయస్సులోగా బ్రాహ్మణునకు ఉపనయనం నిర్వహించాలి. ఓ రాజా! ఇక క్షత్రియ బాలునకు పదకొండవ ఏట, వైశ్యబాలునకు పన్నెండవ ఏట ఉపనయన (వ్రతాన్ని ఉపదేశించాలి. బ్రహ్మతేజోవంతుడు కావలెనను కోరికయున్నచో బ్రాహ్మణునకు అయిదవ ఏట ఉపనయనం జరుపదగును. అట్లే బలార్టీయైనచో వైశ్యునకు ఎనిమిదవ ఏట ఉపనయనం జరుపదగును. బ్రాహ్మణునకు 16 సం॥ వయస్సు వరకు సవితృదేవత అనుకూలించియే ఉంటుంది. అతని నుండి వైదొలగదు. కాన 16 సం॥ ప్రాయము వరకు ఉపనయనాధికారం కలదని భావము. అట్లే క్షత్రియునకు 22 సం॥ వయస్సు, వైశ్యునకు, 24. సం॥ వయస్సు వరకు సవితృదేవత అనుకూలురాలై ఉంటుంది. ఆ నిర్దిష్ట వయః పరిమితులలో వారు ఉపనీతులు కానిచో పవిత్ర మంత్రోపాసనా వ్రతభ్రష్టులై అసంస్కారులవుతారు. తత్రాయశ్చిత్తంగా 'వ్రాతస్తోమ'మనే క్రతువుతో తప్ప వారికి సంస్కారం లభింపదు . ఇట్లు అపవిత్రులైన వీరితో
ఏ ఆపత్సమయమందైననూ, ఏ విధంగానైనను సంస్కారియైనవాడు బ్రాహ్మమగు వివాహ సంబంధమును ఆచరింపరాదు.
తా॥ ఉపనయన వ్రతనిష్టులు ధరింపవలసిన మృగచర్మాలు మువ్విధాలుగా నున్నాయి. బ్రాహ్మణ వటునకు నల్లజింక చర్మము, క్షత్రియునకు “గురు' మృగచర్మం, వైశ్యునకు 'మేక చర్మము నిర్దిష్టము. అట్లే బ్రాహ్మణునకు శణ'వస్త్రము, జనుము క్షత్రియునకు క్షామ (పట్టు వస్త్రము మున్నగు వివిధ వస్త్ర విశేషములను త్రివర్ణముల వారికి సూచింపబడ్డాయి. బ్రాహ్మణునకు మూడువరుసలతో అందంగా మౌంజి (ముంజదర్భలతో తయారుచేబడుతాడు)ని మొలనూలుగా, క్షత్రియునకు అల్లే త్రాటిని మొలనూలుగా, వైశ్యునకు శణ (గొర్రెచర్మపురోమాల) సూత్రమును మొలనూలుగాను చేయదగును . ముంజదర్భలు లభింపని పక్షంలో కుశ దర్భలతో గాని, అశ్మంతకపు ఓషధివిశేషముతోగాని, “బల్వజ'మను తృణ విశేషముతోను ఒక ముడి లేదా మూడు లేదా ఐదు ముళ్ళతోను ఏర్పాటు చేయదగును. బ్రాహ్మణ యజ్ఞోపవీతమును దూదిచే తయారుచేయుట, రాజుల జందెమయినచో శణసూత్రము చే తయారు చేయుట వైశ్యుల జందేమయినచో ఆవిక సూత్రము (గొట్టె చర్మపుదారము)చే తయారు చేయుట శాస్త్ర విహితమై యున్నది.
తా ॥ ఉపనీతులు ధరింపదగిన ఓషధీ దండములు మూడు విధాలుగా ఉన్నాయి. బ్రాహ్మణ వటువు నేరేడు, మోదుగు జువ్వి దండములు, క్షత్రియ వటువు మజ్జి, చండ్ర, వేతసోద్భవ దండములును, వైశ్యవటువు మేడి, రావి పైలవ దండములును ధర్మబద్ధంగా ధరింపనరుడగును. బ్రాహ్మణునకు శిఖాపర్వంతము కొలతగల దండము. క్షత్రియునకు నుదుటి వరకు పొడవుగల దండము, వైశ్యునకు నాసికా పర్వంతముకొలతగల దండము ఉండవలెనని దండప్రమాణము విధింపబడినది. సత్యవర్తనులు, సౌమ్యదర్శనులు, తమ సాత్త్విక ప్రవృత్తి వల్ల ప్రభువులకు కోపము కలిగింపని వారయిన విప్రులు పరమ పవిత్రులు. ఉపనీతుడైన విప్రుడు పై నిర్దేశించిన మూడు విధాలైన దండములలో ఇష్టమైన దానిని గ్రహించి తేజోవంతుడైన గురువునాశ్రయించి యధావిధిగా భిక్షాటన చేయాలి. భవచ్ఛబ్దాన్ని వాక్యారంభమున పలుకుతూ బ్రాహ్మణుడు భిక్షను గ్రహించాలి (భవతి భిక్షాందేహి) భవచ్ఛబ్దాన్నీ వాక్యమధ్యములో పలుకుతూ క్షత్రియుడు, భవచ్ఛబ్దాన్ని వాక్యాంతమున పలుకుతూ వైశ్యుడు భిక్షావృత్తినాచరింపవలెను
తా II వటువు, తనను కించపరచనట్టి తన తల్లిని గాని, చెల్లెలిని గాని, తల్లి సోదరినిగాని మొదటగా భిక్షను యాచించాలి. ఆ మాతృమూర్తి వటువునకు బంగారాన్ని, వెండిని, అన్నాన్ని భిక్షగా భిక్షాపాత్రలో ప్రసాదిస్తుంది. ఆ భిక్షా ద్రవ్యమునంతటిని ప్రోగు చేసికొని, దాపరికం లేకుండా గురువునకు నివేదించిన మీదట వటువు పరిశుద్దుడై తూర్పునకు అభిముఖుడై కూర్చొని ఆచమనం చేసి భుజింపవలెను. ఆయుష్యము కోరువాడు తూర్పు ముఖముగాను, కీర్తికాముడు దక్షిణముఖంగాను, సంపదఁ గోరువాడు పడమర ముఖంగాను, సత్యఫలాన్ని కోరువాడు ఉత్తరముఖంగాను కూర్చుండి అన్నమును భుజిస్తాడు ఓ రాజా! బ్రాహ్మణుడు స్నానా చమనాలచే శుచియై అన్నమును భుజించిన పిదప ముఖాద్యవయవములను నీటిచే శుద్ధి చేసికోవాలి. ఎల్లప్పుడూ అన్నమును పూజింపవలెనే కాని అసహ్యించుకొనుచు నిందింపదగదు. అన్నమును చూడగానే సంతోషించి ప్రసన్నుడు కావాలి. అట్లు సంతోషించియే అన్నాన్ని భుజించాలని మనువచనము. స్తుతిస్తూ భుజించిన అన్నము బలవీర్యములనిస్తుంది. నిందాపూర్వకంగా తిన్న అన్నము బల వీర్యములను హరిస్తుంది. అట్లే ఎంగిలి అన్నమును ఇతరులకు పెట్టకూడదు. ఇంకనూ ఇతరుల ఎంగిలి అన్నమును, వదిలిన అన్నభాగమును కూడా తాను తినకూడదు.
తా ॥ ఎవడయితే తినిన అన్నమును వదిలి అదే అన్నమును లోభముతో మరల భుజించునో అట్టి నరుడు, పూర్వము ధనవర్ధనుడను పేరుగల వైశ్యుడు నష్టపడినట్లు ఇహపరసౌఖ్యాలను కోల్పోతాడు -40. ఆ ధనవర్ధనుడు అన్నాన్ని ఎలా వదిలివెళ్ళాడో వివరంగా చెప్పమని శతానీకుడు అడుగగా సుమంతుడిట్లు బదులు పలికాడు. ఓ రాజా! కృత యుగంలో పుష్కర క్షేత్రమున నివసించే ధనధాన్యవంతుడైన ధనవర్ధనుడనే వైశ్యుడు వేసవికాలమున వైశ్వ దేవమును చేసి పుత్రసోదర బంధు సమేతంగా భక్ష్యభోజ్యయుక్తమైన ఆహారాన్ని భుజిస్తుండగా ఒక గొప్ప శబ్దము వినబడింది. అంత నా ధనవర్ధనుడు భోజనమును వదిలి పెట్టి ఇంటినుండి బయల్వెడలి, ఆ శబ్దముననుసరించి పరుగెత్తెను. పిదప నా శబ్దము తిరోభూతము కాగా తిరిగి ఇంటికి వచ్చి భుక్తపూర్వాన్న శేషమును భుజింపగా వందసార్లు జన్మల నెత్తినాడు. కావున ఓ రాజా ! భుక్తాన్న శేషమును (ఉచ్ఛిష్టమును) భుజింపరాదు
తా ॥ అతిగా అన్నమును తినకూడదు. ఉచ్ఛిష్టాన్నమును తినరాదు. అతిగా తీసుకున్న ఆహారం ఆమ్లంగా మారి, ఆమ్లం వల్ల రోగం కలుగుతుంది. ఆ కారణంవల్ల మానవులకు స్నాన, దాన, జన, హోమ, పితృకర్మలు భంగమవుతాయి. కావున ఆరోగ్యమును, ఆయుర్దాయమును, స్వర్గ సౌఖ్యమును, సర్వ కర్మలను భంగపరచునట్టి అత్యాహార సేవనమును వదులుకోవాలి. ఇక భోజనమువేళ కారణాంతరాల వల్ల అన్నమును వదిలి వెళ్ళినచో అది ఉచ్ఛిష్టమనబడును. ఆ ఉచ్ఛిష్టాన్నమును యక్ష, భూత, పిశాచ, రాక్షస గణాలు ఆశ్రయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల స్నానాచమనాదులచే మానవుడు పరిశుద్ధిని పొందాలి. దాని వల్ల సుఖం కలిగి ఐహికానందం లభించునని వైదిక ప్రమాణము. విప్రశ్రేష్టా! బ్రాహ్మణుడు ఎట్లు పవిత్రతను పొందగలడో, ఎట్లు అశుచిత్వాన్ని పొందుతాడో నాకు వివరంగా తెలుపుమని శతానీకుడడుగ, సుమంతుడిట్లు పలికాడు. బ్రాహ్మణుడు ఉపస్పర్శనము (స్నానాచమనాదులు)ను యథావిధిగా ఆచరించి శుద్ధిని పొందగలడు . దేని మూలంగా విప్రుడు శుచిమౌతాడో అట్టి ఉపస్పర్శన విధానమునంతయు తెలుపుమని శతానీకుడడుగగా సుమంతుడిట్లు చెప్పాడు. ఓ రాజా! చక్కగా అడిగావు. శాస్త్ర ప్రకారంగా విప్రుడు పవిత్రుడయ్యే ఉపస్పర్శన పద్ధతిని చెబుతాను వినుము .
తా ॥ ఆచమన విధిచేయువాడు ముందుగా కాళ్ళు జేతులను శుద్ధి జేసికొని పరిశుద్ధ ప్రదేశమున తూర్పున, కభిముఖుడైకాని ఉత్తరాభిముఖుడై కానీ కూర్చోవాలి. కాళ్ళను సమముగా చేసి కూర్చొని మోకాలిలోపల కుడిచేయి నుంచి యజ్ఞోపవీతయుక్తుడై, శిఖను ముడి వేసినవాడై ఆచమనము నాచరించాలి. కండ్లను మూసికొని ధ్యానముద్రతో, శాంతుడై మౌనంగా ఆచమనమును చేయాలి. ఉష్ణ జలము (వేడినీళ్ళ)ను, నురగతో కూడిన నీళ్ళను, కలుషిత జలమును, రసగంథములచే రంగుమారి చెడిన నీటిని, మరియు బుడగలతో కూడిన నీటిని ఆచమనమునకు వాడరాదు. పరిశుభ్రమైన నీటిచే ఆచమనము జేసిన పరిశుద్ధుడగును. ఓ రాజా! బ్రాహ్మణునకు ఐదు తీర్థములు వినబడుచున్నవి. అవి దేవతీర్థము, పితృతీర్జము, బ్రహ్మతీర్థము; ప్రాజాపత్యము సౌ సఃమ్యము. చూపుడు వ్రేలు, బొటన వేలి మధ్యన పితృతీర్థము, చిటికెన వ్రేలి మూలమున బ్రహ్మతీర్థము, బొటన వేలి మూలమునందలి ఉత్తరమునగల రేఖయందు ప్రాజాపత్య తీర్థము, దేవతా పూజాది క్రియలకు ప్రశస్తమగు సౌమ్యతీర్థము చేతిమధ్యలోనూ కలవని వసిష్టాదులు పలికెదరు .
తా ॥ ఓ రాజా! దేవతార్చన, బలిహరణము, ప్రవిక్షపణము అనునవి దేవతీర్ధముచేత చేయదగినవి. అన్న దానము, అస్థి సంచయనము మరియు లాజాహోమము ప్రాజాపత్య తీర్థము చేత నాచరింపదగును. కమండలూపస్పర్శనము మరియు దధిప్రాశనము సౌమ్యతీర్థము చేత, పితృతర్పణము పితృతీర్థముచేతను, ఉప స్పర్శన విధి బ్రహ్మతీర్థము చేతను ఆచరించుట శ్రేష్ఠముగా చెప్పబడినది. చేతి వేళ్ళను ముడిచిన దోసిటిలో నీటిని పోసికొని, నీటి చప్పుడు కాకుండా ఏకాగ్రమనస్కుడై మూడు మార్లు ఆచమించిన బ్రాహ్మణుడు దేవతలను సంతోష పెట్టిన ఫలితము నందును. మొదటి జలాచమనముచే ఋగ్వేదము, ద్వితీయాచమనముచే యజుర్వేదము, తృతీయాచమనముచే సామవేదమును తృప్తినొందును. ఓ రాజా! కుడిచేతి బొటన వ్రేలితో మొట్టమొదట చేసికొను ముఖ మార్జనముచే అధర్వణ వేదము ప్రీతినందుననుటలో ఏ సందియమును లేదు.
తా ॥ నుదురు భాగమును పవిత్రీకరించుటకై చేయు ద్వితీయ మార్జనముచే ద్విజుడు రుద్రుని, ఇతిహాస పురాణములను సంతోషపరచును. అట్లే శిఖను స్పర్శించుటచేత ఋషులను, నాసికాలంబనమువల్ల వాయువును, చెవులను స్పర్శించుట వలన దిక్కులను సంతోష పెట్టిన వాడగును. అదేవిధంగా బాహువులను పట్టుకొనుట వలన ఇంద్ర యమ, కుబేర వరుణాగ్ని దేవతలను, నాభిని ముట్టుకొనుట వలన ప్రాణ గ్రంథిని విప్రుడు సంతసింపచేయును. పాదములను తడుపుట వలన విష్ణువును, భూమి పై విసర్జింపబడిన నీరు వాసుకి మొదలైన నాగులను సంతోషపరచును.
తా ॥ ఏ నీటి బిందువైతే భూమిపై పడునో వాటిచే చతుర్విధ భూత సమూహము సంతోషించును. తర్జన్యంగుష్ఠములచేత కన్నులను అనామికాం గుష్ఠముల చేత నాసికను, మధ్యమాంగుష్ఠములచేత ముఖమును, కనిష్ఠ కాంగుష్ఠములచే చెవిని, వ్రేళ్ళచేత బాహువులను, అంగుష్ఠముచేత మండలమును, నాభిని శిరస్సును అన్ని వేళ్ళచేత స్పృశింపవలెను. అంగుష్ఠము అగ్నిగాను, తర్జన్యం గుళి వాయువుగాను, అనామిక సూర్యునిగాను, కనిష్ఠికాంగుళి ఇంద్రునిగాను, మధ్యమాంగుళి బ్రహ్మగాను తెలియదగును. ఈ విధంగా ఆచమించి బ్రాహ్మణుడు సర్వ దేవతలను, జగత్తును, లోకులనందరిని ఎల్లప్పుడు సంతోషింపజేయును. అందుచేతనే విప్రుడు సదా పూజ్యుడు. అతడు సకల దేవతల సమాహార స్వరూపము. బ్రాహ్మతీర్థము చేతనే విప్రుడు ఉపస్పర్శన విధి (ఆచమనం) నాచరించవలే కానీ, పితృతీర్ణముచేత చేయకూడదు.
ఆచమన జలం హృదయము వరకు వెళ్ళిన మీదట విప్రుడు, కంఠం వరకు వెళ్ళినచో క్షత్రియుడు, నోటిలోనికి వెళ్ళిన పిదప వైశ్యుడు. నీటి స్పర్శ అయిన వెంటనే శూద్రుడు పవిత్రులగుదురు. సవ్యముగా (అనగా ఎడమ భుజము పై నుండి) జందెమును ధరించిన వాడు 'ఉపవీతి'యని, జందెము నపసవ్యము చేసినచో ప్రాచీనావీతి'యని, కంఠమున పేరువలె వ్రేలాడదీయుచో “నివీతి'యనియు చెప్పబడును. మొలనూలు, అజినము (జింక చర్మము) దండము, జందెము, కమండలు, అనునవి శిథిలములైనచో వానిని నీటి యందు వైచి మంత్రవేత్తయైన విప్రుడు నూతనములైన వానిని గ్రహించి, ఉపవీతియై నిత్యము ఆచమనము నాచరంచాలి. ఇట్లు ఆచమనం చేసిన విప్రుడు పరిశుద్దుడగును. విప్రుని చేతిలోని రేఖలు గంగాది పుణ్యనదులుగాను వ్రేళ్ళ యందలి కణుపులు పర్వతాలుగాను తెలియదగును. కాన విప్రుని కుడిచేయి సర్వ దేవతల నిలయము. ఓ రాజా! ఏ హస్తోప స్పర్శన విధిచేత ద్విజుడు ఆచమనము చేయుటచే పవిత్రుడై అన్ని లోకములందును సర్వమును పొందునో అది యంతయు నీకు వివరించితిని.
- తృతీయాధ్యాయము సమాప్తము -