4. భవిష్య మహా పురాణము - బ్రహ్మపర్వము
తా ॥ సుమంతుముని యిట్లనెను. “రాజా! కేశాంత (సమావర్తన) సంస్కారము బ్రాహ్మణునకు పదునారవ సంవత్సరమున, క్షత్రియునకు ఇరువది రెండవ వత్సరమున, వైశ్యునకు ఇరువది యైదవ సంవత్సరమునను విధింపబడుచున్నది. స్త్రీలకీ సంస్కారమును అమంత్రకముగా చేయవలెను. ఈ చూడా కర్మ శరీర సంస్కారము కొఱకు ఆయా వర్ణముల వారికి ఆయా వయస్సులలో చేయవలెను. స్త్రీలకు వివాహమే ముఖ్యమైన వైదిక సంస్కారము. కేశాంత సంస్కారము పిదప శిష్యుడు, గురు గృహమున నుండుటయో లేక స్వగృహమునకు వచ్చి అగ్నిహోత్ర గ్రహణము చేసి యుండుటయో చేయవలెను. రాజా ! ఇంత వఱకు నీకు ఉపనయన విధి గుఱించి చెప్పితిని. బ్రాహ్మణుల పుట్టుక శ్రేష్ఠత్వ వ్యంజక మైనది. ఇక ఇప్పుడు కర్మయోగమును గుఱించి చెప్పెదను. గురువు, శిష్యునకు ఉపనయనము చేసి మొదట అతనికి శుచిత్వమును గూర్చి ఉపదేశింపవలెను. ఉదఙ్ముఖుడై ఆచమించి సచ్ఛిష్యులకు ఆచారమును, అగ్నికార్యమును, సంధ్యోపాసమును బోధింపుచుండవలెను. శిష్యుడైనవాడు. జితేంద్రియుడై, ఏకాగ్రచిత్తుడై, స్వచ్ఛమైన మనస్సుగలవాడై, తేలికపాటి వస్త్రములను ధరించినవాడై, అధ్యయనమునందు బద్ధబుద్ధియై విద్యాభ్యాసకాలమున బ్రహ్మాంజలి ఘటించి యుండవలెను. గరువు యెడ హస్త ద్వయమును ముకుళించి యుంచుటయే బ్రహ్మాంజలి యనబడును. వేదాధ్యయన ప్రారంభ పరిసమాప్తులయందు ఎప్పుడును గురుపాదములను పూజించుచుండవలెను . వ్యత్యస్తమైన చేతులతో గురుపాదములకు నమస్కరింపవలెను. అనగా కుడిచేతితో కుడి పాదమును, ఎడమచేతితో ఎడమపాదమును స్పృశించి నమస్కరింపవలెను.
తా॥ గురువు శిష్యునికి నిత్యమును విద్యాభ్యాసము చేయుచుండుమని చెప్పవలెను జాగరూకుడై విరామము కలదనే భావనను నివారించుచుండవలెను. విద్యావ్యాసంగమునకు ఆద్యంతములలో ఎప్పుడును పరబ్రహ్మ వాచకమగు నోంకారము నుచ్చరింపుచండవలెను. అట్లు చేయని యెడల నేర్చిన విద్య మరచిపోవుటయు నేర్చుకొనబోవునది శుష్కించుటయు జరుగును. బ్రాహ్మణున కోంకారార్హతయేట్లు కలుగునో వినుము. ప్రాగగ్రములు గల కుశలతో చేయబడిన ఆసనముపై కూర్చుండి, పవిత్రలు ధరించి మూడుమారులు ప్రాణాయామముచేత పవిత్రులై అప్పుడు ఓంకారము నుచ్చరింపవలెను. కురు నందనా! ఓంకార లక్షణమును వినుము. పరమేష్టియగు ప్రజాపతి అకార ఉకార మకారములను మూడు వేదములనుండి గ్రహించి ‘భూర్భువస్వః. అనెడు వ్యాహృతులతో బాటు'తత్సవితుర్వరేణ్యం' ఇత్యాదిగా గల గాయత్రీమంత్ర. ఋచలను మూడింటిని గూడ మూడువేదములనుండి ఉద్ధరించెను. ఈ ఓంకారమును, వ్యాహృతిత్రయ పూర్వకముగ ఈ గాయత్రీ మంత్ర ఋక్కులను బ్రాహ్మణుడు ఉభయ సంధ్యలయందును జపించుచు వేదపాఠ పుణ్యముతో కూడిన వాడగునని తెలియవలెను.బ్రాహ్మణుడు మూడుపాదముల ఈ గాయత్రీ మంత్రమును వేయిమారులు జపించిన యెడల ఒక మాసము దాటినంతనే గొప్పపాపము నుండి యైనను కుబుసము విడిచిన సర్పమువలే విడుదల పొందును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యజాతిలో జన్మించి సకాలమున ఈ జపము చేయని యెడల సజ్జనులలో నిందితుడగును.
తా ॥ రాజా ! ఏకాగ్రచిత్తుడవై వినుము. ఓంకార పూర్వకమై, మూడు వ్యాహృతులతో నవ్యయమై. మూడు పాదములు గల ఈ సావిత్రీ మంత్రము బ్రహ్మముఖముగా తెలియదగినది. దీనిని ప్రతి దినము శ్రద్దగా జపించువాడు.వాయుభూతుడై స్వీయ మూర్తితో పరబ్రహ్మమును పొందును. ఓం అనేది ఒక అక్షరమే పరబ్రహ్మము. ప్రాణాయామమే శ్రేష్ఠమైన తపము .గాయత్రి కంటే శ్రేష్టమైనది లేదు. మౌనము కన్న సత్యము విశేషమైనది.తపస్సు, హోమము, దానము మనువు చెప్పినట్లు అక్షయ ఫలమునిచ్చునవి. అక్షర (వ్యవహారము తరువాతిదిగను, ప్రజాపతియే బ్రహ్మగను తెలియవలెను. రాజా! విధియజ్ఞముకంటే జప యజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనగా అందలి వివిధములైన గుణముల చేతను, ఉద్దేశములచేతను సూక్ష్మ పద్ధతులలో చెప్పబడినది. ఉపాంశువు (పెదవులు, నాలుకతో శబ్దము వినబడకుండునట్లుచేయు జపము) లక్ష గుణములు కలది. మానస జపము వేయిగుణములు కలది. నాలుగు పాక యజ్ఞములు (పితృకర్మ, హవనము, బలి, వైశ్వదేవములు) దర్శ, పౌర్ణమాసాది విధి యజ్ఞముల వంటివి. ఇవి అన్నియును జప యజ్ఞము యొక్క పదునారవ కళకు కూడ సాటికావు. బ్రాహ్మణుడు కేవలము జపము వలననే సంసిద్ధిని పొందును .
తా॥ ఇతరమైనది ఏదిచేసి నను చేయు కున్నను సావిత్ర్యుపాసన చేయుచుండువాడే బ్రాహ్మణుడనబడును. ప్రాతస్సంధ్యావందనమున సూర్యదర్శనము వఱకును నిలబడి గాయత్రీ జపము చేయుచుండవలెను. సాయం సంధ్యావందనమున నక్షత్రములు ప్రకాశించు వఱకును కూర్చుండి గాయత్రీజపము చేయుచుండవలెను. సూర్యోదయము కంటే పూర్వము ప్రాతస్సంధ్య, సూర్యాస్తమయమునకు పూర్వము సాయం సంధ్య (ఆరంభింపవలెను). నక్షత్రములతో కూడినది సాయం సంధ్య. సూర్యునితో కూడినది ప్రాతస్సంధ్య అని తెలియవలెను. ప్రాత సంధ్యలో నిలుచుని జపము చేసినందువలన రాత్రీ పాపములు నశించును . అటులే సాయంకాల సంధ్యావందనమున కూర్చుండి జపించుటవలన దినము నందలి పాపములు నశించును. పూర్వసంధ్యలో నిలబడకయు సాయంకాల సంధ్యలో కూర్చుండకయు ఎవడు జపించుచుండునో . వాడు సర్వబ్రాహ్మణ కర్మల నుండి శూద్రునివలే బహిష్కృతుడు. నీయతుడై జలాశయముల సమీపమునగాని. ఆరణ్యములకు వెడలి గాని గాయత్రీజపాది నిత్యానుష్ఠానములను నిర్వర్తించుకొనుటశ్రేష్ఠము. రాజా! నిత్యవిధుల నిర్వహణమునగాని స్వాధ్యాయమునందుగాని. హోమ మంత్రాదులయందుగాని అనధ్యాయ దోషములేదు. నిత్యకర్మబ్రహ్మ సత్రముగా చెప్పబడును. దానికి అనధ్యయన దోషము వర్తింపదు. అనథ్యాయ మందు అగ్నిహోత్రమున వ్రేల్చిన హవిస్సు బ్రహ్మాహుతియై పుణ్యప్రదమగును. నీయతుడై విధి పూర్వకముగ ఒక్క ఋక్కునైనను, ఎవడు పఠించునో . అతనికి పయస్సు, స్వచ్ఛమైన ఘృతము, తేనె వృద్ధినందును.
ఉపనీతుడైన బ్రాహ్మణుడు సమావర్తనము వఱకును అగ్ని శుశ్రూషణము, భిక్షా చర్య, భూశయనము, గురు సేవ చేయుచుండవలెను. ఉపనయన సంస్కారము పొందిన బ్రాహ్మణుడు, ఆచార్య పుత్రుడు, సేవ చేయువాడు, జ్ఞానదుడు , ధార్మికుడు, శుచియైన వాడు. ఆప్తుడు , సమర్థుడు, ఔదార్యముగలవాడు, సాధుశీలుడు అను నీ పదుగురును పది లక్షణములు గలవారు వేదాధ్యయనముకు అర్హులు. ఆచార్యుడు, అడుగని వానికిని, అన్యాయముగ నడుగువానికిని ఏదియు చెప్పకూడదు.
తా ॥ అన్నియు తెలిసిన మేధావియైనను ఏమియు తెలియని వానివలెనే వర్తింపవలెను. అధర్మముగా నడుగువానికిని ఆధర్మముగ చెప్పువానికి. అరిష్టమైనను విద్వేషమైనను కలుగును. ధర్మము, అర్థము, శుశ్రూష లేని తావున విద్యాబీజములు నటరాదు. నాటినచో అవి ఊషర క్షేత్రమున నాటిన బీజములవలె నిష్పలమగును. బ్రహ్మవాదియైన ఆచార్యుడు విద్యతో బాటు కోరికను కూడ చంపుకొనవలెనేకాని, ఘోరమైన ఆపదకలిగినను, చవుటి నేలలో విత్తనములు వేయరాదు. విద్యాదేవత బ్రాహ్మణునితో నిట్లనెను. “నేను నీకు పెన్నిధిని. నన్ను రక్షింపుము. అసూయగలవాని కెప్పుడును నన్ను ఈయకుము. అట్లేననే నేను శక్తిమంతురాలినై యుందును” . కొందఱు దాచదగిన నిధి వంటిది ఐహిక సుఖమని చెప్పుటకిష్టడెదరు. మజీ కొందఱు జ్ఞానమే దాచదగిన నీధి యందురు. అవి రెండింటిని ధరించును కావున అది (విద్య) శేవధియనబడును. ఎవరిని శుచి నియమములు గల బ్రహ్మచారియని తెలిసికొనెదవో అట్టి బ్రాహ్మణునకు నన్ను ఉపదేశింపుము విద్యానిధిని కాపాడుటలో ప్రమాదపడని దానికి నన్ను బోధింపుము. ఎవడు గుర్వనుజ్ఞలేనిదే విద్య నేర్చుకొనునో. అట్టివాడు భయంకరము, ఘోరమునైన కౌరవ నరకమును పొందును. లౌకికము, వైదికము, లేక ఆధ్యాత్మికమునైన విద్యలలో ఏవిద్యగణపు వానికైనను తొలుత అభివాదము చేయవలెను
తా ॥ గాయత్రీ మంత్రానుష్ఠానపరుడైయును బ్రాహ్మణుడు శాస్త్రనియమములకు బదుడై యుండిననే శ్రేష్ఠుడగును. అట్లులేనిదే మూడు వేదముల నభ్యసించిన వాడైనను అభక్ష్యభక్షకునివలె అవిక్రేయ విక్రేతవలే పాపియగును. గురువు శయ్యాసనములందు న్నప్పుడు అచటికి శ్రేయస్కాముడు ప్రవేశింపరాదు. తానటుల శయ్యాసనములందుండి నపుడు గురువు వచ్చిన ప్రత్యుత్థానము, అభివాదము చేయవలెను. వయస్సు పైబడిన వాడు సమీపించినపుడు తరుణ వయుస్కుని ప్రాణములు పైకి లేచును. ప్రత్యుత్థానము అభివాదము చేయుటచేత తిరిగి యథాస్థానమును పొందును. నిత్యమును పెద్దవారికి నమస్కరించువానికిని, వారిని సేవించువారికిని ఆయువు, తెలివి, కీర్తి, బలము అను నాలుగుఅభివృద్ధి యగును. అభివాదపరుడైన బ్రాహ్మణుడు, శ్రేష్ఠుడైన వృదునకు “నేను ఈ పేరుగలవానీనీ” అని తన పేరు చెప్పుకొనవలెను, పేరుచెప్పుకొని అభివాదము చేయుట తెలియనివారు, స్త్రీలును “నేను ప్రాజ్ఞుడను లేక ప్రాజ్ఞురాలను” అని చెప్పుకొనవలెను. అభివాదనమునందు తన పేరుచివర “భో” శబ్దమును చేర్చి ఉచ్చరింపవలెను. పేరు యొక్క స్వరూప భావమే ఈ “భో భావమని ఋషులు చెప్పిరి. అభివాదన మున దానిని స్వీకరించు బ్రాహ్మణుడు , "ఆయుష్మాన్ భవ సౌమ్య!” అని అశీర్వదింపవలెను. పేరు చివర గల 'అ' కారమును పూర్వాక్షరమును ప్లుతముగా (మూడుమాత్రల కాలమున) ఉచ్చరింపవలెను. అభివాదమునకు ప్రత్యభివాదనము చేయుటతెలియని వానికి బుద్ధిగలవాడు నమస్కరింపకూడదు. ప్రత్యభివాదము తెలియని వాడు శూద్రునితో సమానమైన వాడుగా భావింపవలెను. అభివాదము చేసినప్పుడు ప్రత్యభివాదమో, ఆశీర్వాదమో చేయనివాడు నిశ్చయముగా నరకమును పొందును.
తా ॥ “అభి” యనగా విష్ణు భగవానుడు. “వాదయామి” యనగా శంకరుడు ఎవడు అభివాదము చేయునో వాడు వారిద్దజీని పూజించినట్లగును. బ్రాహ్మణుని కుశలమును, క్షత్రియుని అనామయమును (అరోగమును), వైశ్యుని క్షేమమును, శూద్రుని ఆరోగ్యమునుగుఱించి ప్రశ్నించి పలుకరింపవలెను. తనకంటే చిన్నవాడైనను దీక్షితుని, పేరుతో సంబోధింపరాదు. భో, భవచ్చబ్ద ములతో సంబోధింపవలెనని స్వాయంభువు చెప్పెను. రాజా! రక్తసంబంధములేని యితరుని భార్యను భవతి, సుభగ, భగినీ ఇత్యాది శబ్దములతో పిలువవలేను. తండ్రి తోబుట్టువులను, మేనమామలను , పిల్లనిచ్చిన మానులను, ఋత్విజులను, గురువులను పిన్నవాడు ప్రత్యుత్థానము చేసి గౌరవించి, తన పేరు చెప్పి అభివాదము చేయవలెను, తల్లితోబుట్టువు, మేనమామ భార్య, భార్యతల్లి, తండ్రితోబును, గురువు భార్య వీరందఱు గురు భార్యతో సమానులైనందున పూజ్యురాండ్రు. బ్రాహ్మణుడు తన పెద్ద అన్న భార్యను నిత్యము శ్రద్ధగా పూజించిన, అతడు విష్ణు పదమునందును. రాజా! ప్రవాసమునుండి వచ్చిన (వాడు) వెంటనే తన జ్ఞాతి సంబంధులైన స్త్రీలను, పితృసోదరినైనను మాతృసోదరినైనను పూజింపవలెను. ఓకురుకులోత్తమా! తన జ్యేష్ఠ భగినిని (అక్కను)ఎల్లప్పుడు తన తల్లినివలే గౌరవించుచుండవలెను. రాజా! వీరందజిలోనను, తన తల్లి అందజికంటెను గొప్పదిగా తెలియవలెను. పుత్రుని, మిత్రుని, సోదరి సంతానమును తనతో సమానముగ చూచుకొనవలెను.
తా ॥ పది సంవత్సముల నుండి పేరువడసిన వానిని, అందఱిచేత కొనియాడబడువానిని, విద్యానిపుణులలో ఐదేండ్లుగా పేరుపొందిన వానిని, శ్రోత్రియులలో ఒక సంవత్సరము పెద్దయగు వానిని, స్వజాతిలో ఏకొంచెము పెద్దవాడైనను వానిని . దశవర్ష బ్రాహ్మణుని, శతవరుడగు క్షత్రియుని పితో పుత్రులుగా నెఱుగవలేను. బ్రాహ్మణుని వారలకు తండ్రిగా భావింపవలెను. ఈ విధముగనే క్షత్రియుని తండ్రి, వైశ్యుని తాత, శూద్రుని ముత్తాత బుద్ధిమంతులచే విప్రుడని చెప్పబడును. ధనము, బంధువు, వయస్సు, కర్మ విద్య ఈ ఐదు మాన్యస్థానములు. ఇందు ఉత్తరోత్తరము ఒకటి కంటే నొకటి గొప్పది. ఈ ఐదింటి యాధిక్యములు యోగ్యత కలగించునవి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఇవి ఎవరికిగలవో వారు గౌరవారులగుచున్నారు. శూద్రుడు తొంబది సంవత్సరములు పైబడిన వృద్ధుడైనచో గౌరవార్హుడగును. రథస్థుడు, వృద్ధుడు, రోగి, బరువుమోయువాడు, స్త్రీ . స్నాతకుడు, రాజు, పెండ్లికొడుకు, వీరలెదురైనచో, వీరికి దారి యిచ్చి ప్రక్కకు తొలగవలెను. వీరందరు కలసి వచ్చినచో వీరిలో స్నాతకుడు, రాజు పూజ్యులగుదురు. వీరిద్దఱు కలసి వచ్చినచో స్నాతకుడు మొదట పూజ్యుడగును. భరత సత్తమా ! శిష్యునకుపనయనము చేసి, సరహస్యము, సకల్పమునైన వేదమునధ్యాపనము గావించు బ్రాహ్మణుని, మనీషులు ఆచార్యుడందురు. వేదమునందలి ఒక భాగమును, వేదాంగములను వృత్తికొఱకు బోధించువాడు ఉపాధ్యాయుడనబడును. నిషేకాది కర్మలు చేసి వేదముతోబాటు బ్రహ్మవిద్యను కూడా ఉపదేశించువాడు గురువనబడును.
తా ॥ ఆగ్న్యాధేయము, ఏ యజ్ఞములు, అగ్నిష్టోమాటిక్రతువులు నిర్వహించుటకు ఎవడు యజమాని చేత వరింపబడునో వాడు అతనికి 'ఋత్విక్కు' అని చెప్పబడును. ఎవడు అతధముగ వేదముచే రెండు చెవులను ఆవరించుకొనియుండునో అతడే తల్లియు, తండ్రియు నగును. అట్టివానికి ఎప్పుడును ద్రోహము చేయరాదు. గౌరవింపదగిన దృష్టి చేత ఉపాధ్యాయులకంటే పదిరెట్లు ఆచార్యుడు, ఆచార్యులకంటెను వందరెట్లు తండ్రియును, తండ్రి కంటే వేయి రెట్లు తల్లియును అధిక తరులని చెప్పబడును. వేదాధ్యయనము, చేయించు కన్నతండ్రి కన్నను, వేదాధ్యయనము చేయించు పితృతుల్యుడైన గురువు శ్రేష్ఠుడు. వేదాధికారముగల బ్రాహ్మణ జన్మ ఇహపరములయందును శాశ్వతమైనది. కామముచేత తల్లిదండ్రులన్యోన్యముగా కలియుటవలన కలిగిన యోని జన్మ సంభూతిగా అతనిని తెలియవలెను . వేదపారగుడైన ఆచార్యుడు విధివిధానముగా, గాయత్రిచేత ఆపుట్టుకకు పుట్టువునిచ్చును. అది సత్యమైనది. అజరామరమైనది . ఉపాధ్యాయుడు మొదలుకొని ఎవరెవరు పూజ్యులో నీకు చెప్పితిని. వీరందజీలోనను మహాగురువే అధికుడని చెప్పబడినది. నాలుగు వర్ణముల వారికిని, ఆచార్యులందఱికంటెను నూరువేల రెట్లు అధికుడు. అతడే మహాగురువని చెప్పబడును .
తా ॥ శతానీకుడిట్లనెను. “మహర్షీ! మీరు చెప్పిన ఉపాధ్యాయుడు మొదలగు బ్రాహ్మణులందఱ గుఱించి నాకు తెలియును. ఒక్క మహాగురువు గుఱించియే తెలియదు.” సుమంతుడిట్లు సమాధానము చెప్పెను. “రాజా! 'జయాపజీవి యైన బ్రాహ్మణుడే మహాగురువనబడును. అష్టాదశ పురాణములు, శ్రీరామకథ. విష్ణుధర్మము, శివధర్మము మొదలగు ధర్మములు, కృష్ణవేదము, పంచమవేదమని ఖ్యాతినందిన మహాభారతము. నారదోక్తములైన శ్రాతధర్మములు, వీనినన్నింటిని కలిపి, బుద్ధిమంతులు “జయ”మను పేరుతో వ్యవహరింతురు. ఈ జ్ఞాన సముదాయమును తెలిసినవాడు మనుష్యులలో సర్వజ్ఞుఁడుగా గుర్తింపబడును. అందువలన అట్టివాడు అన్ని వేళల, బ్రాహ్మణాది వర్ణములవారందఱికిని పూజ్యుడు. జగత్పభువైన భగవానుని వాక్యము నీవు వినలేదా? తనకు తెలిసిన కొద్దియో గొప్పదో అయిన విద్యతో ఎవడు ఇతరునికి ఉపకరించునో వానిని - ఆ విద్యాబోధన యనేడు ఉపకారము వలన - గురువని తెలియవలెను. బ్రాహ్మ జన్మమునకు కర్తయైన వాడును, స్వధర్మమును శాసింపగలవాడును అయిన విప్రుడు బాలకుడైనను, ధర్మముననుసరించి వృద్ధునకైనను తండ్రియే యగును.
తా ॥ ఒకప్పుడు బాలుడయియును పండితుడైన ఆంగిరసుడు తండ్రివయస్సుగల పెద్దవారికి విద్యబోధించెను. జ్ఞానము చేత అర్భకులైన ఆ పెద్దలను అతడు “బిడ్డలారా"! అని సంబోధించెను . దాని పై వారు కోపగించుకొని ఆ విషయమును దేవతలకు నివేదించుకొనిరి. బాలుడైన ఆంగిరసుడన్న మాట సరియైనదేయని దేవతలు నుడివిరి “ఎవడజ్ఞుడో వాడు బాలుడు. ఎవరు మంత్రదుడో (గురువో)వాడు తండ్రి. అజునినే బాలుడందురు. విద్యను బోధించువానిని తండ్రియందురు. అటులే “జయదుని' తాతయందురు.” అని దేవతలు చెప్పిరి. 'జయము', మంత్రములు, వేదములు అను వీనికి దేహమొకటియే యైనను అట్లు మూడు భాగములు చేయబడినది. సంవత్సరములచేత, వార్థక్యముచేత, మిత్రుడగుటచేత, బంధువులగుటచేత ఆధిక్యము రాదు. ఈ ధర్మవ్యవస్థను ఋషులేర్పరచిరి. ఇది అనూచానము, మనకు గొప్పది. రాజా! బ్రాహ్మణులలో, క్షత్రియులలో వైశ్యులలో శూద్రులలో గొప్పవాడుగా ఎవడు స్తుతింపబడునో చెప్పెదను వినుము. జ్ఞానముచే బ్రాహ్మణుడు, పరాక్రమముచే క్షత్రియుడు, ధనముచే వైశ్యుడు, జన్మ (వయస్సు)చే శూద్రుడు గొప్పవాడు. కానీ ఎవడు శీలవంతుడో వాడు గొప్పవాడని నా మతము. ఎవని తల నెఱసినదో వాడు మాత్రమే వృద్ధుడు కాడు. ఎవడు యువకుడైనను వేదాది విద్యలు బోధింపగలడో వాడు వృద్ధుడని దేవతలు తలతురు. కాష్ఠమయమైన ఏనుగు, చర్మమయమైన మృగము, విద్యాహీనుడైన బ్రాహ్మణుడు, ఈ మూడును నామమాత్ర స్థితిగలవి. స్త్రీలయందు గొడ్రాలి వలె, గోవులలో గొడ్డు గోదవలే, అజునకీయఁబడు దానమువలె వేద విద్యలేని బ్రాహ్మణుని ఉనికి నిష్పలము
తా ॥ వైశ్వదేవము చేయనివారు, అతిథ్యమొసగనివారును,.వేదమునేర్చిన బ్రాహ్మణులైనను, వారందఱును శూద్రులనియే తెలియవలెను. వేదము లేనివాఁడు బ్రాహ్మణుఁడు కాఁడు. కుత్సితమైన నడవడిలేనివాఁడు వర్తకుఁడు కాఁడు, పనుల కొఱకు పంపబడని వాడు శూద్రుడు కాడు. దొంగతనము (కపటవర్తనము) లేనివాడు వైద్యుడు కాడు. నియమనిష్టలు లేనివారు, వేదాధ్యయనము చేయనివారు, భిక్షావృత్తిచే జీవించువారునగు బ్రాహ్మణులుండు గ్రామమును (ప్రజలను) రాజు దండింపవలెను. లేనిచో దొంగభక్తుల నిచ్చువాడగును. రాజా ! ఆహితాగ్నియగు బ్రాహ్మణుడేచోట సంతుష్టుడైయుండునో ఆ ప్రదేశము (నేలురాజు) సఫలత పొందును. వేదములచేత, దేవతల చేత ఇటులే చెప్పబడినది. ఒకప్పుడు బ్రహ్మదేవునితో వేదములిట్లు చెప్పినవి. “అగ్నిహోత్రము లేకుండగా వేదాభ్యసనము చేయు బ్రాహ్మణులు భూమి పై కంపిచుచుందురు. మూడులై ఫలాపేక్షతో. అనుష్టాన రహితులై మమ్ము అభ్యసించుచు ఈ భువి పై ఎందులకో క్లేశము ననుభవింతురు గదా! ఓ బ్రహ్మాదేవా! మమ్మభ్యసించు ఫలము కేవలము క్లేశమే కదా !. అందువలన మమ్ము అభ్యసించుట కంటే ఎప్పుడును అనుష్టానమే శ్రేష్ఠతరమైనది.” రాజా! ఈ విధముగా వేదములే స్వయముగ బ్రహ్మతో చెప్పినవి. ఆకారణమున వేదాభ్యాసము కంటే అనుష్టానమే మేలైనదని చెప్పబడినది. వేద పారగులు ముగ్గురో నల్వురో ఏది చెప్పినను అది ధర్మముగా తెలియదగును. ఇతరులు వేలకొలది చెప్పినను అది ధర్మముకాకుండును.
తా ॥ మూఢులు, మూర్తులు, ధర్మము నెఱుఁగకుండ ఏదిచెప్పినను అదినూరురెట్లు పాపమై వారినే వెంబడించును. శుచిత్వరహితుఁడు, నియమభష్ణుడు, వేదహీనుడు అయిన బ్రాహ్మణునకు దానముచేయబడిన అన్నము, “నేనేమిపాపము చేసితిని?” అని ఏడ్చును. ఓ రాజా! జయాపజీవికి దత్తము చేయబడిన అన్నము తనను తాను చూచి మురిసిపోవుచు చేతులెత్తి నాట్యము చేయును. విద్యాతపస్సంపన్నుఁడైన బ్రాహ్మణుఁడు గృహమున కే తెంచినపుడు ఓషధులన్నియు “మేము పరమగతిని పొందుదుముగద” యని నర్తించును. నిష్ఠలేని వారికి, మంత్రము లేని వారికి జపములేని వారికి ఏ దానము చేయరాదు. ఒక శిలను మఱియొక శిల తరింపఁజేయఁజాలదు గదా!. హవ్యకవ్యము లెప్పుడైనను శ్రోత్రియునకే ఈయవలయును. శ్రోత్రియుడు కానివానికి ఈయబడినవి పితృదేవతలనుగాని దేవతలనుగాని తృప్తిపరుపజాలవు. గృహముననే మూర్ఖుడుండి పండితుడు దూరమున నుండిన పండితునకే ఈయవలెను. మూర్ఖ వ్యతిక్రమ దోషములేదు. మూరుఁడు, జప వివర్జితుఁ డునైన బ్రాహ్మణునతిక్రమించుట దోషముకాదు. మండుచున్న అగ్నిని వదలి పెట్టి, బూడిదలో ఆహుతిచేయరుగదా !. దేవతలు, పితరులు ఈ విషయమునేకాక, గుణవంతుడైనను, గుణహీనుఁడైనను, బ్రాహ్మణుఁడు పరమదైవతమని కూడ నైజు గుదురు. విప్రకర్మయందు ఇంటనున్న బ్రాహ్మణుని అలక్ష్యము చేయరాదు. అట్లుచేసిన యెడల గౌరవమను నరకము ప్రాప్తించును. గాయత్రీ మంత్రమాత్రసారుఁడైనను బ్రాహ్మణుడు పూజ్యతనందును, విశేషముగా ఇంటనున్నవాఁడు పతితుఁడు కాడనియే భావింపవలెను.
తా ॥ ధాన్యములేని గ్రామము, నీరులేని బావి, వేదవిద్యలేని బ్రాహ్మణుఁడు, ఈ మూడును నామమాత్రములైనవి. స్నేహము వలనగాని, భయము వలనగానీ, లేక అర్థకారణమునగాని ఒకే పంక్తిలోనివారికి, ఒకరికి ఒక విధమున, మఱియొకరికి మఱియొక విధమున పక్షపాతముతో దానము చేయుట బ్రహ్మహత్యతో సమానమైన పాపమని వేదములలో కలదు; ఋషులు కూడ ఈ విషయమును గానము చేసిరి; అని మునులు చెప్పుచున్నారు. ప్రాణులకు శ్రేయముగూర్చు కార్యమును అహింసతోనే అనుశాసింపవలెను. (శ్రేయమును గూర్చు అనుశాసనమును అహింసతోనే చేయవలెను) కోరిన ధర్మమునుపదేశించుటకు మధురమైనదియు, ప్రియమైనదియునైన వాక్కును ప్రయోగింపవలేను. ఎవనివాక్కు, మనస్సు సత్యగుప్తములై శుద్దముగనుండునో పొఁడే వేదాంతోపగతమైన ఫలమునంతయును పొందును. ఒరులను వ్యధ పెట్టరాదు. తానును వ్యధచెందరాదు. ఇతరులను కలత పెట్టు మాటలు పలుకరాదు. ఓ కురుశార్దులా! శుభమును కలిగించు మాటలనే బుద్ధిమంతులు మాట్లాడవలెను. అట్లు పలికిన పలుకులనే వివవలెను. మధుర వాక్కువలె చంద్రుడు, నీరు, చందనరసము, చల్లని నీడ కూడా పురుషుని ఆహ్లాదపరుపజాలవు. బ్రాహ్మణుఁడెప్పుడును, తనను పూజించుటవలన విషము వలన వలె కలత చెందవలెను. సర్వదా అమృతమును వలే అపమానమునే ఆకాంక్షింపుచుండవలెను. అవమానింపబడినవాడు సుఖముగా. నిదురించును. సుఖముగా మేల్కొనును. సుఖముగా ఈ లోకమున తిరుగును. అవమానించిన వాడు నశించును. రాజా! ఈ విధానముగా ద్విజుడు సంస్కృతాత్ముడఁగుచు మెలమెల్లగా గురువు సన్నిధిని ఇట్టియంశములను సంగ్రహమొనర్పవలెను. ఇదియే బ్రహ్మాధిగమగు తపస్సు.
తా ॥ వివిధములైన తపో విశేషముల చేత, అనేకములుగా చెప్పబడిన వ్రతముల చేతను, బ్రాహ్మణుఁడు సరహస్యమైన వేదమునంతయున భ్యసింపవలెను. ద్విజోత్తముడు నిత్యమును వేదాభ్యాసము చేయుచుండలేను. తపమాచరింపుచుండవలెను. వేదాభ్యాసమే విప్రునకు శ్రేష్ఠమగు తపస్సని చెప్పబడును. ఏ బ్రాహ్మణుఁడు ప్రతినిత్యము యధాశక్తిగ, నిద్రించునపుడు కూడా-వేదపఠనము చేయుచుండునో అతఁడు నఖాగ్రములతోడి యుత్తమమగు తపమాచరించువాడని భగవానుడు చెప్పెను. ఏ ద్విజుడు వేదపాఠము చేయక ఇతర విషయములయందు పరిశ్రమ చేయుచుండునో అతడు. జీవితముననే తన వంశముతో కూడ శూద్రత్వమును పొందును, ఎవనికి వేదము, జపము, విద్యలులేవో వానిని శూద్రునిగనే భావింపవలెనని పరమేశ్వరుఁడు చెప్పెను. తల్లికి జన్మించుట మొదటిది, ఉపనయనము రెండవ జన్మ, యజ్ఞదీక్షయందు మూడవజన్మగా బ్రాహ్మణునకు శాస్త్రము చెప్పినది. మౌంజీ బంధన చిహ్నితమైన బ్రహ్మజన్మ అతనికెప్పుడు కలుగునో. అప్పుడు తల్లి గాయత్రియగును. తండ్రి ఆచార్యుడగును. వేదమునిచ్చుటవలన ఆచార్యుడు తండ్రియనీ మనువుచెప్పను. ఉపనయనము కంటే ముందు ఇతనికి ఏ కర్మయునుండదు. శ్రాద్దమంత్రములఁగలసికాక వేదమును ఉచ్చరింపరాదు.
తా ॥ వేదజన్మ (ఉపనయనము) కానంతవఱకు శూద్రునితో సమానము ఉపసయనాయానంతరము బ్రహ్మచర్య వ్రతమునాదేశింప వలెను. విధిపూర్వకముగ క్రమప్రాప్తమగు బ్రహ్మత్వగ్రహణము ఆపై జరుగును. అన్ని వ్రతములయందును అతని యజ్ఞోపవీతము, జింకచర్మము, దర్భమొలత్రాడు, వస్త్రము, దండము అతని తోడుగనుండును. బ్రహ్మచారి గురుకులమునందే నివసించుచు ఈ నియమములను పాటించుచుండవలెను. తన తపస్సును వృద్ధి చేసికొనుట కొఱకు ఇంద్రియసమూహమును నిగ్రహించి. దేవర్షిపితృతర్పణములను చేయుచుండవలెను. మహాబాహూ! వీరు ప్రతిదినము స్నానాద్యనుష్ఠానములు ముగించి. ఫలములు, పుష్పములు, నీరు, సమిధలు, వివిధములైన కష్టములు, మృత్తిక, దర్భలు ప్రోగుచేసి తేవలయును. మత్తుపానీయము, మాంసము, సుగంధములు, పుష్పమాలికలు, రథములు, స్త్రీలు, తెల్లని వస్తువులన్నియు (మల్లెలు వెన్నెలలు, వెండి మొ.) ప్రాణిహింసనము. తలంటు, పాదరక్షలు, గొడుగు ధరించుట, కామసంకల్పము, క్రోధము, లోభము, సంగీతము, వాద్యము. నర్తనము, జూదము, జనవాదము అసత్యభాషణము, నింద, వీని నన్నింటిని దూరముగా వదలి పెట్టవలెను. స్త్రీలను చూచుట, వారిని ఊతగా గొనుట, అడ్డగించుట, కులటలతో సంగమించుట చేయరాదు. ఎక్కడైనను ఒక్కడే పరుండవలెను. ఎప్పుడును రేతఃస్థలనము జరుగనీయరాదు. కామము వలన స్థలించిన రేతస్సు వ్రతమును చెడగొట్టును.
తా ॥ బ్రహ్మచర్యమున నున్న బ్రాహ్మణుఁడు నిద్రాసమయమున కామరహితుడయియును వీర్యస్థలనమునకు గురియగునెడ, స్నానముచేసి సూర్యునర్చించి పునర్మామిత్యాది ఋక్కును జపింపవలెను. ఈ సందర్భమున మను వాక్యము కూడ ఇటులే కలదు. నిత్యమును సమనస్కుడైన బ్రహ్మచారి ఊదకుంభము, గోమయము, మృత్తిక, దర్భలు తెచ్చుచుండవలెను. ఇవియును, భిక్షయును కావలసినంత మేరకు ప్రతిదినము సేకరించుచుండవలెను. నృపోత్తమా! ఇక ఇండ్లలో చేయదగిన కర్తవ్యములను గుజించి వినుము. స్వకర్మలయందు, వేదములయందు, యజ్ఞములందును రుచికలిగి శ్రద్ధాళువులైన బ్రహ్మచారులు ప్రతిదినము ఆయా గృహములనుండి భిక్ష స్వీకరింపవలెను. గురుకులమునందును, జ్ఞాతుల ఇండ్లయందును, బంధు గృహములలోను భిక్షా చర్య చేయకూడదు. అన్యగోత్రముల వారి యిండ్లలో భిక్ష లభింపని పక్షమున పైఁజెప్పిన వానిలో పూర్వ పూర్వములను వదలి ఉత్తరోత్తరములలోచరింపవలెను. ఉక్తములైన యిండ్లలో భిక్ష సంభవము కానప్పుడు గ్రామమంతయును తిరుగవలెను. అంత్యగృహములు మాత్రము విడిచి పెట్టుమని భగవానుడు చెప్పెను. వాక్కును నిగ్రహించుకొనుట ద్వారా కోపమును శాపమును వదలి పెట్టవలెను. భిక్షదొరకనిపక్షమున చతుర్వర్ణముల వారి యిండ్లకును తిరుగవచ్చును. దూరమునుండి సమిధలు సేకరించుకొని వానిని ఇంటి పై భాగమున భద్రపరచియుంచుకొనవలెను. వానితో ప్రాతస్సాయం కాలములయందు అతంద్రితుఁడై అగ్నిని వ్రేల్చవలయును. శిక్షావరణ నుగానీ అగ్నీని వ్రేల్చుటగాని చేయనియెడల అనాతురుడై ఏడురాత్రులు అవకీర్ణి వ్రతము నాచరింపవలెను. భిక్షయే వృత్తిగా కలిగియుండవలెనని బుద్ధిమంతులు చెప్పుచున్నారు. అందువలన భిక్షావతి తాను ఒక్కని వద్దనుండియే నిత్యము భిక్షగ్రహింపరాదు. బ్రహ్మచర్యమునందలి యీ వృత్తి ఉపవాసముతో సమానమైనది. పితృదైవత్యమైన కర్మయందు కోరబడినచో - తానొక ఋషీవలే, అదియొక వ్రతమువలె భుజింపవచ్చును. దానివలన అతని బ్రహ్మచర్య భిక్షావ్రతమునకు లోపము కలుగదు.
తా ॥ కురునందనా! ఇప్పుడు చెప్పినదంతయు బ్రాహ్మణునకు సంబంధించిన కర్మయే. ఇది క్షత్రియులకు వైశ్యులకు కాదని పండితులు చెప్పుచున్నారు. ఆచార్యుని ప్రేరణ ఉండినను, ఉండ కున్నను, నిత్యము అధ్యయనమునందు, గురుహితకార్యములందు మనసు నిలిపి యండవలెను. మనస్సుతోసహా బుద్ధిని, ఇంద్రియములను, శరీరమును, వాక్కును నిగ్రహించుకొని, ప్రాంజలియై, గురుముఖమును వీక్షించుచు నిలచియుండవలెను. సదాచారుఁడై, సంయతుడై, ఎప్పుడును పైకెత్తిన చేతులతో నమస్కరించుచు, గురువు కూర్చుండుమని చెప్పిన తరువాత గురువునకభిముఖముగ కూర్చుండవలెను. గరుసన్నిధిలో నున్పప్పుడు వస్త్రవేషముల విషయమునను, ఆహార విషయమునను మితిగా నుండవలెను. ప్రతిశ్రవణ సంభాషణములు తల్పస్థుడైయుండిగాని, కూర్చుండిగాని, తినుచుగాని, నిలబడియుండీగానీ, పెడమొగమునగాని చేయకూడదు. గురువు కూర్చుండియుండినప్పుడు తాను సమీపమున నుండి, ఎదురుగా వచ్చుచున్నవాడైన తాను వెనుకకు పరుగెత్తుచు ప్రక్కకు తిరిగియున్న, తాను అభిముఖుడై, దూరస్తుఁడైయుండిన సమీపమునకు వెడలి, శయనించియుండినవాడైన తాను నమస్కరించి, యిట్లు ప్రతిశ్రవణ భాషణములు చేయవలెను. గురువు ఉపదేశంచు వేళ తానెప్పుడును నిలబడియే యుండవలెను. గురుసన్నిధానమున శిష్యుని శయ్యాసనములు దిగువనే యుండవలయును. గురువు చూచునప్పుడు శిష్యుడు ఇష్టము వచ్చినట్లు కూర్చుండరాదు. పరోక్షమునందైనను గురువు పేరు నుచ్చరింపరాదు. గురువుగారి నడకను గాని, మాటనుగాని, చేష్టలనుగాని శిష్యుఁడనుకరింపరాదు.
తా ॥ గురువును దూజుట, నిందించుట మొదలగునవి జరుగుచోట చెవులుమూసి కొనవలయును. లేక అచట నుండి వేడొక చోటకు పోవలయును. గురుపరివాదకుడు గాడిదయగును. నిందకుడు కుక్కయగును. గురువు నవమానించువాడు కృమియగును. గురువుయెడ మత్సరించినవాడు కీటకమగును. దూరమున నున్నప్పుడుగాని, క్రుదుఁడైయున్నప్పుడుగాని, స్త్రీల సమీపమున నున్నప్పుడుగాని గురువును నమస్కారాదికముతో గౌరవింపరాదు. యానాసనగతుఁడైనచో వానినుండి దిగిన పిదప అభివాదము చేయవలెను. గురువుతో సమానమగు ఆసనమునగానీ ప్రతికూలాసనమందుగాని కూర్చుండరాదు. గురువునకు వినబడకుండ ఏ విషయమైనను మాట్లాడరాదు. ఎడ్లు, గుఱ్ఱములు, ఒంటెలు మొదలగువాని వాహనముల పైన, ప్రాసాదముల పైన, బిళ్ళ పైన చాపల పైన, శిలాఫలకముల పైనను, నౌకలమీదను గురువుతో సహా కూర్చుండవచ్చును. గురువునకు గురువైనవాడు సన్నిహితుఁడైనపుడు అతని యెడ గురువునకు వలెనే ప్రవర్తింపవలెను. గురుపుత్రులయందు పూజ్యులైన గురుబంధువులయందును అటులే గౌరవభావముతోనుండవలెను. అధ్యాపనము చేయుచున్న గురువుయొక్క పుత్రుఁడు బాలుఁడైనను, సమవయస్కుడైనను, యజ్ఞకర్మలలో విశిష్ఠుఁడైనను గురువునకువలె గౌరవార్థుడగును. అంగములకు నలుఁ గు పెట్టుట, స్నానము చేయించుట, ఎంగిలి తినుట, పాదములు కడుగుట, గురుపుత్రుల విషయమున వదలవలెను. సవర్ణులైన గురుభార్యలు గురువువలెనే పూజ్యురాండ్రు. అసవర్ణులైనచో ప్రత్యుత్థానము, అభివాదములతో గౌరవింపవలెను. అభ్యంజనముచేయుట, స్నానముచేయించుట, అంగములకు నలుఁగు పెట్టుట తలవెంట్రుకలు దువ్వి అలంకరించుట గరుపతి విషయమున చేయకూడదు.
తా ॥ ఇరువది సంవత్సరముల వయస్సు నిండిన గుణదోషజ్ఞుడు, యువతియైన గురుపత్నిపాదములకు నమస్కరింపరాదు. స్త్రీ పురుషుల స్వభావమే దూషితమైనది. అందువలన జ్ఞానప్రయోజన కార్యముల నుండి పండితులు ప్రమాదపడరు, లోకమున విద్వాంసునిగాని, పామరునిగాని కామక్రోధవశానుగమైన కానిత్రోవకు తీసికొని పోవుటకు ఒక్క స్త్రీ చాలును. తల్లితోగానీ, సోదరితో గాని, కూఁతురుతోగానీ ఏకాంతమున కూర్చొనరాదు. ఇంద్రియ సమూహము బలవత్తరమైనది. అది పండితుని కూడ ఆకర్షించును. రాజేంద్రా! యువకుడు, యువతులైన గురుపత్నులకు నేను ఫలనా వానిని' అని చెప్పుచు. విధి విధానముగా వందనమాచరింపవలెను. సత్పురుషుల ధర్మమును గుర్తించుచు గురుపత్నులకు, గురువునకు పాదగ్రహణముచేతను బ్రాహ్మణుఁడభివాదము చేయవలయును. మానవుఁడు గడ్డపాణతో నేలను త్రవ్వుచు నీటిని ఎట్లు పొందునో అటులే గురుగతమైన విద్యను శుశ్రూష చేత పొందును. బ్రహ్మచారి, అవధూత, యోగి, యతి వీరిలో నెవరైనను గ్రామమునుండగా సూర్యుడస్తమింపరాదు. ఉదయింపరాదు. ఉదయాస్తమయములలో గ్రామమున ఉండరాదు. స్వేచ్ఛగా పండుకొనిన అట్టివారిని తిరస్కరించి సూర్యుడుదయించినగాని లేక తెలివి. వలననుండి అస్తమించినగానీ ఆదినమున జపము చేయుచు ఉపవసింపవలేను. సూర్యోదయాస్తమయ సమయములలో నిద్రించువారు ప్రాయశ్చిత్తము చేసికొననిచో మహాపాపముతో కూడినవాడగును.
తా॥ మహారాజా! ఉభయ సంధ్యలయందును సమాహితుడై ఆచమించి, పరిశుద్ధమైన ప్రదేశమునందు కూర్చుండి యథావిధిగా జపము చేసికొనవలెను. స్త్రీ యైనను తమ్ముడైనను శ్రేయమునొడగూర్చినచో అట్టి శ్రేయమును సర్వమును మనసుకు నచ్చిన సమయమున వారికి చేయవలెను. ధర్మార్థకామములు త్రివర్గమనబడును. ఇందు ధర్మార్థములు శ్రేయమని చెప్పబడును. ఇహమునందు అర్థమే శ్రేయమని వికల్పము. తల్లి, తండ్రి, సోదరుఁడు, ఆచార్యుఁడు వీరిలో ఎవరినైనను, ఆర్తుడైయున్నను అవమానింపరాదు. బ్రాహ్మణునకిది విశేష ధర్మము. ఆచార్యుఁడు బ్రహ్మ స్వరూపుఁడు. తండ్రి ప్రజాపతి స్వరూపుఁడు. తల్లి అదితిమూర్తి. సోదరుఁడు ఆత్మ (తన) స్వరూపుఁడు. కొడుకులు కలిగిన పిదప కూడా తల్లిదండ్రులు క్లేశమును సహింపవలసి వచ్చినచో దానిని ఊరకచూచు కుమారునకు వందలేండ్ల వఱకును నిష్కృతి సాధ్యము కాదు. హే భారత! తల్లిదండ్రులకును ఆచార్యునకును ఎప్పుడును ప్రియ మొనర్చుచుండవలెను. వీరు మువ్వురు తృప్తి పడిననే తపస్సు సర్వమును సమాప్తమగును. వారి శుశ్రూషయే శ్రేష్టమగు తపస్సు అని చెప్పబడును. వారి యనుజ్ఞలేనిదే ఏ ఇతర ధర్మమునైనను ఆచరింపకూడదు. వారే మూడు లోకములు వారే మూడు ఆశ్రమములు. వారే మూడు వేదములు. వారే మూడు అగ్నులు. తల్లి గార్హపత్యాగ్ని, తండ్రి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయాగ్ని. ఈ త్రేతాగ్నులే మహత్తరమైనవి.
తా ॥ ఈ ముగ్గురు తృప్తిగా నుండిన, గృహస్థుఁడు మూడు లోకములను జయించును. ఇహ లోకమున దీప్యమానుఁడై, ఆ పిదప దివ్యునివలె స్వర్గమున ఆనందించును. పితృభక్తిచేత ఈ లోకమును, మాతృభక్తి చేత మధ్యమలోకమును, గురు శుశ్రూషచేత స్వర్గమును పొందును. ఈ ముగ్గురిని ఆదరించినవాఁడు సర్వ ధర్మములను ఆదరించినవాఁడగును. ఇట్లు మువ్వురిని ఆదరింపని వాని కార్యములన్నియును నిష్ఫలములగును. వారు జీవించియున్నంత కాలము నిత్యము వారి శుశ్రూషచేయుచు వారికే ప్రియమును హితమును కూర్చుటయందే బుద్దినిలిపి యుంచవలయునే కాని అన్యమేమియు చేయవలదు. ఇదియే పరమ ధర్మము. అన్యమైనది ఉపధర్మము మాత్రమే అని చెప్పబడును. ఈ ముగ్గురియందే పురుషుడు చేయవలసిన దంతయు సమాప్తమగుచున్నది. వారి నిర్నిరోధముగ వేటు పనులేవి చేసినను ఆయా పనులను గుణించి వారికి త్రికరణ శుద్ధిగా నివేదింపవలేను. శ్రద్ధాళువై, శుభప్రదమైన విద్యను శూద్రుని నుండియైనను, అంత్యజునినుండియైనను గ్రహింపవలెను. స్త్రీ రత్నమును దుష్కలము నుండి యైనను గ్రహింపవలెను. ఇది పరమ ధర్మము. విషము నుండి యైనను అమృతము, బాలుని నుండియైనను సుభాషితము, అమిత్రుని నుండియైనను సద్వృత్తము, అపరిశుద్ధము నుండియైనను బంగారము గ్రహింపఁ దగినది. స్త్రీలు, రత్నము, నీతి, విద్య, ధర్మము, శుచిత్వము, సుభాషితము, వివిధములైన శిల్పములు అన్ని చోటుల నుండియు గ్రహింపదగినవి. అబ్రాహ్మణుని నుండి విద్యా స్వీకారము ఆపత్కాల ధర్మముగా విధింపబడును. గురువు వద్ద అధ్యయనము సాగుచున్నంత వఱకే భిక్షా చర్య, శుశ్రూషయు చేయవలెను.
తా ॥ అబ్రాహ్మణుఁడైన గురువు సమీపమున శిష్యుఁడు నివసింపనక్కఱలేదు. సాంగ వేదాధ్యయనముగల బ్రాహ్మణుని గురువుగా పొందగోరుటయే ఉత్తమమైనది. ఒకవేళ గురుకులమునందే నివసించుట రుచించినయెడల శరీర మోక్షణము వఱకును అచట గురు సేవలో ఉండుట యుక్తమైనది. శరీర సమాప్తి వఱకును గురుశుశ్రూష చేయువాఁడు శాశ్వతమైన బ్రహ్మపదమును పొందును. ధర్మ విదుడు విద్యాభ్యాసమునకు పూర్వము గురువున కేమియు ఈయనక్కఱలేదు. స్నాతకము వఱకు గుర్వాజ్ఞతో ‘గురు దక్షిణ', శక్తిననుసరించి సమర్పింపవలేను. క్షేత్రము, బంగారము, గోవు, అశ్వము, ఛత్రము, పాదరక్షలు, ధాన్యము, వస్త్రములు, లేక శాకమైనను గురువునకు ప్రీతితో నర్పింపవలెను. భరత సత్తమా! గురువు స్వర్గస్థుఁ డైన గురుపుత్రుని, భార్యను లేక గురువుగారి సపిండులను గురువును వలె గౌరవింపవలేను. వీరును లేని పక్షమున ఇట్లు అవిప్లుతముగా బ్రహ్మచర్య వ్రతమును పాటించు బ్రాహ్మణుఁడు బ్రహ్మ లోకమును పొంది బ్రహ్మతో కూడి ఆనందించును. ఈ విధముగా మొదట బ్రహ్మచారి ధర్మము చెప్పబడినది. రాజేంద్ర! ఇఁక గృహస్థ ధర్మమును సొంతముగ వినుము. బ్రహ్మచర్యవ్రత దీక్షను నిర్ణీత ఋతుయోగమున స్వీకరించి, దానిని చక్కగా అనుష్ఠించినచో బ్రహ్మసాలోక్యము కలుగును.
తా ॥ వసంతర్తువున బ్రాహ్మణునకు, గ్రీష్మమున క్షత్రియునకు, శరత్కాలమున వైశ్యునకు ఉపనయనము శ్రేష్ఠమని మనువు చెప్పెను. ఇట్లు వ్రత యోజనమున మూడు విధములైన కాలము చెప్పఁబడినది.
ఇది శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ఉపనయన విధి వర్ణనమను నాలుగవ అధ్యాయము.