5. స్త్రీ లక్షణ వర్ణనము

తాII సుమంతుముని యిట్లనెను. “ముప్పదియారు సంవత్సరములు గురు సన్నిధిలో మూడు వేదములు నేర్చుకొనుచు గడుపవలసియుండును. లేక అందుసగమో, నాల్గవ భాగమో (వేదముల సంఖ్యను బట్టి) బ్రహ్మచర్య వ్రతముండును. మూడు వేదములనుగాని, రెంటినిగాని, ఒక వేదమునుగాని అకుంఠిత బ్రహ్మ చర్య వ్రతముతో నధ్యయనము చేసి ఆ పిదప గృహ స్థాశ్రమమున నుండవలెను. స్వధర్మముచేత ప్రతీతి పొందినవాఁడు, గురువునుండి వేద భాగమును జీర్ణించుకొనినవాఁడును, మాలాలంకృతుఁడును, తల్పము పైన కూర్చుండిన వాఁడును అయిన అతనిని మొదట వాక్కుతో (లేక మధుపర్కముతో) పూజింపవలెను. గురువుచేత, వివాహితుఁడగుట కనుజ్ఞపొంది, యథావిధిగ, ఆ ద్విజుఁడు సవర్ణ, సలక్షణమైన కన్యను వివాహమాడవలెను. శతానీకుఁడిట్లనెను. “మహామునీ! స్త్రీల లక్షణమును తెలుపుడు, ఏ లక్షణములతో కూడిన కన్య సుఖము నిచ్చునది యగునో సెలవిండు”. శతానీకుని ప్రశ్నకు సుమంతుఁడు ఇట్లు సమాధానము చెప్పెను. “శుభాశుభఫల ప్రదత్వము నెఱుఁగుట ద్వారా సర్వలోకములకు శ్రేయమును కలిగించు నుత్తమ స్త్రీ లక్షణము పూర్వము బ్రహ్మదేవునిచే చెప్పఁబడిన దానిని. నీకు చెప్పెదను. ఏక మనస్కుఁడవై వినుము. వినుటచేత శోభన లక్షణమైన కన్య యెట్టిదో తెలిసికొందువు. సుఖాసీనుఁడైయున్న పరమేష్ఠి వద్దకు మహరులందఱువెడలి, ఇప్పుడు నీవు నన్నడిగినట్లే ఉత్తమ స్త్రీ లక్షణమును గూర్చి ఆయన నడిగిరి. బ్రహ్మకు శిరమువంచి నమస్కరించి ఆ మహరులిట్లనిరి. “భగవన్! ఉత్తమ స్త్రీ లక్షణమును మాకు తెలుపుడు. శుభాశుభ ఫలప్రదముగా, సర్వ లోకముల శ్రేయస్సు కొఱకు మీరు చెప్పిన దానినిబట్టి ఏ కన్య ప్రశస్తమైనదోఏది అప్రశస్తమైనదో మేము తెలిసికొందుము".

తా॥ వారి ఆ మాట విని బ్రహ్మ ఇట్లనెను. “బ్రాహ్మణ శ్రేష్టులారా! వినుడు. మీ కంతయు చెప్పెదను. ఎఱదామర వంటి కాంతి కలిగి నేలమీద చక్కగా ఆనెడు పాదములు ఉండుట స్త్రీలకు శ్రేష్ఠము. అట్టి పాదములు భోగవర్థనములు. ఎగుడు దిగుడులై కఱకుగా నుండి, మాంసములేక, అర్థశిరాన్వితములై (నగము సగముగా నరములు కప్పట్టునట్లు) ఉండు పాదముల వలన దారిద్ర్యము, దుర్భగత్వము కలుగును. సంశయములేదు. చక్కని అమరిక కలిగి, నునుపు కలిగి, గుండ్రదనము కలిగి, సన్నని గోళ్లుగల వేళ్లు స్త్రీలకు మిక్కిలి ఐశ్వర్యమును, ప్రభుతను కలుగజేయును. కురుచగ నున్న, చక్కని జీవితము నిచ్చును. కురుచగ నుండి వంకరైనవి విత్తహాని చేయును. మిక్కిలి బక్కచిక్కి, గుండ్రని కణుపులతో నున్న వేళ్లుగల స్త్రీ చాలా మంది భర్తలను చంపి దాసియగును. బొట్టన వ్రేళ్ల కణుపులు ఎత్తైన కొనలు గలవియై కోమలములుగ నుండిన రత్న కాంచన లాభము కలుగును. దీనికి విరుద్ధముగ నుండిన విపత్తు కలిగించును. గోళ్లు చిక్కగనునుపుకలిగియున్న సుభగత్వము కలుగును. రాగి వర్ణముతో ప్రకాశించుచుండిన ధనాఢ్యత కలుగును. ఉన్నతములుగనున్న పుత్రులు కలుగుదురు. మిక్కిలి సూక్ష్మముగా నున్న ప్రభుత కలుగును. పాండుర వర్ణమున నున్నను, పగుళ్లుండినను కరుకుగా నున్నను, నీల వర్ణములో నున్నను, పొగ రంగులో నున్నను, వాడిమి కలిగియున్నను అట్టి స్త్రీలకు నిఃస్వయోగము' పట్టును. గోళ్లు పసుపు వన్నెలో నున్న అభక్ష్య భక్షణము సంభవించును. చీల మండలు నునుపు గలిగి, గుండ్రనివై, శిరలతోనుండి, నూపురములనుకూడ ధరించినవైనచో నట్టి స్త్రీలు బంధు పరివారములతో నుందురు.

తా॥ నరములులేనివి, బాణపు కజ్ఞలవలె చక్కనివై, గుండ్రదనము కలిగి, అల్ప రోమములు గల జంఘలు (పిక్కలు) సౌభాగ్యమును కలిగించును. ఏనుగు నడక వంటి నడకను, సక్షి (హంస) గమనము వంటి గమనమును కలిగించును. రోమములున్న పిక్కలు గల స్త్రీ క్లేశము పొందును. ఉవ్వెత్తుగనున్న నాభి గల స్త్రీ తిరుగుఁబోతగును. కాక జంఘ పతిని సంహరించును. గోరోజనము వంటి వర్ణముగలది వదరుబోతగును. పిల్లి, సింహముల మోకాళ్ల వంటి మోకాళ్లు గల స్త్రీలు సంపదలను, సౌభాగ్యములను, సంతానమును పొందుదురు. జానువులు కుండలను బోలియున్న స్త్రీలు త్రిప్పటగలవారగుదురు. మాంస రహితముగనున్న కులటలగుదురు. నరములు కలిగియున్న చంపువారగుదురు. వేరు చేయబడినట్లున్న ధన హీనలగుదురు. మిక్కిలి వంకరగానున్నను కఱుకుగా నున్నను, భేదించినట్లున్న ఆగ్రములు కల్గియున్నను, గోళములవలెనున్నను, దట్టమైన రోమములు, వెంట్రుకలు కలిగియున్నను అట్లేయగుదురు. మిక్కిలి గోరోచనము వన్నె కలిగిన స్త్రీ నిశ్చయముగ విషతుల్యమైనది. ఆమె వారము దినములలోపలనే భర్తను హతమార్చును. సంశయములేదు. ఏనుగుల తొండములవలె, గుండ్రని అరటిస్తంభములవలె, మణి బంధము నుండి కనిష్ఠిక పర్యంతమైన హస్త భాగమువలె తొడలు కలిగిన స్త్రీలు ఎప్పుడును మన్మథ సుఖమును పొందెదరు. బద్ధమాంసములైన దౌర్భాగ్యమును, రోమయుక్తమైన బంధనమును, సన్నగానున్న వధను, మధ్యచ్ఛిద్రములైయున్న అనీశతను కలిగించునని చెప్పుదురు. సంధ్యావర్ణమున, సమముగా, అందముగా, సూక్ష్మరోమములతో, గొప్పగ నుండిన నడుము స్త్రీలకు ప్రశస్తమైనది. రతి సౌఖ్యమునిచ్చునది యగును. అరోమకము, సుశిష్టమునైన భగముగల స్త్రీ, నీచ కులమునఁ బుట్టినను రాజపతియగును.

తా॥ రావియాకును బోలియుండునది, తాబేలు వీపును బోలి ఎత్తుగ నుండునది, చంద్ర బింబమువలెను, కలశాకారముగను ఉన్న భగము స్త్రీలకు ప్రశస్తతమము. మరియు రతి సుఖ వర్ధనమునై యుండును. నువ్వు పువ్వు వలెను, అగ్రమున గొరిజ వలెనుండునదియు దాస్యమును, దారిద్ర్యమును కలుగజేయును, జోళ్ల వలెనున్నవి శోకమును, నోళ్లు తెఱచుకొని యుండునవి మరణమును, వికృతములై, దుర్గంధముగలవియై, నిర్మాంసములై ఏనుఁగు వెంట్రుకలు కలవి దుశ్శీలతను, దౌర్భాగ్యమును దారిద్ర్యమును కలిగించును. వెలగపండువలె నుండి, బలసియుండి, ముడతలు లేనిదై, విరివిగనున్నది స్త్రీలకు శ్రేష్ఠము. దీనికి విరుద్ధముగ నున్న నీంద్యము. కుచ భారముచే నించుక వంగియుండి, కదలుచున్న మూడు వళులచే గొప్పదియై, రోమ పంక్తితో విభూషితమైయున్న నడుము స్త్రీలకు శుభమునిచ్చును. ఉడుక వాద్యములవంటివి, మృదంగ వాద్యములవంటివి, మధ్య భాగమున యవధాన్యపు గింజవలె నున్నట్టివి అయిన నడుముగలవారు భయముతోకూడిన జీవితము, క్లేశమును, దుశ్శీలతను పొందుదురు. వక్రతలేనిది, ఉవ్వెత్తుకానిది, రోమములులేనిది, అసహ్యముగలేనిదియైన వీపుగల స్త్రీలు వివిధములై పరుపులుగల పర్యంకముల పై రతిసౌఖ్యమునను భవింతురు, పొట్టిగ వికారమై, నడిమికాలువ లేనిదై, రోమములు గలదియైన వీఁపు గల్గిన స్త్రీలు కలలో కూడ సుఖమును పొందలేరు. అట్టి స్త్రీ భర్తను హతమార్చును. విపులములు, సుకుమారములునైన కడుపుగల స్త్రీ చక్కని సంతానమును కనును. మండూక కుక్షిగల స్త్రీ రాజులకు జన్మనిచ్చును. వక్షోజములున్నతములుగనుండెనేని వంధ్యలగుదురు. మిక్కిలి వట్రువలై కఠినములుగ నుండెనేని కులటలు, జార కర్మరతులు, అగుదురు. లేక భిక్షా చర్య గలవారగుదురు.

తా ॥ వక్షో భాగములు వంగియున్న ఉన్నతులగుదురు. ఎగుడు దిగుడుగ - లేక ఎక్కువ తక్కువగా నున్న క్షుద్రులు, విషమాశయులునగుదురు. సమానముగనున్నచో ఆ స్త్రీలు ఆయురైశ్వర్య సంపన్నులగుదురు. గుండ్రములై, ఎత్తుగ నుండినవియై, బలిసినవియై, దూరములేనివియై నిడివిగ నుండిన స్తన యుగ్మములు ప్రశస్తములు. అట్లుకానివి దుఃఖావహములు. మొదటి గర్భము ఎత్తినపుడు రెంటిలో నొకటి అతిశయించిన, అది ఎడమవైపుదియైన ఆడ శిశువు, కుడివైపుదైన మగ శిశువు జన్మింతురు. స్తన చూచుకములు పొడవుగనున్న స్త్రీ ధూర్తురాలు, రతి ప్రియమగును. పట్రువలైగట్టిగనున్నయెడల ఆ స్త్రీ పురుషద్వేషియగును. పాము పడగలవలే, కుక్క నాల్కలవలె స్తనములున్న స్త్రీలు పురుష చేష్టలు గలవారై దారిద్ర్యమును పొందుదురు. కట్టఁబడిన కుండలబోలియున్నను అట్లేయగుదురు. సమముగ నుండి, మాంసలములై, నరములుగాని, రోమములుగాని లేనివై, సుందరముగనుండిన పక్షోజములు ఏ స్త్రీకి ఉండునో ఆమె ఈప్సిత భోగములనుభవించును. వక్షము వంకరగనున్న హింసించునది, రోమములతో నున్న దుశ్శీలముగలది, నిర్మాంసముగానున్న వైధవ్యము పొందునది, విస్తీర్ణముగానున్న కలహ ప్రియ యగును. చేతిలో ఎరుపు చాయ కలిగిన నాలుగులోతైన రేఖలుండిన స్త్రీలు సుఖముగానుందురు. అట్టి రేఖలు విచ్ఛిన్నములై యున్న యెడల అధికార పీనలగుదురు. మూడింటిలోను రెండు ఒక దానికంటే నొకటి పొడవై యున్న రేఖలు, ఏ స్త్రీ చేతిలో కనిష్ఠికా మూలము నుండి తర్జని వఱకు వ్యాపించియుండునో అట్టి స్త్రీ వంద సంవత్సరముల ఆయుర్దాయము కలిగియుండును. గుండ్రములై, సమానమైన కణుపులు కలిగి, తీక్షణమైన కొనలుగలిగి, మృదువైన చర్మము గలిగి సమములైన వ్రేళ్లుగల స్త్రీ భోగ వర్థిని యగును.

తా॥ మంకెనపువ్వువలె అరుణవర్ణమున పొడవుగనున్న గోళ్లుగల స్త్రీలు ఐశ్వర్యమును పొందుదురు. వంకరగను, వివర్ణముగను, తెలుపుతో కలిసిన పసుపు వన్నెలోనుగల గోళ్లవలన అధికార రాహిత్యము సంభవించును. ఎఱుపుగను, మృదువుగను, నిశ్చిద్రముగను ఉండు వ్రేళ్ల వలన ఐశ్వర్యము కలుగును. పగుళ్లు కలిగి, విషమముగను, గఱుకుగను ఉన్న చేతుల వలన క్లేశము కలుగును. బొటన వ్రేలు, ఇతరములైన వేళ్లు కనుపులయందును సమరేఖలతోడి యవబీజ చిహ్నములుండిన స్త్రీలకు అక్షయమగు ధనధాన్యముల తోడి సౌఖ్యము లభించును. అవ్యయము, అచ్ఛిన్నమునై మూడు రేఖలతో విభూషితమైన మణి బంధము అచిరకాలముననే అక్షయమైన భోగమును, ఆయువును ఇచ్చును. శ్రీవత్సము, టెక్కెము, తామర, కన్ను, ఏనుగు, గుఱ్ఱము, (హంస) పాళెము, చక్రము, స్వస్తికము, వజ్రము, ఖడ్గము, పూర్ణకుంభము, అంకుశము. ప్రాసాదము, గొడుగు, కిరీటము, హారము, కేయూరము, కుండలము, శంఖము, తోరణము, పూలదండ - వీనిలో ఏ చిహ్నమైనను చేతిలో గలవారు రాజస్తీలగుదురు. పాణితలమున, చరణమున యూపస్తంభములు, కుండలు, కమండలములు (లేకతోట్లు) చొహ్నితములై దేవి యగును. అంగడి, దుకాణము, త్రాసు, తూనికలు, ముద్రలు చేతులయందు నొప్పుచు కృషీవలుల భార్యలగుదురు. భుజములు ఆవు తోకవలె నుండి, ఉన్నతములుకాక, నరములు, వెంట్రుకలులేక సన్నగా నుండిన స్త్రీలకు శుభము.

తా॥ మణుగు పరచినట్లున్న గనుపులు, రోమములులేని మోచేతులు, లలిత కోమలములైన గుండ్రని బాహువులు స్త్రీకి ప్రశస్తమైనవి. పొడవైనవయి అంతస్థూలములుగాక రోమములు లేనివైన బాహువులు స్త్రీలకు సౌభాగ్యమును, ఆరోగ్యమును వృద్ధిచేసి సుఖము నిచ్చునవియగును. స్టూలములైన భుజములవలన బరువు మోయును. రోమశములవలన వ్యాధి కలుగును. వక్రములైయున్న వంధ్యయగును. పొడవైన ముఖమున్న కులటయగును. మెడ పైన నాలుగంగుళముల స్పష్టమైన మూడు రేఖలు గల స్త్రీ మణులు, బంగారము, మంచి ముత్యములతో నొప్పిదములైన ఆభరణములు ధరించును. కృశించిన మెడగలది. ధనహీన యగును. పొడవైన మెడగలది బంధకియగును. పొట్టమెడగలది మృత సంతానము గలదియగును. స్థూల గ్రీవ దుః ఖితయగును. పెడతలయందలి ముచ్చిలిగుంట ఉన్నతముగాక, మాంసలమై సమముగా నున్న స్త్రీ చిరంజీవియై, చిరకాలము సువాసినియైయుండును. నిర్మాంసమునగాని, మిక్కిలి మాంసముగలదిగాని, నరములు రోమములుండినగానీ, వంకరగాగాని, వికటముగగాని, విశాలముగగాని యుండిన ప్రశస్తముకాదు. చెక్కిలి మీదీ భాగము (వెలిగౌడ) స్థూలముగాక కృశించినట్లు కాక, అధికముగాక, వంకరగాక, రోమశముగాక యున్నచో ప్రశస్తము. అట్లు కానిది అప్రశస్తము. ముఖము చతురస్రముగా నున్న స్త్రీ ధూర్తు రాలగును. గుండ్రని ముఖము గలది శుభకరమైనది. గుఱ్ఱము ముఖము వంటి ముఖముగలది సంతానహీనయగును. మిక్కిలి వంకరగనున్న ముఖము గలది దుర్భగయగును. కుక్క, పంది, తోడేలు, గుడ్లగూబ, కోతి ముఖములవంటి ముఖములు గల స్త్రీలు క్రూర వృత్తిగలవారై పాపకర్మలు చేయువారగుదురు. వారికి సంతానము, బంధువులు ఉండరు.

తా ॥ జాజి, పొగడ, తామర, నల్లగలువల పరిమళముగల ముఖము (నోరు) పాన, భోజన తాంబూలములను విడువకుండును. రాగివలె మెఱయుచు, స్టాల్య కార్శ్యములు లేనిదై సన్నగాను, పొడవుగను ఉన్న కింది పెదవి స్త్రీలకెప్పుడును భోగమునిచ్చును. స్థూలమైనచో కలహశీలత, వివర్ణముగనున్న మిక్కిలి దుఃఖమునిచ్చును. మీది పేదవి తీక్షముగనున్న స్త్రీ కోపముగలది యగును. నాలుక మిక్కిలి సన్ననై వక్రముగను పొడవుగను ఉండుట శ్రేష్ఠము. మందముగను, పొట్టిగను, వివర్ణముగను, వక్రముగను, పగిలినట్లును ఉండుట నిందితము. శంఖమువలె, మొల్ల పువ్వువలె, చంద్రునివలె తెల్లనివియై, నునుపుగ, పొడవుగ, సందులులేకుండగ, ఎత్తుగ లేక యున్న దంతములు గల స్త్రీ మృష్టాన్న పానములను పొందును. సూక్ష్మముగను, కృశించినవిగను, పొట్టివిగను, పగిలినట్లును, వంకరగను, కణుకుగను వికటముగను ఉన్న దంతముల వలన స్త్రీ సదా దుఃఖిత యగును. శుభ్రపరచిన అద్దమువలె, తామరపువ్వువలె, నిండు జాబిల్లివలె ముఖములుగల స్త్రీలు అభీష్ట ఫలములను పొందుదురని చెప్పఁబడినది. అంత స్థూలముకాక, అంత సూక్ష్మముకాక, వక్రముకాక, మిక్కిలి పొడవుకాక, మిక్కిలి ఎత్తుగా కాక సమముగా నుండు ముక్కుగల వనీత ధన్యురాలు. శుభమును కలిగించునది యగును. ఉన్నతములై కోమలములై, పరిశుద్ధమగు రేఖలవలెనొప్పారి, ఒకదానినొకటి కలియక, ముఖమునకు సరిపడునట్లున్న సూక్ష్మమైన కనుబొమ్మలు స్త్రీలకు సుఖప్రదములు. ధనురాకారముగనున్నవి సౌభాగ్య ప్రదములు. పొడవైన వెంట్రుకలు కలిగియున్నచో గొడ్రాలి తనము నిచ్చును. గోరోచనము వర్ణమున నుండి, అస్తవ్యస్తముగ, పొట్టిగను ఉన్న కనుబొమ్మలు దారిద్ర్యమునకే యనుటలో సంశయములేదు.

తా ॥ నల్లగలువ జేకులతో సమానమై, ఎఱుపువన్నెగలవియై, అందమైన జెప్పలతోడి కన్నులుగల మగువ సుఖ సంపదలు గలదియగును. కాటుకపిట్ట, లేడి, వరాహము కన్నుల వంటి కన్నులు గల శ్రేష్ఠమైన స్త్రీ ఎచ్చట పుట్టినను భోగములొందును. లోఁతు కానివి, కలయిక లేనివి, అనేక రేఖలతో శోభించునవి, తేనెవంటి పింగలవర్ణముగలవియయిన కనులున్న స్త్రీలు రాజ భార్యలగుదురు. వాయసాకృతిలో నుండి, దీర్ఘమైన కడచూపులుగలవియై, కలఁకబాఱనివియైన అందమైన కనులు స్త్రీలకు ఐశ్వర్యమును కలిగించును. లోతుగను, ఎఱుపుగను ఉన్న నేత్రములు చిరకాలము దుఃఖితులను చేయును. స్త్రీకి కన్నులున్నతములుగ నుండెనేని అకాల మృత్యువు సంభవించును. ఎఱ్ఱనీవి, ఎగుడుదిగుడుగనున్నవి, పొగరంగులోనున్నవి, నిర్జీవమైనవి అయిన కన్నులుగల స్త్రీ విడువదగినది. కుక్క కన్నుల గల యాడు దానిని దూరముగ విడువవలెను. తిరుగుపడినవి కొక్కెర వంటివి, చిత్రమైనవి అయిన కనులున్న స్త్రీలు మద్యమాంస ప్రియులు, ఎప్పుడును చపలురైయుందురు . పొడవైన ఆకృతితో సూక్ష్మ ధ్వనిని కూడా వినగలిగిన చెవులున్నవారు ప్రకాశవంతమైన కాంచన రత్నా భరణములను ధరింతురు. గాడిద, ఒంటె, ముంగిస, గుడ్లగూబ, ఏనుగు చెవుల వంటి చెవులు గల స్త్రీలు మిక్కిలి దుఃఖమును పొందుదురు. ప్రాయశః సన్యసింతురు. ఇంచుక తెలుపు మించిన పచ్చని చెక్కిలి, గనుపునందు గుండ్రదనము గలది ప్రశస్తము. తద్విరుద్ధమైనది రోమకూపములతో దూషితమైనది నింద్యము.

తా ॥ అర్థ చంద్రుని పోలిక నిండుదనముతో, రోమములులేక, చక్కనిదైన నొసలు స్త్రీలకు శ్రేష్టమైనది. భోగమును ఆరోగ్యమునిచ్చునది. అట్టి నొసటికి, వైశాల్యముచేత రెండింతలు గల శిరస్సు స్త్రీలకు శ్రేష్టమైనది. ఏనుఁగు తలగల యాడుది అభాగ్యురాలగును. సన్ననివి, నల్లనివి, మెత్తనివి, చిక్కనివి, వంకర కొనలుగలవి అయిన తల వెంట్రుకలు స్త్రీలకు శ్రేయోదాయకములు. దానికి విరుద్ధమైనవి క్లేశమును శోకమును కలిగించును. హంస, కోకిల, వీణ, తుమ్మెద, నెమలి, పిల్లన గ్రోవి స్వరమువంటి కంఠ స్వరముగల స్త్రీలు బహు భోగములను, సేవకులను కలిగియుందురు. కంచుపగిలిన ధ్వని, గాడిద, కాకి స్వరముల వంటి స్వరముగల స్త్రీ రోగము, వ్యాధి భయము, శోకము దారిద్ర్యము పొందును. హంస గోవు, వృషభము, చక్రవాకము, మదించిన ఏనుఁగు నడకల వంటి నడకగల స్త్రీ తన కులమును ప్రకాశింపజేయును. రాజపత్నియగును. కుక్క, నక్కలనడక వంటి నడక గలది, కాకివలె నడచునది నిందనీయ యగును. మృగమువలే నడచునది దాసీ యగును. మిక్కిలి వేగముగ నడచునది బంధకి యగును. వెన్న వెదురు, గోరోచనము, బంగారము, కుంకుమ లేతగజిక వంటి ప్రకాశవంతమైన శరీర వర్ణములు స్త్రీలకు శుభకరములు. కోమలములు, మృదువైన రోమమలు గలవి, ఎక్కువగా చెమట పట్టనివి, పరిమళ భరితములైన అంగములు గల స్త్రీలు పూజ్యురాండ్రగుదురు. నలుపు కలిసిన ఎఱుపు, ఎఱుపు వర్ణములలోనున్నది, స్థూల కాయముగలది, రోగగ్రస్తురాలు, బొత్తిగా రోమమలులేనిది, మిక్కిలి పొట్టిగా నున్నది, ఎక్కువగా మాట్లాడునది యైన కన్యను వివాహమాడరాదు.

తా ॥ నక్షత్ర, వృక్ష, నదీ, మ్లేచ్చ, పర్వత, పక్షి, సర్పాదుల పేరు గలది, దాసీ ఫోచక నామము గలది, భయంకరమైన పేరు గది యైన కన్యను వివాహమాడరాదు. వైకల్యములేని అంగములు గలది, సామ్యమైన పేరు గలది, హంసవలె, ఏనుగు వలె నడచునది, సూక్ష్మమైన రోమములు, సన్నని తలవెంట్రుకలు, చక్కని పలువరస గలది, కోమలమైన శరీరముగలదైన స్త్రీని వివాహమాడవలెన. పశు సంపద, ధన ధాన్య సంపద పుష్కలముగా నున్నను ఈ పది కులములను వివాహ సంబంధ పరముగా విడిచి పెట్టవలెను. సంస్కార హీనులు, పురుష సంతతిలేని వారు, వేద పఠన పాఠనములు లేనివారు, అంగముల పైన మిక్కిలి రోమములు గలవారు, ఆర్శ, క్షయ, మందాగ్ని అపస్మారము, బొల్లి, కుష్టు వంటి రోగములు గలవారు పెండ్లి విషయమున విడువదగినవారు. పాదములు, చీల మండలు ఒకటి, పిక్కలు మోకాళ్లు రెండు, మేడ్ర గుహ్యములు మూడు, నాభి నడుము స్థాలుగు, కడుపు ఐదు, హృదయము స్తనములు ఆకు, భుజములు కొంకులు ఏడు, పెదవులు మెడ ఎనిమిది. కనులు కనుబొమలు తొమ్మిది, నుదురు తల పది అని యిట్లు శరీరభాగములు చెప్పుదురు. ఇందు అన్ని అశుభ లక్షణములు కలిగియున్న అశుభమే కలుగును. చరణాదిగ ఒక నాల్గవ భాగము మాత్రము అశుభముగనున్నను శుభమే కలుగును. శచీదేవి నిమిత్తముగ ఇంద్రుఁడడిగినప్పుడు మహాత్ముడు మహానుభావుఁడునైన బృహస్పతి సవిశేషముగా ఇట్లు ఉత్తమ స్త్రీ లక్షణములను చెప్పెను. బ్రాహ్మణోత్తములారా! ఇప్పుడు మీకు చెప్పినట్లు స్త్రీ లక్షణములతో(బాటు పురుష లక్షణములను కూడ నేను చెప్పగా అతఁడు మఱల వినెను. ఈ లక్షణముల కంటెను స్త్రీలకు సచ్చరిత్ర ప్రశస్తతరమైనది. సద్వృత్తముచేత ప్రశస్తమైనట్లు స్త్రీ, లక్షణములచేత కాదు.

తా ॥ ఇట్టి లక్షణములతో నొప్పారు మంచి కన్యను వివాహమాడిన వానికి సర్వ వస్తుసమృద్ధి, అభివృద్ధి, కీర్తి ఎల్లవేళల సమకూరియుండును.

ఇది శ్రీ భవిష్య మహా పురాణ శతార్థ సాహస్ర్యమందు బ్రహ్మపర్వమునందలి స్త్రీ లక్షణ పర్వమను నైదవ అధ్యాయము.