3 - లింగశబ్దార్థ నిర్వచనము
సచ్చిదానందమయుడగు పరమేశ్వరుని లక్షణమును ఇద మిత్థమని నిరూపింప నెవరికిని తరముకాదు. ఐనను “జగజ్జున్మస్థితిలయకారణము శివలింగము” అను తటస్థలక్షణమును భావింపవలెను. వస్తుతః లింగము (గుర్తు) లేని శివుడు హరిబ్రహ్మలకు జ్ఞానోదయమునకై - జ్వాలా మాలావృతమగు జోతిర్లింగముగ ప్రకాశింపవలసి వచ్చెను.
లింగము ఆను నిరాకార స్వరూపము ఏర్పడుటకు- ప్రకృతి - ఆధారమయ్యెను. .
ప్రకృతియనఁగా శివుని శక్తి గాన శక్తితో కూడిన శివుడు శక్తి ద్వారా జగత్తును కల్పించుచున్నవాడు. కాని లింగమనగా శివునిఁ జెందిన ఒకానొక లోకోత్తరస్థితి యగును.
గంధవర్ణ రసాదులతో శబ్దస్పర్శాదులతోడ నుండు ప్రధానము సూక్ష్మముగా - స్థూలజగత్తునకు కారణమగుచున్నయది. నిజముగా విచారించినచో - “ఆకాశం లింగ మిత్యాహుః పృధివీ తన్య పీఠికా అను నిర్వచనముఁబట్టి- పదునాలుగు లోకముల ప్రపంచము గూడ శివలింగ స్వరూపమని తేటపడును.
భూజలతేజో వాయ్వాకాశాది షడ్వింశతితత్త్వముల సమష్టిగా ముమ్మూర్తులు ఆవిర్భవించి, సృష్టి స్థితి లయములఁ జేయుచున్నవారు. ఈ ముగ్గురికి మూలపురుషుడు శివుడనిశ్రుతిస్మృతి పురాణాదులు నిర్వచించినవి.
శివ సంకల్పము బీజమనియు, విష్ణువు జగద్యోనియనియు అట్టి జగద్యోనియందు తన సంకల్ప బీజమును విడువగా - విష్ణునాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉదయించెను. శివుడు తన శక్తిని వేరుపఱచి ప్రేరేపింపగా - శక్తి - సత్త్వరజస్తమోగుణయుక్తయై - జగత్తును నిర్మించును.
ఈ శక్తి నిత్యమై ఎరుపు తెలుపు నలుపు వన్నెలు గలదై నిర్మించిన జగత్తునొకడు ప్రేమించుచు జనన మరణ సమన్వితమగు సంసారసముద్రములో మునిగి తేలుచుండును. మరియొకడు ప్రకృతిని
నానావిధ జన్మలయందు అనుభవించి వేసారి శివు నాశ్రయించును; ప్రకృతి వలన సూక్ష్మపంచ మహాభూతముల చేరికగా - మహత్తత్త్వము, దానినుండి అహంకారము; అహంకారమునుండి శబ్దము, శబ్దమునుండి ఆకాశము; ఆకాశమునుండి స్పర్శము, స్పర్శము నుండి వాయువు, వాయువునుండి రూపము, రూపమునుండి తేజస్సు, తేజస్సునుండి రసము, రసము నుండి జలము, జలము నుండి
గంధము, గంధము నుండి పృథివి యావిర్భవించినవి.
శబ్దాదులను గుర్తించుటకు - ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, సంకల్ప వికల్పాత్మకమగు మనస్సు నేర్పడినది.
బ్రహ్మాండమున చతుర్దశలోకములుండును. భూమిని ఉదకము పదిరెట్లు ఆవరించి యున్నది. జలమును తేజస్సు పదిరెట్లు చుట్టియున్నది. తేజస్సును వాయువు పదిరెట్లు వ్యాపించియున్నది. వాయువును ఆకాశము పదిరెట్లు చుట్టుముట్టి యున్నది.
అహంకారము ఆకాశము నావరించినది. అహంకారము నావరించినది
ప్రకృతియగును. ఇట్టి ఏడు ఆవరణములకు కమలాసనుడు అధిష్ఠాత యగువాడు. కోట్లకొలది బ్రహ్మాండములు ప్రవర్తించినపుడు ప్రతి బ్రహ్మాండమున బ్రహ్మ విష్ణురుద్రులు సృష్టి స్థితి లయ కర్తలుగా నుందురు.
శో॥ ఆదికర్తా చ భూతానాం - సంహర్తా పరిపాలకః । తస్మా న్మహేశ్వరో దేవో బ్రహ్మణోఽధిపతి శ్శివః ॥
ప్రాణులను పుట్టించు ఆదికర్త - రక్షకుడు - సంహర్తయు నగుటఁజేసి - బ్రహ్మాదులకు అధిపతి యగు శివుడే జగత్కర్తయని సారాంశము - ఇయ్యది - పురుషాధిష్ఠితయగు ప్రకృతిచే గావింపబడు ప్రాధమిక సృష్టియని తెలియవలెను.
ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (3) తృతీయాధ్యాయము.