4 - ప్రాథమిక సృష్టిగత విశేష నిర్వచనము
ప్రాథమిక (మొదటి) సృష్టిఁజెందినకాలము - దినమని చెప్ప బడును. ప్రాథమిక సృష్టి సమాప్తం జెందిన కాలము రాత్రి యనబడును. బ్రహ్మదేవుడు - పగలు జగత్తును కల్పించును. రాత్రి అవాంతరప్రళయముఁ జేయును. ఇట్లు అహోరాత్రములు ప్రవర్తించునని చెప్పఁబడినను ఆదికర్తయగు పరమేశ్వరునకు దివారాత్ర కాలవిభాగము లేదనుట - శ్రుతి సమ్మతమై యున్నది. బ్రహ్మదేవుని దినమున- దేవతలు ప్రజాపతులు మహర్షులు మొదలగు వారుందురు. రాత్రి సమయమున బ్రహ్మలో సూక్ష్మరూపమున దాగియుందురు. పునః ప్రభాత సమయమున జన్మింతురు. బ్రహ్మదేవుని దినము కల్పమనబడును. పగలెంతో రాత్రి యంతే నుండును.
కృత - త్రేతా - ద్వాపర - కలి యనబడు నాలుగుయుగములు - మహా యుగమనఁబఱగును. ఇట్టివేయి మహాయుగములలో పదునాలుగురు మనువులుందురు. కృతయుగము దివ్యములైన నాలుగు వేల సంవత్సరములుండును. త్రేతాయుగము దివ్య సంవత్సరములు 3000, ద్వాపరయుగము దివ్య సంవత్సరములు 2000, కలియుగము దివ్యసంవత్సరములు 1000 ఇట్లు నాలుగు యుగములు సంధ్యలతో సంధ్యాంశములతోడను 12000 దివ్య సంవత్సరములు ప్రవర్తించును మానవ సంవత్సరములు 43 లక్షల 20 వేలు; (4,32,0000)మానవుల యొక్క నెలరోజులు పితరులకు నొక్క దినమగును. కృష్ణపక్షము పగలుగా-శుక్లపక్షము రాత్రిగా - పితరులకు ఏర్పడును. మానవుల ముప్పది నెలలు పితరులకు ఒక నెలయగును. 360 నెలలు పితరులకు సంవత్సరమగును. మానవుల వంద ఏండ్లు- పితరులకు మూడు సంవత్సరమలగును. ఇవ్విధము లోక వ్యవహారమున మానవుల సంవత్సర కాలము దేవతలకు నొక్కదినమగునని ఈ లింగ పురాణమున ప్రతిపాదింపఁబడినది. ఉత్తరాయణము పగలుగా దక్షిణాయనము రాత్రిగాను దేవతలకు పరిగణింపబడినది. మానవుల 3030 సంవత్సరములు సప్తర్షులకు నొక సంవత్సరము; 9090 సంవత్సరములు ధ్రువునకునొక సంవత్సరము. 36100 మానవ సంవత్సరములు దివ్యమైన వత్సరమగును.మూడు లక్షల ఆరువదివేల మానవ సంవత్సరములు దివ్యములైన వేయి వత్సరములగును.
సృష్టిలో వైమానిక దేవతలు 28 కోట్లుందురు. ఆవాంతర ప్రళయమున మహర్లోకవాసులు. జనలోకముఁజేరుదురు. బ్రహ్మదేవునకు - వేయికల్పములు అనగా అహోరాత్రములు గడచిన యెడల నొక్క వత్సరమగును. ఇట్టి బ్రహ్మ సంవత్సరములు ఎనిమిదివేలు గడచినచో బ్రహ్మకు నొక్క యుగమగును. బ్రహ్మయుగములు వేయి-సవనమనఁబడును. సవనములు మూడు వేలగుచో బ్రహ్మదేవుని కాలము పరిసమాప్తమగును.
ఇవ్విధము వేయి కోట్ల కల్పములు గడువగా వేయి కోట్ల కల్పములు రానున్నవని తెలియవలెను. ప్రకృతి వికారమగు ప్రపంచము యొక్క సంహారము శివాజ్ఞ తోడనే సంభవించును.సంహారమున ప్రకృతి-పురుషు నాశ్రయించును. సత్తరజస్తమోగుణములు హెచ్చుతగ్గులైనచో సృష్టియగును. సమానములైనచో ప్రళయము సంభవించును. ఈ గుణత్రయ వైషమ్య సామ్యములకు మహేశ్వరుడే కారణము; మహేశ్వరుడు-లీలావిలాసముగ నీ సృష్టి స్థితి లయముల నేర్పరచువాడు.
శ్లో॥ అసంఖ్యాతాశ్చ కల్పాఖ్యా - హ్యసంఖ్యాతాః పితామహః. హరయ శ్చాప్యసంఖ్యాతా - స్వైక ఏవ మహేశ్వరః ॥
కల్పములు, బ్రహ్మదేవులు, విష్ణుమూర్తులు నసంఖ్యాతములు (లెక్కింప నలని గానివి) ప్రవర్తించుచుండును. మహేశ్వరుఁడు మాత్రము ఒక్కడేను. మహేశ్వరుడు ప్రకృతి బద్ధుడుకాకుండుటచే ఆది మధ్యాంతములు లేనివాడని తెలియవలెను.
చరాచరములు ప్రళయములో నశింపగా - ఏర్పడిన ఉదకమున బ్రహ్మదేవుడు పయనించి నారాయణు డనఁబఱిగెను. మరల సృష్టికాలమున జలనిమగ్నయైన పృధివిని వరాహ రూపముతో లేవనెత్తి పదునాలుగు లోకముల మధ్యన నెలకొలిపెను. నదీనద సముద్రములను పర్వతములను భూరాదిలోకములను పూర్వము నందువలే సృజించెను.
ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (4) చతుర్థాధ్యాయము.