5 - బ్రహ్మదేవుని సృష్టి క్రమనిరూపణము

తపస్సు మోహము మహామోహము అంధతామిస్రము పంచవిధములు గల ఆవిద్యయు బ్రహ్మదేవుని నుండి మొదట నుదయింపగా ఇవి ముఖ్యములు కావని తలచి ముఖ్యసృష్టి నారంభించెను. అది యెట్లనగా? వృక్షము స్థిరములుగ నుండునని యద్వానిని విధాత సృజించెను. తరువాత తిర్యక్(అడ్డముగానడుచు) జంతువులుదయింపగా ఊర్ధ్వ గతిగల సాత్త్వికులైన దేవాదులను పుట్టించెను. క్రిందిగతి గలవారు ఈశ్వరాను గ్రహమును సంపాదించు నేర్పుగలవారు నగు మానవులు జన్మించిరి.
తన్మాత్రలు అనఁగా మిశ్రములు గాని పంచమహాభూతములు మిశ్రములైన పంచమహాభూతము(పృథివీజల అగ్ని వాయు ఆకాశము)లు శ్రవణము (చెవి) మొదలగు ఇంద్రియములు తిర్యk జంతువులగు పశుపక్ష్యాదులు దేవతలు మానవులు ఈశ్వరానుగ్రహ పాత్రులగు సనక సనందనాది కుమారులు అనువానిని పుట్టించెను. ఈ నవవిధసృష్టిలో సనక సనండనాది కుమారులు మొదటివారు. వీరు జ్ఞానయోగముచే పరమేశ్వరు నారాధించుచు ముక్తి భాజనులై యున్నవారు.

బ్రహ్మదేవుడు తన శివధ్యాన యోగమహిమచే నవ ప్రజాపతుల నావిష్కరింపఁజేసెను. మరీచి భృగువు- అంగిరసుఁడు-పులస్త్యుఁడు-పులహుఁడు- క్రతువు-దక్షుడు- అత్రి-వసిష్ఠుడు అను తొమ్మండుగురు- నవ ప్రజాపతులనఁబడుదురు. మరియు వీరు వేదవేదాంగ పొరగులై బ్రహ్మసమానులు నైయున్నవారు.

సంకల్పము - ధర్మము - ధర్మముతో కూడియుండు అధర్మము అను ముగ్గురితో సహబ్రహ్మపుత్రులు పండ్రెండుగురుగా గుర్తింపబడిరి. ఋభువు సనత్కుమారుడు నను ఇరువురు మొదట నుదయించి బ్రహ్మవాదులుగా - కుమారులుగా బ్రహ్మతుల్యులుగా నుండిరి. శతరూప యనునామె స్వాయంభువ మనువును పతిగా బడసినదై ఇద్దరు కుమారులను కుమార్తె లిరువురి గనెను. శతరూప యొక్క కుమారులలో ప్రియవ్రతుడు జ్యేష్ఠుడు, ఉత్తానపాదుడు కనిష్ఠుడుగా నుండిరి. ఆకూతి, ప్రసూతియనువారు - శతరూప యొక్క పుత్రికలుకాగా ఋచియను ప్రజాపతి ఆకూతిని పెండ్లాడెను.

దక్ష ప్రజాపతి ప్రసూతిని పత్నిగా బడసెను. ప్రసూతి దక్షిణయను కుమార్తెను యజ్ఞము అను కుమారుని గనగా దక్షిణాదేవి దివ్యురాండ్రగు ద్వాదశ (12) కన్యకల గనెను. ప్రసూతి యను నామె దక్షుని వలన 24 కుమార్తెలను కనినది.

శ్రద్ధ, లక్ష్మి, ధృతి, పుష్టి, తుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, సిద్ధి, కీర్తి, ఖ్యాతి,
శాంతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధయని దక్షపుత్రికల పేర్లు.

శ్రద్ధ మొదలుకొని కీర్తివరకు గల పదముగ్గురిని - ధర్ముడను ప్రజాపతికి దక్షుడు భార్యలుగా సమర్పించెను. భృగువు- భ్యాతిని మరిచి సంభూతిని ఆంగిరస్సు స్మృతిని పులస్త్యుడు ప్రీతిని పులహుడు క్షమను క్రతువు సన్నతిని ఆత్రి అనసూయను, వసిష్ఠుడు ఊర్జను విభావనుడు (అగ్ని) స్వాహను, పితరులు స్వధను వివాహమాడిరి.

శ్లో॥ పుత్రీకృతా సతీ యా సామానసీ శివ (శక్తి) సంభవా । దక్షేణ జగతాం ధాత్రీ - రుద్రమేవాస్థితా పతిమ్ ॥

దక్ష ప్రజాపతి ఆదిశక్తి యవతారముగా మానసకన్యయగు సతీదేవిని పుత్రికగా బడసెను. లోకమాత యగు సతీదేవి పరమేశ్వరు (రుద్రు)నే పతిగా నాశ్రయించెను.

బ్రహ్మదేవుఁడు సృష్ట్యాదిని పరమేశ్వరుని అర్ధనారీశ్వర రూపముఁ గాంచి “నీలో నుండు స్త్రీ పురుషులను విడివిడిగా విభజింపుమని ప్రార్థించినందున అర్ధనారీశ్వర రూపము నుండి వేరైన స్త్రీ రూపమే సతీ దేవిగా పరిణమించెనని మరియొక నిర్వచనము.

ముల్లోకముల యందలి స్త్రీలందరు-సతీదేవి యంశములు కాగా- ఏకాదశరుద్రులు, మరియు పురుషులందరు- పరమేశ్వరాంశ సంభూతులని భావింపవలెను.

బ్రహ్మదేవుడు “జగన్మాతయగు నీకు నాకును పూజ్యురాలునైన ఆదిశక్తి నారాధించి  “పుం” అను నరకమును తప్పించు పుత్రికఁబడయుము! అని ఆదేశించి నందున దక్షుడు ఆది దంపతుల యను గ్రహమున తనకు లభించిన పుత్రికకు సతీదేవి యను పేరిడి పోషించియు కైలాసపతికి ఆదరముతో భార్యగా సమర్పించెను.

కామము, దర్పము, నియమము, సంతోషము, లాభము, శ్రుతము, దండము, సమయము,బోధము, అప్రమాదము, వినయము, వ్యవసాయము, క్షేమము, సుఖము, యశస్సు అను పదునైదుగురు. ధర్ముని కుమారులు.

వీరిలో క్రియ యను పత్నియందు దండము, సమయము నను వారు, బుద్ధియందు అప్రమాదము, భోధము ననువారు; జన్మింపగా మిగత 11 గురు - ధర్ముని ఇతర పత్నులయందు జన్మించిరి.

భృగుపత్ని యగు ఖ్యాతి- విష్ణు ప్రియయగు లక్ష్మీదేవిని ధాత విధాతయను పుత్రులఁ గనెను. మరీచి భార్య భుగు ప్రభూతి యను నామె- పూర్ణమాసుడు మారీచుడు నను ఇరువురు కుమారులను (తుష్టి-దృష్టి-కృష్టి-ఆపచితి) యను నలుగురు కుమార్తెలఁ గనినది. క్షమాదేవి పులహుని వలన కర్దముడు వరీయాంసుడు సహిష్ణువు అను కుమారులను, పీవరి యను కుమార్తెఁగనెను. పులస్త్యుడు ప్రీతియందు దత్తోర్ణుడు, వేదబాహువు, అనుకుమారులను-దృషద్వతి యను పుత్రికను పుట్టించెను. కతువు యొక్క భార్యయైన సన్నతి యను నామె - వాలఖిల్యులు అను అరువది వేల కుమారులను

ప్రసవించినది. ఆంగీరసుని పత్నియగు స్మృతియను నామె సినీవాలి, కుహూ, రాక, అనుమతియను నలుగురు కుమార్తెలను; లబ్దానుభావుడ నబఱుగు అగ్ని కీర్తిమంతుడు నను కుమారులను కనెను. అత్రి యొక్క భార్యయగు అనసూయాదేవి - ఆరుగురిని ప్రసవించెను. ఆరుగురిలో శ్రుతి యనునది-కుమార్తె కాగా సత్యనేత్రుడు, భవ్యుడు ఆపుఁడు (ఉదక స్వరూపుడు) శనైశ్చరుడు సోముడు నను ఐదుగురు కుమారులుగా జన్మించిరి.  ఊర్జయను నామె వసిష్ఠుని వలన- రజస్సు, సుహోత్రుఁడు, బాహువు, సవనుఁడు, అనవుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు నను ఏడుగురు కొమరులను కనినది.

తేజస్సునందు అభిమానము గలయట్టి అగ్ని రుద్రదేవుని రూపాంతరమై బ్రహ్మదేవుని ముఖము నుండి సృష్ట్యాదిని ఆవిర్భవించి మరల ఆంగీసుని కుమారుడై జన్మించెను. అగ్నియే ప్రజలకు జఠరాగ్ని రూపమున ప్రాణమై యుండువాడు - స్వాహాదేవి - అగ్నివలన ముగ్గురు తనయులను లోకకల్యాణమునకై ప్రసవించెను.

ఇయ్యది - శివవిజ్ఞాన వీచిక - యను శాంకరీయ
ఆంద్రానువాదప్రవచనమున - (5) పంచమాధ్యాయము.